నవ్వుల రాణి - శ్రీలక్ష్మి గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

నవ్వుల రాణి - శ్రీలక్ష్మి గారితో ముఖాముఖి

Share This

నవ్వుల రాణి - శ్రీలక్ష్మి గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


ఆవిడ మొహం  చూడగానే నవ్వొచ్చేస్తుంది. అమాయకమైన మొహంతో, నిండైన ఆహార్యంతో ఆవిడ హాస్యం పండించిన శకం తెలుగు సినిమా చరిత్రలో హాస్యానికి "స్వర్ణయుగం" అని చెప్పాలి. కామెడీకి కేరాఫ్ అడ్రస్  లా నాటికీ నేటికీ ఆమె నటించిన సినిమాల సన్నివేశాలతో అన్ని తరాల వారినీ కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీలక్ష్మి గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ  నెల మీకోసం...
మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది ?
నేను 1980లో ఇండస్ట్రీ లోకి వచ్చానండి, మా నాన్నగారు ప్రముఖ హీరో అమర్నాథ్ గారు. ఆయన పోయిన తర్వాత కుటుంబ భారం అంతా నామీదే పడడంతో నేను సినిమాల్లో నటించేందుకు రావాల్సి వచ్చింది.
మీరు హాస్య పాత్రలు చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా ?
హాస్య వేషాలు వేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. బాధ్యతల వల్ల సినిమాల్లోకి వచ్చాను. ఏ పాత్ర వేస్తాను అన్నది కూడా నాకు మొదట్లో ఐడియా లేదు. మొదట్లో హీరొయిన్ గానే అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఒక సినిమా, తమిళ్ లో 5 సినిమాలు, మలయాళంలో ఒక 5 సినిమాలు హీరొయిన్ గా చేసాను. దేనిలోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. ఒక సినిమా ‘నివురు గప్పిన నిప్పు’ అని నాగేష్ గారు, నేను చేసాము, ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలో ఆఫర్ వచ్చింది. అదీ ‘రెండు జళ్ళ సీత’ అనే సినిమాలో చాలా చిన్న వేషం. అసలు అది కామెడీ నా ఏమిటా అన్నది కూడా నాకు తెలీదు. ఆ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతూ ఉన్నప్పుడే ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ రాసాగింది. జంధ్యాల గారు కలం బలం ఉన్న డైరెక్టర్ కనుక, నా పాత్రను సినిమా మొత్తం వచ్చేలాగా పెంచుకుంటూ పోయారు. అది కూడా నా అదృష్టం అనుకోవాలి.
మా తమ్ముడు రాజేష్ కూడా అందులో హీరో. వాడు హీరోగా చేస్తున్నప్పుడే నేను కామెడీ క్యారెక్టర్ చెయ్యడం తనకు ఇష్టం లేక ‘ఎందుకొచ్చావు?’ అని గోల చేస్తే, ‘బాధ్యతలున్నాయి కదా, అందుకే చెయ్యాలి. నువ్వు హీరోగా వచ్చినందువల్ల చేకూరేది ఏమీ లేదు, ఎవరి కష్టం వాళ్ళు చెయ్యాలి, వాళ్ళకే ఉంటుంది.’ అని చెప్పి చేసాను. ఈ సినిమా నుంచి నాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దొరికింది. కామెడీ పాత్రల్లో నేను నటించడం ఇక్కడి నుంచే మొదలయ్యింది.
మీ దృష్టిలో అసలు హాస్యం అంటే ఏమిటి ?
కామెడీ అంటే వెకిలిగానే ఉండాలని నేను అనుకోను. నా పాత్రల పరంగా నాకు మామూలుగా మనింట్లో జరిగే ఆరోగ్యకరమైన హాస్య పాత్రలే అదృష్టవశాత్తూ వచ్చాయి. పాత్రలన్నీ ఒక మానరిజం తో వచ్చినవే ! స్వర్ణకమలం లో హారతులిచ్చే పాత్ర కాని, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసులో కాళ్ళు కడిగే పాత్ర కాని, సహజంగానే స్వభావంతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాయి. అటువంటి హాస్యం ఉత్తమమైనదని నా భావన.
జంధ్యాల గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది?
