ధరణీపుత్రి - అచ్చంగా తెలుగు

ధరణీపుత్రి

Share This

ధరణీపుత్రి

మంజువాణి సుధీర్  


“చదువుకుని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో జాబు చేసిన నువ్వు వ్యవసాయం చేస్తావా? పైగా  ఆడపిల్లవి, ఇదేమి విచిత్రం ?” అంటూ ధరణి ఆడపడుచు, ఆవిడ భర్త ఒక్కటే నవ్వు. ధరణి కూడా చిన్నగా నవ్వి, తయారవ్వడానికి లోపలికి వెళ్ళింది. ఈ ప్రపంచంలో ఎదుటివారి మాటను విని స్పందించినంత సులువుగా, ఆ వ్యక్తి మనసులోతును అంచనా వేసి తెలుసుకోవడం, అర్ధం చేసుకోవడం, అసాధ్యం అని ధరణి నమ్మకం. అందుకే, ఆమె అటువంటి సందర్భాల్లో చిరునవ్వుతోనే సరిపెడుతుంది.
“హైదరాబాద్ లో 2 రోజూలు ప్రకృతి సేద్యం శిక్షణ” అనుకోకుండా పేపర్ లో వచ్చిన ప్రకటన చూసింది ధరణి. ధరణి అప్పుడు ఖాళీ గానే ఉండటం వల్ల ఆ వర్క్ షాప్  కి వెళ్లాలని, తన భర్త సుధీర్  అనుమతితో అక్కడికి వచ్చి,  కుక్కట్పల్లిలో బస్సు దిగి, సుధీర్ అక్కగారింటికి వచ్చింది. ధరణి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న ఆమె ఆడపడుచు, ఆవిడ భర్త స్పందన అది.
 టిఫిన్ చేసి తన కజిన్ నాగేష్ తో వర్క్ షాప్  జరుగుతున్న ప్రదేశం చేరుకుంది. 300 వందల మంది దాకా జనం పొగయ్యారు. అందులో ఓ 50 మంది యువతీ యువకులున్నారు. ఒక పక్కగా కుర్చీ చూసుకుని కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయింది ధరణి. తనకు చిన్నప్పటి నుంచి ప్రకృతిపై ఉన్న మమకారాన్ని నెమరువేసుకోసాగింది.
********** ఒకప్పటి రతనాల సీమ రాయల సీమ ,అనంతపురం లో “గిల్డ్ అఫ్ సర్వీస్  గర్ల్స్ బాలికోన్నత పాఠశాల” లో అప్పట్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది శ్రీధరణి. తండ్రి ఒక మధ్యతరగతి మామూలు మెకానిక్ ,తల్లి గృహిణి. స్వతహాగా చాలా తెలివిగల పిల్ల కావడంతో, అటు చదువు ఇటు ఆటలు ,సైన్సు ఫెయిర్లు,ఒక్కటేమిటి అన్నింటా  ముందుండేది. ఆమె పోటి కెళితే బహుమతి తప్పనిసరి. తన తరగతి లోనే కాక ఉపాధ్యాయుల్లో కూడా  తనకు అభిమానులు ఉండేవారు. అన్ని సుబ్జేక్టులు ఇష్టపడే  శ్రీధరణికి, జీవశాస్త్రం అన్నా, రసాయనశాస్త్రం అన్నా ప్రత్యేకమైన ఇష్టం ఉండేది.
