వసంతానికి స్వాగతం !
చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం.
ఇక ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే ఆనవాయితీఉంది. పంచాంగం అంటే అయిదు అంగాలని అర్ధం చెపుతారు. ఇందులో తిధి, వార, నక్షత్ర, యోగం, కరణం అని అయిదు అంగాలుంటాయి. వరుసగా ఇవి మానవునికి సంపద, ఆయుష్షు, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగాస్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు.
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము చెబుతోంది. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికీ, అంటే, త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము పూర్తయ్యి, కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ, శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా మనతో నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకుంటూ ఉన్నారు. శ్రీ రామ నవమి పండుగను స్వామి జన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా తారక మంత్రమైన 'రామ నామ జపంతో' తరిద్దాము.
అందరికి ఆనందం కలిగించే ఈ తెలుగువారి పండుగలైన ఉగాది, శ్రీరామనవమి మీకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖవంత జీవనం అందించాలని ఆశిస్తూ, చదువరులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
'అచ్చంగా తెలుగు' అంతర్జాల మాసపత్రిక ప్రతీ సంచిక- పరిపూర్ణ గురు అనుగ్రహానికి, మీ అందరి అమూల్యమైన అభిమానానికి ప్రతీక. 8 కధలు, 4 ధారావాహికలు, పండుగల సందర్భంగా వచ్చిన అనేక ప్రత్యేక శీర్షికలు, ముఖాముఖీలతో కూడిన ఈ సంచికకు ఎప్పటిలానే, మీ ఆదరాభిమానాలు, దీవెనలు అందిస్తారు కదూ...
కృతజ్ఞతాభివందనలతో
భావరాజు పద్మిని.
chinmayii02@gmail.com
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment