షెహ్నాయి సామ్రాట్ - ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ - అచ్చంగా తెలుగు

షెహ్నాయి సామ్రాట్ - ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్

Share This

షెహ్నాయి సామ్రాట్ - ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్

-మధురిమ 


ఆగష్టు 15న ప్రధాన మంత్రి గారు దేశాన్ని ఉద్దేశించి చేసిన ఉపన్యాసము  తరువాత, జనవరి 26న రాష్ట్రపతి గారి ఉపన్యాసము తరువాత ఒక సుమధురమైన షెహ్నాయి నాదం వినిపిస్తుంది. ఆ షెహ్నాయి  ఎవరిదంటే యావత్ భారతదేశ సంగీత ప్రియులచే "ఉస్తాద్"  అని ఎంతో గౌరవ పూర్వకంగా సంభోదించబడే షెహ్నాయి సామ్రాట్ కీ.శే. శ్రీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారిది.
అసలు షెహ్నాయి అనేది పల్లెవాసులు తమ పెళ్ళిలలో,జాతరలలో,అంటే శుభ సమయాలలో వాయించుకునే ఓ  పల్లె వాయిద్యం.
షెహ్నాయి ఎక్కడైనా వినిపిస్తోందంటే అక్కడ  శుభం జరుగుతోందనే అర్థం, అలాంటి షెహ్నాయి ని శాస్త్రీయ సంగీత కచేరిలు ఇచ్చేలా చేసింది బిస్మిల్లా ఖాన్ గారే.
సంగీతం వీరికి జన్మతరహా గా కూడా లభించిందని చెప్పచ్చు. ఎందుకంటే వీరి తాతగారు  రసూల్ బక్ష్ ఖాన్ గారు  భోజ్పూర్ సంస్థానంలోని షెహ్నాయి వాయించేవారట.
1916వ సంవత్సరంలో మార్చి నెల 21వ తేదీన పైగంబర్ ఖాన్, మిఠ్ఠన్ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఈ దంపతుల పెద్దకుమారుడి పేరు షంషుద్దీన్. కుమారుల పేరులిద్దరివీ ఒకెలా ఉండాలని వారు ఖాన్ గారికి కమరుద్దీన్ అని పేరు పెట్టారు.కానీ వీరి తాతగారు వీరు చంటిపిల్లాడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి వీరిని చూడగానే  బిస్మిల్లా అన్నారట. బిస్మిల్లా అనేది ఖురాన్లో మొట్టమొదటి వాక్యం”,భగవంతుని పేరుతో” అని అర్థం,ఇక ఆపేరే వీరికి స్థిరపడిపోయింది.వారి తాతగారు ఏ మంగళ ఘడియలలో ఆ దేవుడిపేరు ఉచ్చరించారో కానీ నిరంతరం తన షెహ్నాయి వాదనతో ఆభగవంతునికి అతిప్రీతిపాత్రులయ్యరు.
నేటి బీహార్ రాష్ట్రంలో ని  దుమరావ్ గ్రామంలో జన్మించారు.వీరి తండ్రి గారు కూడా దుమ్రావ్ సంస్థానాదీసులైన కేసవ్ ప్రసాద్ సింగ్ గారి వద్ద షెహ్నాయి వాయించేవారట.
ఆ రోజుల్లో ఇలా నోటితో ఊది వాయించే  వాయిద్యాలకు శాస్త్రపరంగా పెద్దగుర్తింపు ఉండేది కాదట.వారు ధనికుల ఇళ్ళలో  జరిగే శుభకార్యాలలో,దేవాలయాలలో,పెద్ద పెద్ద సంస్థానలలో వాయించుకునేవారట.ముసల్మానులిగా ఉండి సంగీతం నేర్చుకునే వారిని కిందిజాతి వారిగా కూడా పరిగణించేవారట. మరి అలాంటి పరిస్థితులలో పుట్టి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఇలా ప్రాతః స్మరణీయులైనారంటే వారు ఈదిశగా ఎంత కృషి చేసారో మనకి అర్థం అవుతుంది.
