మహిళా! నీకు నువ్వే రక్ష - అచ్చంగా తెలుగు

మహిళా! నీకు నువ్వే రక్ష

Share This

మహిళా! నీకు నువ్వే రక్ష

భావరాజు పద్మినీ ప్రియదర్శిని


‘స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, సోదరుడు, వృద్ధాప్యంలో కొడుకు రక్షించాలి!’
ఇటువంటి సూక్తులు స్త్రీలు ఇల్లు కదలకుండా ఉండే రోజుల్లో అయితే పనికి వచ్చేవేమో. కాని అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా, ఒకవిధంగా అంతకంటే ఎక్కువగా, ఇంటా బయటా వెలుగుతూ, వెలిగిస్తూ స్త్రీ మెరుపులా దూసుకుపోతున్న ఈ కాలంలో  స్త్రీ తన రక్షణ తానే చూసుకోవాలి.
రోజురోజుకీ ఉద్యోగినుల సంఖ్య పెరుగుతోంది. చదువు, ఆపై క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగాలు రావటం, పని ఒత్తిడి వల్ల, ఆఫీస్ లో అర్ధరాత్రి దాకా పనిచెయ్యాల్సి రావడం, తరచుగా ప్రయాణాలు స్త్రీలకు తప్పటంలేదు. ఈ దశలో భద్రత అనేది, స్త్రీలకు ప్రధాన సమస్యగా మారుతోంది. కాస్తంత నిశిత పరిశీలన, సమయస్పూర్తి, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం మరి కాస్తంత ఆధునిక సాంకేతికత, చాలా వరకు ఈ భద్రతా అవసరాల్ని తీరుస్తాయి. అదెలాగో చూద్దామా ?
భద్రత కోసం సూచనలు
భారత స్త్రీలపై నిర్వహించిన ఒక తాజా సర్వే ప్రకారం 94% మంది స్త్రీలు ఒంటరిగా ప్రయాణించడం ప్రమాదకరమని భావిస్తారు. పెరుగుతున్న క్రైమ్ రేటు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వెంటాడడాలు వంటివే ఇందుకు కారణం. గత ఏడాది రాష్ట్రంలో నమోదైన 1,500కు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. వెలుగులోకి వచ్చి, పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులే ఇలా ప్రతిఏటా పెరుగుతుంటే, ఇక వెలుగు చూడని వాస్తవాలు ఎన్ని ఉంటాయో, మన ఊహకు అందదు. అందుకే, స్త్రీల భద్రత కోసం కొన్ని సూచనలు చూద్దాము.
  • నిర్మానుష్యమైన ప్రదేశాల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ప్రత్యేకించి రాత్రి వేళలలో మీకు జతగా ఒకరు తోడుంటే మంచిది, తప్పని స్థితిలో సహోద్యోగుల సహకారం తీసుకోండి.
  • స్థానిక సంప్రదాయాన్ని ప్రతిబింబించే, గౌరవకరమైన దుస్తులు ధరించడం చాలావరకు సమస్యల్ని తగ్గిస్తుంది. స్త్రీలపై యునైటెడ్ నేషన్స్ వారి సర్వే ప్రకారం, ఢిల్లీ లో నివసించే 75 % మంది ప్రజలు(స్త్రీలు, పురుషులు, పిల్లలు ), కొందరు స్త్రీలు అసభ్యకరమైన దుస్తులతో రెచ్చగొడతారని అంగీకరించారు. స్త్రీలు, పురుషులు, అమరికగా దుస్తులు ధరించటం భారతీయ సంప్రదాయం. స్లీవ్ లెస్ టాప్స్, మినీ స్కర్ట్ లు, షార్ట్స్, ఉల్లిపొర వంటి దుస్తులు, స్కిన్ టైట్ కురచ దుస్తులు వీలైనంత తగ్గిస్తే మంచిది. టి- షర్టులపై స్కార్ఫ్ లు, దుపట్టాలు ధరిస్తే చూసేవారి దృష్టి మళ్ళుతుంది.
  • రాత్రి వేళల్లో ట్రైన్ లో వెళ్ళాల్సి వస్తే, అప్పర్ బెర్త్ ను ఎంచుకోండి. వీలుంటే స్త్రీలు నడిపే కార్లు, స్త్రీల ప్రత్యేక బోగీలు, బస్సులు ఎక్కండి. డోర్ కు దగ్గరగా, ఇతర స్త్రీల ప్రక్కనే కూర్చునేలా చూసుకోండి. తెలియని వ్యక్తుల కళ్ళలోకి సూటిగా చూడడం, వారితో సంభాషించడం చెయ్యకండి. అది తప్పుడు భావనలకు అవకాశం ఇస్తుంది.
