మా భావన్నారాయణుడు - అచ్చంగా తెలుగు

మా భావన్నారాయణుడు

Share This

మా భావన్నారాయణుడు

(మా బాపట్ల కధలు -1)

భావరాజు పద్మిని


జ్ఞాపకాల మబ్బులపై పయనిస్తూ, ఏ ఉద్వేగాల ఉత్తుంగ శిఖారాన్నో తాకినప్పుడు, మనసులో ఉండే ఆర్ద్రత బయల్పడి, తొలకరిగా కురిసి, నిలువెల్లా పులకింపచేస్తుంది...
మౌనంగా, గంభీరంగా ఉండే సాగర తీరాన నడుస్తూ, నీరెండకు ఇసుకపై మెరిసే అలల తడిని చూస్తున్నప్పుడు, జీవితంలోని ఏ తియ్యటి జ్ఞాపకాలో మనోఫలకం మీద తళుక్కున మెరిసి, మురిపిస్తాయి...
ప్రతి గుండె గూటిలో పదిలంగా నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల గువ్వలు -  కన్నతల్లి, సొంత ఊరు, మాతృభాష లను తలచుకోగానే, రెక్కలు విప్పుకుని, ఉవ్వెత్తున గగనతలానికి ఎగసి, ఆనందడోలికల్లో తేలియాడిస్తాయి...
అటువంటి మధురానుభూతులే నాకూ ఉన్నాయి. అన్నట్లు మా ఊరి పేరు చెప్పనే లేదుకదూ ! ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని భావదేవరపల్లి! అదే కాలక్రమేణా భావపురి, భావపట్ల, బాపట్ల అయ్యింది.
మా బాపట్ల పేరు చెప్పగానే గుర్తొచ్చేది మా భావన్నారాయణుడే ! అల్లంత ఎత్తున్న ఈ శిఖరం(మూడేళ్ళ క్రితం కూలిపోయి, పునర్నిర్మాణంలో ఉంది) పైన అమర్చిన మైక్ ల నుంచి, తెల్లారకుండానే వినవచ్చే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాటలే, మా ఊరివారికి మేలుకొలుపులు. అందుకే... బాపట్ల కధలను చెప్పాలంటే, ముందుగా మా భావన్నారాయణుడి కధతోనే మొదలుపెట్టాలి.
శైవానికి పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవానికి కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), సర్పవరం (నేడు కాకినాడ లో అంతర్భాగం), పట్టసం. వీటిలో సుమారు 1400 ఏళ్ళ చరిత్ర కలిగిన స్వయంవ్యక్త క్షేత్రం, బాపట్ల.
బాపట్ల ఆవిర్భావాన్ని గురించిన కధను తెలుసుకుందాము.
బాపట్ల సమీప గ్రామమైన కొండపాటూరు నుండి ఒకరోజున బావ-బావమరుదులు ఇద్దరు కట్టెలు కొట్టుకోవడానికి ప్రస్తుత భావనారాయణ స్వామి దేవస్దానమున్న చోటికి వచ్చారు. అప్పట్లో పూర్తిగా అటవీ ప్రాంతమది. అక్కడ మామూలు వృక్షాలతోపాటు శాఖోపశాఖలుగా విస్తరించి వున్న అనేక క్షీర వృక్షాలు [పాలచెట్లు] కూడా ఉన్నాయి. ఇద్దరు చెరో దిక్కుకెళ్ళి చెట్లుకొట్టడం ఆరంభించారు. అందులో "బావ" ఒక క్షీర వృక్షం మీద వేసిన గొడ్డలి వేటుకు, ఆ చెట్టు నుంచి అనూహ్యంగా రక్తం స్రవించడంతో ఆ రక్తాన్ని చూసిన అతను భయోత్పాతంతో మూర్చిల్లాడు. వేరే దిక్కున చెట్టు కొట్టందుకు వెళ్ళిన బావమరిది తన పని పూర్తి కాగానే బావను వెదుకుతూ "బావా, బావా" అని పిలుస్తుండగా, ఒక పాల చెట్టు నుంచి "ఓయ్" అని స్వరం వినపడడంతో, అతను ఆ దిక్కుకు వెళ్ళి అక్కడ రక్తం స్రవిస్తున్న చెట్టును, దాని చెంతనే స్పృహతప్పి పడున్న తన బావను చూసి కంగారుగా మళ్ళీ "బావా" అని పిలిచాడు. మరలా అదే చెట్టు నుంచి వచ్చిన ఆ సమాధానానికి ఆశ్చర్యచకితుడయ్యాడతను. అది దైవ మాయగా భావించిన అతను క్షణంలో జరిగిన తప్పును గ్రహించాడు. వెంటనే తమ తప్పును మన్నించమనీ, తమని మన్నించి కరుణిస్తే పొంగళ్ళు పెట్టుకుంటామనీ, ఆ చెట్టునే ప్రార్దించడంతో అతని బావ తిరిగి స్పృహలోకి వచాడు. దాంతో ఆ చెట్టుగల గల ప్రాంతమంతా మహిమలతో కూడుకున్నదని భావించిన ఆ ఇద్దరూ, ఆనాటినుంచి ఆ చెట్టును పూజించడం ప్రారంభించారు. అంతేకాకుండా తాము మొక్కుకున్న విధంగా ప్రతి ఆదివారం నాడు వారు ఆ వృక్షానికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించసాగారు.
ఇదిలా వుండగా “వీరప్రతాప క్రిమికంఠ చోళుడు” అనే చోళ రాజు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా క్రీ.శ. 6వ శతాబ్దం చివరి భాగంలో, కావేరి నదీ తీరం నుండి దిగ్విజయ యాత్రకై బయల్దేరి, సమస్త రాజులను జయించి తిరిగివెళ్తూ, విశ్రాంతి నిమిత్తం "ఆముదాలపల్లి" గ్రామం వద్ద తన సైన్యంతో మజిలీ చేశాడు. రాజు, ఆయన పరివారం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ రాజుగారి పట్టపుటేనుగులు తమ అహారం నిమిత్తం ఆ ప్రాంతమంతా సంచరించసాగాయి. ఆ ప్రాంతంలోని క్షీర వృక్షాలను చూడగానే వాటికి ఆకలి రెట్టింపై, వెంటనే ఒక క్షీర వృక్షాన్ని తమ తొండములతో విరచి తినడానికి ప్రయత్నంచాయి. అయితే విచిత్రంగా ఆ ఏనుగుల తొండములు ఆ పాలచెట్టుకు అతుక్కునిపోవడంతో, భీతిల్లిన మావటివాడు, పరుగు పరుగున మహరాజు దగ్గరకు వెళ్ళి ఆ సంఘటనను వివరించాడు . ఆ వార్త ఎంతో చిత్రంగా అనిపించడంతో వెంటనే చక్రవర్తి తనే స్యయంగా తన పరివారంతో సహా ఆ చెట్టు దగ్గరకు చేరి, దానికి అతుక్కునిపోయిన తన పట్టపుటేనుగులను చూసి మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అది భగవానుని లీలగా గ్రహించి, చేతులు జోడించి, ఆ వృక్షరాజంతో "ఓ క్షీర వృక్షమా! నీ మహిమ తెలియక తప్పు జరిగింది. నా నేరములు మన్నించి నా ఏనుగులను కాపాడు " అని శరణు వేడడంతో వెంటనే స్వామి ఇద్దరు విప్రులలో ఆవహించి, "ఓ చోళ మహారాజా ! ఏనుగు పాదములవంటి స్తంభములతో విరాజిల్లు ఒక ఆలయమును ఈ ప్రాంతమున నిర్మించి నన్ను ప్రతిష్ఠింపుము, నా పేరుతో ఒక పట్టణమును నిర్మింపుము, అప్పుడు మేము ప్రసన్నులమవుతాము,” అనడంతో దానికి చొళ మహారాజు మహదానందభరితుడై వెంటనే అంగీకరించాడు. వెంటనే ఆ ఏనుగులకు స్వస్దత చేకూరి అవి అక్కడినుంచి వెళ్ళిపోవడంతో స్వామివారి మహిమను అనుభవపూర్వకంగా గ్రహించిన అతను ఆముదాలపల్లిలోనే స్దిర