ఆ ఒక్క క్షణం - అచ్చంగా తెలుగు

  ఆ ఒక్క క్షణం

అక్కిరాజు శ్రీహరి 


(మనమే  దేవుళ్ళం అంటుంది వేదాంతం . అయినా కష్టపడి కొండలెక్కి ఎక్కడో వున్న  దేవుని విగ్రహాన్ని చూడటానికి  వెళతాడు మనిషి. ఓ పదేళ్ళ క్రితం, తిరుమల వేంకటేశ్వరుని గుడి సన్నిధిలో ఉన్న అనుభూతి మీ కోసం...)
తిరుమల వేంకటేశ్వరుని దర్శించటానికి వీలుచిక్కగానే  బయలుదేరాం   నేను, మా ఆవిడ  పిల్లలతో  సహా . ఓ గంట ముందుగా గుడి బయట లైనులో నిలుచున్నాం . ఎండగా వున్నా పైన 'కప్పు' ఉండటంతో అంత ఇబ్బందిగా  లేదు . పక్కనున్న మనిషి మాట్లాడటం మొదలుపెట్టాడు . ఏ రోజు ప్రయాణం మొదలుపెట్టాడో , ఆ చరిత్రనంతా.
లైను మెల్లిగా కదలటం మొదలుపెట్టింది . బయట బ్యాంకు వద్ద ఇంకో లైను ! రైల్వే రిజర్వేషన్స్ గుర్తుకొచ్చాయి. ప్రతిసారి మనం ఉన్న లైను కాక పక్కనున్నది చాలా వేగంగా కదులుతున్నదనిపిస్తుంటుంది. వెనకనుంచి ఒక్కసారి తోపుడుకు ఈ లోకం లో కొచ్చాను . ' నాదేం లేదండి . ఆ వెనకాల మనిషి తోస్తున్నాడు ' అతని సంజాయిషి !
అంతలో మొదటి పరీక్షా వలయంలోకి ప్రవేశం . మీ బ్యాగులన్నీ చూపించండి - ఆడ సెక్యూరిటి అథారిటి ! మా ముందున్న ఆవిడ , మీనాక్షి , భర్త అలానే పిలుస్తున్నాడు , తన భారీ చేతి బ్యాగు తెరచి చూపిస్తోంది . ఈ చెప్పులేంటి ? ఏమ్మా గుళ్ళోకి చెప్పులు తీసుకొస్తారా ? ఎలాంటి వాళ్ళొస్తారో !- ఆడ సెక్యూరిటి చీత్కారమ్! మీనాక్షి మొగుడు పిల్లవాడిని ఎత్తుకొని ముందుకెళ్ళి పోయాడు . ఈవిడ మండిపడ్డది . ' అవి పిల్లాడి వమ్మా , అసలే ఎండాకాలం, పసివాడి కాళ్ళు కాలవా? అవి తీసి పారేయటానికి మీరెవ్వరు? - ఎగిరిపడ్డది . సెక్యూరిటి ససేమిరా అంది . ఈవిడకి కోపం వచ్చింది- సెక్యురిటి పై కాదు, తన భర్త మీద - వెనక్కు వచ్చి తనకు 'సప్పోర్ట్ ' ఇవ్వలేదని! చిరచిరలాడుతూ అందరిని తోసుకు వెళ్లి , పిల్లవాణ్ణి లాక్కుని- మొదలుపెట్టింది-- ఆగలేదు ఇంకా .... ఈ  లోపు  రెండో వలయంలోకి ప్రవేశం--   కంప్యూటర్లో ఫోటోలను సరి చూసుకొని పంపిస్తున్నారు .  పదండి పదండి అని తోస్తున్నారు ఇక్కడి మగ సెక్యురిటి .  భారీ శరీరం , మహాలక్ష్మి , పాపం వేగంగా పోలేకపోయింది . వాడి చెయ్యి పడగానే ఇంతెత్తున లేచింది . నా మీద చేయి వేస్తావురా అంటూ -- సర్దిచెప్పినా , గొణుక్కుంటూ తిట్టుకుంటూనే వుంది . పెద్ద హాలులో కొచ్చి కూర్చున్నాం . ఉదయం ఎప్పుడో తిన్న ఫలహారం - ఆకలేస్తుంది . ఇంతలో పక్కన కూర్చున్న పరంధామయ్య ఆ  రోజు పేపరు తీసి చదవటం మొదలుపెట్టాడు , కొంచెం గట్టిగానే - జరుగుతున్న విషయాలకు తెగ బాధ పడి పోతూ - పొలిటీషియన్సును తిట్టేస్తున్నాడు . నాలుగు రోజుల తర్వాత మా అబ్బాయి రిజల్ట్స్ వస్తాయి , ఏ కాలేజి లో సీటు వస్తుందో , ఎలా వుంటుందో ... మీరు వింటున్నట్లు లేదు. పక్క ఆసామి మాటలతో మళ్ళి ఈ  లోకం లోకి .. హాలు తలుపులు తెరిచారు . అందరు పరిగెత్తటం   మొదలుపెట్టారు .  