కవి సమ్రాట్టును కదిలిస్తే... - అచ్చంగా తెలుగు

కవి సమ్రాట్టును కదిలిస్తే...

Share This

కవి సమ్రాట్టును కదిలిస్తే...

- పి.వి.ఆర్. గోపీనాథ్


. . . . .  తద్దినమట తద్దినము. అదియేమో, అననేమో తెలియునా వీరికి ?!
పుట్టిన దనము గావచ్చును, మెట్టిన దినమైననూ గావచ్చును. ఏదియునూ గాకపోవచ్చును. అది యెక విచిత్రము. అటుండనిమ్ము. లోకులు పలుగాకీ మూకలు కదా. రకరకములుగా తలవోయుదురు. లోకులనగా నెవరు... జములే... మరి వీరు గాకులెట్లాయిరి... విష్ణు శర్మ గారి నడుగ వలె.. వారెవరో తెలియునా... పంచ తంత్రమను నీతి కథలనేకంబులు వెలయించిన సంస్కృత పండితుడు. మరి యట్టివాడు జనులను గాకులుగా నేల వర్ణింపవలె. ఏమో. అడుగుటకైనను వారిప్పుడు మన మద్య లేరు కదా.. వదలుడు. ఇంతకు మన మెట నుంటిమి. తద్దిము వద్ద కదా... సరి లోకులు దీనినేమందురు. ఆ దినము. అనగా... గుర్తుంచుకొనెడి దిము. అనగా ఏమది.. సరి మరల మొదటకే వస్తిమి కదా...
గొందరకది పుట్టిన దినము, మరి కొందరకు మెట్టిన దినము. ఇంకొందరకది బాల్యము నుంచి గైవల్యబ్రాప్తి వరకూ ఏ దినమైననూ గావచ్చును. హా. ఇప్పుడు కదా మనము సరియైన దిశగా బయనము ప్రారంభించినది...దినము...మరణ దినము. ఇదియే ఆధునికులునూ, సంప్రదాయ వాదులునూ గూడా గాబడని మద్యస్తుల వ్యావహారిక వర్ణనము. వీరు దీనిని తద్దినమందురు. వీరిలోనే కొందరు ఆబ్దీకమనగా మరి కొందరు బుద్ధిమంతులు పుణ్య తిథి యందురు....కదా !
ఏల వీరికింత తొందర...?
------------------
అవును వీరిలో గొందరు ... కాదు కాదు బలువురే చాల తొందరపాటుతో యుంటిరేలకో... ఆబ్దీకము లేదా దీనిని కొందరు బిలుచునట్లు శ్రాద్ధము అనునది జీవుడు పోయిన రోజు జరుపవలసినది. అనగా పుణ్య తిథియని వీరలు పేర్కొనుచుండునట్లు తిథి ప్రకారంబే జరుపవలె కదా...
మరి వీరు ఈ దుర్ముఖి వత్సరము అక్టోబరు నెల 18ననే ఏల బెట్టుచున్నట్లు..
మదీయ మరణమును నిజముగా వీరలు స్మరింప దలచిన ఆశ్వీయుజ బహుళ దశమినాడు గదా అట్టి పనికి బూనుకొనవలసినది. అయ్యది ఆనెల 25 కదా. మరిదేమీ. వీరేల ఇంత వేగిరపాటుగా......
ఏమిరా పావనీ...ఏమి చేయుచున్నవాడవురా,, అచ్యుతా ఎక్కడయ్యా నీవూ...?
నేను జీవించి యుండగనే మదీయ పటములకు దండలు....!?
 వేయుచున్న ఈ జనులు నిజముగనే యభిమానులందమా లేక... .హూఁ... ఏరీ ఈ పావనీ, అచ్యుతా .... ??
______

No comments:

Post a Comment

Pages