ఆయన నాకు గురువు వంటివారు. అన్నం పెట్టిన ఆయన. ఆయన ద్వారా ఈ కామెడీ పలికింది. నాలో కామెడీ పాత్రల్లో నటించే శక్తి ఉందని ఆయన ఎలా అనుకున్నారో తెలీదు. పాత్రని ఎలా సృష్టించారో కూడా తెలీదు, దేవుడు ఆయన రూపంలోనే నాకు ఈ అవకాశం కలిగించారని అనుకున్నాను. ఆ తర్వాత విశ్వనాథ్ గారు, దాసరి గారు, కోదండ రామిరెడ్డి గారు, ఇలా మొత్తం అందరి దర్శకుల హయాంలో పనిచేసే అవకాశం వచ్చింది.
జంధ్యాల గారికి అసలు ఆ ఊహ ఎలా వస్తుంది అన్నది మేము అంచనా వెయ్యలేము. ఒక హీరో ను కాని, హీరొయిన్ ను కాని, ఒక కమెడియన్ ను కాని, ఆయన సృష్టించిన తీరులో, ఈ రోజుకీ మేము చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నామంటే, అది ఆయన గొప్పదనం. పూర్ణిమ, నరేష్, సుత్తివేలు గారు కాని, వీరభద్రరావు గారు కాని, నన్ను కాని, ఆయన విభిన్న కోణాల్లో సృష్టించారు అంటే, అది వర్ణించడానికో, తేల్చి చెప్పడానికో వీలుకాదు. ఆ ప్రతిభ అంతా ఆయనదే.
అమాయకమైన మొహంతో మీరు పండించిన హాస్యం మేము ఎప్పటికీ మరువలేమండి. అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీని గురించి మీరు ఏమంటారు?
కామెడీ అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని నాతో ఆ పాత్రల్ని సృష్టించి, చేయించిన దర్శకులది ఆ ప్రతిభ అంతా. కామెడీలో నేను పెద్ద పండితురాల్ని అని కాదు. అలా విడిగా నిర్వచించలేను. కాని, అటువంటి నాతో కూడా ఆ పాత్రల్ని చేయించడం వాళ్ళ గొప్పదనం. మీరంతా మెచ్చుకుని, మార్కులు వేయబట్టి, అది నా కెరీర్ కు దోహదపడింది, నిలబెట్టింది. దానిబట్టి, నేను కామెడీ చెయ్యగలుగుతాను అన్న పేరు వచ్చింది కాబట్టి, సరే అనుకున్నాను, అంతే. కాని, కామెడీ పరంగా నాకంత అవగాహన లేదండి.
ఇదివరకు ఉన్న దర్శకులు ఒక ఆర్టిస్ట్ ను సానబెట్టి, ఒక కెరీర్ ను సృష్టించేవారు. ఇప్పుడు వచ్చినా పోటీ ఎక్కువయిపోయింది కదా. చాలామంది ఆర్టిస్ట్ లు వచ్చారు కాబట్టి, డైరెక్టర్లు వాళ్ళపై దృష్టి పెట్టేందుకు కూడా టైం లేదు. ముందే షైన్ అయిన వాళ్ళనే ప్రోత్సహిస్తారు. మాకసలు a-z ఏమీ తెలియని వాళ్ళని సృష్టించారు అంటే, అది వాళ్ళ ప్రతిభే అని చెప్తాను.
నిజమేనండి, హాస్యానికి “స్వర్ణయుగం” అని చెప్పవచ్చు. నిండైన ఆహార్యంలో, సహజమైన పాత్రల్లో హాస్యాన్ని సృష్టించారు.
అవునండి. అది నా అదృష్టం, పైగా ఆ టైం చాలా మంచి టైం. అప్పటి డైరెక్టర్లు, రైటర్స్, ఉండటం కూడా కలిసొచ్చిందని అనుకోవాలి. అన్నీ ఉంటేనే కదండీ అన్నీ పండించగలుగుతాము. ఏదైనా ఒక వంట చెయ్యాలన్నా, అన్నీ బాగా సమకూరితేనే, ఆ వంట బాగా వస్తుంది. ఏ ఒక్కటి తగ్గినా బాగోదు కదా, అలా ఆ రోజుల్లో అందరూ అలా ఉన్నారు. అందరూ కష్టపడి, ఒక సినిమాలోంచి ఒక ఎఫెక్ట్ సృష్టించారు అంటే, దానికి అందరి ప్రోద్బలం ఉందన్నమాట.