జీవశాస్త్రం బోధించే గిరిజ టీచర్ అంటే తనుకు చాలా అభిమానం. ఆవిడ విషయాన్ని ఎంతో చక్కగా, అతి సామాన్యంగా చెప్పి,పిల్లలకు నేర్పించేవారు. కానీ ఈ నాటి విద్యార్థులను  చూసి, ఆవిడ చాలా బాధ పడేవారు. జీవశాస్త్రంలో  గిరిజ టీచర్ బోధించిన మొక్కలకు అంటు కట్టడం అనే అంశం తనకు మొక్కలమీద ఉన్న ప్రేమను ఎంతో పెంచింది. ఇంటికి వెళ్ళగానే రెండు రకాల మొక్కల కొమ్మలను టీచర్ చెప్పిన విధంగా అంటు కట్టింది. కొత్త మొక్క ఎంతో చక్కగా చిగురించింది. ధరణి లేత హృదయం ఎంతో పొంగిపోయింది. మెల్లగా మొక్కలను పరిశీలించడం మొదలు పెట్టింది .ప్రతి ఆదివారం ఇంటికి దగ్గరలో ఉన్న నర్సరీ కెళ్ళి, మొక్కలను నాటడం కోసం మట్టి ఎరువుని ఏ విధంగా కలపాలో నేర్చుకున్నది. ఆ వీధిలోని ఇంటిటింటికీ వెళ్లి మొక్కలను పంచి పెట్టేది. ఒక రోజు తను వాళ్ళ అమ్మమ్మతో గుడికెళ్ళింది . అమ్మమ్మ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వుంది. ”అమ్మమ్మ! ఎందుకు ఈ చెట్టు చుట్టూ తిరుగుతున్నావు?” అని అడిగింది.  “ఏమోనే చిట్టి తల్లి! మా అమ్మ తిరుగుతుండేది. నన్ను కుడా తిరగమని చెప్పింది, అంతే “ అని చెప్పింది. కానీ ధరణి ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉండిపోయింది.
మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళగానే గిరిజ టీచర్ ని కలిసి, తన సందేహాన్ని తీర్చమని అడిగింది. గిరిజ టీచర్ “ఎంత మంచి అనుమానం కలిగింది నీకు,తప్పకుండా క్లాసులో సమాధానం చెబుతానని ”చెప్పింది. జీవశాస్త్రం క్లాసు కోసం ధరణి ఎదురు చూస్తూ ఉంది. ఆ సమయం రానే వచ్చింది. టీచెర్ వస్తూనే ”మాములుగా మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ని వదులుతాయని మనందరికీ తెలుసుగా...” అని అడిగింది. విద్యార్థులంతా ఏక కంఠంతో “అవును” అనే సమాధానం ఇచ్చారు. “కానీ ఒక్క రావి చెట్టు మాత్రం ఒక్కసారి పీల్చుకున్న CO2 కి బదులుగా 20 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ విడుదలచేస్తుంది. అలా రావి చెట్టు దగ్గర మనం కాసేపు కూర్చుంటే  మన మెదడుకు, శరీరానికి కావలసినంత ఆక్సిజన్ దొరుకుతుంది. ప్రదక్షిణం చేయడం వాళ్ళ శరీరానికి వ్యాయామం కుడా అవుతుంది. అందుకే మన పూర్వీకులు ఇలా ఒక ఆచారాన్ని కల్పించారు,”అని టీచర్ చెప్పగానే... ధరణికి “మనకు ఆహారాన్ని,ప్రాణ వాయువుని ఇచి మన ప్రాణం నిలబెడుతున్న మొక్కలు ఎంత గొప్పవి,” అన్న భావనతో మొక్కల మీద ఎనలేని గౌరవం కలిగింది.
ఒక సంవత్సరం గడిచిపోయింది. ధరణి అప్పుడు  పదవతరగతి. ధరణి SPL(స్కూల్ పుపిల్ లీడర్) అయ్యింది. ఎంతో చాకచక్యంగా టీచర్లకు, విద్యార్థులకు మధ్య ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కుడా “డిస్ట్రిక్ట్ లెవెల్  గ్రిక్స్ లో బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్” ను ధరణి కాప్టెన్సి లో సాధించారు. ఇంకా హై జంప్ లో ధరణి మొదటి బహుమతి సంపాదించింది.  సైన్సు ఫేర్ లో “రైన్ వాటర్ హార్వెస్టింగ్” అంటూ వర్షపు నీటిని ఎలా సంరక్షించుకోవాలో ధరణి చెప్పిన పద్ధతులకి రెండవ బహుమతి వచ్చింది. “నేషనల్ సంచాయిక డే” సందర్భంగా ధరణి రాసిన వ్యాసానికి మొదటి బహుమతి లభించింది. ఇలా పదవతరగతి లో 550 మార్కులతో స్కూల్ సెకండ్ గా నిలిచింది. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. BSc అగ్రికల్చర్ చదవాలనున్నా, ధరణి ఆర్ధిక స్తోమత లేకపోవడం మూలంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యింది. కానీ మనసంతా తన ప్రాణమైన మొక్కల గురించి ఇంకా నేర్చుకోలేకపోయాను అనే బాధ అలాగే ఉండిపోయింది. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిపోయాయి.. 85% మార్కులతో పాస్ అయ్యింది. “ నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి “ అన్న మాటను నిజం చేస్తూ ధరణి ఆలోచనలు నిజమయ్యి, తనకు B.E బయోటెక్నాలజీ లో సీట్ లభించింది. “విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ విశ్వ విద్యాలయం ,కర్ణాటక” అన్న బోర్డు చదువుతూ అందులో అడుగుపెట్టిన ధరణి ఆనందానికి అవధుల్లేవు. మొదటిసారి అమ్మని, అనంతపురాన్ని వదిలి బయటికి వచ్చింది. కానీ ప్రకృతి మాత ముద్దు బిడ్డలైన మొక్కల గురించి కొత్త కొత్త విషయాలు వైజ్ఞానిక పరంగా నేర్చుకొబోతున్నందుకు పొంగిపోయింది. మొదటి సంవత్సరం అందరితో పాటుగా అన్ని సబ్జెక్టులు చదివింది. రెండవ సంవత్సరంలో, తన క్లాసు లో కేవలం 25 మంది  విద్యార్థులు. మామూలుగా ఇంజనీరింగ్ విద్యర్ధుల్లాగా క్లాసులు బంక్ కొట్టడం సినిమా ,షికార్లు అంటూ తిరగడం లాంటివి వీళ్ళ క్లాసులో లేవు. అందరూ చాలా ఆసక్తిగా పాఠాలు వినేవాళ్ళే. ధరణి ఆ సంవత్సరం నిర్వహించిన సైన్సు ఎక్సిబిషన్ లో “టిష్యూ కల్చర్” మీద సెమినార్ నిర్వహించింది. ఒక టెస్ట్ ట్యూబ్ లో మొక్క ని కెమికల్స్ వేసి ఎలా పెంచాలో, అరటి కాండం లోని కణజాలం తీసుకుని టిష్యూ కల్చర్ ద్వారా కొత్త మొక్కలను  ఉత్పత్తి ఎలా చెయ్యవచ్చో, విశదీకరించి చెప్పింది. ఆ సెమినార్ లో ధరణికి మొదటి బహుమతి లభించింది. వారాంతాల్లో దగ్గరిలో ఉన్న రైతులకు సేంద్రీయ ఎరువుల గురించి, అవి మొక్క పెరుగుదలకు ,చీడ పీడల నివారణకు ఎలా ఉపయోగపడతాయో విద్యార్థులంతా వెళ్లి వివరించేవారు. ఆ రైతుల మధ్యే భోజనం చేస్తూ, వారి వివరాలు కనుక్కుంటూ హాయిగా గడిపి వచ్చేవారు . మూడవ సంవత్సరం గడిచి ఆఖరి సంవత్సరం లోకి అడుగుపెట్టింది. ఎలేక్టివ్ సబ్జెక్టుగా “ప్లాంట్ బయోటెక్నాలజీ” ని ఎన్నుకుంది. ఈ సబ్జెక్టులో తనని ఎంతగానో ఆలోచింపజేసిన అంశం “BT-కాటన్ -బాస్సిలుస్ టోరెంజేనిసెస్” ఇది ఒక బాక్టీరియా. దీనిగురించి మొదటగా తెలియచేసిన శాస్త్రవేత్త ,బయలజిస్ట్ “షిగేటోన్ ఇషివాటరి”,జపాన్. ఈయన ఈ బాక్టీరియా ప్రత్తిలో సోటోవ్యాధి (సడన్ కొలాప్స్)కి ఎలా కారణమవుతుందో వివరించారు. ఈ వ్యాధి నివారణ కోసం ఈయన ప్రత్తి విత్తనాల్లో, ఒకలాంటి సైనైడ్ తో ప్రత్తి విత్తనజన్యువుల్లో మార్పుచేసారు. ఆ విత్తనాల పేరు ని BT-కాటన్ సీడ్స్ పేరుతో విడుదల చేసారు. ఈ విత్తనంతో చిగురించిన మొక్కని, ఎప్పుడైతే బాక్టీరియా తినాలని కోరుకుతుందో, ఆ మొక్క కాండం లోని సైనైడ్ బాక్టీరియా యొక్క గొంతుని చేరి, ఆ జీవిని చంపేస్తుంది. ఇది నాణేని కి ఒక వైపు మాత్రమే... ఈ జన్యు మార్పిడి చెందిన విత్తనం, పంటకు మేలు చేసే మిత్ర కీటకాలని కుడా చంపేస్తుంది. ఇది పాఠ్య పుస్తకాల్లో లేని నిజం. ఇది సమాజనికి తెలీని ఒక చేదు నిజం. ఇప్పుడు శ్రీ ధరణి B.E పట్టభద్రురాలు. ఒక మంచి సంస్థలో చేరి, మొక్కలపై  ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేయాలనుకుంది. హైదరాబాద్ ,అమీర్పేట్ లో ఒక హాస్టల్ లో చేరింది. తనకు హాస్టల్ జీవితం అలవాటే గనుక త్వరగానే సర్దుకుంది .అక్కడ ప్రసన్న అనే MSc మైక్రోబయాలజీ చదివిన అమ్మాయి, 2 నెలల లోనే మంచి స్నేహితురాలయ్యింది. ఇద్దరు కలిసి, బాల నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఫార్మా కంపెనీలలో తమ CV లు ఇచ్చారు. పాపం శ్రీ ధరణి CV లో BE బయోటెక్నాలజీ అని చూడగానే రిసెప్షనిస్ట్ “ఇదేంటి ఇంజనీరింగ్ లో బయోటెక్నాలజీయా? నేను ఇదే మొదటిసారి చూడటం,”  అని అడిగింది.