మళ్లీ  ఇంకో 'క్యూ ' -- వెనకున్న 'వసంత' తెగ బాధ పడి పోయింది . మా వెనకాల వచ్చిన వాళ్ళు అంత ముందుకెలా వెళ్ళారు ? అలా ఎలా వెళ్ళనిచ్చారు? ఒక పద్ధతి లేదు -- తిట్టి పో స్తూంది . ఈ లోపల ఒక పిల్లవాడి ఏడుపు- ఆకలేసింది కామోసు!
ఒక్కసారి గుంపు లోంచి అరిచారు ఎవరో .. ' గోవిందా గోవిందా ' అని - అందరూ అందుకున్నారు రెండోసారి . ఇంతలో ఇంకో లైనులో వాళ్ళు కలిశారు. మీరు ఎన్నింటికి లైనులో నిలుచున్నారు? - పలకరింపులు !
ముఖ ద్వారం చేరాం - లోపలకు పంపించారు . దబదబా అందరు పరిగెత్తటం మొదలుపెట్టారు .shortcut లో కొందరిని వదిలేస్తున్నారు . తోసుకొని వెళ్ళడం -పిల్లలను చేయి ఆసరా యిచ్చి - అతి కష్టం మీద మహా ద్వారం దాటి లోపలకు వెళ్లాం . ఇక గర్భ గుడి లోకి వెళ్ళాలి .... మీనాక్షి ఇంకా భర్తను తన చూపుల తోను , మాటల తోనూ తిడుతూనే వుంది . మహాలక్ష్మి తన భుజాలనే కాదు శరీర మంతా కాపాడు కుంటూనే వుంది . ఆసామి ఆలయ అధికారులను గట్టిగా విమర్శిస్తూనే వున్నాడు పిల్లవాడు పాలకోసం ఏడుస్తూనే వున్నాడు . గర్భ గుడిలో గడప దాటి చూస్తున్నాను- తలయెత్తి చూస్తూ ముందుకు పోతున్నాం - సెక్యురిటి తోస్తూనే వున్నారు . అదిగో - ఎదురుగా సుందర మంగళ విగ్రహం ! ఆ క్షణం - ఈ  మనసులో ఏ ఆలోచనా లేదు - గతం పట్ల విచారం , భవితపై ఆరాటం! మినాక్షికి తన భర్త గుర్తుకు రాలేదు , ఆడ సెక్యురిటి ఆలోచనే లేదు . మహాలక్ష్మి తన శరీరం  చూడటం  లేదు ! పసివాడు ఏడుపు మానేశాడు ! ఆసామి ఆక్రోశం ఆపేశాడు ! గుడి నించి బయటకొచ్చాం . ఆలయ ప్రాగణంలో కూర్చుని గోపురం కేసి చూస్తున్నాను. మీనాక్షి మళ్లీ  భర్తతో తగవు. పసివాడికి ఆకలి- ఏడుపందుకొన్నాడు . ఆసామి మళ్లీ మొదలెట్టాడు - గుడిలో సెక్యురిటి మరీ ఎక్కువైందని . నేను 'ఆ' క్షణాన్ని గురించే ఆలోచిస్తున్నాను . ఇంత కష్టపడి , ఇన్ని శ్రమల కోర్చి ఇందరు వచ్చేది ఆ ఒక్క క్షణం కోసం ! ఆ క్షణం కోసం  ప్రతీక్ష , పరిశ్రమ , తపన - ఏముందా క్షణంలో ? ఏమీ లేదు - అవును. ఆ క్షణంలో ఈ దేహ స్పృహ లేదు. ఈ   బుద్ధి స్పురణ లేదు. ఈ  మనసు అసలు లేదు. ఏ  విధమైన ఆలోచనా లేదు . జీవాత్మతో పరమాత్మ భేటియా ? ప్రతిక్షణం ఆ క్షణం ఐతే ఎంత బావుంటుంది ? ' పదండి వెళ్దాం , ఈ  లోకంలోకి రండి ', మా ఆవిడ పిలుపుతో  మళ్లీ  ' ఈ క్షణం ' లోకి .
*********                                                                                        

No comments:

Post a Comment

Pages