సజీవ శిల్పాలు చెక్కే శారద శిల్పకళా మందిరం - అచ్చంగా తెలుగు

సజీవ శిల్పాలు చెక్కే శారద శిల్పకళా మందిరం

Share This

'సజీవ శిల్పాలు' చెక్కే శారద శిల్పకళా మందిరం 


ప్రతి మనిషి, పరిస్థితులు, కాలం చెక్కిన శిల్పమే. అందుకేనేమో, 'ఒక స్త్రీ అయ్యుండి, ఇలా కఠినమైన శిల్పాలు చెక్కడం కష్టంగా లేదా?" అని అడిగితే, 'నేను జీవితంలో ఎదుర్కున్న అవమానాల కంటే, ఇదేమీ కష్టమైన పని కాదండి,' అంటూ వెంటనే జవాబు చెప్పింది ఆమె. అవరోధాలనే మైలురాళ్లుగా, అపజయాలనే సోపానాలుగా మలచుకుని, అంచెలంచెలుగా ఎదుగుతున్న 'భువన' గారితో ప్రత్యేక ముఖాముఖి, ఈ నెల మీకోసం.
నమస్కారం భువన గారు. మీ ‘శారద శిల్పకళా మందిరం’ ఎక్కడ ఉంది ?
నమస్కారమండి. ఆళ్లగడ్డలో ఉందండి.
మీరు శిల్పాలు చెక్కడం ఎలా మొదలుపెట్టారు ?
మాది మొదటినుంచి శిల్పుల వంశం. మా తాతాగారు 1960 ప్రాంతంలో ‘శారద శిల్పకళా మందిరం’ అనేది ప్రారంభించారు. ఆయన చనిపోయిన తర్వాత, మా నాన్నగారు ఇదే పరంపరను కొనసాగించారు. నేను కూడా మామూలు అమ్మాయిలాగే చదువుకుని ఉద్యోగం చెయ్యాలని, డిగ్రీ దాకా హాస్టల్ లో ఉండి చదువుకున్నాను. తర్వాత నాకు 2011 లో నా పెళ్లి
అయ్యాకా నేను బెంగుళూరు వెళ్ళిపోయాను. 2012 లో డెలివరీ కి తిరిగి వచ్చాను. కొన్ని అనుకోని ఇబ్బందుల వల్ల, నేను తిరిగి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాను.
ఆ సమయంలో నేను మా కుటుంబానికి భారంగా ఉంటున్నానేమో అన్న భావన కలిగింది. ఉద్యోగాలు వెతుక్కుంటే, ఒకచోట టీచర్ గా ఉద్యోగం వచ్చింది. కాని, నేను ఉద్యోగానికి వెళ్లేసరికి బాబు ఏడుస్తున్నాడు. దాంతో, దీనికంటే, నాకు వంశపారంపర్యంగా వచ్చిన శిల్పాలు చెక్కడాన్ని ఎందుకు చెయ్యకూడదు అనిపించింది.
మీరు మీ ‘శారద శిల్పకళా మందిరం’ ను ఎలా అభివృద్ధి చేసారు ?
నాన్నగారు తరచుగా “ పనివాళ్ళు సరిగ్గా రావట్లేదు. ఆర్డర్స్ తగ్గిపోతున్నాయి, ఈ రంగంలో పోటీ పెరిగిపోయింది,” అనేవారు. ఆ సమయంలో నాకు మా గురించి ఇతరులకు తెలిసేందుకు ఫేస్ బుక్ ను ఎందుకు వాడకూడదు, అనిపించింది. మొదటి నుంచి, ఫేస్ బుక్ వాడేదాన్ని. అయితే, ఫోటోలు అప్లోడ్ చెయ్యడం అవీ నాకు రావు. నెమ్మదిగా నేర్చుకున్నాను.
అలా ఒకప్రక్క ఫేస్ బుక్ లో ఫొటోస్ పెడుతూ, నెమ్మదిగా పని నేర్చుకోవడం కూడా మొదలుపెట్టాను. వర్క్స్ చేస్తూ వాటి ఫొటోస్ కూడా ఫేస్బుక్ లో పెట్టసాగాను. దాని ద్వారా నాకు కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయండి.
అప్పట్లో చందన ఖాన్ గారు ఎ.పి. టూరిజం తరఫున చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. కొన్ని శిల్పాలు తీసుకున్నారు. ఇలా మా ‘శారద శిల్పకళా మందిరం’ అభివృద్ధి చెందింది. ఇప్పుడు మేము వెబ్సైటు కూడా రన్ చేస్తున్నాము.
మీరొక స్త్రీగా, సహజ సౌకుమార్యంతో ఉంటూ, ఉలి పట్టుకుని, కఠినమైన శిలలని చెక్కాలంటే, మీకు కష్టంగా అనిపించలేదా ?