నివాసమేర్పరచుకొని ఆలయ నిర్మాణానికి పూనుకొన్నాడు. ‘బావా, బావా’ అని పిలికిన నారాయణుడిని ‘భావనారాయణుడన్న’ పేరుతో ప్రతిష్ఠింపదలచి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఆ వెంటనే చిలకలూరిపేట వద్దగల బొప్పూడి కొండనుండి రాళ్ళు తెప్పించి, పనులు ప్రారంభించాడు. రాత్రి నిర్మించిన ప్రతి కట్టడం మరునాటికే శిధిలమైపోతుండడంతో చక్రవర్తి మళ్ళీ దైవాన్ని ప్రార్దించాడు. అప్పుడు స్వామి చక్రవర్తికి స్వప్నంలో సాక్షాత్కరించి "ఓ రాజా! వెంకటగిరి సంస్థానమునందు చిమ్మిరిబండయను కొండగలదు. అందలి రాళ్ళు కృష్ణవర్ణమయములు. ఆ కొండయందలి రాళ్ళకు శీతాకాలమున వెచ్చదనమును, గ్రీష్మమున చల్లదనము నొసంగెడి లక్షణము కలదు. ఆ రాళ్ళ తో ఆలయ నిర్మాణమును చేయుము" అని పలకగా ఆ రాజు వెంకటగిరి రాజు గారి అనుమతితో ఆ సంస్దానమునందలి చిమ్మిరిబండ కొండనందలి రాళ్ళను ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తెప్పించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు.
పునాదులు తవ్వుతుండగా ఆ త్రవ్వకంలో ఒక వల్మీకము [పుట్ట], అందులో శ్రీ వీరభొగ యోగ లక్ష్మీ సమేత జ్వాలా నరసింహస్వామి విగ్రహము బయటపడ్డాయి. హిరణ్యకశిపుని వధానంతరం శాంత రసానికి చేరుకుంటున్న జ్వాలా నరసింహ స్వామి రూపమది. ఆ విగ్రహమును అక్కడినుంచి కదిలించటానికి సాధ్యం కాకపోవడంతో ఆ రాజు తూర్పుదిక్కున తిరుచుట్టు మాలిక వెడల్పు పెట్టించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు ఐతే పుట్టనుండి బయటపడ్డ జ్వాల నరసింహస్వామి వారి దృష్టి అక్కడికి ఆరుక్రోసుల దూరంలో గల కారంచేడు గ్రామంపై పడి, ఆ ఊరు ధగ్ధ మవడంతో ఆ దోష నివారణకు శ్రీ శాంతకేశవ స్వామిని శ్రీ జ్వాలా నరసింహస్వామికి అభిముఖంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేసాడు. ఓ వంక దేవాలయ నిర్మణం చురుగ్గా సాగుతుండగా కొండపాటూరు గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ గ్రామంలో ఒక  జున్న పాతర యందు అమ్మవారి విగ్రహము బయటపడింది. ఆమె అక్కడి కాపులతో “నేను శ్రీ భావన్నారాయణ స్వామి వారి దేవేరిని, నా పేరు రాజ్యలక్ష్మి. నాకు ఈ ఊరే పుట్టినిల్లు, మా అత్తగారి ఊరు భావపట్ల, పుట్టినింటివారే నాకు మంగళ ద్రవ్యములను ప్రతిసంవత్సరం కల్యాణోత్సవములో సమర్పించవలెను,” అని చెప్పడం తో గ్రామస్తులు వెంటనే చొళ మహారాజు కు ఆ సంఘటను తెలియజేసారు, మహారాజు ప్రమానందంతో గ్రామీణుల సహకారంతో కొండపాటూరు నుండి శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మి తాయారు విగ్రహాన్ని తెప్పించి శ్రీ భావన్నారాయన స్వామి వారికి వాయవ్య దిగ్భాగాన దక్షిణాముఖంగా ప్రతిష్ఠ చేయించి, ఆ దేవేరికి గజపాదాకార స్తంభాలతో ఆలయంలోనే మరో ఆలయాన్ని నిర్మించారు. అది మొదలు నేటికి కూడా స్వామివారి కల్యాణమహోత్సవానికి కొండపాటూరు గ్రామము నుంచి మంగళసూత్రం, మెట్టెలు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, తలంబ్రాలు వంటి మంగళ ద్రవ్యాలు రావడం ఆచారమయ్యింది.
