సరిలేరు 'దాసరి' కెవ్వరూ - అచ్చంగా తెలుగు

సరిలేరు 'దాసరి' కెవ్వరూ

Share This

సరిలేరు 'దాసరి' కెవ్వరూ

(దార్శనీకులు  దాసరి నారాయణరావు గారితో ముఖాముఖి )

భావరాజు పద్మిని 


నూట యాభై చిత్రాలకు దర్శకత్వం వహించి, దర్శకరత్నగా గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్న దాసరి నారాయణరావు గారు అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో కలిసారు. మేము వెళ్తున్న ఫ్లైట్ లోనే వారూ రావడంతో వారితో ఫ్లైట్ లోనే కాసేపు ముచ్చటించాను. "కృషి, పట్టుదల, దీక్ష ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు" అని సంతకం చేసే దార్శనీకుడు, స్వయంకృషితో ఇండస్ట్రీలో మేరుపర్వతమంత సమున్నత స్థాయికి ఎదిగిన సహృదయులు దాసరి నారాయణరావు గారితో జరిపిన ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
చిన్నప్పటినుంచే మీరు సినిమాల్లోకి రావాలని అనుకునేవారా ?
నేను దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. పేదరికంతో జీవించాను. నేను ఆరో తరగతిలో ఉండగా ఒక నాటకం రాసాను. తొమ్మిదో తరగతిలో ఉండగా నేను నాటకాలు వేసాను. నేనే రాసి, వేసే నా నాటకాలకు మంచి ఆదరణ లభించేది. తర్వాత చదువు పూర్తిచేసి, హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ చాలా కధలు రాసాను. నాకు రాయడం అంటే బాగా ఇష్టం. ప్రైవేటు ఉద్యోగం నచ్చక, సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యంతో మద్రాసు వెళ్ళి అక్కడ మాటల రచయితగా జీవితాన్ని ప్రారంభించి, కొన్ని సినిమాలకు ఘోస్ట్ రచయితగా, దర్శకుడిగా పని చేశాను. నా లోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ నిర్మాత కె. రాఘవ ఆయనను 1972లో తాతా మనవడు సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు. తాతమనవడు ఆ రోజుల్లో సూపర్ హిట్. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాను. ఆ తరువాత నా కెరీర్ మలుపు తిరిగింది.
అయితే మీకు మొదట మీకు ఇష్టమైన రంగం సాహితీరంగం అన్నమాట. ఆ తర్వాత నాటకరంగం, సినిమా. ఒక సాహితీవేత్తగా నేటి సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి?
ఇవాళ ప్రత్యేకించి సాహిత్యం రాసేందుకు ఎవరూ మొగ్గు చూపటంలేదు. ఎందుకంటే ఇవాళ మోడరన్ టెక్నాలజీ, ఐ.టి వచ్చాకా చాలామంది రాసే శ్రమ, చదివే శ్రమ కూడా తగ్గించేసారు. కాబట్టి, వాటి గురించి కామెంట్ చెయ్యడం కష్టం.
తాతామనవడు సినిమా తర్వాత మీ ప్రస్తానం ఎలా కొనసాగింది.
కెరీర్ తొలినాళ్ళలోనే నేను ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. మేఘసందేశం తీసేటప్పుడు మొట్టమొదటిసారి స్టిల్ కెమెరా వాడాను. సినిమా అంటే ఫలానా హీరో నటించిన సినిమా అని చెప్పుకుని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే రోజుల్లో దర్శకుడికి ఒక గుర్తింపు తీసుకు వచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాను. పోస్టర్ పై దర్శకుడి పేరు చూసి ప్రేక్షకులు సినిమాకు వెళ్ళడం నాతోనే ప్రారంభమైంది. తాత మనవడు సినిమాతో దర్శకుడిగా మొదలైన నా ప్రయాణం నల్లేరు మీద నడకలాగా సాగింది. సంసారం సాగరం..బంట్రోతు భార్య, ఎవరికి వారే యమునా తీరే.. రాధమ్మపెళ్ళి.. తిరుపతి. స్వర్గం నరకం.. బలిపీఠం.. మనుషులంతా ఒక్కటే.. తూర్పు పడమర.. చిల్లర కొట్టు చిట్టమ్మ్.. శివరంజనీ.. గోరింటాకు.. పెద్దిళ్ళు చిన్నిళ్ళు ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలను నేను రూపొందించాను.
