నవ జీవనయానం - అచ్చంగా తెలుగు

నవ జీవనయానం

అక్కిరాజు ప్రసాద్ 


హైదరాబాదు జుబిలీ హిల్ల్స్‌లో ఓ ముఖ్యమైన రోడ్డులో పెద్ద స్థలంలో మూడంతస్థుల భవనం. సెక్యూరిటీ వచ్చిన బీఎండబ్ల్యూ కారును చూసి సెల్యూట్ చేసి గేటు తెరిచాడు. కారు వేగంగా వచ్చి ప్రధాన ద్వారం ముందు ఆగింది. విశాలమైన ఆవరణ, ఓ పక్క పెద్ద తోట, మరో పక్క ఐదు కార్లు పట్టేంత స్థలం. ఇంటి వెనుకవైపు కూడా పెద్ద తోట, ఉయ్యాల, రకరకాల పూల, కూరగాయల మొక్కలు. దాదాపు ఎకరం స్థలం. కారులో నుండి సూటు వేసుకున్న నలభై ఎనిమిదేళ్ల రాఘవ దిగి చక చక నడుచుకుంటూ లోపలకి వెళ్లాడు.
రాఘవకు తల్లి పార్వతమ్మ ఎదురై "నాన్నా! రెండు రోజులైంది ఆఫీసుకు వెళ్లి, స్నాన పానాలు, తిండి తిప్పలు ఏమిటి?" అని దిగులుగా ప్రశ్నించింది. రాఘవ నవ్వుతూ "అమ్మా! నా ఆఫీసుకు ఒకసారి వచ్చి చూడు! అక్కడ బాత్రూము, పూజ గది, పడక గది, వంటిల్లు అన్నీ ఉన్నాయి. అయినా, జానకి మూడు పూటలా వేడివేడిగా క్యారేజీ పంపించింది. నాకేమీ ఢోకా లేదు.." అని చెప్పి లోపలికి వెళ్లాడు. పార్వతమ్మకు గతం మనసులో మెదిలింది. భర్త చిన్నతనంలోనే చనిపోతే ఎంతో కష్టపడి రాఘవను, తమ్ముడు భరత్‌ను చదివించి పెంచి పెద్ద చేసింది. తాను ఆరోజుల్లో స్కూలులో ఆయాగా పని చేసేది. ఇద్దరు కొడుకులూ బాగా చదువుకొని, స్వంత కాళ్లపై నిలబడి ఈరోజు వందల కోట్ల విలువ చేసే కంపెనీలకు అధిపతులు. వారిద్దరినీ నిరంతరం రెండు కళ్లతో గమనిస్తూనే ఉంటుంది. విలువలు వదులుకోకుండా, జీవితంలో అసంతులన రాకుండా కొడుకులను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు కొడుకులు వారి జీవన గమ్యంలో తడబడలేదు. కానీ, కొత్త తరం పెరిగి పెద్దవుతోంది. వారికి నేటి సమాజంలో ఎలా అన్న ప్రశ్న ఆమెను వేధిస్తూనే ఉంటుంది.
"నాన్నా! మా స్కూలులో ఇండస్ట్రియల్ టూర్ ఉంది. మా క్లాసు వాళ్లను సింగపూర్ అండ్ మలేషియా తీసుకువెళ్లాలని ప్లాన్. వెళ్లనా?" అని అడిగింది 14 ఏళ్ల రమ్య. రాఘవ ఒక్క నిమిషం ఆలోచించి "ఎంతవుతుందని చెప్పారు టీచర్లు?" అని అడిగాడు. "దాదాపు లక్ష అవుతుందట నాన్నా!" అని సమాధానం చెప్పింది రమ్య. "నీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా" అని అడిగాడు రాఘవ. ఆశ్చర్యపోయిన రమ్య "నాన్నా! నేను గత రెండేళ్లుగా సమ్మర్ వెకేషన్‌లో మీ ఆఫీసులో డేటా ఎంట్రీ పని చేసి సంపాదించుకున్నవి ఇరవై రెండు వేలు. లక్ష రూపాయలు ఎక్కడ ఉంటాయి చెప్పండి?" అని సమాధానం చెప్పింది. "చూడు రమ్యా! నిన్ను డిస్కరేజ్ చేయాలని కాదు. ఎనిమిదో తరగతి చదువుతున్న నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. సింగపూర్, మలేషియా మనకు అంత దూరం కాదు. నువ్వు నీ కాళ్ల మీద నిలబడిన తరువాత ఎప్పుడైనా చూడవచ్చు..." అని రమ్య కళ్లలోకి సూటిగా చూసి చెప్పాడు. విపరీతమైన కోపం వచ్చినా అణచుకొని తన గదిలోకి వెళ్లి తలుపువేసుకుంది రమ్య.