ధరణి “అవును, ఇదే మొదటి బాచ్ ఇండియాలో” అని చెప్పగానే తలాడించి, ఊరుకుంది. 10 నెలల కాల వ్యవధిలో ఒక్క ఇంటర్వ్యూ కాల్ కుడా రాలేదు. కానీ తను ముద్దుగా పిలిచే ప్రసు మాత్రం శాంత బయోటెక్ లో జూనియర్ సైంటిస్ట్ గా సెటిల్ అయ్యింది. ఇంకో రెండు నెలలు పోరాడి ధరణి ఇంటికోచ్చేసింది. ఒక నెలరోజులు దగ్గరి గ్రామాల కెళ్ళి రైతులతో వారి పంటల గురించి తెలుసుకుంది. తరువాత ధరణి నాన్నగారి స్నేహితుని పొలంలో పంట పండించడానికి సిద్ధమైంది. కానీ ధరణి తండ్రికి ఇది నచ్చలేదు.
“పెళ్లి చేసుకుని వెళ్ళాల్సిన సమయంలో ఇవన్ని ఎందుకమ్మా? అయినా నువ్వలా పొలం పనులు చేయడం మాకు ఎంత పరువు తక్కువ అని వాదించారు. ధరణి కొన్నాళ్ళు ఎదురు చూసినా, ఎలాంటి సానుకూలత లభించలేదు. ఇక తన  చేతల్లో లేనిదనుకుని,.పెళ్లికి సిద్దమయ్యింది. దైవానుగ్రహం చేత తనకు పదవతరగతి సెలవుల్లో పరిచయమైన సుధీర్ ఇంకా తనకు టచ్ లో ఉన్నాడు. సుధీర్ కి ధరణి అంటే ప్రాణం. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందడంతో ఇద్దరి వివాహం ఘనంగా జరిగింది.
సుధీర్ ఉద్యోగం చెన్నైలో అవడంతో  ధరణి చెన్నై వెళ్ళిపోయింది. ఈ సారి సుధీర్ సహకారంతో ఒక MNC లో టెస్ట్ అనలిస్ట్ గా చేరింది. అక్కడ సఖి అనే ఒక మలయాళీ అమ్మాయితో మంచి స్నేహం కుదిరింది. ఇద్దయికి వయో బేధం దాదాపు 10సం. కానీ ఇద్దరి ఆలోచనా విధానాలు కలసిపోవడంతో బాగా దగ్గరయ్యారు. సఖి ప్రకృతి ప్రేమికురాలు కూడా. సుధీర్, ధరణి, సఖి ముగ్గురు కలిసి ప్రతి వారాంతాల్లో ఎక్కడికో అక్కడికి వెళ్ళొచ్చేవాళ్ళు. ఇలా 2 సం. గడిచాయి.సుధీర్ కి బెంగుళూరు కి ట్రాన్ఫర్ అయ్యింది. కానీ ధరణి కి కుదరలేదు. కుటుంబానికే ఎక్కువ ప్రధాన్యమిచ్చిన ధరణి ఉద్యోగానికి రాజీనామా చేసి, బెంగళూరు చేరింది. రోజులు సాగిపోతూ ఉన్నాయ్.
