మనసా నువ్వెక్కడ? - అచ్చంగా తెలుగు

మనసా నువ్వెక్కడ?

Share This

మనసా నువ్వెక్కడ?

బి.వి.సత్యనగేష్


‘మనసంతా నువ్వే, నా మనసు నీకిచ్చేసాను ‘ అని హృదయాన్ని చూపిస్తూ వుంటారు కొంతమంది. అసలు మనసు హృదయంలో వుండదంటే కొంతమంది నమ్మరు కూడా! ఎందుకంటే..... కవులు , ఆద్యాత్మిక గురువులు మనసును హృదయంతో పోల్చుతారు కాబట్టి. మన తెలుగులోనే కాదు..... ఇంగ్లీష్ లో కూడా మనసును హృదయంతో పోల్చుతారు. తెలుగలో ‘మనస్పూర్తిగా’ అంటే దానికి ఇంగ్లీషులో ‘whole heartedly’ అంటారు. అలాగే hearty greetings, heart felt feelings, from bottom of the heart అనే పదాలు వాడుకలో వున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనసు హృదయంలో ఉండదు. ఎందుకంటే... గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసినపుడు గుండెతో పాటు మనసు మారిపోవడం లేదు కదా! అందుకే అంటున్నాను... మనసు గుండెలో వుండదు.. గుండులోనే ఉంటుందని.
          మెదడు, మనసు ఒకటే అనే వాళ్ళు వున్నారు. కాని అవి వేరు వేరు. మనసు మెదడులోనే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మానసిక సమస్యలున్న వారు వాడే మందులు మెదడుపైనే పని చేస్తాయి. మెదడు లో జరిగే అసాధారణమైన రసాయినిక చర్యల వల్లనే మానసిక సమస్యలు వస్తాయి. అలాగే తీవ్రమైన మానసిక సమస్యలున్న వారిని EEG (ఎలక్ట్రో ఎన్ సెఫలో గ్రామ్ ) ను తీసుకురమ్మంటారు. E.c.g ను అడగరు. మానసిక సమస్యలున్న వారిని BRAIN SCAN REPORT తీసుకు రమ్మంటారు. అలాగే షాక్ ట్రీట్ మెంట్ (ECT) ఇస్తే మనిషితల భాగానికే ఇస్తారు. కాని గుండెకు ఇయ్యరు. కనుక మనసు మెదడులోనే వుంటుందనే నిర్ధారణకు వచ్చేద్దాం.
          కంప్యూటర్ లో రెండు ముఖ్యమైన విషయాలుంటాయి. 1. హర్డ్ వేర్ 2. సాఫ్ట్ వేర్. అలాగే మనిషిలో కూడా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లుంటాయి. మానసిక ప్రవర్తన గురించి తీసుకుంటే... మెదడు హార్డ్ వేర్, మనసు సాఫ్ట్ వేర్. కంప్యూటర్ ను చూడగలం కాని సాఫ్ట్ వేర్ అనబడే ప్రోగ్రాం ను చూడలేం. అలాగే కేసెట్,CD.  DVD లను చూడగలం కాని వాటిల్లో వుండే అంశాలను చూడలేం. మరొక ఉదాహరణను తీసుకుందాం... మెదడు ను చూసి ఆ వ్యక్తి మతం ఏమిటనేది చెప్పలేం. అన్ని రకాల మతాలకి చెందిన వారి మెదడు ఒకే రకంగా ఉంటుంది. మనస్సు మాత్రం వేరు. అదే మనం వృద్ధి చేసుకున్న ప్రోగ్రాం. ఈ మనసు ఏర్పడటానికి మూడు కారణాలుంటాయి. వాటిని 3 ‘E’ లు అంటారు.
          ENVIRONMENT. పెరిగిన వాతావరణం
          EDUCATION. నేర్చుకున్న విషయాలు (చదువు మాత్రమే కాదు)
          EXPERIENCES. అనుభవాలు
మనం పెరిగిన వాతావరణంలో, నేర్చుకున్న విషయ జ్ఞానం ద్వారా కలిగిన అనేక అనుభవాలతో, ఊహలతో ఏర్పరచుకున్న భావాల సముదాయాన్ని ‘స్వభావం’ అంటాం, అంటే స్వంత భావం అన్నట్లు. ఈ స్వంత భావాల్లో కొన్ని సానుకూలమైనవి, కొన్ని ప్రతికూలమైనవి వుంటాయి. మనిషి ఎప్పటికప్పుడు ఆలోచనా ప్రక్రియ ద్వారా తన భావాలను మార్చుకుంటూ వుంటాడు. ఈ ఆలోచనా ప్రక్రియ అనేది కంప్యూటర్ లోని ‘ఆపరేటింగ్ సిస్టం’ లాంటిది. ఒక్కవాక్యంలో చెప్పాలంటే... మనసు అనేది ఆలోచనా ప్రక్రియ తో కూడిన మానసిక ముద్రల సమూహం. ఇది మెదడులోనే వుంటుంది.