"అమ్మా! నా ఫ్రెండ్స్‌తో  పార్టీకి వెళ్లాలి,  ఒక 10,000 రుపీస్ ఇవ్వు..." అని రాజీవ్ తల్లి జానకి దగ్గరకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. 17ఏళ్ల రాజీవ్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. "పదివేలా? ఆర్ యు కిడ్డింగ్?" అని రెట్టించి అడిగింది జానకి. అవునమ్మా! ఇట్స్ అ ఫేర్వెల్ పార్టీ వి ఆర్ ప్లానింగ్ ఎమాంగ్ ఫ్రెండ్స్...మళ్లీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయటానికి కుదరదేమో! నాన్నకు చెప్పు" అన్నాడు. "నేను కమిట్ చేయటం లేదు. ఐ నీడ్ టు థింక్ ఎబౌట్ దిస్...." అని చెప్పి అక్కడినుండి వెళ్లిపోయింది. గదిలోకి వెళ్లి భర్తతో మాట్లాడింది. తిరిగి వచ్చి రాజీవ్‌తో ఇలా అంది - "నాన్నా రాజీవ్! మీ నాన్న గారు నీ సేవింగ్స్ ఉన్నాయి కదా! వాటినుండి తీసుకోమన్నారు. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా?". "అమ్మా! వాట్! నేను 3 నెలలు కష్టపడితే నా ఖర్చులు పోను మిగిలినవి 11 వేలు. అందులో 10 వేలు పోతే ఇంక నా దగ్గర ఏమీ మిగలవు..నో వే ఐ యాం గోన్న స్పెండ్ ఫ్రం మై సేవింగ్స్..."
పిల్లలిద్దరితో మాట్లాడటానికి సరైన సమయం ఇదే అని గ్రహించారు రాఘవ, జానకి. అందరూ లివింగ్ రూంలో సోఫాలో కూర్చున్నారు. రాఘవ మొదలు పెట్టాడు.."రాజీవ్! రమ్యా! మీరిద్దరూ పెద్ద వాళ్లవుతున్నారు. ఈపాటికే, మీకిద్దరికీ డబ్బు విలువ, ఎప్పుడు ఎక్కడ దేనిమీద ఎంత ఖర్చుపెట్టాలో, ఎప్పుడు పెట్టకూడదో తెలిసి ఉండాలి, కానీ మీ ఇద్దరి మాటలతో అది మీకు ఇంకా తెలిసినట్లు లేదు...లిసన్ టు మి కేర్ఫుల్లీ".
"తల్లిదండ్రులుగా మా బాధ్యత మీకు సరైన విలువలు తెలియజేయటం, మీకు 18 ఏళ్ల వరకు అయ్యే విద్యకు కావలసిన వసతులు కల్పించటం. ఈలోపు కూడా ఎంత కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో, ఎంత దాచితే ఎంతవుతుందో మీకు తెలియాలి. మీరున్న వయసు దారి తప్పే వయసు. అందుకే ఇక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలి. నేను గత మూడేళ్లుగా వేసవి సెలవుల్లో మీ చేత పని చేయించి మీకు జీతం ఇప్పించింది డబ్బు, పని విలువ తెలియజేయటానికే..."