*******
 “సదస్సు ఆరంభమవబోతోంది” అని ప్రకటించడంతో మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చింది ధరణి.
ఒక 50సం. ఉన్న పెద్దావిడ వేదిక మీదికి వచ్చింది. నిండైన కట్టు బొట్టు తో భారతీయత ఉట్టి పడుతోంది. ఆవిడ పేరు జగతి అని, తను ఒక ఆధ్యాత్మిక సంస్థని నడుపుతున్నానని, తనని పరిచయం చేసుకుంది. “ ప్రకృతితో మమేకమై ప్రకృతి నియమానుసారం జీవించిన మన పూర్వీకులను నేను ముందుగా స్మరిస్తున్నాను. వాక్భటుడు, శుశ్రూషుడు మొదలగు మహా ఋషులకు ప్రణమిల్లుతున్నాను. ఉదయం పళ్ళు తోముకోవడం దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు, మన పూర్వీకుల జీవన శైలి ఎలా ప్రకృతితో ముడిపడి ఉండేదో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీకొక చిన్న కథను చెబుతాను.  పూర్వం ఒక ఆయుర్వేద వైద్య విద్యార్థికి  గురువుగారు ఇలా చెప్పి అడవికి పంపించారు “నాయనా నీవు నేర్చుకోవాల్సిన విద్య మొత్తం నేర్పించాను,ఇప్పుడు నువ్వు అడవికి వెళ్లి  వైద్యానికి పనికి రాని ఒక మొక్క ను తీసుకువస్తే నిన్ను ఆయుర్వేద వైద్యుని గా ప్రపంచానికి పరిచయం చేస్తాను”. ఒక సం. గడచిన తరువాత ఆ విద్యార్థి భోరున విలపిస్తూ గురువు గారి పాదాలపై పడ్డాడు.
” గురువు గారు, ఈ సం. కాలంలో నేను వైద్యానికి పనికిరాని ఒక్క మొక్కను కూడా చూడలేదు, అంటే నేను వైద్యం చేయుటకు ఆర్హుడను కానా “ అని దీనంగా అడిగాడు. అప్పుడు ఆ గురువుగారు,” నాయనా! నువ్వే అసలైన వైద్యుడి వి. ఈ ప్రకృతి లో వైద్యానికి పనికి రాని మొక్క అంటూ ఏదీలేదు. ప్రతి మొక్క అపార కరుణానిధి, దివ్యౌషది,” అని చెప్పారు. కానీ ఈనాడు మనిషి, కూర్చున్న చెట్టు మొదలునే నరుక్కున్నట్టుగా, ప్రకృతిని ఎలా పాడు చేస్తున్నాడో కదా! భారతీయులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక, ఆయా కాలాన్ని బట్టి, వాతావరణ స్థితిని బట్టి మనిషి ఆరోగ్యాన్ని సహజంగా కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న ఆచారాల వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను మనం తెలుసుకోవాలి. మన ఆహారమే  మన ఔషదం.  మన  ఆహారపు అలవాట్లు శరీరం లో హార్మోన్ల ను ఎలా నియంత్రిస్తాయో కూడాఅధ్యయనాలు నిరూపించాయి. మనిషి మనుగడలో ఇంత ప్రాధాన్యం ఉన్న  ఆహారానికి నేడు పట్టిన దుర్గతి శోచనీయం. నేడు మానవుడిలో దిగజారుతున్న విలువలు, స్వార్థం, అసహనం….వీటన్నింటికీ ఆహారం అనే పేరుతో మనము తీసుకుంటున్న ఈ విషపదార్థాలే కారణం.” జగతి గారు సెలవు తీసుకున్నారు. ఈ మాటలు అక్కడ ఉన్న అందరి ని ఆలోచింపచేసాయి.