జీవితంలో నేను ఎదుర్కున్న అవమానాలతో పోల్చుకుంటే ఇదేమీ కష్టంగా అనిపించలేదండి.
మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేసారు ? మండపాలు, ఆలయ గోపురాలు, శిల్పాలు అన్నీ మీ ఫొటోస్ లో చూసాను. ఇవన్నీ ఎలా తయారు చేసారు ?
మొత్తం ముందే మేము ఇక్కడే తయారుచేసుకుంటాము. తయారు చేసుకున్నాకా, సెట్ చేసి చూసుకుంటాము. అంతా బాగుంది అనుకున్నాకా, దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేస్తాము. రాయికి రాయికి మధ్యలో సిమెంట్, కరక్కాయ ,అరటిపండు వంటి పేస్టు పెడతాము. మామూలుగా గ్యాప్ ఎక్కువ రానివ్వము. ప్రతిష్టలప్పుడు కూడా ఇలాగే చేస్తాము.
మీ వంశస్థులు చెక్కిన శిల్పాల గురించి చెప్పండి.
ఎగువ అహోబిలంలో ఉగ్రనృసింహ స్వామి కోనేరు ఉంది కదండీ. ఆ కోనేరు పునర్నిర్మాణం మా తాతగారే చేసారు.
మీరింతవరకూ ఏమి శిల్పాలు చెక్కారు ?
నేను ఎక్కువగా ఫినిషింగ్ వర్క్ – అంటే ఆభరణాలు చెక్కటం వంటివి చేస్తాను,
బిజినెస్ చూసుకుంటాను. ఒక ౩౦ మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్లకు విగ్రహం యెంత ఎత్తు ఉండాలి, మిగతా సూచనలు అన్నీ చెబుతూ పర్యవేక్షిస్తాను.
మీ శిల్పకళామందిరం కోసం ప్రభుత్వం ఏవైనా నిధులు సమకూర్చిందా ?
అంటే, మేము ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టాలని అనుకున్నాము. అందుకోసం ప్రభుత్వ అనుమతి అవసరం అయ్యింది. నేను ఒకచోట ఈ విషయం చెబుతుంటే విన్న జిల్లా కల్లెక్టర్ విజయ్ మోహన్ గారు, ‘ఇది చాలా మంచి ఆలోచన’ అంటూ అనుమతిని ఇచ్చారు. ట్రైనింగ్ సెంటర్ కు సంబంధించిన పత్రాలు అన్నీ సమర్పించాము. ఈ నెలాఖరుకి కాని, వచ్చేనెలలో కాని, శిల్పాల తయారీలో శిక్షణ మొదలు పెడతాము.
మీవద్ద 30 మంది స్టాఫ్ ఉన్నారని అన్నారు కదా ! ప్రస్తుతం శిల్పాలకు డిమాండ్ ఎలా ఉంది ?
మేము అందించే నాణ్యమైన, అందమైన శిల్పాలకు మాకు ఇప్పుడు ఏడాదికి సరిపడా వర్క్ ఉంది. అదీకాక, ఈ మధ్య హోటల్స్ లో, పెద్ద పెద్ద ఇళ్ళలో అలంకరణకు శిల్పాలను వినియోగిస్తున్నారు. మ్యురల్స్ కూడా మేము చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏదైనా ఒక పౌరాణిక ఘట్టం తీసుకుని, దానికి సంబంధించిన శిల్పాలు చెక్కమంటారు. ఇళ్ళలో అలంకరణకి  ఆర్డర్ లు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
‘శ్రీశైల శిఖర దర్శనం’ దగ్గర ఉన్న నంది మీరే చేసారని, చదివాను.
అవునండి, శిఖర దర్శనం వద్ద ఉన్న నంది వద్ద, మా శిల్ప కళా మందిరం పేరు కూడా ఉంటుంది. మహానంది లో రామాలయం, అద్దాల మండపం పనులన్నీ మా తాతగారే చేసారు. ఇంకా శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారి గుడి చుట్టూ ఉన్న శిల్ప స్థంభాలు అన్నీ మా తాతగారు చెక్కినవే. అప్పట్లో, శ్రీశైలంలో గుడి చాలా చిన్న ప్రాంగణంలో ఉండేదట. మా తాతగారు ‘ఇది విజయనగరం స్థాయిలో ఉండాలి’ అని చాలా డ్రాయింగ్స్ అవీ వేసి, నిర్మించారు.
