గొడుగు - అచ్చంగా తెలుగు

గొడుగు

Share This

గొడుగు

తురగా వేంకటేశ్వరులు 


జనార్ధనం,నేను బాల్య స్నేహితులం . ఒకే  హైస్కూల్లో చదువుకున్నాం. ఏడవ తరగతి నుంచి ఒకే బెంచి మీద కూర్చునే వాళ్ళం.  అపుడు మామధ్య స్నేహం అంకురించింది. హైస్కూలు చదువు  ముగిసాక మేమిద్దరం విడిపోయాం . చెరొక కాలేజీలో చదివి పట్టభ ద్రులయాం . వేరొక ప్రాంతాలలో ఉద్యోగాలు, తర్వాత పెళ్ళిళ్ళు,పిల్లలు ,తాపత్రయాలు .ఏభై సంవత్సరాలుగా కలుసుకో లేదు ,మాట్లాడుకోలేదు. ఒక రోజు అనుకోకుండగా అతని  చుట్టం  ఒకాయన పార్కులో కనపడి ఉద్యోగ విరమణ అయి  ఇపుడు జనార్ఢనం నేనుంటున్నవైజాగు లోనే ఉంటున్నట్లు చెప్పి ఫోను నెంబరిచ్చాడు. ఇంటికెళ్ళి ఫోనుచేసాను. ఆశ్చర్యం! నాగొంతువిని నన్నుగుర్తుపట్టిఇంటిపేరుతోసహా నా పూర్తి పేరుచెప్పి ఏడవ తరగతిలోమా క్లాసుటీచరు పేరుకూడా చెప్పాడు.అతిశయోక్తి కాదు. అప్పుడనిపించింది. ఏడవతరగతిలో మామధ్య అంకురించి మొలకెత్తిన స్నేహపు మొక్క గడచిన ఏభై ఏళ్ళలో పెరిగి పెద్దదై ఇపుడు గొప్పచెట్టుగా ఎదిగి బలంగా ఉందని. భూమి నుండి  పెరిగిన మామూలు చెట్టైతే ఈపాటికది ఏగాలివానకో పడిపోయేది. లేదా ఏ రోడ్డు వెడల్పు పథకంలోనో  నరకబడేది. కానీ స్నేహం  నుండి పెరిగిన చెట్టుకదా పదిలంగానేఉంది. మేమిద్దరమున్నంత కాలం అలాగే ఉంటుంది. ఇంటికి రమ్మని ఎడ్రస్సు, ఫోను నెంబరూ ఇచ్చాను.
               పదిరోజులు పోయిన తర్వాత ఒకరోజుపది గంటలకు నేను స్నానంచేసి వీధిగుమ్మంలో బయట సూర్యుడుకి  నమస్కారం చేస్తుండగా  జనార్ధనం ప్రత్యక్షమయి నా పేరు చెప్పి “మీరేనా?” అనడిగాడు.“అవును. మీరూ .... ?” అంటుండగా, “నేను జనార్ధనాన్ని.నాకుఫోనుచేసావు కదా?” అన్నాడు. వయస్సుతో పాటు వచ్చిన  మార్పువల్ల అతన్ని గుర్తు పట్టలేకపోయాను. వెంటనే ఇంట్లోకి రమ్మని కాఫీలయ్యాకా పరిచయాలు, ఉద్యోగ,కుటుంబ విషయాలు తెలిసికోవడం జరిగాయి ఆరోజు. అప్పటినుంచి  మా స్నేహపు చెట్టు నీడలో తరచుగా  సమావేశాలు ,చర్చలు, వాదనలు జరుగుతూనే ఉన్నాయి.
            జనార్ధనం మంచి అనువాదకుడు, సాహిత్యాభిలాషి. ఒకసారి నావద్దున్న పుస్తకాలు రెండు తీసుకోడానికి  ఇంటికొచ్చాడు.  నా గదిలోకి రాగానే  తన చేతిలోని గొడుగుని ఒక మూల పెట్టాడు.
“ఏమిటయ్యా! ఇది వానాకాలం కాదు. వేసవి కాదు. గొడుగు తెచ్చావెందుకు?” అన్నాను నవ్వుతూ.