"రమ్యా! టెల్ మి హౌ ఎ ట్రిప్ టు సింగపూర్ అండ్ మలేషియా ఈజ్ జస్టిఫైడ్ ఆజ్ ఎన్ ఇండస్ట్రియల్ టూర్...". రమ్య నాన్న మాటలు విని ఆలోచనలో పడింది. "నాన్నా! సింగపూర్, మలేషియా మనకన్నా అభివృద్ధిలో ముందున్నాయని చెప్పుకుంటే విన్నాను. అందుకే ఆ దేశాలు చూస్తే అవేర్‌నెస్ పెరుగుతుందని మా టీచర్ చెప్పింది...దట్స్ వై దిస్ ట్రిప్..." అంది. "ఈజ్ దట్ కన్విన్సింగ్ ఫర్ యు" అని అడిగాడు రాఘవ. "లేదు నానా! అందరూ వెళుతున్నారని నేను కూడ ప్రెస్టీజ్ కోసం వెళ్లాలనుకున్నాను. కారణం, ఉపయోగం గురించి ఎక్కువగా ఆలోచించలేదు..." అంది రమ్య. "అయితే లక్ష రూపాయలు సేవ్ చేయాలంటే నువ్వు ఎంత పని చేయాలి, అంత పని చేసిన తరువాత లక్ష రూపయలు ఈ ట్రిప్ మీద పెట్టటం సబబా కాదా అని దీర్ఘంగా ఆలోచించు. నేను ఎంత కష్టపడితే వన్ ల్యాక్ రుపీస్ వస్తాయో ఒకసారి నా వైపు నుండి కూడా ఆలోచించు...."
నాన్న చెల్లితో చెప్పినవన్నీ వింటున్న ఆదిత్యకు అదే పాఠం తనకూ వస్తుందని తెలుసు. అందుకే ముందే జాగ్రత్తపడి "అమ్మా! నాన్నా! ఈ విల్ రీథింక్ అబౌట్ మై ప్లాన్" అన్నాడు. జానకి అంతటితో ఊరుకోలేదు. "రాజీవ్! నీకు నాన్న బిజినెస్‌లో చేరి దానిని వృద్ధి చేయాలన్న ఆసక్తి ఉంది కాబట్టి చెబుతున్నాను విను. ఎప్పుడూ ఈ కంపెనీ మన సొంతం అన్న భావన రానీకు. ఇది 15000 మంది ఉద్యోగులు, షేర్‌హోల్డర్ల కంపెనీ. నీకు మన సంస్థలలో ఉద్యోగం అంటే అది మామూలు ఉద్యోగిగా మొదలు. ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు ఉన్నతస్థాయి ఉద్యోగిగా చేరటానికి వీల్లేదు. కానీ, నీకు మీ నాన్నగారిలో కాకుండా, మా స్వశక్తులలో, మరింత ఉన్నత చదువులు, మరింత అవగాహన పెంచే విద్యాసంస్థలో చదివే అవకాశం మేము కల్పిస్తాము. దానిని ఎలా ఉపయోగించుకుంటారో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అన్నది మీ ఇష్టం.." అని స్పష్టంగా చెప్పింది. అదే సందేశాన్ని కళ్లతో రమ్యకు కూడా సంకేతం చేసింది.