నా సినిమాల్లో కథ మానవ సంబంధాల మీదే ఎక్కువగా ఉండేది. కథకుడిగా.. మాటల రచయితగా.. పాటల రచయితగా.. స్ర్కీన్ ప్లే రచయితగా.. దర్శకుడిగా.. నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. ఎంతో మంది నటీనటులను తెరకు పరిచయం చేశారు. అందరూ కొత్తవారితో నేను చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది నిర్మాతలు నా ప్రతిభ మీద నమ్మకంతో సినిమాలు చేసేవారు.
ఎన్నో గొప్ప చిత్రాలను తీసారు కదా, ముఖ్యంగా మేఘసందేశం సినిమాకు ప్రేరణ ఏమిటో చెప్పండి.
మేఘసందేశం సినిమాకు ప్రేరణ ఏమిటంటే, నేను అన్ని జోనర్ల లోనూ సినీమాలు తీశాను. కేవలం సంగీత ప్రధానమైన సినిమాలు మాత్రమే కాకుండా, కమర్శియల్ సినిమాలు, కుటుంబప్రధానమైన చిత్రాలు అన్నీ తీసాను. అలా మేఘసందేశం అనే క్లాసిక్ సినిమాను తియ్యాలి, చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే సినిమా తియ్యాలి అనుకున్నాను. అది నాగేశ్వరరావు గారి 200వ సినిమా కనుక ప్రతిష్టాత్మకంగా తీయాలని అనుకున్నాను. తీసాను. సంగీత దర్శకుడు రమేష్‌ నాయుడు ఈ సినిమాకు నిజమైన కథానాయకుడు. ఈ సినిమాకు గొప్ప పాటలను అందించారు ఆయన. మేఘసందేశం సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది. ఆ సినిమా జాతీయ అవార్డును కూడా సాధించి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.
మీరు చేసిన సినిమాలు అన్నింటిలోకి మీకు బాగా తృప్తినిచ్చిన సినిమా ఏది ?
నాకు తృప్తిని ఇవ్వని సినిమా ఏదీ లేదు. ఎందుకంటే 150 సినిమాలకుదర్శకత్వం వహించాను. అన్ని సినిమాలు నాకు నచ్చి, నేను బాగుంది అనుకుని తీసినవే, స్వహస్తాలతో రాసినవే. అందుకని, దేన్నీ తగ్గించి చెప్పగలను ? నాకు నచ్చని సినిమా ఏం లేదు. ఫెయిల్యూర్లు అనేవి ఉండచ్చు కాని, దేన్నీ తక్కువ చేసి చెప్పలేను.
ప్రస్తుతం వస్తున్న సినిమాలు, సినిమా పాటల మీద మీ అభిప్రాయం ఏమిటి ? ఒక దర్శకుడిగా కాదు, దార్శనీకుడిగా చెప్పండి.
నేనేమైనా మాట్లాడితే మళ్ళీ బాధపడతారమ్మా. వచ్చే పాటల్ని పాటలుగా విశ్లేషించలేము. పాటల్లో సాహితీ విలువలు కూడా తగ్గిపోయాయి. ఉత్తిగా డాన్స్ చెయ్యడానికే పనికొస్తాయి తప్ప, కలకాలం నిలిచే పాటలు లేవు. అలాగే ఏదో కాసేపు చూసి వదిలేసే సినిమాలే తప్ప, కలకాలం నిలిచే సినిమాలు తక్కువ వస్తున్నాయి.
మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా?
ఏం లేదమ్మా. జీవితం అనేది ఒక సంఘటనల సమాహారం. అందులో నా జీవితాన్ని నేనే రాసుకున్నాను. ఏఒక్కదానితోటి జీవితం ఆగదు.
మీకు నచ్చిన నటీనటులు ఎవరు?
నాకు పాతతరం నటీనటులు నాగేశ్వరరావుగారు, రామారావు గారు, రంగారావు గారు, సావిత్రిగారు బాగా ఇష్టం. వాళ్ళంతా లెజెండ్స్ అమ్మా.
మీరు ఇంకా ఏమైనా సినిమాలు తీస్తున్నారా? వాటిలో నటిస్తారా?
త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా మొదలవ్వబోతోంది. ఇక నటన విషయంలో పట్టింపులు ఏమీ లేవు. నేను మాత్రమే చెయ్యగలను అనుకున్న పాత్రలు వస్తే, తప్పకుండా చేస్తాను.
*******

No comments:

Post a Comment

Pages