ఖాన్ గారికి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారు వారణాసిలో తమ తల్లిగారి పుట్టింటికి అంటే తాతగారింటికి వచ్చేశారట.అక్కడ వారి మేనమామ అలీ బక్ష్ విలాయత్ గారు కూడా షెహ్నాయి వాయిస్తూ ఉండేవారట. అదికూడా వారణాసిలో విశ్వేశ్వరాలయంలో,గంగానది ఒడ్డున.వారు వాయిస్తున్నంతసేపూ కన్నార్పకుండా అలానే చూస్తూ,వింటూ ఉండేవారట. తరువాత వారివద్దనే శిష్యునిలా అభ్యసించారు కూడా. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సంగీత ప్రక్రియలైన థుమ్రి, ఛైతి, ఖజ్రి, సావని  అన్నిటినీ అవపోసన పట్టారు. ఇంకా షెహ్నాయిపై హిందుస్థానీ సంగీత రాగాల సాధన కూడా చేశారు. మావయ్య గారికి పక్కవాయిద్యం వాయిస్తూ ఆయనతో అన్ని ప్రదేశాలకు వెళ్ళేవారు. అలా 1930వ సంవత్సరంలో "అలహాబాద్ సంగీత సమ్మేళనంలో"తొలిసారి గా 14ఏళ్ళ వయసులో వాయించారు.  బిస్మిల్లా ఖాన్ గారికి ఎప్పుడూ ఒక్కటే కోరిక ఉండేదట, షెహ్నాయి వాయించడాన్ని ఒక కళలాగా అభివృద్ధి చెయ్యాలి.దానిపై హిందుస్థాని శాస్త్రీయ సంగీత రాగాలు వాయించాలి అని.  తన శక్తి యుక్తులన్నీ నిరంతర షెహ్నాయి  సాధనకే ఉపయోగించేవారట. 1936లో  మొట్టమొదటి కచేరీ చేసినప్పటికీ ఆయన సంగీత ప్రయాణం 1936వ సంవత్సరంలో ఆకాశవాణి లక్నౌ ప్రారంభంతో ఊపందుకుంది.ఆ రోజుల్లో లక్నౌ ఆకాశవాణిలో విరివిగా ఈయన షెహ్నాయి వినిపిస్తూ  ఉండేదిట.
1937వ సంవత్సరంలో "అఖిల భారత సంగీత సమ్మేళనం" కలకత్తా నగరంలో జరిగింది.అక్కడ బిస్మిల్లా ఖాన్ గారు పూర్తి స్థాయిలో షెహ్నాయిపై  హిందుస్థాని శాస్త్రీయ సంగీతాన్ని వాయించి ఆ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతానికి పరిచయం చేసారు.
ఖాన్ గారి అన్నయ్య షంషుద్దీన్ కూడా వీరితో కలిసి వాయించేవారట.వీరిద్దరు మొట్టమొదటిసారి ఆకాశవాణి దిల్లీ కేంద్రంలో 1941లో జుగల్బందీ వాయించారట.అన్నదమ్ముల ఇద్దరిమధ్య ఎంత సమన్వయం  ఉండేదంటే ఇద్దరిలో  ఎవరు వాయిస్తున్నారో తెలిసేది కాదట.వారిద్దరికీ వాయిద్యంపైనే కాదు ఒకరిపై ఒకరికి కూడా ఎంతో అభిమానం, అవగాహన ఉండబట్టే అది సాధ్యం అయ్యింది.చూడడానికి కూడా ఇద్దరు అన్నదమ్ములు కవలలవలె ఉండేవారట.
 భారతీయ సంగీత సముద్ర ప్రవాహానికి ఖాన్ గారు తొలి కెరటంవంటి వారు.ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్,విలాయత్ ఖాన్,పం.రవి శంకర్,శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి,శ్రీ బిస్మిల్లా ఖాన్ వీరందరినీ ఆ రోజులలో ఓ దేవగణంగా పాశ్చాత్యులు పరిగణించేవారట.జార్జి హారిసన్ (బిస్మిల్లా ఖాన్ సమకాలీకులైన పాశ్చాత్య  గిటారిస్ట్) ఖాన్  గారి ప్రతీ కచేరీకీ వచ్చే వారట.