  • రాత్రి వేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లలో ప్రయాణించకండి. ఖాళీగా ఉన్న బస్సు లు, ట్రైన్ లు రాత్రి వేళల్లో ఎక్కకండి. రాత్రి వేళల్లో కాల్ సర్వీసెస్ ఇచ్చే టాక్సీ లను వాడటం మంచిది. ఇప్పుడు వోలా క్యాబ్స్ వంటివి, ఆప్స్ ను అందిస్తున్నాయి. అది డౌన్ లోడ్ చేసుకుని, చేస్తే, ఆటోమేటిక్ గా మీరున్న ప్రదేశం గుర్తించి, 5 నిముషాల్లో, ఆటో ధరకే మీకు టాక్సీ ని అందిస్తుంది. పైగా డ్రైవర్ ను కాబ్ యజమానులు జి.పి.ఎస్ ద్వారా మానిటర్ చేస్తూ ఉంటారు కనుక, మీకు మరింత భద్రత అందుతుంది.
  • తలొంచుకుని, భయపడుతున్నట్లు కనిపిస్తూ నడవకండి. సన్ గ్లాస్ లు ధరించండి. ఇప్పుడు యువతులు ముఖానికి ధరిస్తున్న ముసుగు కూడా ఒకవిధంగా ఇతరులు వారి హావభావాల్ని గమనించకుండా వారికి ఉపయోగిస్తుంది.
  • బదిలీపై వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మీ సంస్థకు ఉన్న స్థానిక కాంటాక్ట్స్ ద్వారా వసతి ఏర్పరచుకోండి. లేక వారికి తెలిసిన నమ్మకస్తులను సంప్రదించండి. కాస్త ఖర్చు ఎక్కువైనా, సెక్యూరిటీ గార్డ్, రిజిస్టర్, ఇంటర్కాం వంటి సౌకర్యాలున్న భద్రమైన ఎంచుకోండి. ఫ్లాట్ లో మీరు ఒంటరిగా ఉండేటప్పుడు పాలు, కొరియర్, ఆర్డర్ ఇచ్చిన ఫుడ్, లేక బిల్లులు వసూలు చేసుకునేవారు వస్తే, తలుపు తెరిచే ఉంచి, లోనికి వెళ్ళకండి. వారు ఏమనుకున్నా, మన భద్రత ముఖ్యం కనుక, తలుపు వేసి, లోనికి వెళ్లి, మళ్ళి తలుపు తీసి, పంపెయ్యండి.
  • హోటల్ లో ఒక్కరే ఉండాల్సి వచ్చినప్పుడు, గదిలోని తాళం, చైన్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మీ గదిలోని అద్దాలు వన్ వే మిర్రర్స్ (మామూలువి) లేక టు వే మిర్రర్స్ (రెండు వైపులా కనిపిస్తాయి, అంటే మిమ్మల్ని అద్దంలోంచి, అవతలి వారు చూడగలరు) అయి ఉన్నాయో, అద్దంపై గోరు ఉంచి పరిశీలించుకోండి. మామూలు అద్దమైతే, గోటికీ, గోరు ప్రతిబింబానికి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. అలాగే హిడెన్ కెమెరాలు ఏమైనా లైట్ లలో, స్మోక్ అబ్సార్బెర్ లలో, లేక సీలింగ్ లో  ఉన్నాయేమో, పరిశీలించుకోండి.
  • ట్రైన్, బస్సు, హోటల్ లలో తెలియని వారినుంచి పానీయాలను స్వీకరించకండి. డ్రింక్స్ లో డ్రగ్స్, మత్తుపదార్దాలు కలిపి మాన ప్రాణాలు, ధనం హరించిన సంఘటనలు ఎన్నో చూసాము. తప్పనిసరి పరిస్థితుల్లో సీల్ చేసిన బాటిల్ మాత్రమే కావాలని, పట్టుబట్టండి.
  • ఇతరులతో పరిచయాలు చేసుకునేటప్పుడు, విదేశీ పద్ధతిలో కౌగిలింతలు, ముద్దులు, షేక్ హ్యాండ్ ల ద్వారా పురుషుల స్పర్శకు అవకాశం ఇవ్వకుండా, భారతీయ శైలిలో రెండు చేతులెత్తి, నమస్కారం పెట్టండి. ఇది ఎదుటివారికి మీపై సదభిప్రాయాన్ని కలిగిస్తుంది కూడా !
  • అపరిచితుల కళ్ళలోకి చూడడం చాలా క్లుప్తంగా ఉండాలి తప్ప, తేరిపారా చూడకండి. వారివంక చూస్తూ అదే సమయంలో నవ్వడం అనేది, చాలాసార్లు అపార్ధాలకు దారి తీస్తుంది. మీ మాటలు, చూపులు, హావభావాలు, కదలికలు, చాలా మామూలుగా ఉండాలి.
  • ఆటోడ్రైవర్ల ముసుగులోని నేరస్థులూ, సహప్రయాణికుల రూపంలోని గొలుసు దొంగలూ, ఒంటరిగా కనిపిస్తే చాలు- మాటలతో చేతలతో కంపరం పుట్టించే కామపిశాచాలూ, నగర మహిళలకు నరకం చూపుతున్నారు.  దారితెలియక ఎవరినైనా అడగాల్సి వచ్చినప్పుడు, ‘నా కూడా రండి, చూపిస్తాను,’ అనేవారితో వెళ్ళవద్దు. వారెంత స్నేహపూర్వకంగా ఉన్నా సరే. ఒకరిని అడిగి, ఆ దారిలో వెళ్తూ,మరికొందరిని అడిగి, నిర్ధారణ చేసుకుంటూ వెళ్ళండి.
  • పురుషుడు తనను ఏ దృష్టితో చూస్తున్నాడో, మాట్లాడుతున్నాడో ఒక స్త్రీ అవలీలగా తెలుసుకోగలదు. అందుకే మీ హావభావాల్ని, పరిధులలో ఉంచుకోండి. ఎవరైనా తాకాలని, దగ్గరగా కూర్చోవాలని ప్రయత్నించినప్పుడు, భయపడకుండా, స్పష్టంగా మాట్లాడండి. తడబడుతున్నట్టు, సంకోచిస్తున్నట్టు కనిపించకండి. మీకు అసౌకర్యంగా ఉన్నప్పుడు, జనసంచారం ఉన్న చోటైతే, దూరంగా జరిగి, వారి చెయ్యి తీసేసి, సూటిగా, బిగ్గరగా, ‘నన్ను తాకవద్దు’ అని చెప్పండి. ఎవరూ లేని చోట అయితే, కోపంగా చెప్పకుండా, దూరంగా జరిగి, యుక్తిగా, వీలైనంత తొందరగా అక్కడినుంచి బయటపడండి.
  • కార్యాలయాల్లో లైంగిక వేధింపులు - అతి తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నాయి. అవి హద్దులుదాటి అత్యాచారాల దాకా వెళ్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఆమెను నీడలా వెంటాడేవాడు, కాటేయాలని కాచుకుకూర్చున్నవాడు, కళ్ల నిండా కామాన్ని పులుముకున్నవాడు - ఏ రాక్షసలోకం నుంచో దిగిరాడు, కోరలతో ప్రత్యక్షం కాడు. ఆ దుర్మార్గుడు- స్నేహితుడో, బంధువో, పొరుగువాడో, సహోద్యోగో, రక్తసంబంధీకుడో అయిఉంటాడు. చూపుల్లో తేడానూ, స్పర్శలో పన్నాగాన్నీ గమనించండి. అటువంటి వారిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇవ్వకండి.
  • నడుస్తున్నప్పుడు చెవుల్లో వైర్లు పెట్టుకుని సంగీతం వినడం, ఫోనుల్లో ముచ్చట్లలో మునిగిపోవడం కాకుండా స్త్రీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాస్తంత ముందూ, వెనుకా చూసుకోండి.
  • సొంత కంప్యూటర్‌ ద్వారానే ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించడం, పుట్టినతేదీ ఇంటిపేరూ,కుటుంబసభ్యుల పేర్లూ - పాస్‌వర్డ్‌ వూహించడానికి పనికొచ్చే వ్యక్తిగత వివరాల్ని బహిర్గతం చేయకపోవడం, అనుమానాస్పద సైట్స్‌ జోలికి వెళ్లకపోవడం, అపరిచితుల ఫేస్‌బుక్‌ రిక్వెస్టులకు స్పందించకపోవడం, వ్యక్తిగత ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం, తరచూ పాస్వర్డ్ లను మార్చడం...స్థూలంగా, అప్రమత్తతే ఆన్‌లైన్‌ రక్షణ కవచం.