పిల్లలలో తెలియని అసంతృప్తి, కోపం, ప్రశ్నలు, కొంత తికమక. తల్లిదండ్రులు మాటలు అర్థమయ్యాయి, కానీ, వాటిని పూర్తిగా అవగాహన చేసుకునే పరిస్థితిలో లేరు. "అన్నయ్యా! నన్ను కాసేపు బయటకు తీసుకువెళ్లు. ఐ నీడ్ ఎ బ్రేక్" అంది రమ్య. "సరే పదా" అన్నాడు రాఘవ. ఇద్దరూ బైక్ మీద కేబీఆర్ పార్కుకు వెళ్లారు. ఫుట్‌పాత్‌పై ఇద్దరూ నడుస్తున్నారు. "అందరూ వెళుతున్నారన్నయ్యా! అమ్మ నాన్నకు దిస్ ఈజ్ వెరీ స్మాల్ అమౌంట్..." అంది రమ్య. "ఐ నో. పదివేలు ఇస్ పీనట్స్ ఫర్ నాన్న" అని అసహనంగా సమాధానం చెప్పాడు రాజీవ్. కాస్త ముందుకు వెళ్లాక ఒక అరవై ఏళ్ల పేదవాడు, ప్యాంటు చొక్కా వేసుకున్నాడు. అడుగులు తడబడుతున్నాయి. వీళ్ల దగ్గరకు రాగానే సొమ్మసిల్లి పడబోయాడు. రాజీవ్ అతనిని గట్టిగా పట్టుకున్నాడు. అతని పరిస్థితిని ఇద్దరూ చీదరించుకున్నారు. "పగలు పూటే తాగి నడుస్తున్నావా" అని గద్దించి అడిగాడు రాజీవ్. దానికి అతను కళ్ల నీళ్లు పెట్టుకొన్నాడు. "తాగడానికి ఎక్కడ బాబూ! నా దగ్గర పెళ్లానికి తిండి పెట్టడానికి కూడా డబ్బుల్లేవు" అన్నాడు. "ఏమైంది? ఎందుకు అలా" అని ఆందోళనగా, కాస్త అమాయకంగా అడిగింది రమ్య.
"మా నాన్న హైదరబాదు వీధుల్లో మిఠాయి అమ్ముకునే వాడు. చాలా పేద కుటుంబంట వాళ్లది. రూపాయి రూపాయి కూడ బెట్టి ఆయన ఒక ఐదువేలు దాచుకోగలిగాడు. దానితో చిన్న మిఠాయి దుకాణం 1955లో ప్రారంభించాడు. నేను అదే సంవత్సరంలో పుట్టాను. మా అమ్మ నాన్నల కష్టంతో ఆ దుకాణం దినదినాభివృద్ధి చెందింది. మా దుకాణంలోని నాణ్యమైన నేతి మిఠాయిల కోసం సాయంత్రం పూట జనం క్యూ కట్టేవాళ్లు. నాన్న ఆరోజుల్లోనే లక్షలు సంపాదించారు. నాకు పదేళ్లు వచ్చేసరికి మేము పెద్ద ఇంట్లో, నౌకర్లు, కార్లు...నా బాల్యమంతా అమ్మ నాన్న చదువుకోమని ఎంత చెప్పినా, నేను వారి మాట వినలేదు. వాళ్లకు తెలియకుండా డబ్బులు తీసుకుని వెళ్లి స్నేహితులతో జల్సా చేసే వాడిని. ఒకసారి నాన్న జేబులో వంద రూపాయిల కట్ట తీసుకొని స్నేహితులతో బాంబే వెళ్లి వారం తరువాత తిరిగి వచ్చాను. ఆరోజు కూడా అమ్మ, నాన్న నాకు నచ్చచెప్పాలని చూశారు. నేను వినలేదు. వారిపై ద్వేషం పెంచుకున్నాను...కాలక్రమంలో నాకు చదువు అబ్బలేదు, నాన్న గారి బిజినెస్‌లో ఏదో కాస్త సాయం చేసినట్లుగా ఉండేవాడిని. ఎక్కువ సమయం కాలక్షేపమే..."