“నీకు తెలియని దేముంది.? మనుష్య ధర్మాలతోపాటు ఋతు కాల ధర్మాలుకూడా మారుతున్న రోజులివి. అకాల వానలు,ఎండలు అనుభవిస్తున్నాము కదా. అయినా ఈగొడుగునాకుఒక రక్షకుడుగా అనిపిస్తుంది.” అన్నాడు.
“అవును మరి! వానలోతడవకుండా,ఎండలోవేడికి చెమటలు పట్టకుండా మనల్ని రక్షింస్తుందికదా. అదీగాక గొడుగు మనకేకాదయ్యా!దేవుడికికూడాఅవసరమే! అందుకేకదా నిత్యపూజలో మనం గంధం సమర్పయామి, పుష్పం సమమర్పయామి,ఛత్రంసమర్పాయామి అంటూ  గొడుగుకి బదులు  పువ్వుని వేస్తాం. పితృ కర్మలులో గొడుగుని దానంగా ఇప్పిస్తారు మనవాళ్ళు.  ఇంకో విషయం చెప్పనా? పార్టీఫిరాయింపులుకి  గొడుగుని ఉపయోగించుకున్న సందర్భముంది” అన్నాను.
“ఏది? ఎల్లాగ?” అంటూ  ఆత్రుతగా  కుర్చీ నాకు దగ్గరగా జరుపుకుంటూ అడిగాడు జనార్ధనం.
“కృష్ణరాయబారం విఫలమయ్యాక  తిరిగి వెళ్తూ  కృష్ణుడు కర్ణుడుని ఊరు చివరి వరకు వచ్చి  తనను సాగరింపమనడగి తన రధంమీద తీసుకెళ్తాడు. ఊరి చివర రధాన్ని ఆపు చేసి కృష్ణుడు  కర్ణునికి  తన జన్మ రహస్యాన్నిచెప్పి పాండవులు వైపుకువచ్చేయమంటాడు. “ వస్తే నాకేంటి ?” అంటావేమో,‘’ నీకు పట్టాభిషేకం జరుగుతుంది. సాక్షాత్తు ధర్మరాజు నీకు గొడుగు పటదాడాయ్యా!” అని ఆశ చూపిస్తాడు .
“నువ్వు ఇల్లా చెపుతుంటే నాకు చినప్పప్పటి ఓ విషయం గుర్తుకొస్తోంది” అన్నాడు జనార్ధన్.
“ మాఊళ్ళో డబ్బు, పలుకుబడి ఉన్న దండు వెం కట రాజుగారు ఆయన దర్పం, దర్జా చూపించడానికి ఎక్కడికి నడిచెళ్ళినా తనకు గొడుగు వేసిపట్టుకోడానికి ఒక మనిషిని పెట్టుకొనే వాడు.  వయస్సులో ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయి  వర్షంలో  ఒకే గొడుగులో  కలిసి  వెళ్తూ  వర్షపు జల్లుకి కొద్దిగా తడిసిన బట్టలతో  ఇద్ద్దరి శరీరాలు తాకుతూ చెవిలో గుసగుసలు, పైకి పకపకలతో  వానలోని చల్లతనాన్ని అనుభవిస్తూన్న  వాళ్ళప్రేమని  చూసాను ఈ మధ్య నేను చూసిన సినీమాలో. ఒక పాటలో రంగు రంగుల గొడుగులు పట్టుకున్న అందమైన అమ్మాయిలు వయ్యారంగా డేన్సు చేసారు.  మనకి వినోదాన్ని పంచడానికి  గొడుగును ఉపయోగించుకున్నాడు  ఆ చిత్ర దర్శకుడు.“అవునా. మరి జనార్ధన్! నేను ఇంకా కొన్ని చెపుతాను. విను” అన్నాను.