‘రెండుజళ్ళ సీత’ సినిమాకు మీకు మొట్టమొదట కళాసాగర్ అవార్డు వచ్చినప్పుడు ఎలా అనుభూతి చెందారు?
నేను అసలు ఊహించలేదండి. అందరూ ‘అవార్డు వచ్చింది, అవార్డు వచ్చింది’ అంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే అది నిజమయ్యింది, చాలా హాపీ గా ఫీల్ అయ్యాను. అదే నా మొట్టమొదటి అవార్డు. అంతా జాక్ పాట్ లాగా కలిసొచ్చింది. అదే హీరొయిన్ గా 10 సినిమాలు చేసినా, ఏ భాషలోనూ గుర్తింపు రాలేదు. కాబట్టి హీరొయిన్ గా నాకు లక్ లేదన్నమాట. కామెడీ గా నాకు లక్ ఉంది కనుక, అందరిలోనూ దూసుకుని వెళ్ళిపోయేంత అదృష్టం కలిగిందేమో, మొదటి సినిమాకే నాకా అవార్డు వచ్చింది. ‘ఫస్ట్ ఈస్ బెస్ట్’ అంటారు కదా ! ఎలాంటి అవార్డు అయినా అది గొప్ప అవార్డే ! కళాసాగర్ అవార్డు ఆ రోజుల్లో గొప్ప అవార్డు. ఆ తర్వాత హాస్య పాత్రలకు నాలుగు నందీ అవార్డులు వచ్చాయి, తర్వాత కళాసాగర్ లోనే 13 ఏళ్ళ పాటు వరుసగా, ప్రతి ఏడాది అవార్డులు తీసుకున్నాను.
తెలుగు లేడీ కమెడియన్స్ లో మీరు అగ్రస్థానంలో ఉన్నారని మా  మీరేమంటారు ?
అవునండి. రమాప్రభ గారి తర్వాత ఆ స్థానం నాదేనని ఆవిడ నోటి తోనే ఆవిడే స్వయంగా చెప్పారు. అది కూడా నాకు పెద్ద విషయమే కదా. ‘ఈ రోజుకి కూడా నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేదమ్మా, నీ స్థానం నీకే ఉంది’ అంటారు, అది కూడా నా అదృష్టం అనుకోవాలి.
మీరు నటించిన పాత్రల్లో మీకు బాగా నచ్చినది, మీ మనసుకు బాగా దగ్గరైనది ఏది ?
ప్రేక్షకులు మెచ్చిన పాత్రలన్నీ నాకు నచ్చినవేనండి. రెండుజళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, వంటి జంధ్యాల గారి సినిమాలు ప్రతి ఒక్క పాత్ర నాకు ఇష్టమైనదే. , స్వర్ణకమలంలో పాత్ర, తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా లో ‘బాబు చిట్టీ’ అనే పాత్ర, శుభలగ్నం లో ‘అబ్బ దబ్బ జబ్బ’ కాని, ఇలా ఏ పాత్ర వేసినా నేను చెయ్యగలుగుతాను అనిపించుకున్నానంటే అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను.
20 ఏళ్ళ సినీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ?
మా నాన్నగారు పోవడం అనేదే నేను మర్చిపోలేని సంఘటన అండి. నేను కాని, రాజేష్ కాని, ఇంత మంచి పేరు సంపాదించుకుని, నిలబడ్డప్పుడు ఆయన లేకపోవడం, ఆయన ఇదంతా చూడలేకపోవడం కంటే బాధ ఏముంటుంది? అంతే కదండీ, ఒక బిడ్డ ప్రయోజకురాలు అయినప్పుడు అదంతా చూసి, ఆ ఆనందంలో పాలు పంచుకునేందుకు నాన్నగారు లేరే అన్న వేదన నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇదే నేను మర్చిపోలేని సంఘటన. ఇండస్ట్రీ లో అంత పెద్ద హీరోగా ఆయన ఒక వెలుగు వెలిగాకా, ఆయన బిడ్డలు కూడా ఆ స్థాయికి చేరుకుంటే, అది చూసే అదృష్టం లేకపోయిందే అన్న ఒక బాధ మాకు కూడా. ఆయన ఉంటే తప్పొప్పులు కూడా చూసి చెప్పేవారు కదా, అనిపిస్తుంది.
