జయాపజయాలకు మీరే బాధ్యులు - అచ్చంగా తెలుగు

జయాపజయాలకు మీరే బాధ్యులు

Share This

జయాపజయాలకు మీరే బాధ్యులు

బి.వి.సత్యనగేష్


         
ఏదో ఒకటి సాధించి తీరాలి అనే బలమైన కోరిక లేకపొతే జీవితం ఉప్పు లేని కూర లాంటిది. అలా సాధించాలంటే మన జీవితంలో జరిగే ప్రతీ సంఘటనకు మనమే బాధ్యులమని నమ్మితీరాలి. అందుకు మన ఆలోచనాసరళి మాత్రమే కారణమని ఒప్పుకోవాల్సిందే. జీవితంలో అనేక మంచి, చెడు సంఘటనలు ఎదురౌతాయి. వాటిని స్వీకరించే పద్ధతిలోనే వుంది మన నేర్పు, సామర్థ్యం.
          ఈ మధ్య కాలంలో సుమారుగా 24 సంవత్సరాల యువకుడు నా దగ్గరకు కౌన్సిలింగ్ కొరకు వచ్చాడు. “ఇంజనీరింగ్ చదువుతున్నాను, కాని పూర్తి చెయ్యలేదు, సుమారుగా 13 పేపర్లు ఇంకా పాస్ అవ్వాలి” అన్నాడు. విద్యావిధానంలో, యూనివర్సిటి విధానాల్లో తప్పులున్నాయన్నాడు. చాలా ఘాటైన విమర్శలు చేసేడు.
          నువ్వు చెప్పినవన్నీ కరక్టే అన్నాను అతని తృప్తికోసం. ఎందుకంటే...కౌన్సిలింగ్ కు వచ్చిన వ్యక్తికున్న అభిప్రాయాలను వ్యతిరేకించడం కౌన్సిలింగ్ పధ్ధతి కాదు.
          “ఇలాంటి తరంలో పుట్టడం నా ఖర్మ” అన్నాడు.
          “ఇలా అనుకోవడం కన్నా మేలైన మార్గం లేదా” అని నేనన్నాను.
          “ఉంటే గింటే నాకెందుకీ ఖర్మ” అన్నాడు.
          “సుమారుగా మూడు సంవత్సరాలుగా విలువైన సమయం వృథా అయింది కదా!” అన్నాను.
          “ఔను, నా క్లాస్ మేట్స్ చాలామంది ఎం.టెక్, ఎం.ఎస్ లాంటి చదువులను పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు” అన్నాడు.
          “మరి వాళ్ళు కూడా ఇదే విద్యావిధానంలో ఉత్తీర్ణులయ్యారు కదా!” అన్నాను.
          ఊహించని ఈ వాక్యాన్ని ఎలా తిప్పికొట్టాలా అని కొన్ని క్షణాలు ఆలోచించుకున్నాడు.
          “వాళ్ళంతా గొర్రెలమంద లాంటి వాళ్ళు” అన్నాడు.
          “పోనీ... ఈ విద్యావిధానంలో మార్పుతీసుకురాడానికి ఏదైనా విప్లవం చేపట్టావా?” అన్నాను.
          ఈ ప్రశ్నను కూడా అతను ఊహించలేదు. కొద్దిసేపు అసహనంతో మౌనం వహించాడు.
          ఇలాంటివాళ్లు “నలుగురితో నారాయణ” అన్నట్లు వుండరు,... లేదా ఏదైనా సమాధానం కొరకు ప్రయత్నమూ చెయ్యరు. మధ్యస్థంగా వుండిపోయి కుమిలిపోతూ వుంటారు. ఇంట్లో వాళ్ళకి కంటనీరు తెప్పించగలరు. ఇటువంటి వాళ్ళు మనకు అక్కడక్కడ తారసపడుతూ వుంటారు. సమాజాన్ని, కుటుంబ సభ్యుల్ని, ఆఫీస్ లో బాస్ ని, సహోద్యోగుల్ని తిట్టుకుంటూ, వ్యవస్థను తప్పుపడుతూ ‘తమ ఖర్మ’ అని నిందించుకుంటూ జీవితాన్ని గడుపుతారు. తమ జీవితానికి తామే బాధ్యులమని, తమ ఆలోచనా సరళిని మార్చుకునే అవకాశం వుందని ఏ రోజూ గుర్తించరు.