ఇదండీ కొండంత మా దేవుడి కధ. శ్రీ భావన్నారాయణుడు వెనకవైపు కుడి చేయి కమల హస్తంగా, ముందు వైపు ఎడమ చేయి కటి హస్తంగా భక్తకోటికి దర్శనమిస్తారు. అంతరాలయంలో ఆంజనేయ స్వామి పడమరన, కేశవస్వామి విగ్రహాలను తూర్పు ముఖంగాను, స్వామి వారి పర్యంక మందిరము, ఆసీన రీతిలోని రాజ్యలక్ష్మీ అమ్మవారు, విఖనసాచార్యులు, రంగనాధ స్వామి, సమభంగ స్దానక రీతిలోని గోదాదేవి, స్దానక రీతిలోని కోదండ రామస్వామి, ఆసీన రీతిలోని వీర భోగ జ్వాలా నరసింహ స్వామి, 10 మంది ఆళ్వారులతో శ్రీరామానుజాచార్యులు మరియు 112 గ్రంధాలకు పైగా శ్రీ వైష్ణవ గ్రంధాలను రచిచిన "కవితార్కికకేసరి" బిరుదాంకితులైన వేదాంత దేశికుల వారితో తిరుచుట్టు మాలిక అలంకరంపబడగా కేంద్రస్దానంలో స్వామివారి దివ్వ స్వరూపం అఖిలాండ కోటికి అనంత వరాల జల్లులను కురిపిస్తూ దివ్వ ప్రకాశాలను వెదజల్లుతుంటుంది. కుట, శాల, పంజర హారములతో కూడిన ఏకతల విమానము, గర్భగుడి, ముఖమండప ద్వారాల దగ్గర గల ద్వారపాలక విగ్రహాలు, అర్దాండప ద్వార బంఢాలపై చిత్రంచబదిన పురాణ ఘట్టాలు, పలు కుడ్య చిత్రాలు, ద్వార తోరణాలు, చిత్ర తోరణాలు, స్తంభ తోరణాలు వంటి కళాత్మక అలంకరణలు ఆలయ అందాన్ని ఇనుమడింపజేస్తూ నటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తునాయి.
గుళ్ళో ఒక్కో దేవుడి దగ్గరా ఆగి, గుంజిళ్ళు తీసి, వెళ్ళేవాళ్ళం. గుడిలో స్వామి వెనుక ఉన్న సీలింగ్ పై ఉండే చేపను ముట్టుకుంటే, కోరికలు తీరతాయని, చెప్పేవారు. అందుకే... గుడికి వెళ్దాం పద, అనగానే ముందుగా కోరికల చిట్టా, మనసులో పరిచేసుకుని, సిద్ధమైపోయేవాళ్ళం. అల్లంత పెద్ద రంగనాధ స్వామిని, చుట్టూ ఉన్న దేవతల్నీ, కళ్ళు విప్పార్చి చూసేవాళ్ళం. ఉగ్ర నృసింహ స్వామిని కాస్తంత భయంగా చూసేవాళ్ళం. అది మా ఊరి వారికి,గుడి కాదు, అమ్మ ఒడి లాంటిది.
ఇక ఏడాదికి ఒకసారి వచ్చే తిరునాళ్ళు వచ్చాయంటే, మా ఊరి వాళ్ళకే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకీ గొప్ప సంబరమే. ప్రతి ఏటా వైశాఖశుద్ద సప్తమి నుండి పౌర్ణమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 9 రోజులపాటు రధోత్సవమైన మర్నాడు వరకు అంగరంగవైభవంగా జరుగుతాయి. తిరుమజ్జనోత్సవముతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 2 వ రోజున ధ్వజారొహణ, 3వ రోజు నరసింహ వాహనోత్సవము, 4న హనుమంత