ఎప్పుడైనా మీ సినిమా మీరు థియేటర్ లో కూర్చుని చూసారా ?
‘స్వర్గం’ అనేది నా మొదటి సినిమా. ‘ఖూబ్ సూరత్’ అని, హిందీలో వచ్చిన సినిమాకు రీమేక్ ఇది. ఇందులో రేఖా, వాళ్ళ చెల్లెలి పాత్ర ఉంటుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. రేఖ పాత్ర జయసుధ చేస్తే, చెల్లెలి పాత్ర నేను చేసాను. ఇందులో చంద్రమోహన్ గారు, సత్యనారాయణ గారు వంటి మేటి నటులు ఉన్నారు. ఆ సినిమా అప్పుడు ఫిలిం ఛాంబర్ లో  ప్రివ్యూ వేస్తే, అప్పుడు అందరితో పాటు కూర్చుని చూసాను, చాలా సంతోషం అనిపించింది. టైటిల్స్ లో ‘శ్రీలక్ష్మి’ అని వస్తుంటే చూసి, మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము.
కమెడియన్ లు కావాలని ఇండస్ట్రీ కి వచ్చేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా ?
ఇప్పుడు వచ్చే తరానికి మనం చెప్పేది అంతా ఓల్డ్ ఫాషన్ అయిపోతుంది. నేను చెప్పినా కూడా ‘ఆవిడ అనుభవంతో చెప్పారు,’ అని వారు అనుకోరు. కనుక సలహాలు ఇవ్వకపోవడమే మేలు.
మీరు చెయ్యాలనుకున్న ‘డ్రీం రోల్’ ఏమైనా ఉందా ?
ఏం లేదండి, వయసుకు తగ్గట్టు  దిగిపోయాం మేం కూడా !  బామ్మ పాత్రల్లోకి దిగిపోయాము. అందరూ అంటారు, ‘అప్పుడే బామ్మేంటండి ‘ అని. ఇప్పుడొచ్చే అప్ కమింగ్ హీరోయిన్స్ అమ్మలు చేస్తున్నప్పుడు, మేము బామ్మలు చెయ్యటంలో తప్పు లేదు కదా, లేకపోతే అది కూడా ఉండదు. ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈ పాత్ర కూడా ఉండదు. మగవాళ్ళు అంటే ‘ఎవర్ గ్రీన్’ ఇండస్ట్రీలో. వాళ్ళు తాతయ్యలు అయినా హీరో పాత్రలే వేస్తూ ఉంటారు, అదే ఆడవాళ్ళకు వెంటనే రిటైర్ మెంట్ చూపిస్తారు.
సినిమాకి, సీరియల్ కి మీరు గమనించిన వ్యత్యాసం ఏమిటి ?
రెండూ ఆక్టింగే కానివ్వండి, దాంట్లో ఓవర్ లోడ్ ఉంటుంది, ఇందులో హ్యాపీ గా చేసుకోవచ్చు. సినిమాల్లో ఒక పాత్రను ఇస్తే, దాన్ని అనేక విధాలుగా మలచుకోవడానికి, డైలాగ్ మాడ్యులేషన్ దిద్దుకోడానికి టైం ఇస్తారు. సీరియల్ లో ఇలా ఉండదు, అదే తేడా. అందుకే టీవీ లలో లోడ్ ఎక్కువ. సినిమాల్లో రిలాక్స్ అవుతూ, దాన్ని ట్యూన్ అప్ చేసుకుని,  డైరెక్టర్ చెప్పినవి అవగాహన చేసుకుని, ఆ డైలాగ్ ను ప్రాక్టీసు చేసుకుని, దాన్ని సానబట్టి, ఆ పాత్రకి ఒక ఐడెంటిటీ తీసుకుని రావడానికి టైం ఇస్తారు. సీరియల్ లో అలా కాదు, గబగబగబా ప్రోమ్ప్తింగ్ ఇస్తే, గబగబా చదివేసి, అసలు ఎన్ని తప్పులుంటాయో అందులో. మేము అనుకున్నాము, ‘సినిమాల్లో అంత కష్టపడి పేరు తెచ్చుకుని, సీరియల్ లో ఇలా పైపైన తగినంత సమయం లేక, పర్ఫెక్ట్ గా చెయ్యలేకపోవడం వల్ల, మనం ఆడియన్స్ లో తేలిపోతున్నామే !