గొల్లపూడి మారుతీరావు గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

గొల్లపూడి మారుతీరావు గారితో ముఖాముఖి

Share This
 గొల్లపూడి మారుతీరావు గారితో ముఖాముఖి 
భావరాజు పద్మిని 


ఆయన అక్షరాలు పున్నమి అలలపై తేలియాడే వెన్నెల తరగలు. ఆయన మాటలు, జీవితాన్ని కాచి వడపోసిన ఒక కర్మయోగి మనసులోంచి సూటిగా దూసుకొచ్చే సుమ సుగంధాలు. ఆయన ప్రతీ కదలికా ఒక అద్భుతం ! ఒక్కసారి ఆయనతో మాట్లాడడం మొదలుపెడితే, ఇక ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు. విజ్ఞానఖని, నడిచే ఎన్సైక్లోపీడియా లాంటి గొల్లపూడి మారుతీరావు గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మా ప్రియమైన ‘అచ్చంగా తెలుగు’ చదువరుల కోసం అందిస్తున్నాను.
నమస్కారమండి, మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించిన సంగతులు చెప్పండి.
నేను 1939, ఏప్రిల్ 14 వ తేదీన విజయనగరంలో మాతామహుల ఇంట్లో పుట్టాను, విశాఖపట్నం జిల్లా. మా నాన్నగారు విశాఖలో పని చేసేవారు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో చెప్పిన ప్రసిద్ధమైన ప్రాంతాలన్నీ నేను పెరిగినవే. గుండాల వారి వీధిలో నా చిన్నతనం గడిచిన గుర్తు. గుల్లంపల్లి, గంట స్థంభం ,అయ్యకోనేరుగట్టు, రంగస్థలం, ఇవన్నీ అప్పుడు ప్రసిద్ధమైన స్థలాలు.  అలా నా చిన్నతనం నా సాహితీ పరమైన గొప్ప జ్ఞాపకాలకి వేదికగా నిలిచింది.
మీకు సాహిత్యం పట్ల అభిరుచి ఎలా కలిగిందండి? మీ ఇంట్లో రచయితలు ఎవరూ లేరటకదా ?
ఎవ్వరూ లేరండి. నాకు ఇటుపక్కా లేరు, అటుపక్క లేరు మా ఇంట్లో. నాకు చిన్నతనంలో మా అమ్మగారు కూడా  ఆరోజుల్లో రామాయణ భాగవతాలు చదువుకొనే ఆనాటి ఆఅడవాళ్ళలాంటి ఆవిడే.  కానీ ఆవిడ తో పాటు చిన్నప్పుడు పురాణాలకి వెల్తూ ఉండేవాడ్ని. పురాణాల్లోని అంశాలు నన్ను ఆకర్షిస్తూ ఉండేవి.
మేడూరి అప్పన్న శాస్త్రి గారని ఒకాయన ‘పప్పు వారి వీధిలో’ వైశ్యుల ఇంట్లో పురాణాలు చెప్తూ ఉండేవారు. మా అమ్మగారితో నేను ఆయన పురాణాలకి వెల్లేవాడ్ని. ఆ రోజుల్లో నాకు 10 ఏళ్ళో 11 ఏళ్ళో అనుకుంటాను. ఆయన చెప్పినవి నన్ను ఆకర్షించిన విషయాన్ని ఇంటికొచ్చి రాసుకొనే వాడ్ని. I don't know why..it prompted me. దాన్ని మళ్ళీ రాసుకోవడము, రాసుకుంటునప్పుడు మళ్ళీ  ఆ అనుభవాన్ని పునరుజ్జీవింప చేసుకోవడం జరుగుతూ ఉండేది.   To recreate a memory, to recreate a feeling , to recreate an inspiration ..అని అనుకుంటాను. ‘ధట్ వాస్ ద బిగినింగ్, ఒక లేటెంట్ ప్రాంప్టింగ్’ ఏదో ఉండేది మనసులో. అది నా ఎర్లియర్ అట్టెంప్ట్ టు రైట్ సంథింగ్ అనుకుంటాను. మా నాన్నగారు షార్ట్ హ్యాండ్ రాసేవారు. ఆయన పుస్తాకాలన్నీ ఒక పక్క ఖాళీగా ఉండేవి. అందులో రాస్తూ ఉండేవాడ్ని.