“ ఒక సారి  నేను వీధిలో నుంచుని బయటకు చూస్తుండగా  హఠాత్తుగా మబ్బులు కమ్మి చినుకులు మొదలయ్యాయి .  అపుడు నడచి వెళ్ళుతున్న ఒకాయన తన చేతిలోని గొడుగు వెంటనే తెరిచి వేసుకుని తన ప్రక్కన వెళ్తున్న ఇంకో ఆయనను  కూడా తన గొడుగులోకి రమ్మనడం లో  ఆయనలోని సంస్కారాన్నిచూడగలిగాను. ఇంకోసారి  యిల్లాగే ఎండలో  ఒకాసామి హడావిడిగా  వేగం గా  గొడుగేసుకుని వెళ్తున్నాడు .  ఇంకో వైపు ఒకముసలిది ఆ ఎండలో కర్రపట్టుకుని  నడుస్తూ మెల్లిగా వెళ్తోంది. ఆ ఆసామి ఆమెను చూసి  ఆగిపోయి  ఆమె వైపుకి వెళ్ళి  గొడుగు వేసి ఆమె తో పాటు  మెల్లిగా నడవడం చూసి అతనిలో  జాలిగుణాన్ని మనస్సులో మెచ్చుకున్నాను.  ఆమధ్య  మా ఊరు వెళ్ళినప్పుడు  జన్మభూమి కార్యక్రమంలో  ఎం.ఎల్.ఎ. మాట్లాడుతూ   గ్రామాభివృధ్ధి కోసం అన్ని పార్టీలవాళ్ళు  ఒకే గొడుగు లోకొచ్చి పనిచేయాలని సూచించాడు.  అంటే అందరూ కలసి ఐక మత్యంగా  పనిచెయ్యాలనికదా.”
“అంటే ఆనాటి పురాణకాలంనుంచి నేడు మన నిత్య జీవితం లో , మన భాషలో కూడా  గొడుగు పాత్ర  ఉందంటావు. అవునా?”” అన్నాడు జనార్ధన్. “యస్!.... అంటూ లోపలికి వెళ్ళి రెండు కప్పుల టీ ఒక ప్లేటు బిస్కట్టులు  తెచ్చి బల్లమీద పెట్టాను. టీ తాగుతూ , “అయితే  మొత్తానికి గొడుగు మీద ఒక సమీక్ష జరిగింది ఈ వేళ “ అన్నాడు జనార్ధన్.
“ చీకటిపడుతోంది ఇక వెళ్తాను. ఏవీ? నేనడిగిన పుస్తకాలు” అనగానే బీరువాలోంచి తీసిచ్చి  జనార్ధన్ తో కూడా బస్సు స్టాపు  వరకు వెళ్ళి  బస్సెక్కించి చేరగానే  ఫోను చేయమన్నాను. నేనింటికి రాగానే జనార్ధన్ నెంబరుతో  ఫోను మ్రోగింది. “అపుడే చేరిపోయావా?” అన్నాను.  “లేదయ్యా. బాబూ!  నామతి మండ. నీ గదిలో నా గొడుగు మర్చి పోయాను. జాగ్రత్తపెట్టు. మనం మళ్ళీ  కల్సినప్పుడు  తీసికుంటాను. “ అన్నాడు . ఫోనులో ఇద్దరం నవ్వుకున్నాం.
తర్వాతమళ్ళీనాలుగైదు  నెలలు మామధ్య మాటలు రాకపోకలు లేవు. నేనెదో యాత్రలంటూ, పెళ్ళీళ్ళంటూ  సొంతపనులు మీద తిరిగాను. జనార్ధన్ కూడా ఫోను చేయలేదు.  కొంత స్ఠిమిత పడ్డాకా  ఒక రోజు జనార్ధన్ కి ఫోను చేసి,”ఏమయ్యా?ఈమధ్య ఐపు లేవు. నీనుంచి కబురు కాకరకాయలు లేవు. ఫోనులేదు. నన్ను మరచిపోయావా? ఏమిటి?” అనడిగాను.
అతనుజవాబుగా “అయ్యయ్యో! ఎంత మాట. నిన్ను మరచి పోవడమా? మరచిపోగలనా? “అన్నాడు.
“అవునులే. నామీద నీ అభిమానం, ప్రేమ అటువంటివి.”అన్నాను.  అతను, “ ప్రేమా  లేదు. దోమా లేదు. నా గొడుగు నీవద్ద ఉండిపోయింది. అప్పటి నుంచి నిన్ను తలవని రోజు లేదు. నువ్వు గుర్తుకు రాని సమయంలేదు.” అన్నాడు గట్టిగా నవ్వుతూ.