మెదడును పూలతోటతో పోల్చుకుని చూద్దాం! రంగురంగుల వువ్వులున్న పూలతోట ఆకాశమంత ఎత్తునుంచి చూస్తే భూమి మీద రంగులు వేసేరన్నట్లు ఉంటుంది. అటువంటి చక్కటి, అందమైన పూలతోటలో కలుపు మొక్కలు పెరిగితే ఆపూలతోట అందం చెడిపోతుంది. క్రమేణా ఆ కలుపు మొక్కలు పెరుగుతూ పొతే పూలతోట అందం పోతుంది, గుబాళింపు పోతుంది... అంటే కాదు నేల సారం కూడా తగ్గిపోతుంది. మెదడు ఒక పూలతోట లాంటిది. కనిపించని విత్తనాలు మన మానసిక ముద్రలు లాంటివి. మొక్కల్లో, పువ్వుల్లో కనిపించని ప్రాణశక్తి లాంటిదే మన మానసిక శక్తి తోట నుంచి వెలువడే గుభాలింపు, అందం మనకున్న గుర్తింపులాంటిది. కనుక విత్తనాన్ని బట్టి మొక్క, మొక్కను బట్టి పువ్వు, పువ్వును బట్టి అందం, గుభాలింపు వుంటాయి. అలాగే పరిసరాల్లో నేర్చుకున్న అనుభవాలనబడే విత్తనాల వల్ల, ప్రాణశక్తితో స్వయంగా ఎదగాలనే మొక్కలాగా మనిషి ఆలోచనాశక్తితో జీవితంలో ఎదిగి, మంచి పువ్వులను, గుబాళింపు మొక్కలిచ్చినట్లు, మన జీవితంలో మంచి లక్ష్యాలను సాధించాలి. సాధారణంగా ప్రతీపువ్వు కాయగానో, విత్తనాలుగానో మారుతుంది. ప్రొద్దుతిరుగుడు పువ్వు (sun flower)ను ఉదాహరణగా తీసుకుందాం. ఒక విత్తనం మొక్కై, ఎన్నో పువ్వులను ఇచ్చి, కొన్ని వందల విత్తనాలను తయారుచేస్తుంది. ఈ పువ్వుల తోట ను దూరం నుంచి చూస్తే అది ఒక పసుపురంగు భూమిలా కన్పిస్తుంది. ఈ పువ్వులో మరొక ప్రత్యేకత ఉంది. ఉదయం వేళ తూర్పు వైపు, సాయంత్రం వేళ పడమరవైపు ఈ పువ్వులు తామంతట తామే తిరుగుతాయి. ఈ ప్రక్రియ మన జీవితానికి ఒక పాఠం నేర్పుతుంది. అవకాశాలను వెతుక్కుంటూ, పరిస్థితుల కనుగుణంగా మనిషి మారాలి అనే పాఠం చెప్తుంది. ఆ విధంగా ‘పంటకాలం’ లాంటి మన ‘జీవితకాలం’ లో లక్ష్యాలనే పువ్వులను, ఫలాలను సాధించుకోవాలి. మంచి పువ్వులు, కాయలకు మంచి ఆదరణ ఉంటుంది. కొన్ని పువ్వులు మన ఇష్టదైవం చెంతకు చేరుతాయి కూడా. ఉమ్మెత్త పువ్వులు, కాయలు లాంటివి మనిషికి, పూజకు పనికి రావు. మన లక్ష్యాలు విలువైనవిగా ఉండాలంటే విలువైన విషయాల గురించే ఆలోచించాలి. విలువలేని లక్ష్యాల గురించి ఆలోచిస్తే మన సమయంతో బాటు మనసు కూడా చెదరిపోతుంది. దీనివల్ల జీవితంలో సారం తగ్గిపోతుంది.
భూమిలో సారం తగ్గితే ఎరువులను వేస్తాం, అలాగే మన లక్ష్యసాధనలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎరువులనబడే సానుకూల ఆలోచనా విధానాన్ని ప్రవేశపెట్టాలి. అపుడే లక్ష్యాలనే ఫలాలను అందుకుంటాం.
లక్ష్యాలను సాధించిన వారి గురించి తెల్సుకోవడం, మంచి పుస్తకాలను చదవడం, మంచి వారితో స్నేహం చేయడం, సమయపాలనను పాటించడం లాంటివి జీవిత లక్ష్యాలనే పంటకు ఎరువులు లాంటివి. కష్టం అనుకోకుండా ఇష్టంతో చేస్తే మంచి పంట వస్తుంది. జీవితం పండుతుంది.
‘మనసే అందాల బృందావనం’ అన్నారు ఓ సినిమా కవి, నిజమే! జీవితంలో మధురామృతాన్ని పొందుదాం, ఆలస్యమెందుకు? పదండి ముందుకు.

No comments:

Post a Comment

Pages