మహోదయం - అచ్చంగా తెలుగు

మహోదయం 

టీవీయస్.శాస్త్రి    

జన ఘోషను నేను!

జన భాషను నేను!!

కొందరు నన్ను 'కవి' అని అంటారు 

అసలు నేను కవినే కాను

నిజానికి నాకు కవిత్వమంటేనే తెలియదు

పద్యం వ్రాయలేను

గద్యం పలుకదు

చెప్పదలుచుకున్నది హృద్యంగా చెబుతాను

పేదవాడి కన్నీటి భాషను దయనీయంగా చెబుతాను

నిరుద్యోగి నిస్పృహను నిజాతీయిగా  చెబుతాను

నిర్భాగ్యురాలి మానభంగం గురించి 'నిర్భయం'గా పోరాటం చేస్తాను 

అవినీతిని అధ:పాతాళానికి తొక్కేస్తాను

అంతరాలు లేకుండా అందరితో తిరుగుతాను

నేను ఒంటరి వాడిని కాను

నాకున్న లక్ష్యమే కొన్ని లక్షలమందికి కూడా ఉంది

నేను నిరాయుధుడను కాను 

కలాన్ని కదంతొక్కించే కదనకుతూహలడను

అలుపెరుగని యోధుడను 

ఈ జీవనపోరాటంలో గుండె నిండా గాయాలే!

ఆ గాయాల భాషనే మీకు చెబుతుంది

నిరాశ లేనే లేదు

దురాశపరుడను కాను

అత్యాశ లేనే లేదు

ఓర్పే నా నేర్పు

మరి ఏమిటి నా లక్ష్యం అంటారా!

చెబుతాను....

ఈ నిశిరాత్రి ఇలానే ఉండదు

ఈ చీకటిని చీల్చుకొని కాంతులు విరజిమ్ముతూ 

రేపు ఉదయాన్నే ఒకడు వస్తాడు

వాడే సూర్యుడు!

'వాడే' సూర్యుడు కాడు,మండే సూర్యుడు!

వాడు వచ్చేంత వరకు ఈ దీపశిఖలతో జనాన్ని జాగృత పరుస్తాను

వాడు వచ్చిన నాడు జనావళికి మహోదయం

"రేపు మళ్ళీ వస్తాను,ప్రతి రాత్రీ జనాన్ని జాగృతపరచు"

అనే సందేశం ఇచ్చి మరో దేశంలోని చీకట్లను తరిమికొట్టటానికి  వెళ్ళుతుంటాడు వాడు

వాడు నా చెలికాడు! 

ఇలా నిరంతరం జరుగుతున్న 'తిమిరంతో సమరం'లో 

ఎప్పటికీ జయ దుందుభి మోగించేది వాడే! 

 

No comments:

Post a Comment

Pages