“  సరెలే... త్వరలో ఏదో సందర్భంలో మనం  కలసినప్పుడు నీ గొడుగు నీకు అప్పగిస్తాను.”
“ఆ  ఏర్పాటేదో నువ్వేచెయ్యాలి మరి” అన్నాడు జనార్ధన్.
                                 పదిహేను రోజులుపోయకా ఒకరోజున సాయంత్రం నాలుగు గంటలకు కా లింగు బెల్  మోగుతే వెళ్ళి తలుపు తీసాను. నాకు బాగా పరిచయమున్న సంగీతరావు ఎదురుగా కనపడ్డాడు.  లోపలికి రమ్మని, “ ఏమిటిసంగతులు? “అడిగాను. సంచి లోంచి ఒక కార్డు తీసి ఇచ్చాడు. ఆనెల ఇరవై  తేదినుంచి రెండురోజులు పాటు టౌనులో ఏర్పాటు  చేస్తున్న  సాహిత్య సభలకు ఆహ్వానం.. తప్పకుండా రావాలన్నాడు.
“పేరుసంగీత రావు పెట్టుకుని సాహిత్య సభలు నిర్వహిస్తున్నావేమిటయ్యా?” అన్నాను. “సంగీత సాహిత్య సమ్మేళనం బాగుంటుందికదా సర్... “అన్నాడు నవ్వుతూ .  “ అబ్బో.. ఘటికుడివే!”  అన్నాను  భుజం తట్టుతూ. ఒక రోజయినా వస్తానని ,  నా మిత్రుడు అని చెప్పి  జనార్ధన్ ఎడ్రస్సు, ఫోనునెంబరూ  యిచ్చాను కార్డు పంపమని.  సంగీతరావువెళ్ళిపోయాకా  జనార్ధన్ కి ఫోను చేసి చెప్పాను. తప్పకుండా వస్తానన్నాడు.
                 సభ రెండవ రోజున  నేను, జనార్ధనం వెళ్ళాం.  సఁగీతరావుకి జనార్ధనాన్ని పరిచయం చేసాను.  అతను మమ్మల్ని సాదరంగా  ఖాళీలున్న సీట్లలో వేరు వరసల్లో  కూర్చో పెట్టాడు. జనార్ధనం  ముందు వరసలోకి వెళ్ళాడు. సంగీతరావు నా దగ్గరికొచ్చి, “అయ్యా... ఈ రోజు మధ్యాహ్నం సెషనులో మిమ్మలను  వేదికమీదకి పిలుస్తాను. మీరు ఎదైనా అంశం మీద మాట్లాడితే బాగుంటుంది ” అన్నాడు. “ఇపుడుచెపుతే ఎల్లాగయ్యా? మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు అడిగుంటే సిద్ధపడి వచ్చే వాడిని. ఇంకొకరినెవరినైనా చూడు.” అన్నాను. “  ఇంకొకరెవరైనా ఉంటే  మిమ్మలనెందు కడుగుతానండీ?” అన్నాడు. “అయితే  ఎవరైనా  ఉంటే మాట్లాడ్డానికి నేను పనికిరానన్నమాట.” అన్నాను నవ్వుతూ.  “ అయ్యో!  అలా భావించకండి. పోనీ ఎవరినైనా సూచించండి.”  అన్నాడు సంగీతరావు. “ ఇటువంటి సందర్భాలలో  అనుకోకుండా జోకు లొస్తాయిలేవయ్యా ... నా మిత్రుడు జనార్ధనం గురుంచి ప్పాను కదా  ముందు వరసలో ఉన్నాడు..అతన్ని  అడిగి చూడు. ఇదిగో...ఒక  సభ నిర్వాహకుడుగా రిక్వస్టు చేయి . అడుగు. అంతే గానీ నాతో అన్నట్లుగా ‘ మీ మిత్రుడు అడగమంటే  అడుగుతున్నాను లేకపోతే  నేనెందుకడుగుతానండీ మిమ్మలని’ అని మాత్రం అనకు.” అన్నాను సరదాగా. “సర్... నన్ను తక్కువంచనా వేస్తున్నారు. చూడండి . ఎల్లా ఒప్పిస్తానో ఆయన్ని.” అన్నాడు సంగీతరావు. “అయితే ఆ పని మీద ఉండు.” అన్నాను.