  • కోపం కంటే, వారిలో అపరాధభావన కలిగించడం బాగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. బస్సులలో, జనంలో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే, ధృడంగా, మర్యాదగా, ‘ఏం చేస్తున్నారు ?” అని అడగండి.
  • మీరు ఎక్కడ ఉన్నా, భద్రతకు బంగారు సూత్రం, అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, పరిసరాలు గమనించడం. మీరు గమనించిన అంశాలను బట్టి, తెలివిగా స్పందించండి.
“ధైర్యం, ఆత్మవిశ్వాసమే స్త్రీకి వెన్నంటి నిలిచే సాయుధ పటాలం. “ ఇప్పుడు కొన్ని ఆత్మరక్షణ చిట్కాలను చూద్దాము.
 ఆత్మరక్షణ కోసం చిట్కాలు
 స్వీయ రక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
  • ఇబ్బందుల్లో మొదట స్త్రీ దాడి చెయ్యాల్సింది, పురుషుడి కళ్లపై. అందుకే కారం, లేక పెప్పర్ స్ప్రే ను సదా వెంట ఉంచుకోండి. ప్రతి మందుల షాప్ లోనూ, ప్రభుత్వం చౌకగా అందిస్తున్న పెప్పర్ స్ప్రే, తేలిగ్గా లభిస్తుంది. అతని కళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడు, మీరు సులువుగా తప్పించుకుని, పరిగెత్తండి.
  • ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు గమనిస్తే, వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూడండి. అది వారిని వెనక్కు తగ్గేలా చేస్తుంది. “నా వెంట పడకండి. ఒక్క బటన్ నొక్కానంటే, దగ్గరలో ఉన్న పోలీస్ లు వస్తారు,’ అని ధృడంగా చెప్పండి.
  • మానవ శరీరంలో అనేక బలహీనమైన స్థానాలు ఉన్నాయి. చెవులపై చాచి కొట్టడం, గొంతుపై బలంగా ,వారికి ఊపిరి ఆడకుండా చేస్తుంది. అతని మోకాళ్ళ మధ్యలో బలంగా కొడితే, వారికి నొప్పి రెట్టింపై, కాసేపు గిలగిలలాడతారు. ఈ లోపు మీరు తప్పించుకోవచ్చు.
  • ఎవరైనా మీ పర్స్ కోసం అడిగితే, అతనివద్ద ఆయుధాలు ఉన్నాయా, మీ చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్న్నారా అనేదాన్ని బట్టి, స్పందించండి. మీరు ప్రతిఘటించగలరో, లేదో నిర్ధారించుకోండి. ఒకవేళ తప్పని స్థితిలో మీరున్న స్థానానికి, వ్యతిరేక దిశలో, దూరంగా పర్స్ విసిరేసి పరుగెత్తండి. మీకు అందుబాటులో ఉన్న పెన్, గొడుగు లేక పెర్ఫ్యూమ్ (ఇది కూడా పెప్పర్ స్ప్రే లాగా వాడాలి ), వంటి వాటిని సమయానుకూలంగా ఎలా తెలివిగా వాడాలో ఆలోచించండి. ఇవి మీ ప్రాణాన్ని కాపాడవచ్చు.
  • మొనదేలిన కీ చైన్ లు, దువ్వెన్నల్లో, పెన్ లలో చిన్న కత్తులు దాగిఉండే సాధనాలు ఇప్పుడు మూడు నాలుగొందల ధరలో ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీ నోరు మూసేసి, మీరు అరవలేని స్థితిలో ఉన్నప్పుడు పెద్దగా ధ్వనిని వెలువరించే అలారం లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రింది లింక్ లో కొనుగోలు చెయ్యవచ్చు.