1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున సాయంత్రం అప్పటి తొలి ప్రధాని నెహ్రూ  గారి ఆహ్వానంపై ఎర్రకోటపై గాంధి గారి వంటి శ్రోతల సమక్షంలో తన షెహ్నాయి కచేరి చేశారు.అలాగే మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం నాడు కూడా ఎర్రకోటపై వాయించే అపూర్వమైన అరుదైన అవకాశం కూడా ఆయనకే దక్కింది.ఇక అప్పటినుండీ అన్ని ప్రసార  మాధ్యమాలు స్వాతంత్ర్య ,గణతంత్ర్య దినోత్సవాల రోజు ప్రథాని మరియు రాష్ట్రపతి ప్రసంగాల తరువాత బిస్మిల్లా  ఖాన్ గారి షెహ్నాయి వాదననే ప్రసారం చేసేవట.
1960వ సంవత్సరంకల్లా విశ్వవిఖ్యాతి గాంచినా అప్పటివరకూ ఆయన ఎప్పుడూ భారతదేశం వదిలి వెళ్ళలేదు.ఎన్నో దేశాలనుండీ ఖాన్ గారి కచ్చేరికై ఎన్నో వినతిపత్రాలు వచ్చినప్పటికీ ఆకాశం  లో ప్రయాణం చెయ్యడం అంటే నాకు  భయము,నేను భారతదేశం వదిలి ఎక్కడికీ రాను అని చెప్పేవారట.
అప్పుడు 1966లో అప్పటి ప్రభుత్వం ఎడిన్ బర్గ్ సంగీతోత్సవానికి ఆయనను పంపించడానికి ఆయనను ఎంతో బ్రతిమాలితే ముందు తనను మక్కా మదీనా యాత్రలకు పంపితే అప్పుడు ఎడిన్ బర్గ్ వెళతానన్నారట.ఇలా అంటే ప్రభుత్వం ఆయనను పంపదులే అనుకున్నారట. కాని అప్పటి ప్రభుత్వం ఆయనను ముందు మక్కా మదీనా యాత్రలకు పంపి ఆ తరువాత ఎడిన్ బర్గ్ సంగీతోత్సవానికి కూడా పంపింది.ఈ సంఘటన తరువాత ఆయన ఇంచుమించు ప్రపంచంలోని అన్ని ప్రఖ్యాత నగరాలలోని ప్రజలను తన  షెహ్నాయినాదంతో ముగ్ధులను చేసారు.
1967లో లండన్  నగరంలో ని “ఈవినింగ్ స్టాండర్డ్” అనే పత్రిక ఏం ప్రచురించిందంటే "ఇక నుంచీ మీరు బిస్మిల్లా ఖాన్ ఇంకా వారి షెహ్నాయి గురించి  డిక్ష్నరీ లో తెలుసుకోపోతున్నారు.షెహ్నాయి,బిస్మిల్లా ఖాన్ రెండూ ఇంగ్లీషు భాషలో ప్రవేశించాయి. అసాధారణ భారతీయ సంగీత ప్రతిభకి అంకురార్పణ ఇప్పుడు జరిగింది"అని పేర్క్కొన్నది. 1986లో  ఆంగ్ల ఆక్స్ఫర్డ్  డీక్ష్నరీ లో షెహ్నాయి పేరు,బిస్మిల్లా ఖాన్ గారి పేరు చేర్చబడ్డాయి.
ఒక మనిషి కి తాను జీవించి ఉండగా ఇంత అపూర్వ గౌరవం లబించడం ఎంత అరుదు.తన వాయిద్యము, తనూ, రెండూ పర్యాయపదాలుగా ప్రపంచం అంతా వ్యవహరించడం చాల అరుదైన సత్కారం, పూర్వజన్మ సుకృతం.