                     సభ  ప్రొద్దుటి సెషను ఒంటి గంటకు పూర్తయింది.  అందరూ లంచికి లేచారు.  నాతో పాటు తెచ్చిన జనార్ధనం గొడుగు  లంచి టైములో అతనికి అప్పగిస్తూ, “ఈ సాహిత్య సభకు వచ్చినందు  వల్ల నీ గొడుగును  నీకు ఇవ్వగలిగాను. లేకపొతే ఇంకా అది  నా దగ్గరేవుండేది”అన్నాను.  వెంటనే జనార్ధనం,“ నేను మాత్రం ఈ గొడుగు కొసమే వచ్చాను. సభ కోసం రాలేదన్నాడు” . మా ప్రక్కనే ఉన్న సంగీతరావు  ఆ మాటలు విన్నాడు.  విన్నాకా అతని మొహంలో  మార్పు గమనించాను.
 లంచి తర్వాత సభ  మధ్యాహ్నం మూడు గంటలకు సెషను  మొదలయింది.  ఈ సెషనులోమాట్లాడినవారి లో  జనార్ధనం లేడు. ఐదు గంటలకి సంగీతరావు వేదిక మీదకు వచ్చి సభకు వచ్చిన వారికి, వక్తలకు ధన్యవాదాలు చెప్పడంతో సభ ముగిసింది.
ఇంటి దగ్గర దింపుతానని జనార్ధనాన్ని నా కారెక్క మన్నాను. కారులో వెళ్తూ అడిగాను, “ జనార్ధనం! ఏమిటి  బొత్తిగా అల్లా అనేసావు? సభ కోసం రాలేదు గొడుగు కోసమే  వచ్చానని .  నీ మాటలు విన్న సంగీతరావు మొహంలో మార్పు గమనించావా? “ దానికి జనార్ధనం “ గమనించాను. కావాలనే, అతను వినాలనే అన్నాను. ఏం చేయమంటావూ? ప్రొద్దున్నసెషనులో  నా దగ్గరికి వచ్చి చెవులో ఒకటే  గొడవ.. మధ్యాహ్నం  వేదిక మీద ఏదైనా సాహిత్యాంశం గురుంచి  మాట్లాడమని. వ్రాయడమే గాని మాట్లాడడం  నావల్లకాదని ఎంత చెప్పినా వినడు. మూడు సార్లు  అడిగాడు. వేదికెక్కితే నాకు చెమటలు పడతాయన్న సంగతి  అతనికి తెలియదు పాపం. సంగీతరావు మళ్ళీ నన్నుఅడక్కుండా సమయంచూసి   అతన్ని తప్పించుకుందుకు  అల్లా అన్నాను.  నా మాటలు విన్నాకా మళ్ళీనా దగ్గరుకు అతనొస్తే  వొఠ్ఠు”. అన్నాడు నవ్వుతూ. “ అయితే నీ గొడుగు ఎండ లోనే గాకుండగా వేదికమీద కూడా చెమటలు పట్టకుండా కాపాడింది మాట నిన్ను”  అన్నాను. ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాం. కాస్సేపటికి జనార్ధనం  ఇంటిముందు కారాపేను. కారు దిగుతూ,“సంగీతరావు చాలా మంచివాడు. ఒక సారి ఫోను     చేసి నా పరిస్థితి వివరించి అతనికి నచ్చ చెపుతాను. ఏమనుకోవద్దనీ. సభ బాగానిర్వహించి నందుకు అభినందనలు కూడా చెప్పాలి. ఇంకోవిషయం...  తన గొడుగు చూపిస్తూ దీని మీద నువ్వు ఒక కథ వ్రాయకూడదూ” ! అన్నాడు నవ్వుతూ . ‘’బై” చెప్పుతూ కారు స్టార్టు చేసాను.
*********

No comments:

Post a Comment

Pages