ఇది పన్నెండు, పదమూడో ఏట అనుకుంటే, పద్నాలుగో ఏటకి మొదటి కధ రాసాను. పద్నాలుగో ఏట అంటే 1959 డిసంబర్లో నా మొదటి కధ పబ్లిష్ అయ్యింది. నాట్ అ గుడ్ స్టోరీ ఎట్ ఆల్.  కథ పేరు ఆశాజీవి.అది ప్రొద్దుటూర్ నించి ఒక లోకల్ పేపర్ ఒకటి వచ్చేది. ఒక ఫ్రెండ్ ద్వారా దాని అడ్రెస్ తెలిసింది అనుకుంటాను. దాని పేరు రేనాడు. దాన్లో ఈ కధ పబ్లిష్ అయ్యింది. జ్వాలా నారాయణ రెడ్డో ఎవరో ఆయన నడిపేవారు. లోకల్ వ్యాజ్యాలు, కోర్ట్ ప్రొసీడింగ్సు, లోకల్ న్యూసు  ఇవ్వటానికి ఇలా నాలుగైదు పేజీలు ఉండేది ఆ పేపరు. ఎవరూ రసేవడు కాదు, ఎవరూ చదివేవాడు కాదు అనుకుంటాను ఆ రోజుల్లో.
ఒక ఇరవయ్యి ముప్పై సంవత్సరాల తర్వాత దేవాలయంలో ఒక అమ్మాయి వచ్చి నా పాదాలకి నమస్కారం పెట్టింది. పక్కన భర్త పిల్లలూ ఉన్నారు. ‘ఆ పత్రిక ఎడిటర్ మా తాతగారండీ, మీరు మా పత్రికకు రాస్తూ ఉండేవారని చెప్పేవారు,’ అంది. అదొక మధుర జ్ఞాపకం.
రేడియో ప్రయోక్తగా మీ కెరీర్ ఎప్పుడు ఆరంభమయ్యింది ?
రేడియో లో అంటే – నేను 1959 లో విద్యార్ధి దశలో ఆనర్స్ చదువుతూ ఉండగానే ఆకాశవాణి వారు నిర్వహించిన, ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు గాను , నాకు బహుమతి లభించింది. కె.వి.గోపాలస్వామి గారు మా గురువుగారు. నేను రాసిన ‘అనంతం’ అనే నాటికను ఆయనకు ఇచ్చాను. దాన్నిఆయన నన్ను సెలవల్లో రికార్డు చెయ్యమన్నారు. మా స్టూడెంట్స్ తో కలిసి, AIR విజయవాడ లో రికార్డు చేసాను. దుర్గాచలం గారని, ఒకాయన అందులో ఉండేవారు. నా రికార్డింగ్ చూడడానికి వచ్చిన తెన్నేటి హేమలతా దేవి గారు (అనౌన్సర్). రికార్డు అయిన తర్వాత, తెలిసింది ఏమిటంటే – అంతర్ విశ్వవిద్యాలయాల నాటక రచనా పోటీల్లో నాకు ఉత్తమ రచయతగా బహుమతి లభించింది అని తెలిసింది.
అప్పట్లో మధు గారు, 3 రూ. ఇచ్చారు, అప్పట్లో దానితో తులం బంగారం వచ్చేది. అదే సమయంలో నేను ‘చాసో’ అనే మరొక నాటిక రాసాను. ఇదొక గ్రీక్ గాడెస్ పేరు అనుకుంటాను. దురదృష్టవశాత్తూ, ఈ స్క్రిప్ట్ మాత్రం ఎక్కడా నాదగ్గర లేదు. దీన్ని 1960 లో AIR వారు అక్సెప్ట్ చేసారు. దీనికి 25 రూ. వచ్చింది. అనంతం నాటిక ప్రసారమైన వారానికే రేడియో లో దీన్నీ వేసారు. ఆ డబ్బులను మా నాన్నగారిని ఇచ్చి, వారు ఇచ్చిన డబ్బులతో నా మొదటి రేడియోను కొన్నాను. ఆ విధంగా రేడియో మా ఇంట్లోకి ప్రవేశించింది.
ఆ రోజుల్లో ఎస్. వరలక్ష్మి గారు, శాంతకుమారి గారు, టి. సూర్యకుమారి గారు ‘ ఊపరే ఊపరే ఉయ్యాల’ అంటూ మధురంగా పాడే పాటల్ని రేడియో లో వినేవాడిని. ఇవి వింటూ ఉంటే, అదేదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా ఉండేది. ఐ నెవెర్ నో, ఈ పాటలు ఇంట్లోకి వచ్చిన మూడేళ్ళలో నేను రేడియో కు వెళ్తానని. నేను దుర్గాచలం గారు, లత గారు వీరందరితో కలిసి, దాదాపు 20 ఏళ్ళు పనిచేస్తూ, అందులో అంతర్భాగం అయిపోయాను. ఈ విధంగా రేడియో నా జీవితంలో ప్రవేశించింది.  1982 లో కడప రేడియో స్టేషన్ కు అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేసాను.
మీరు మాటల్లోనే చీకటిని సృష్టించేవారట, ఇది ఎలా సాధ్యమయ్యింది ?