స్త్రీల భద్రత కోసం కొత్త ఆప్స్
ఇప్పుడు మొబైల్ ఫోన్, అందులో నెట్ కనెక్షన్ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో ! అయితే, ఈ మొబైల్ నే మీ రక్షణ కోసం ఒక ఆయుధంలా వాడుకోవాలి. స్పీడ్ డయల్ లో మీ కుటుంబ సభ్యులు, ఆప్తుల నెంబర్లు సేవ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఛార్జ్ ఉండేలా చూసుకోవాలి. హెల్ప్ లైన్స్, దగ్గరలోని పోలీస్ స్టేషన్ నెంబర్లు, అంబులన్స్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. కొన్ని సేఫ్టీ ఆప్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోండి. వీటి గురించిన సమాచారం క్రింద ఇవ్వబడింది.
  1. Bsafe పర్సనల్ సేఫ్టీ ఆప్ – ఇది మీరు ఫేక్ కాల్ చేసుకుని, అక్కడినుంచి బయటపడే అవకాశం ఇస్తుంది. ఇందులో ఉన్న ‘గార్డియన్ అలెర్ట్’ బటన్ మీ సన్నిహితులకు మీరున్న ప్రదేశాన్ని వారికి వెంటనే తెలియచేస్తుంది. ఈ ఆప్ ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ లో అందుబాటులో ఉంది.
  2. Safetipin ఆప్ – GPS ట్రాకింగ్, అలారం వంటి సౌకర్యాలనే కాక, ఒక ప్రదేశానికి వెళ్లేముందే అది యెంత భద్రమైనదో తెలుసుకునేందుకు ఇది ఉపయోగిస్తుంది. ఇందులో ఉన్న డైరెక్టరీ ఆప్షన్స్ ద్వారా, మీరు దగ్గరలోని ఎమర్జెన్సీ నెంబర్లువెంటనే తెలుసుకోవచ్చు. ఈ ఆప్ ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ లో అందుబాటులో ఉంది.
  3. iGoSafely ఆప్ – ఈ ఆప్ అవసర సమయాల్లో మీరు నెంబర్లు వెతుక్కుని, స్పందించలేరని అర్ధం చేసుకుంటుంది. అందుకే మీరు హెడ్ ఫోన్స్ ని తీసేసినా, ఫోన్ ను గట్టిగా ఊపినా, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కు వెంటనే మెసేజ్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ లో ఇది అందుబాటులో ఉంది
  4. Lookup ఆప్ – ఈ ఆప్ బెంగుళూరు ప్రధానమైనది. ఆపదకాలంలో నేరుగా కోరామంగలా పోలీస్ స్టేషన్ వారికి మీరున్న ప్రదేశం, ఫొటోలతో సహా సందేశం పంపగలదు. రిపోర్ట్ ఇచ్చే సదుపాయం కూడా కల్పిస్తుంది.
  5. Raksha - Women Safety Alert ఆప్ – ఇది గూగుల్ ప్లే లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాల్యూం బటన్ నొక్కగానే, ఆప్ ఆఫ్ లో ఉన్నా, మీ ఆప్తులకు సందేశం పంపుతుంది. దగ్గరలో మీకు సురక్షితమైన ప్రాంతాలను తెలియచేస్తుంది. మీరున్న ప్రదేశాన్ని, మీకు దగ్గరలో ఉన్న ఆప్తుల వివరాలను తెలుపుతుంది. మీరు offline ఉంటే, ఇది మీ సన్నిహితులకు మీరున్న చోటును sms ద్వారా పంపుతుంది. త్వరగా మీకు వైద్య సహాయం అందేలా చేస్తుంది.
స్త్రీలకోసం హెల్ప్ లైన్ లు –
దేశ వ్యాప్తంగా
స్త్రీల హెల్ప్ లైన్  (భారత్ మొత్తంలో )        1091 / 1090
స్త్రీల జాతీయ కమిషన్  (NCW)        0111-23219750
ఆపదల్లో ఉన్న స్త్రీలకోసం భూమిక వారి 24/7 హెల్ప్ లైన్ : 1800 425 2908(టోల్ ఫ్రీ )
తెలంగాణా
హైదరాబాద్/ సికింద్రాబాద్  - విమెన్ పోలీస్ స్టేషన్    040-27853508
హైదరాబాద్ విమెన్ పోలీస్ స్టేషన్ 04027852400 / 4852
ఈ నెంబర్ సేవ్ చేసుకుని ఉంచుకోండి. అప్రమత్తతే శ్రీరామరక్ష ! మనో ధైర్యమే కవచం ! ఆత్మవిశ్వాసమే ఆయుధం ! ఓ మహిళా ! నీకు నీవే రక్ష !

No comments:

Post a Comment

Pages