జన్మతః ఒక షియా ముసల్మాన్ అయిన ఆయన ఎప్పుడూ సరస్వతీ దేవిని ఆరాధిస్తూ ఉండేవారట. సంగీతానికి ఏ మతం కులం లేదు అనేవారట.ఆమె కరుణా కటాక్షాలు ఆయనపై అంత సంవృద్ధిగా ఉన్నాయి కాబట్టే ఇంత సంగీత జ్ఞానం సంపాదించుకోగలిగారు మరి.ఈ విషయం మనకి ఒక్క మాట స్పష్టం చేస్తుంది అదిఏంటంటే మనుషులకు దేవుడి విషయాలలో విబేధాలు ఉన్నాయేమో కానీ భగవంతుడి దృష్టిలో మనం అందరము ఆయన సత్సంతానమే. ఈ సత్యాన్ని జ్ఞానులైన బిస్మిల్లా ఖాన్ గారి వంటి వాళ్ళు తెలుసుకుంటారు  కాబట్టే  ఆయన ఎన్నో హిందూ దేవాలయాలలో వాయించారు.ముఖ్యంగా ఆయన నివాస స్థానమైన వారణాసిలో విశ్వనాథుని గుడిలో ఎప్పుడూ వాయిస్తూనే ఉండేవారట.
ప్రపంచం లో దాదాపుగా అన్ని దేశాలు తిరిగినా ఎప్పుడూ ఉర్దూలోనే మాట్లాడేవారట. విదేశాలలో కచేరీ చేస్తున్నప్పుడు శ్రోతలకు సంగీత పరంగా ఎదైనా చెప్పవలిసి వచ్చినప్పుడు మాత్రం చిన్న చిన్న ఆంగ్ల పదాలు ఉపయోగించడం తప్ప వారికి  ఆంగ్లం అస్సలు  రాదట.
ఆంగ్లం రాకపోతే బ్రతుకులేదు అని మూర్ఖంగా నమ్మే తల్లితండ్రులు,పిల్లల్లు ఈయన జీవిత చరిత్ర చదివితే వారికి ఒకటి అర్థం అవ్వాలి.ఏంటంటే తాము ఎంచుకున్న మార్గంలో సంపూర్ణ జ్ఞానం సంపాదించడం ముఖ్యం కానీ భాషతో ఏపనిలేదు. ఈ వాక్యం బలపరచడానికి ఇలాంటివారి జీవితాలే ఉదాహరణలు.
ఉస్తాద్ తన జీవిత కాలంలో ఎన్నో  పెద్ద కంపెనీలకు  ప్రఖ్యాత రికార్డింగ్స్ చేసారు  ఉదా: భారతదేశంలొ టిప్స్ కంపెనీకి ఆయన చాల రికార్డింగ్స్  చేశారు.అన్నీ బహుళ జనాదరణ పొందినవే. ముఖ్యంగా  1980వ సంవత్సరంలో "హిస్ మాస్టెర్స్ వాయిస్" అన్న పేరుమీద 19 సోలో రికార్డింగ్స్ చేసారు. వీరు చాలమందితో జుగల్బంది చేసినా ప్రముఖ సితార్ విద్వాంసులైన విలాయత్  ఖాన్ గారితో వీరి జుగల్బందీ చాల పేరు ప్రఖ్యాతలు  పొందింది.
అలానే ప్రముఖ సరోద్ వాయిద్య విద్వాంసులైన అంజద్ అలీ ఖాన్ గారు,బిస్మిల్లా ఖాన్ గారు కలిసి ఎన్నో జుగల్బందీలు చేశారు.2004వ సంవత్సరంలో వీరిద్దరి సమైఖ్య ఆల్బం రు-బ-రు చాలా జననాదరణ పొందింది.
 బిస్మిల్లా ఖాన్ గారి  చిరకాల మితృలైన అంజద్ అలీ ఖాన్  గారు ఆయన గురించి ఏమంటారంటే "ఈ సంగీతజ్ఞుని హృదయంలో ఓకవి హృదయం దాగి ఉంది.ఆయన ఆ కవి హృదయంతోనే ఎప్పుడూ షెహ్నాయి వాయిస్తాడు.అందుకే ఆయన దృష్టికోణం అనితర సాధ్యం గా ఉంటుంది." ఒక మితృడు తన తోటి మితృని ఎంత లోతుగా తెలుసుకుంటే తప్ప ఇలా అనగలడు?