ఆ నాటిక పేరు ‘సహస్ర బాహు’. అద్భుతమైన నాటిక అది. సౌండ్ లో చీకటిని దానితో మేము సృష్టించాము. ఇది చాలా సులభం. వెర్బల్ ద్వారా మెంటల్ ఇమేజ్ ను క్రియేట్ చెయ్యడం అనేది ఒక ఆర్ట్. మీరు అక్కడ ఉండగానే, నా కాలు సరిగ్గా పనిచెయ్యట్లేదు, నేను కుంటుతూ నడుస్తున్నాను అన్న విషయాన్ని ఎలాగైతే మీకు అర్ధమయ్యేలా చెయ్యగలనో, అలాగే, నేను చీకట్లో కూర్చున్నాను , చెయ్యి చాపితే ఏం తగులుతుందో కూడా తెలీని పరిస్థితిలో ఉన్నానని మీకు చెప్పచ్చు. మీ ఇంట్లో దీపం ఆరిపోయింది అనుకోండి. మీ పిల్లలు గావుకేకలు పెట్టారే అనుకోండి, ఎటుపక్క నుంచి వెతకాలో మీకు తెలీలేదు అనుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ అయిస్ అండ్ సెర్చ్ ఫర్ యువర్ చైల్డ్. వాడి కాలు తగిలిందేమో, వాడి ఊపిరి మీ పక్కన తగులుతోందేమో, ఇలాంటి భావాలు, మీ ఆతృత ఇవన్నీ వెర్బల్ లోనే ప్రాజెక్ట్ చెయ్యాలి. వెర్బల్ లో ఇది మరొక డైమెన్షన్. దీనితో ఒక పార్లల్ విసువల్ వెర్బల్ ద్వారా మీరు వినే శ్రోతకు క్రియేట్ చేస్తున్నారు. ఇలా మేము చెయ్యగలిగాము.
ఈ నాటకం చాలా సెన్సువల్ పరిస్థితి, వ్యక్తి కోరికలకు సంబంధించినది. చీకట్లో ఒక వేశ్య కూర్చుని ఉంటుంది. ఆమె దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. అమ్మాయి లైట్ వేసేందుకు చూస్తుంది. అతను అసలు ఒప్పుకోడు. ఇద్దరికీ తాము చీకటి గదిలో ఎందుకు ఉన్నామో తెలుసు. ఆమె అతను తనను ముట్టుకుంటాడని, ఆశిస్తూ ఉంటుంది. నిరీక్షిస్తుంది. కాని, అటువంటిది ఏమీ జరగదు. చివరికి లైట్ వెలిగినప్పుడు, ఆమె గావుకేక పెడుతుంది. ఎందుకంటే – అతనికి రెండు చేతులూ ఉండవు. అతనికి చీకట్లో ఒక స్త్రీతో ఉండే అనుభవం ఎలా ఉంటుందో చూడాలని కోరిక. అతనొక సైనికుడు – నా చేతులు ఈ దేశ భద్రతను కాపాడుతున్నాయి, అంటాడు క్లైమాక్స్ లో. ఇదీ సహస్ర బాహు.
ప్రాపంచిక విషయాల గురించి, కోరికల గురించీ అన్నింటి గురించీ వారు మాట్లాడుకుంటారు. ఒక తాత్వికమైన రేంజ్ ఉంటుంది. ఇదొక గొప్ప ప్లే, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
మీ విజయాల్లో మీ శ్రీమతి, శివకామసుందరిగారి భాగస్వామ్యం గురించి చెప్పండి.
నా వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. జీవితంలో ఎప్పటికీ నాకు తెలియని విషయం ఒకటి ఉంది. నా జీతమెంతో నాకు తెలీదు. నా బ్యాంకు లో ఎంత డబ్బుందో నాకు తెలీదు. నాకు 76 ఏళ్ళు, అయినా నాదగ్గర ఎంత డబ్బుందో నాకు తెలీదు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నాను. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా జీవితంలో క్రియేటివ్ గా నేను ఏం చెయ్యగలను అన్న విషయం తప్పితే, లౌకిక ప్రపంచంతో సంబంధం లేనట్లు బ్రతుకుతున్నాను. జీవితంలో నా వృత్తీ, ప్రవృత్తీ ఒకటే అవడం నా అదృష్టం. నా బాధ్యతలన్నీ ఆవిడ మీద రుద్దేసాను. ఆవిడ ఉదారంగా, అన్నీ చక్కబెట్టడం వల్లే, నేను ఇన్ని విజయాలు సాధించాను అని గర్వంగా చెప్పగలను.
పూర్తి ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి...
https://www.youtube.com/watch?v=ByT9o-L-MaA

No comments:

Post a Comment

Pages