          ‘LIVING BY CHOICE’ , ‘LIVING BY CHANCE’  అనే వాక్యాలను వింటూనే వుంటాం.‘LIVING BY CHANCE అంటే మనకు అందుబాటులో వున్న వనరులను వీలయినంటే మాత్రమే వినియోగించుకోవడం, ఎలా రాసి పెట్టి వుంటే అలా జరుగుతుందనుకోవడం. ‘LIVING BY CHOICE’ అంటే మనకు కావలసినట్లుగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిచడం, అవకాశాలను సృష్టించుకోవడం, వచ్చిన అవకాశాలను వదలకుండా వినియోగించుకుని ప్రయోజనం పొందడం. ఈ రకం వ్యక్తుల జీవితంలో బాధ్యతను వహిస్తారు కనుకే వారిని విజయం వర్తిస్తుంది.
          ‘బాధ్యత’ అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్ లో ‘RESPONSIBILITY’ అంటారు. ఈ పదాన్ని రెండు పదాలుగా విడగొడితే RESPONSE, ABILITY అనే రెండు అర్ధవంతమైన పదాలొస్తాయి. మన జీవితంలో ప్రతీ సంఘటనకు మనం జవాబు (RESPONSE)నిస్తాం. ఈ జవాబు సానుకూలమైనది లేదా ప్రతికూలమైనది కావచ్చు. ఈ జవాబు నివ్వడంలో లేదా స్పందించడంలో సామర్థ్యం (ABILITY)ను ప్రదర్శించడమే RESPONSIBILITY అవుతుందంటాడు ప్రముఖ మేనేజ్ మెంట్ నిపుణుడు, రచయిత స్టీఫెన్.ఆర్.కొవి.
          మనకు ఎదురయ్యే అనేక సంఘటనలకు మనం స్పందిస్తాం. ఈ స్పందన మన మానసిక ముద్రలపై ఆధారపడి వుంటుంది. స్పందన ఏ విధంగానైనా వుండొచ్చు, కాని ప్రతీ సంఘటనకు సానుకూలంగా స్పందించేలా అభ్యాసం చెయ్యాలి. క్రమేణా మనం సంఘటనలకు స్పందించే విధం సానుకూలంగా మారుతుంది. తద్వారా మనం జీవితాన్ని అర్ధం చేసుకునే తీరు మారుతుంది. అంతేకాదు.. ఈ అబ్యాసం/ సాధన వల్ల మన మానసిక ముద్రలు మారిపోతాయి.
          స్పందించే విధానాన్ని బట్టి వ్యక్తుల్ని రెండు రకాలుగా విభజించేరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. మొదటి రకం వ్యక్తుల్ని “ప్రోయాక్టివ్” అని రెండవరకం వ్యక్తుల్ని “రియాక్టివ్” అని అంటారు. ‘ప్రోయాక్టివ్’ రకానికి చెందిన వ్యక్తుల స్పందన సానుకూలంగా ఉంటుంది. ‘రియాక్టివ్’ రకానికి చెందిన వ్యక్తుల స్పందన ప్రతికూలంగా ఉంటుంది.
          పైన పేర్కొన్న యువకుడు ‘రియాక్టివ్’ వర్గానికి చెందడం వల్ల విద్యావిధానాన్ని, కుటుంబ వాతావరణాన్ని విమర్సిస్తున్నాడు. రియాక్టివ్ మరియు ప్రొడక్టివ్ వర్గాలకు చెందిన వ్యక్తుల ఆలోచనాసరళి ఎలా వుంటుందో చూద్దాం.