"నాకు ఇరవై ఐదేళ్లకు పెళ్లి చేశారు. అంతలో పిల్లలు...నాకు నలభై ఏళ్లు ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఒకరోజు నాన్నగారు గుండెపోటుతో మరణించారు. ఒక్కసారిగా నేను నాన్న గారి బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. కానీ, నాకు విషయ పరిజ్ఞానం లేదు, డబ్బు జాగ్రత్త లేదు, అసలు ఎంత కష్టపడితే డబ్బు వస్తుందన్న అవగాహన అంతకన్నా లేదు. నా బలహీనతలను అనువుగా తీసుకొని మా బిజినెస్‌లో ముఖ్యులు నన్న మోసం చేశారు. అవసరమైన దాని కన్నా ఎక్కువ వెలలకు వస్తువులు కొన్నట్లు దొంగ బిల్లులు చూపించి మా లాభాలకు గండి కొట్టారు. నాకు తెలియకుండా మిఠాయిలలో నాణ్యతను తగ్గించేశారు. ఒక్క ఐదేళ్లు నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. నాకు తెలిసేలోపు బిజినెస్ మొత్తం కుంటు పడింది. నష్టాలలోకి వెళ్లాము. అప్పులు చేయాల్సి వచ్చింది. మా ఆస్తులు జప్తు చేశారు. వీధిన పడ్డాము. ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు అమ్ముతూ పిల్లలను గవర్నమెంటు స్కూలులో చదివించే ప్రయత్నం. నా పిల్లలూ నా పెంపకమే కదా? చదువు సంధ్యలు లేక గాలికి తిరుగుతూ జులాయి వెధవల సాంగత్యంలో రౌడీలు అయ్యారు. నన్ను ఉన్న చిన్న ఇంట్లోంచి తరిమి తగలేశారు. ఇదిగూ..ఇలా గత ఐదేళ్లుగా రోడ్డు మీద అడుక్కుని తిరుగ్తున్నాను...నా భార్య ఇళ్లలో పని చేస్తోంది. ఓపిక తగ్గింది, వృద్ధాప్యం వస్తోంది..."
రాజీవ్, రమ్యలకు కాళ్ల కింద భూమి కదిలినట్లనిపించింది. నాన్న అమ్మలు చెప్పిన విషయాలు ఇప్పుడు పూర్తిగా అవగాహనకు వచ్చాయి. ముందున్న కర్తవ్యం బోధపడింది. మొట్టమొదట ఆ వ్యక్తికి సాయం చేయాలన్న ఆలోచనతో "నువ్వు మా ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తావా?" అని రాజీవ్ అడిగాడు. "చేస్తాను బాబూ" అని అతను అన్నాడు. అతనికి తమ అడ్రెస్ ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరే వరకూ వారిద్దరిలో తమ భవిష్యత్తు గురించి, తాము ఏమి చేయాలి అన్న దాని గురించే ఆలోచనలు. స్వావలంబన, బాధ్యతాయుతమైన జీవితం ఎంత ముఖ్యమో అర్థమైంది. ఇద్దరికీ కన్నీళ్లు వచ్చాయి. ఇంట్లోకి వెళ్లగానే, "నాన్నా! ముందు మీరు మాకో సహాయం చేయాలి, తరువాత మనం మాట్లాడదాం" అని చెప్పి, ఆ వ్యక్తి వివరాలిచ్చారు. అతనికి వాళ్లింట్లో డ్రైవర్ ఉద్యోగం ఖాయమైంది.
"అమ్మా, నాన్నా! నా పార్టీ అంత ఎత్తున చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఐ యాం కన్విన్సుడ్ అబౌట్ ఇట్. నా దగ్గర ఉన్న సేవింగ్స్ నుండి ఒక 2000లో పార్టీ చేసుకుంటాము. ఇప్పుడు మేము జాగ్రత్తగా ఉండకపోతే, మనుషులు, ఆస్తిపాస్తులు, బాధ్యతలు, విలువలు తెలుసుకోకపోతే మా జీవితాలే కాదు, మా పిల్లల జీవితాలు కూడా తప్పుదారి పడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి జీవిత అనుభవం మాకు పాఠమైంది. జీవితాన్ని ఒక బాధ్యతాయుతమైన ప్రయాణంగా మలచుకోవాలని నా నిర్ణయం. ఇప్పటినుండి ప్రతి నెలా నేను కొంత సంపాదన చేస్తాను.." అని ఉత్సాహంగా వారి మధ్యలో చేరి హత్తుకుంటూ చెప్పాడు.
"అవును నాన్నా! నైన్‌త్ క్లాసులో నాకు సింగపూర్, మలేషియా ట్రిప్ అనవసరం. వన్ ల్యాక్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ. అది విహార యాత్రగానే మిగిలిపోతుంది. ఐ విల్ గో వెన్ ఐ మేక్ ఎ దీసెంట్ లివింగ్.  ఇక్కడే రోజుకు కొన్ని గంటలు పని చేసి, మిగిలిన సమయం ఫ్రెండ్స్‌తో హాయిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తాను" అంది. "ష్యూర్ కదా?" అన్నాడు రాఘవ్. "యెస్ డ్యాడ్" అంది రమ్య నవ్వుతూ.