శిల్పాలు తయారుచేసేందుకు మీకు రాయి ఎక్కడినుంచి వస్తుంది ?
మేము తాడిపత్రి నుంచి బ్లాక్ గ్రానైట్ తెప్పించుకుంటాము. తులసి కోటలు, బుద్ధుడి విగ్రహాలు మాత్రం  మామూలు రాయి తెప్పించుకుంటాము.
తులసి కోట ఫోటో చాలా బాగుంది. ఇలా చెయ్యాలన్న ఆలోచన ఎలా వచ్చింది
?
థాంక్స్ అండి. తులసి అంటేనే అమ్మవారు కదా. అందుకే, ప్లైన్ గా చేసేబదులు, చుట్టూ అమ్మవారి విగ్రహాలు పెడితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. అలాగే చేసాము.
మీరు చేసిన వర్క్స్ కి మీరు ఏవైనా ప్రశంసలు అందుకున్నారా ?
ఫిలిప్పీన్స్ కు చెందిన ఒకామె తరచుగా హైదరాబాద్ కు వస్తూ ఉంటుంది. ఆవిడకు అక్కడ పెద్ద ఫార్మ్ హౌస్ ఉంది. అక్కడ కారిడార్ కోసం శిల్పాలు కావాలి అన్నారు.  ఆమెకు నేను 6 అడుగుల బుద్ధుడి విగ్రహం చేసి, ఇచ్చాను. నేను తీసుకున్న మొదటి ఆర్డర్, పెద్ద ఆర్డర్ అదే. మొత్తం విగ్రహాలు అన్నీ కలిపి, ఆమె నాకు 5 లక్షలు ఇచ్చింది. ముందుగానే, ఆమె నాతో “బుద్ధుడి వదనం చాలా ప్లేసెంట్ గా, చిరునవ్వుతో రావాలమ్మా. ఆ ముఖం చూస్తేనే ప్రశాంతత కలగాలి.” అని చెప్పింది. సరే అని, దాదాపు నెల రోజులు కష్టపడ్డాము. ఆమె చెప్పిన మార్పులన్నీ చేసి, మా నాన్న, మామ, అన్నయ్య విగ్రహాన్ని తీసుకు వెళ్ళారు. ఆమె ఫోన్ చేసి, ఎంతగా మెచ్చుకున్నారంటే, అన్నాళ్ళు మేము పడ్డ శ్రమ అంతా మర్చిపోయాము.
ఇంకోటి, హైదరాబాద్ లో ‘గంపా సుబ్బలక్ష్మి’ గారని, ఆవిడ ఫేస్ బుక్ చూసి, నాకు మొదటి ఆర్డర్ ఇచ్చారు. తమ ఇంటికి అమ్మవారి విగ్రహాలు, అన్నీ ఒక అడుగువి తీసుకున్నారు. అప్పుడు కూడా నేను ఇక్కడ పనుల వల్ల వెళ్ళలేక పోయాను. కాని ఆ మేడం నన్ను తమ ఇంటి ఆడపడుచు లాగా భావించి, నాకు చీర, పసుపుకుంకాలు పంపారు. చాలా ఆనందంగా అనిపించిందండి.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
కొన్ని ఎ.పి.టూరిజం వారి ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఇందాకే సాక్షి టీవీ లో మా కార్యక్రమం చూసి, ఇద్దరు ఆర్డర్స్ ఇచ్చారు. మా శిల్పకళా శాలను ఇంకా అభివృద్ధి చెయ్యాలని, ఫారెన్ కు ఎక్స్పోర్ట్ చెయ్యాలని, ఒక కోరిక. కొన్ని ఫారెన్ కు పంపినా, మాకు ఈ విషయంలో పెద్దగా అనుభవం లేదు. ప్రభుత్వ సాయం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి, కొత్త వారికి శిక్షణ ఇవ్వాలి అన్నది ఒక కోరిక.
చాలా సంతోషం భువన గారు. మీరు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని, ప్రపంచ స్థాయికి ఎదగాలని, మా కోరిక.
చాలా సంతోషమండి, కృతఙ్ఞతలు.
****
వీరు చెక్కిన మరిన్ని శిల్పాలను, క్రింది లింక్ లో సందర్శించండి.
https://www.facebook.com/stone.statues.94?fref=photo

No comments:

Post a Comment

Pages