ప్రకృతి చిత్రకారుడు - మోషే దయాన్ - అచ్చంగా తెలుగు

ప్రకృతి చిత్రకారుడు - మోషే దయాన్

Share This
ప్రకృతి చిత్రకారుడు - మోషే దయాన్

భావరాజు పద్మిని 


 " చిన్నప్పుడు ఎర్రమట్టిని నీళ్ళల్లో కలుపుకొని, వేపపుల్లలు నమిలి కుంచెలాగ తయారు చేసి, గోడల మీద బొమ్మలు వెయ్యటం నాకింకా గుర్తు," అంటున్నారు చిత్రకారులు మోషే దయాన్ . "ప్రకృతే నాకు ప్రేరణ" అని చెప్పుకునే ఈ గొప్ప చిత్రాకారుడి పరిచయం, ఈ నెల ప్రత్యేకించి మీకోసం...
1.మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
మా వూరు చీరాల దగ్గర ఉన్న చిన్నగంజాం. నా బాల్యం చాలా వరకు అక్కడే గడిచింది. సముద్రం, తాటి చెట్లూ,చెరువులూ, కొంగలూ... అందంగానే ఉండేది. నా చదువు బడిలోపలి కంటే బయటే ఎక్కువగా సాగింది. స్వేచ్చగా తిరిగేవాళ్ళం. పిట్టలూ, తూనీగలతో సావాసం. చదువు కోసం ఆరవ తరగతిలోనే హాస్టలుకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాతంతా ఒంగోలు, విశాఖపట్నం, హైదరాబాదులోనే. అయినా అదేదో అమెరికన్ సామెత చెప్పినట్టు నేను మా వూరు వదిలిపెట్టినా మా వూరు నన్ను వదిలి పెట్టలేదు. నా మీదా నా బొమ్మల మీదా చాలా బలమైన ప్రభావం.
2.మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మాది మామూలు మధ్య తరగతి కుటుంబం. నాన్న రైల్వే ఉద్యోగి. బాగా చదువుకున్నారు. లేరు అని ఖచ్చితంగా
చెప్పలేను. అక్క,చెల్లెలు, తమ్ముడూ ఇప్పుడు అక్క కొడుకులూ అందరూ బొమ్మలు బాగా వెయ్యగలవాళ్ళే. అయితే చదువుల గొడవల్లో పడి ఒక స్థాయిని దాటి సాధన చెయ్యకపోవటం వల్ల వాళ్ళలో కళ మరుగున పడిపోయింది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం అనుకుంటాను.
3.చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
అవును, చాలా చిన్నప్పటినుండీ బొమ్మలు వేస్తున్నాను. అప్పట్లో మా వూర్లో కొత్తగా వేసిన రోడ్ల మీది ఎర్రమట్టిని నీళ్ళల్లో కలుపుకొని, వేపపుల్లలు నమిలి కుంచెలాగ తయారు చేసి గోడల మీద బొమ్మలు వెయ్యటం బాగా గుర్తు. బొమ్మలు వెయ్యాలనే తపన ఎలా కలిగిందో చెప్పలేను. నాకు తెలియదు.
4.మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
స్కూలులో మా ఆర్ట్ టీచర్ రామారావు గారు తప్ప నాకు చెప్పుకోదగ్గ గురువులెవరూ లేరు. అభిమానించే చిత్రకారులంటారా చాలామందే ఉన్నారు. బాపుగారు, చంద్రగారు, మోహన్ గారు, అన్వర్ గారు చాలా ఇష్టమైన ఆర్టిస్టులు. మోహన్ గారి వ్యాసాల ద్వారా ఆర్ట్ గురించి గొప్ప ఆర్టిస్టుల గురించి ఎంతో నేర్చుకున్నాను. నేనెంతో అభిమానించే అన్వర్ గారితో ఇప్పుడు స్నేహం కుదరటం గొప్ప అనుభూతి. వాటర్ కలర్స్ విషయానికొస్తే మన సమీర్ మండల్, మిలింద్ మల్లిక్ యింకా జోసెఫ్ జుక్ట్ విక్ (Joseph zbukvic), సవాన్ వీక్సింగ్, లీ యీ, వంటి విదేశీ చిత్రకారులు గొప్ప ఇన్స్పిరేషన్.
5. మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
ఇందాక చెప్పినట్లు సరిగ్గా ఎట్లా మొదలయ్యిందో చెప్పటం కష్టం. అయితే నేను
గోడలూ, పలకలూ బొమ్మలతో నింపటం చూసి మా నాన్న కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్ వంటివి కొనిచ్చేవారు. వాళ్ళూ వీళ్ళూ నా బొమ్మలు చూసి మెచ్చుకోవటం వంటి సంఘటనలు కూడా కొంతవరకు నాకు ప్రోత్సాహంగా పని చేసి ఉండవచ్చు గాని అసలైన ప్రస్థానం లోపలెక్కడో జరుగుతూ వచ్చింది. సహజంగా పిల్లలందరిలో కళాకారులుంటారు గానీ మన చదువులూ, వాళ్ళ నెత్తిన బలవంతంగా రుద్దే భవిష్యత్ ప్రణాళికలూ ఆ కళాకారులని క్రమంగా చంపేస్తాయి. అటువంటిది నాతో జరగకుండా ఆపగలిగాననుకుంటాను. ఆ తర్వాత జరిగిందంతా ఒక natural consequence.
6. ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
నేను కళని కెరీర్ గా ఎంచుకుంది ఈ మధ్యనే. యిప్పటిదాకా అది నా passion మాత్రమే. జీవనోపాధికి చిత్రకళ మీదే ఆధారపడటంలో కష్టాలు చాలానే ఉన్నాయి. కళ అంటే మనకు సరైన అవగాహనా,గౌరవమూ లేకపోవటం, జీవితం గురించి మన ప్రాధమ్యాలు సరిగ్గా లేకపోవటం (distored priorities) యిందుకు కారణాలు. మిమ్మల్ని ఆకాశపుటంచులలో విహరింపజేయగల గాయకుడికంటే, మీ కవసరమైన డాక్యుమెంట్ల మీద సంతకం చేసే రెవెన్యూ అధికారే గొప్ప మనకు. ఆనందమూ,అనుభూతీ విలువ లేని వస్తువులు.
అయితే ప్రస్తుతం technology వల్ల అంతర్హాతీయ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. అవకాశాలున్నాయి. Greener Pastures ఉన్నాయి. కాని అవి యిక్కడ కాకుండా యింకెక్కడో ఉండటమే బాధాకరం.
7 .మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
అటువంటివి ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయి. అయితే ఒకదాని గురించి చెబుతాను. ఈ మధ్యనే FBలో post చేసిన గడ్డి మోస్తున్న అమ్మాయి బొమ్మకు చాలా స్పందన వచ్చింది. అది అమ్మాయి బొమ్మ కావటం, బొమ్మలోని అనాటమీ, వెలుగునీడలు బాగుండటం వంటివి కారణాలుగా చెప్పుకోవచ్చుగాని అంతకంటే యింకేదో ఉందని నా సందేహం. క్రమక్రమంగా మనం అవసరంకొద్దీ దూరం చేసుకుంటున్న ప్రకృతీ, శ్రమ జీవనంలోని అందం మనలో ఎక్కడో దాకూనే ఉంది. యిటువంటి బొమ్మలు చూసినప్పుడో, ఏదో పాట విన్నప్పుడో అది అప్రయత్నంగానే అలజడి రేపుతుంటుంది.
8.మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
 ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ లో ఉన్నప్పుడు బహుమతులు చాలానే వచ్చాయి. ఆ తర్వాత నా కోసం నేను బొమ్మలు వేసుకోవటం తప్పితే పదిమందికి చూపించటం, పోటీలకు పంపించటం వంటివి మొన్నటివరకూ
చెయ్యలేదు. మొన్న డిసెంబరులో ఢిల్లీలో జరిగిన International Water Colour Society India Biesnial కు నేను వేసిన Blue Rain అనే పెయింటింగ్ సెలెక్ట్ అయింది. ప్రస్తుతానికంతే.
9. మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నా కుటుంబం నుంచి ప్రోత్సాహం చాలానే ఉంది. అయితే నేను ఆర్ట్ ని కెరీర్ గా ఎంచుకోవటం వాళ్ళని కొంత యిబ్బందికి గురి చేస్తున్న మాట వాస్తవమే. కాని వాళ్ళ కలవరపాటు అకారణమైంది కూడా కాదు. చుట్తో ఉన్న వాస్తవమే. ముందుకి వెళ్ళటం తప్ప చెయ్యగలిగేదేమీ లేదు.
10.భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
సందేశమిచ్చే స్థాయికి నేనింకా చేరుకోలేదు. అయితే ఒడిదుడుకులు
ప్రతిచోటా ఉంటాయి. దేశాన్ని పరిపాలించే రాజుకు కూడా పంటినొప్పి ఉండవచ్చు. నమ్మిన కళని ఎంత చిత్తశుద్ధితో సాధన చేస్తున్నామన్నదే అన్నిటికంటే ముఖ్యం అని నా అభిప్రాయం. అదే చెబుతున్నాను. కళ ఏదైనా జీవితాన్ని చూడటం నేర్పిస్తుంది, జీవించటంనేర్పిస్తుంది, జీవితానికి అందాన్నిస్తుంది – కళని అనుభవించేవాడికైనా, కళాసృష్టిచేసేవారికైనా .. జీవితానికి అంతకంటే సార్ధకత ఉందనుకోను.
***

No comments:

Post a Comment

Pages