వాహనోత్సవము, 5న పొన్నమాను వాహనోత్సవము, 6న శేష వాహనోత్సవము, 7న పొన్న వాహనోత్సవము , 8న జగన్మోహిని ఉత్సవము, గ్రామోత్సవము, ఎదురుకోల ఉత్సవము, 9న తెల్లవారుజామున శ్రీసుందరవాల్లీ రాజ్యలక్ష్మీ భవదేవుల కళ్యాణ మహోత్సవము, గరుడ వాహనోత్సవము సాయంత్రం రధోత్సవము అత్యంత వైభవంగ నిర్వహించబడతాయి. గాలిగోపురానికి బయట కుడివైపున స్వామివారిని ఊరేగించే రధం రధశాలలో ఉంది. ఈ రధం 18వ శతాబ్దంలో "మల్లేశలింగం" అను విశ్వబ్రాహ్మణ కళాకారుడిచే నిర్మించబడింది. గత 300 సంవత్సరాలుగా ఈ రధం తిరునాళ్ళ సందర్భంగా స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించబడుతొంది. రధోత్సవం రోజున ఊరంతా ముందు జాగ్రత్తగా కరెంటు తీసేసేవారు. కాగడాల పసిడి వెలుగుల్లో, కొండంత రధం మీద ఈ బ్రహ్మాండాలు అన్నింటికీ మహారాజులా, ఠీవిగా, దర్పంగా వస్తున్న మా స్వామిని చూసేందుకు పెద్ద పెద్ద మేడలు ఎక్కి నిల్చునేవారు జనం. అదొక అంబరాన్ని  సంబరం.
బ్రహ్మోత్స వాలలో "పొన్నమాను" ఊరేగింపు ఒక ప్రత్యేక అకర్షణ. గోపికల వస్త్రాలు అపహరించిన కృష్ణుడు పొన్నమాను చెట్టు మీద కూర్చుంటే, కృష్ణుడిని తమ వస్త్రాలు తిరిగి ఇవ్వమని వేడుకుంటున్న గోపికలు ఈ వాహనంలో కనిపిస్తారు. ఆ చెట్టుకి అమర్చిన అలంకారాలు, దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. స్వామి ఊరేగింపు మేళాలు వినిపించగానే, పూలు, పళ్ళు, కర్పూరం, దక్షిణ, అగరుబత్తీలు, ఒక ప్లేట్ లో పెట్టుకుని, ఇంటి ముందుకు వచ్చే ఊరేగింపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. వెలుగుతున్న కర్పూరం ప్లేట్ తో అందరికీ హారతీ, ప్రసాదం ఇస్తూ, ఇంట్లోకి తిరిగి వెళ్ళడం, ఒక మధురానుభూతి.
 మా చల్లని స్వామి దీవెనలు ఆ మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరిమీద ప్రసరిస్తాయి. కేవలం మా ఊరి వాళ్ళకే కాదు, నమ్మిన వారికి కొంగు బంగారంలా నిలుస్తారు మా భావన్నారాయణ స్వామి. పురావస్తు శాఖ దేవాలయ శాఖ అధీనంలో ఉన్న ఈ ఆలయానికి ఉన్న గాలిగోపురాన్ని మళ్ళీ పునర్నిర్మించి, ఆలయ వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని, ఆ కొమ్మకు పూచిన నావంటి పువ్వులు ఎన్నో వెయ్యి కళ్ళతో, కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాయి.
చివరగా... చిన్న మాట...
‘అందరూ ఇటువంటి కధలు రాసారు కదా, మరి మీరు కూడా ఎందుకు రాయడం ?’ అంటారా ? మరి వారి ఊళ్ళను గురించి వారు చెప్పారు, మా ఊరి గురించి కూడా ఎవరైనా చెప్తేనేగా మీకు తెలుస్తుంది ! అందుకే నేనొచ్చాను. మళ్ళీ వచ్చే నెల “మా బామ్మ కధ” చెబుతానే... వేచి ఉంటారు కదూ !
(వచ్చే నెల కలుద్దాం...)

No comments:

Post a Comment

Pages