సినిమా రంగంలోకి వీరికి చాలా అవకాశాలు వచ్చినా ఆయన అటువైపు వెళ్ళలేదు.1959లో "గూంజ్ ఉఠీ షెహ్నాయి" అన్న హిందీ చిత్రానికి,1970వ సంవత్సరంలో సన్నాది అప్పన్న అన్న కన్నడ చిత్రానికి మాత్రమే షెహ్నాయి వాయించారు. ఎ.ఆర్. రెహ్మాన్ గారు మాత్రం 2004వ సం లో విడుదలైన స్వదేశ్ చిత్రానికిగాను ఒక పాటకోసం బిస్మిల్లా ఖాన్ గారిచేతనే షెహ్నాయి వాయింపజేశారు.ఆస్కార్ అవార్డ్ గ్రహీత ,భారతీయుడు అయిన సత్యజిత్ రే గారి చిత్రం జల్సాగర్ లో బిస్మిల్లా ఖాన్ గారు నటించారు కూడా.
ఇంకో విషయం ఆయన అనవసరంగా జనంలోకి ఎక్కువ వచ్చేవారు కాదట.నేను శ్రోతలకి వినిపించాలి కానీ కనిపించకూడదు అనేవారట. ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించినా చాల అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన ఉదార్త హృదయులు. అమెరికా దేశంలో నివశించడానికి ఆ దేశపు శాశ్వత విశా వచ్చినా కాని వారణాసి నుండీ అంగుళం కూడా కదలలేదు. జీవించి ఉన్నంత కాలం కచేరిలకు వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా వారణాసిలోనే జీవనాన్ని గడిపిన మహా పుణ్యాత్ములు.వారణాసి అంటే ఆయనకు ఎంత ఇష్టం అంటే చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు వైద్యానికి కూడా వారణాసి దాటి వెళ్ళలేదు.”అందరూ కాశి వచ్చి ప్రాణాలు వదలాలి అనుకుంటారు అలాంటిది నన్ను బతకడానికి ఇక్కడనుండీ తీసుకెళతారెందుకు?” అని అడిగేవారట.
లౌకిక జీవితంలో నిరుపేద అయిన ఈ సంగీతసంపన్నుడికి జీవిత కాలంలో కనీసం ఒక్క కారు కూడా లేదు. వారణాసిలో ఎప్పుడూ ఆయనకి అతి ప్రీతికరమైన  రిక్షాలోనే ఎక్కడికెళ్ళాలన్నా..  ,కుటుంబం మాత్రం చాల పెద్దది.అయిదుగురు కొడుకులు,ముగ్గురు కూతుర్లు మనవలు,మునిమనవళ్ళతో కలిపి మొత్తం 60 మంది ఒకే ఇంటిలో ఉండేవారట.
ఇక వీరి పురస్కార,సత్కారాల విషయానికొస్తే:
 1930లో అల్లహాబాద్ లో అఖిల భారత సంగీత సమ్మేళనంలో ఉత్తమ ప్రదర్శకునిగా పురస్కారం
 1937లో కలకత్తా లో అదే సభలో ఉత్తమ ప్రదర్శకునిగా మూడు బంగారు పతకాలు
 1956లో సంగీత నాటక అకాడెమీ అవార్డ్
1961లో  పద్మశ్రీ  1968లో పద్మ భూషన్ 1981లో పద్మ విభూషణ్
2001లో భారతరత్న.
మొట్టమొదటి స్వాతంత్ర్య,గణతంత్ర్య దినోత్సవాలతో పాటు ఎన్నో స్వాతంత్ర్య,గణతంత్ర్య దినోత్సవాలకు ఎర్రకోట పై వాయించిన అపూర్వ గౌరవం వీరొక్కరికే సొంతం.
 అమెరికాలోని లింకన్ సెంటర్ హాల్ కి ఆహ్వానించబడ్డ మొట్టమొదటి భారతీయుడు.
 తన ఎనభయ్యో  జన్మదినం   న్యూయార్క్ నగరంలో ని "వరల్డ్ మ్యూసిక్ ఇన్స్టిట్యూట్" లో జరుపుకున్న నిజమైన సరస్వతీ పుత్రులు.