భోజన విరామం తర్వాత ఒక బక్క పలుచటి వ్యక్తి , మధ్య రకం ఎత్తుతో వేదిక మీదకు వచ్చారు. ఆయనకు అంతా చప్పట్లతో స్వాగతం పలికారు. ఆయనే శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఆయన హిందీలో మాట్లాడుతున్నారు. అక్కడ ఒక అనువాదకుడు కూడా ఉన్నాడు. గత 10సం లుగా ప్రకృతి వ్యవసాయం గురించి బోధిస్తూ, దేశం మొత్తం తిరుగుతున్నారు. ఆయన ఇలా మొదలు పెట్టారు….”ఈనాడు  మానవుని అతి పెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్. దీనికి కారణం ఓజోన్ పోర చిల్లు పడటం. దీనికి కారణం - వాహన కాలుష్యం, పరిశ్రమల నుండి బయటకు వచ్చే విషవాయువులు,విష పదార్థాలు,” అవునా? అనగానే అందరూ ముక్త కంఠంతో అవునన్నారు. పాలేకర్ గారు అప్పుడు చూపిన ఒక విషయం నమ్మశక్యంగా అనిపించలేదు ధరణికి. అది “ వ్యవసాయ కాలుష్యం” నేడు వ్యవసాయం పేరుతో ప్రకృతిని మానవజాతి ని ఎలా నాశనం చేస్తున్నారో చెప్పారు. హరిత విప్లవం పేరుతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆ మందుగుండు సామాగ్రి తయారు చేసే పరిశ్రమలను మూసివేయలేక, అక్కడి నుండి భయంకరమైన విషరసాయనాలను ఉత్పత్తి చేసి, వాటిని  చీడ పీడల నివారణ కోసం అని ప్రపంచదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. స్వార్థానికి పరాకాష్టగా రాత్రికి రాత్రే పండు పక్వానికి వచ్చేలాగా కూడా రసాయనాలను విడుదల చేస్తున్నారు.  ఈ  విషరసాయనాలు భూమిని చేరగానే జరిగే రసాయనిక చర్య వల్ల చాలా విషపూరిత వాయువులు విడుదల అవుతాయి. ఈ కాలుష్యం  వాహన, పరిశ్రమల కాలుష్యాన్ని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అది మాత్రమే కాక, ఈ విషం మెల్లగా మొక్కని చేరి ఆహారాన్ని విషంగా మారుస్తుంది.  మెల్లగా భారతదేశ రాజకీయ నాయకులతో పొత్తు కుదుర్చుకుని,  వ్యవసాయరంగంలో మార్పులు ఎలా తీసుకొచ్చారో వివరించారు. 30 సం. గా ఇది నిర్విఘ్నంగా సాగిపోతున్న సమయంలో  “ఆర్గానిక్ ఫార్మింగ్” అనే పేరు తో మళ్ళీ రైతులను ఎలా మోసాగిస్తున్నారో వివరించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పేరు మొదటగా వాడిన వ్యక్తి  ఒక బ్రిటీష్ వ్యవసాయ పరిశోధకుడు Dr అల్బెర్ట్ హార్వర్డ్. అమెరికా, యూరోప్ లాంటి అభివృద్ది చెందిన దేశాలు రసాయన ఎరువుల స్థానే సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలనుకున్నారు. వెర్మి కంపోస్ట్ దీనికి సరి ఐనదని భావించారు. కానీ ఇందుకోసం ఉపయోగించే వానపాములు అతి భయంకరమైన కాడ్మియం, ఆర్సెనిక్, మెర్క్యూరీ లను మలంలో విసర్జిస్తాయి .ఈ వానపాములను  “ఇసీనియో ఫీటిడ” అని అంటారు. ఈ నిజాలు కొందరి శాస్త్రవేత్తలకు తెలిసినా  బయటకు రానివ్వడం లేదు. అబ్భివృద్ధి చెందుతున్న దేశాల లో NGO లకు పెద్ద మొత్తలలో డబ్బు ఆశ చూపించి, ఆ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయించి, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి, వ్యవసాయ విభాగాల ద్వారా ప్రజల్లోకి తీసుకువచ్చారు.” అంటూ ఆ తర్వాత ఈ  ఎరువుల దిగుమతి ద్వారా  మన దేశ ఆర్ధిక వ్యవస్థ  ఎలా పతనం జరుగుతూ ఉందో చెప్పారు. ఆ రోజు సభ అంతటి తో ముగిసింది.
ధరణి ఆ రోజు రాత్రంతా తను చదువుకున్న బయోటెక్నాలజీ పాఠాలు, ప్రకృతి ని యెంత నాశనం చేస్తాయో కదా అని ఆలోచించసాగింది. ఆ రాత్రి ఆమెకు నిద్రే పట్టలేదు. మరుసటి రోజు  చిన్న పిల్లల తో ఒక నాటకం వేయించారు. దాని సారాంశం  “పల్లెకు పోదాం ప్రకృతిని కాపాడుకుందాం”. ఆ తర్వాత పాలేకర్ గారు ఇప్పుడు మన రైతు ల కర్తవ్యం ఏమిటన్నది బోధించారు. భారత దేశం అనే మన కర్మ భూమి లో 10వేల సం. గా వ్యవసాయం చేస్తున్న దాఖలాలు ఉన్నాయని, మొదటి 5వేల సం. లు ఒకచోట నుండి మరోచోటికి వలస వెళ్ళడం, భూమి దున్నడం పంట పండించటం జరిగినదని, మిగతా 5వేల సం.రాల నుండి  భగవాన్ శ్రీ కృష్ణుని కృప వల్ల  పాడి-పంట  విడదీయరానివిగా ఉన్నాయని చెప్పారు. గోమూత్రం, గోవు పేడ చాలా విశిష్టమైన వని, ఒక్క గ్రాము ఆవు పేడ లో 300 కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయని, అవి భూమికి కావలసిన సారాన్ని ఇస్తాయని, ఆయన 7సం పరిశోధన లో నిరూపించారు. అందుకే ఆవు పృష్ఠ భాగాన్ని లక్ష్మిదేవి గా భావిస్తారు  అని  చెప్పారు. మళ్ళీ మన ప్రకృతి ని కాపాడుకోవాలని అప్పుడే మనిషికి మనుగడ ఉంటుందని,దాని కోసం ఆవు పేడ తో జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, వాటి వాడకం గురించి వివరించారు. చీడపీడల నివారణకు “లశాయ”, తయారీ వాటి వాడకం వివరించారు. అడవిలో మొక్క పెరుగుదల కోసం ప్రకృతి ఎలా సహకరిస్తోందో, అదే విధంగా మన పంటకు కూడా సహాయం చేస్తుందని,  అసహజమైన రసాయన ఎరువులు కాని, వానపాములు కానీ ఆవసరం లేదన్నారు. అన్ని విషయాలు ఈ కొంచెం సమయంలో వివరించలేమని  అనుమానాలొస్తే  ,తీర్చుకోవడానికి సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ ను కూడా ఇచ్చారు. తరువాత ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఎంతో ఆరోగ్యమైన ఆహారం తింటూ ,ఆనందంగా ఉన్న వాళ్ళు తమ అనుభవాలు పంచుకున్నారు. బ్లూ క్రాస్ వ్యవస్థాపకురాలు  సినీ నటి అమల గారు కూడా తన అనుభవాలను వచ్చీ  రాని తెలుగులో వివరించారు. వర్క్ షాప్ ముగిసింది. ధరణి  ఒక దృఢమైన నిర్ణయంతో ఇంటికి ప్రయాణమయింది.
సుధీర్ తో 2 రోజుల్లో తను విన్న అన్ని విషయాలు చెప్పింది. సుధీర్ కి కూడా వ్యవసాయం అంటే ఎంతో మక్కువ కావడంతో అన్ని విషయాలు ఎంతో ఆసక్తిగా వినడమే కాకుండా,  తన చిన్నప్పుడు తన తాతగారు ఏవిధంగా పని చేయించే వారో కూడా చెప్పాడు. సుధీర్ తల్లిదండ్రులు కుడేరు అనే గ్రామం లో ఉంటారు.  పెద్ద భూస్వామి అయిన మావగారు, 100 ఎకరాల భూమి ఉన్నా పండించే ఓపిక లేక  కౌలుకు ఇచ్చుకున్నారు. శ్రీధరణి తన నిర్ణయం సుధీర్ కి చెప్పింది. తను వ్యవసాయం చేయాలనుకుంటున్నాని, అందుకు గాను తనకు కుడేరులో కొంత పొలం కావాలని, అడిగింది.
తనకు ప్రాణమయిన ధరణి నిర్ణయాన్ని ఎంతో మెచ్చుకున్నా, యెంత వరకు ఫలిస్తుందో తెలియదు కాబట్టి కొంత సమయం ఇవ్వమని అడిగాడు. రాత్రంతా ఆలోచించిన సుధీర్ ఉదయాన్నే  ధరణితో ఇలా అన్నాడు, ”బంగారం..నీ నిర్ణయం చాలా బాగుంది, కానీ ఇలా చెబితే అమ్మా నాన్న ఒప్పుకోరు. ఒక పని చేద్దాం. ముందుగా నువ్వు వెళ్ళు. నేను మా బాస్ ని అడిగి కొన్ని నెలలు అమెరికాలో అసైన్మెంట్ వేయించుకుంటాను. ఈ లోపు నువ్వు అనుకున్నది  సాధించు” అని అన్నాడు.
 ఎంతో సంతోషంతో ధరణి ఒప్పుకుంది. కానీ సుధీర్ ,ధరణి కి పక్కన ఉండీ సహాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధ పడ్డాడు. దైవానుగ్రహం వల్ల అంతా అనుకున్న విధంగా జరిగిపోయింది. ధరణి ఇప్పుడు అత్తగారింటిలో ఉన్నది. తను చిన్నప్పటి నుండి చేయాలనుకుంటున్న పని నెరవేరుతుందని ఆనందంగా ఉంది. చెప్పిందే తడవుగా తన మామ గారు 15 ఎకరాలు ఇవ్వడానికి కి సిద్ధపడ్డారు. ధరణికి మట్టి వాసన అంటే చాలా ఇష్టం. ఆ మట్టిలో తిరుగుతూ  తన గ్రామ ప్రజలకు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించింది. తనతో పాటు వారిని కూడా చేయమని అడిగింది. కానీ ఎవ్వరికీ నమ్మకం కుదరలేదు. సరే తను చేసి చూపిస్తే తప్పకుండా  మారతారని, 15 ఎకరాల్లో వ్యవసాయం మొదలు పెట్టింది. మహిళా రైతులను మాత్రమే పనికి తీసుకుంది. వారికి కూలీ బదులు  పంటలో భాగం ఇస్తానంది. ఒక్కరకం పంట కాకుండా  పాలేకర్ గారి 5 లేయర్ మోడల్ లో 5 రకాల  మిత్ర పంటలను పెట్టింది. మామూలుగా కలుపు మొక్కలు అంటే భయపడతారు కానీ, కలుపు అంటే మొక్కలను కలిపేవి.   ఏక దళం మొక్క పక్కన ద్విదళ మొక్కలు వేసుకోవాలి. అవి ఒక దాని పెరుగుదలకు మరొకటి సహాయం చేస్తాయి. ఎంతో ప్రేమతో  ధరణి పొలం పనులన్నీ చేసుకుంటూ, విత్తనం నాటే ముందు బీజామృతం ద్వారా విత్తన శుద్ధి చేసి, తగిన సమయాల్లో జీవామృతం పోస్తూ, చీడలకు దశపర్ని కషాయం జల్లుతూ,  తగిన సలహాలు తీసుకుంటూ 4 నెలలు ఒక పంట 6 నెలలకు మిగతా 4 పంటలు తీసింది. పక్కన పండిస్తున్న రైతుల కన్నా ,పెట్టుబడి లేని ఈ  ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి, నాణ్యతా, రుచి అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. కళ్ళారా చుసిన వారంతా  ఒక్కొకరిగా ధరణిని కలుస్తున్నారు. మెల్లగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు సైతం వచ్చి, ప్రకృతి వ్యవసాయం నేర్చుకుంటున్నారు. సేవ్ ఎన్.జి.ఓ  విజయ్ రామ్ గారు ధరణిని కలిసి కుడేరు గ్రామంలో ఈ వ్యయసాయం ద్వారా పండించిన కూరగాయలను, చిరు ధాన్యాలను అధిక ధరకు  అమ్మి పెడతానని, అన్నవిధంగానే అమ్మిపెట్టారు. ఇప్పుడు కుడేరు గ్రామం  కళకళ లాడుతోంది. ధరణి  తన ప్రచారాన్ని జిల్లా వ్యాప్తం చేసింది. అమెరికా నుండి వచ్చిన సుధీర్ ఉద్యోగాని కి  రాజీనామా చేసి ధరణి PA గా జాయిన్ అయ్యాడు. ప్రకృతిని కాపాడటానికి ధరణి తన వంతు కృషి చేస్తూనే ఉంది. శ్రీ పాలేకర్ గారికి ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించారని తెలిసి, నిస్వార్థంగా చేసిన సేవకు గుర్తింపు లభించిందని, సుధీర్ ధరణి  ఎంతో సంతోషించారు. దేశం , ప్రకృతి, ఈ మానవులు మెల్లగా కొలుకుంటారనే  నమ్మకంతో ఆ ఆదర్శ దంపతులు ముందుకు అడుగులు వేస్తున్నారు.
****

No comments:

Post a Comment

Pages