పిల్లల ఆలోచనలో మార్పుకు సంతోషించిన రాఘవ, జానకి "శీనూ, కాదు కాదు శ్రీనివాసరావు గారూ!" ఒక్కసారి ఇటు రండి అని పిలిచారు. డ్రైవర్‌గా చేరిన శ్రీనివాసరావు తళతళలాడే సూటు బూటులో వచ్చాడు. రాజీవ్, రమ్య ఆశ్చర్యపోయారు. "నాన్నా! ఈయన..." అని అడిగేలోపు.."కిడ్స్! మీట్ శ్రీనివాసరావు. హీ ఈజ్ అ గుడ్ సైకాలజిస్ట్ ఇన్ విజయవాడ...మీ ఇద్దరి భవిష్యత్తు కోసం వీరిని కన్సల్ట్ చేసి ఈ నాటకం ఆడాం" అని పరిచయం చేశాడు. "అవునా! ఇదంతా నాటకమా!" అని కోపం తెచ్చుకోబోయి పిల్లలు ఆ నాటకం అంతరార్థం తెలుసుకొని తలదించుకున్నారు. "నో నో కిడ్స్! వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ! మీరిద్దరూ ఆ సందర్భంలో మీ బాధ్యత వెంటనే తెలుసుకోగలిగారు. అది చాలా పెద్ద అచీవ్‌మెంట్" అని రాఘవ పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు.
శ్రీనివాసరావు పిల్లలతో - "పిల్లలూ! ప్రతి జీవితం ఒక విలక్షణమైన ప్రయాణం. దానికి తల్లిదండ్రులు ఇచ్చే విలువలు, పిల్లలలో ఉండే రిసెప్టబిలిటీ చాలా ముఖ్యం. రెస్పాన్సిబిలిటీ అనేది ఒక్కరోజులో రాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మధ్యలో అవరోధాలకు దిగులు చెందకుండా ముందుకు వెళ్లాలి. మనీ ఈజ్ ఎ బిగ్ ఫెసిలిటేటర్. డబ్బు చాలా ఇవ్వగలదు. చాలా జీవితాలలో మార్పు తేగలదు. కానీ, దానిని సద్వినియోగం చేసుకోవాలంటే దాని విలువ, ఎక్కడ ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఎలా కూడబెట్టుకోవాలి అన్న విచక్షణ చాలా అవసరం. అది తల్లిదండ్రులు నేర్పాల్సిన ప్రధానమైన విలువ. ఈరోజు సమాజంలో పిల్లలకు అదుపులేని స్వేచ్ఛ, సదుపాయాలు, గాడ్జెట్స్ ఇచ్చి జీవితంలో మితంగా ఉంటేనే మంచింది, స్వావలంబన అన్న ముఖ్యమైన విలువలను వదిలేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తోంది. మీరిద్దరూ కనబరచిన రీథింకింగ్ చలా హర్షణీయం. మేక్ యువర్ ఓన్ లైఫ్, రెస్పాన్సిబుల్లీ, విత్ వ్యాల్యూస్" అని వారిద్దరినీ అభినందించాడు.
రాఘవ! జానకి! మీరిద్దరి ప్రయత్నం, మీరు కనబరచిన దృఢ చిత్తం చాలా అరుదు. తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చటానికి తమ జీవితాలను ధారపోసే సమాజంలో మీలాంటి సంపన్నులు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండటం ఈ సమాజానికి ఎంతో శ్రేయస్కరం. వెరీ గ్లాడ్ టు నో యూ బెటర్" అని చెప్పి వారిని కూడ మనస్పూర్తిగా అభినందించాడు. పార్వతమ్మ మనసు కుదుటపడింది. వెంటనే భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకొని ఆ ఐదుగురి సంతోషంలో తానూ ఒక భాగస్వామి అయ్యింది.
****

No comments:

Post a Comment

Pages