 వీరి శిష్యుల్లో ప్రముఖులు వీరి కుమారులైన నాజిం ,నయ్యర్ తో పాటు బాగేశ్వరి కమర్. ఈమె భారత దేశ మొట్టమొదటి మహిళా షెహ్నాయి విద్వాంసురాలు.గురుశిష్యులిద్దరూ 1994వ సంవత్సరంలో చేసిన జుగల్బందీ ఇప్పటికీ సంగీతాభిమానుల వీనులకు విందే.
 కానీ జీవితపు చివరి భాగంలో చాల పేదరికాన్ని కూడా చవిచూసారు.దురదృష్టం ఏంటంటే 2003లో అప్పటి వాజ్ పాయి ప్రభుత్వాన్ని ఆర్ధిక సహాయం చెయ్యమని కూడా అడిగారట.పేదరికపు బాధలు కుటుంబంచేత అనుభవింప చెయ్యలేక తన ఆత్మాభిమానము అణచుకుని ఆర్ధిక సహాయం అడిగినందుకు ప్రభుత్వం వాయిదాలలో 5లక్షల రూపాయలు అందించింది.
ఆయన షెహ్నాయిని ఎంత ప్రేమించేవారంటే ఆయన దానిని బేగం అని సంభోదించేవారట. 2006వ సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీన షెహ్నాయి శాశ్వతంగా ఆగిపోయింది.ఆరోజు వారణాసిలో ఫతేమైన్ స్మశాన వాటికలో ఓ వేప చెట్టు కింద బిస్మిల్లా ఖాన్ గారితో పాటు సమాధి చెయ్యబడింది. ఈ పుడమినుండీ అల్లా సామ్రాజ్యానికి షెహ్నాయి బాద్షా ఆయన బేగం అయిన షెహ్నాయి తో శాశ్వతంగా వెళ్ళిపోయారు ,  మళ్ళీ తిరిగిరారు,రాలేరు ఎందుకంటే వారణాసిలో 9రోజులుంటేనే పునర్జన్మ ఉండదుట  మరి 91 సంవత్సరాలు అక్కడే ఉన్న ఈ మహా పుణ్యాత్ముని కైలాసం నుండీ శివుడెలా తిరిగి పంపగలడు? కానీ మరణం ఈ శరీరానికే ఆత్మ నిత్య సత్యం కాబట్టే ఇప్పటికీ వారణాసి విశ్వేశ్వరునికి తన షెహ్నాయి నాదంతో సుప్రభాతం పలుకగలుగుతున్నారు.
చివరిరోజుల్లో బిస్మిల్లా ఖాన్ గారికి ఒకే ఒక కోరిక ఉండేదట.ఎప్పుడైనా ధిల్లీలో ఇండియాగేట్ వద్ద వాయించాలని, కాని అది తీర కుండానే కన్నుమూసారు.ఆయన రెండవ కుమారుడు నయ్యర్ హుస్సేన్ మాత్రం తండ్రి గారి వద్దనుండీ వారసత్వంగా తీసుకున్న ఈ విద్యతో ఎప్పటికైనా ఆ కోరిక తీర్చగలననే ఆశావాదంతో ఉన్నారు.
బిస్మిల్లాఖాన్ గారు ఎప్పుడు  "ప్రపంచం అంతరించినా సంగీతం బ్రతికి ఉంటుంది" అనేవారట.ఇది వేదవాక్కు వంటిది.
భగవంతుడు ప్రతీ మనిషిలో కళాంశ ని పెట్టే ఇక్కడికి పంపుతాడు.ఏ మనిషైతే తన ఉనికిని కూడా మరిచి ఆ కళ కోసం జీవితాన్నంతా అంకితం చేస్తాడో వాడు  చేశే సాధన ఒక యజ్ఞమై,ఆ యజ్ఞఫలం లోక కళ్యానార్థమై విరాజిల్లి అతని కీర్తి ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది.
బిస్మిల్లా అలీ ఖాన్ గారి మధురమైన సంగీతాన్ని క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages