ముంగిట్లో తొలకరి
రచన : ఆచంట హైమవతి .
రైతుల హృదయాన్ని చేస్తోంది పరవళ్ళు!
ఊరు దాటి పడుతున్న వాన చినుకులు -
దున్నిన ధారుణి దేహాన్ని శమింపజేస్తున్నాయ్!
మొలకెత్తబోతున్న'విత్తులు'వర్షా న్ని హర్షంతో-
పలకరించి , పులకించిపోతూ ఆహ్వానిస్తున్నాయ్ !
వన్నెల విరులు విరియబోతున్న మొక్కలకీ జల్లులు-
అశాంతరంగాల 'సెగ' ను ఉపశమింపజేస్తున్నాయ్ !
పెంకుటిళ్ళ కప్పులను 'సవరించగ' గేస్తులనుంచి-
పెంకు నేతగాళ్ళకు ' పిలుపులు' వెడుతున్నాయ్ !
ఇన్నాళ్ళూ ' అగ్ని' కురిసిన 'వడ' గాళ్పులు -
ఈనాడు కురిసే తుంపరలకు, వాయువు తోడై -
సర్వత్రా తృప్తి నిండి త్రుళ్ళిoతలౌతున్నది !
పశు - పక్ష్యాదులు- జంతువులూ -
దేహ తాపం చల్లారి...తెప్పరిల్లుతున్నాయ్ !
తొలి ఆషాఢ 'మాసపు' ఆచారాలకు ....
దూరమైన నూత్న మిదునములు -
నిరీక్షణ చాలించి... మనస్సుల్లో కూడా -
తొలకరి జల్లుల సౌఖ్యాన్ని ఆహ్వానిస్తున్నారు !
పసిపాపలూ - పండుముదుసలులూ -
గ్రీష్మ తాపానికి అలసి , సొలసి -
కమ్మని మట్టి తడిసిన సువాసనలు చిమ్మే
తొలి వర్షాన్ని ఇష్టంతో ... తిలకిస్తున్నారు !
శిశిరంలో మోడులై - వసంతంలో చిగిర్చిన
వృక్షాలు ఈ వర్షానికి సంతసిస్తున్నాయ్ !
జ్యేష్ట - ఆషాఢాల ఋతు పవనములతో -
ధూళెగసిన 'బాటలు' వాన జల్లులకి -
తేమ ఇంకిన పరిమళం వెదజల్లుతున్నాయ్!
కుతంత్రాలతో - అలజడులతో - ఆగడాలతో...
వ్యధచెంది...ఉడుకెత్తుతున్న 'లోకం' -
సత్యాహింసలు - శాంతి సౌహార్దాలు...
త్యాగ , సౌశీల్యాలతో - సరదా, సంతోషాలతో-
విలసిల్లే 'రామరాజ్యం' లాంటి కాలం కోసం
సదా ఆతృతతో,ఆశతో ఎదురుచూస్తోంది!!
*****
No comments:
Post a Comment