ఇంత కష్టపడి తెచ్చుకున్న పేరు అంతా నీళ్ళ ప్రాయంగా పోతోందే,’ అని. కాని, చేసేది ఏమీ లేదు. కావాలనుకుంటే చెయ్యాలి. అందుకే వాణిశ్రీ గారు కాని, ఇలా పాత వాళ్ళు ఎవరైనా కూడా సీరియల్స్ లోకి రారు. వాళ్ళు ఇంత కష్టపడి, పునాదులు వేసుకుని, ప్రేక్షకుల మనసులో సంపాదించుకున్న స్థానం పాడుచేసుకోకూడదు అని సీరియల్స్ లో చెయ్యరు. నేను ఏమిటంటే ఊరికే ఉండలేక, సినిమాలు చెయ్యలేక, ఊరికే ఉండకూడదు అని ఆక్టివ్ గా ఉండేందుకు చేస్తున్నాను. ఆర్టిస్ట్ కి ఏ పాత్ర అయినా చేసే కెపాసిటీ ఉందని నిరూపించుకునేందుకు అదొక మంచి స్టేజి. నా తృప్తి కోసం నేను ఎన్ని పాత్రలు చేసినా, ప్రేక్షకులు కమెడియన్ గానే నన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని నాకు అర్ధమయ్యింది.
అదే సినిమాల్లో ఇంత వైవిధ్యం ఉండదు. పోలీస్ పాత్ర వేసిన వారు అదే పాత్ర, డాక్టర్ పాత్ర వేసిన వారు అదే పాత్ర, ఇలాగే వేస్తూ ఉంటారు. కమెడియన్ కీ అదే పాత్రలు ఇస్తారు. కాని సీరియల్స్ లో ఒక ఫిక్స్డ్ ఎజెండా ఉండదు కనుక, వివిధ పాత్రలు చేసే అవకాశం ఉంటుంది. అలాగని, దాని నుంచి ఒచ్చిన ప్రతిఫలం కూడా లేదు. కాని, ఇందులో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది.
డైలాగుల కోసం వాయిస్ మాడ్యు లేషన్ కు మీరు శిక్షణ ఏదైనా తీసుకున్నారా ? ఏదైనా ప్రత్యేక సాధన చేసేవారా ?
లేదండి, అప్పటి రోజుల్లో డైరెక్టర్ లే ఒక ట్రెండ్ ను సృష్టించే వారు. వాళ్ళు చెప్పి, చూపించేవారు, చేయించేవారు. ఉచ్చారణ దోషాలు కూడా చెప్పి, సరిచేసేవారు. వాళ్ళు చెప్పింది క్యాచ్ చేసి చెప్తే సరిపోయేది. ఇప్పటి సినిమాల్లో ఇది ఉందని నేను అనుకోవట్లేదు. సీరియల్స్ లో కూడా ఇప్పుడు ఎవరూ చెప్పరు. మనం చెప్పుకుంటూ పోవడమే.
ప్రస్తుతం ఏ సినిమాల్లో పని చేస్తున్నారు ?
ఇప్పుడు వచ్చేసి ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సారధ్యంలో సుమంత్ బాబుకి అమ్మ పాత్రలో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకో సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. రిలీస్ కాబోయే సినిమాలు రెండు ఉన్నాయి. ఈ మధ్యనే ‘సేల్ఫీ రాజా’ ఒకటి విడుదల అయ్యింది. అంతకు ముందు ‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ‘ సినిమాలో చేసాను. అన్నీ నాయనమ్మ పాత్రలే చేస్తున్నాను.
చాలా సంతోషమండి. మళ్ళీ మిమ్మల్ని మునుపటి కామెడీ పాత్రల్లో చూడాలని అనుకుంటున్నాము. నమస్కారం.
అదృష్టం అనేది ఏ నిముషం ఎలా ఉంటుందో చెప్పలేము. అదృష్టం కొద్దీ మళ్ళీ కామెడీ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. నమస్కారం.
శ్రీలక్ష్మి గారు నటించిన కొన్ని హాస్య సన్నివేశాలను క్రింది లింక్  లో చూడండి.

No comments:

Post a Comment

Pages