          ఇక్కడొక చిన్న ఉదాహరణను తీసుకుందాం. చాలా కాలంగా మీకొక మంచి స్నేహితుడున్నాడు, కొంతకాలం క్రితం మీ ఇద్దరికీ ‘గోపాల్’ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. మీరు ముగ్గురూ కొంతకాలం మంచి స్నేహితులుగానే గడిపేరు కూడా. కాని ఈ మధ్యకాలంలో వారిద్దరూ చాలా స్నేహంగా వుంటూ మీకు దూరంగా వుంటున్నారు, తరచుగా వారిద్దరూ కలుసుకుంటున్నారు. ఇలా జరగడానికి కారణం – కొత్తగా పరిచయమైన గోపాల్ మాత్రమేనని మీకు ఎవరో చెప్పితే, అపుడు మీ ఆలోచనాసరళి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
మీరు ‘రియాక్టివ్’ అయితే...
 • స్నేహం అనేది ఒట్టిమాట. నీళ్ళ మూట లాంటిది.
 • అవసరం కొరకు పరిచయం చేసుకుంటారు. అసలు స్నేహం అనేది ఈ ప్రపంచంలోనే లేదు.
 • గోపాల్ దుష్టుడు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు.
 • గోపాల్ పరిచయం అయిన తరువాత మీ స్నేహితుడు ఎన్ని విధాల నష్టపోయాడన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు.
 • వారిద్దరూ కలసి మిమ్మల్ని మోసం చెసేరని అందర్నీ నమ్మించడానికి ప్రయత్నిస్తారు.
 • వారి స్నేహాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు.
 • మానసికంగా కృంగిపోతారు.
మీరు “ప్రోయాక్టివ్” అయితే......
 • నన్ను వద్దనుకున్న స్నేహితుడు గురించి నేనెందుకు బాధపడాలి అని అనుకుంటారు.
 • ఆఖరి ప్రయత్నంగా మీ స్నేహితుణ్ణి నిలదీసి స్నేహం గురించి అడుగుతారు.
 • స్నేహం అనేది చాలా విలువైనది అని నమ్మడానికి, తెలియజేయడానికి మిగిలిన స్నేహితులతో చాలా అభిమానంగా వుంటారు.
 • మీ స్నేహితుడు మీకెందుకు దూరమయ్యాడనే విషయాన్ని విశ్లేషించుకుంటారు.
 • మీ స్నేహితుడు గోపాల్ తో కలిసి చెడు మార్గాన వెళ్తుంటే, మీరు అటువంటి మార్గానికి దూరం అయినందుకు సంతోషిస్తారు.
 • అంతా నా మంచికే అనుకుంటారు.
 • వాళ్ళ స్నేహం వారి ఇష్టం. వాళ్ళ స్నేహం నా మనసుపై చెడు ప్రభావాన్ని చూపకూడదని కోరుకుంటారు.
          ఒక్కమాటలో చెప్పాలంటే ‘రియాక్టివ్’ గా వుండేవాళ్ళు వారి జీవితానికి వారే ‘విలన్’లు. ‘ప్రొడక్టివ్’గా వుండేవాళ్ళు వారి జీవితానికి ‘హీరో’లవుతారు, ప్రొడక్టివ్’గా ఉండాలంటే ప్రతీవిషయం సాధ్యం అని నమ్మాలి. వేరే వ్యక్తులు సాధ్యం చెయ్యగలిగినపుడు నేను కూడా సాధ్యం చెయ్యగలను అనే మానసిక దృక్పథాన్ని అలవరచుకోవాలి. ప్రతీ విషయంలోనూ సానుకూలంగా స్పధించాలి.
మన జీవితంలో జయాపజయాలకు మనమే బాధ్యులం. మన పరిసరాలను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, సిలబస్ ను, విద్యావిధానలను, ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా, మనకున్న వనరులను గురించి విశ్లేషించి విమర్శించుకుంటే మనం ‘ప్రొయాక్టివ్’గా తయారవగలుగుతాం. జీవితంలో ఎంతో సంతోషాన్ని పొందగలుగుతాం. మరి ఆలస్యమెందుకు? పదండి ముందుకు.

No comments:

Post a Comment

Pages