మన వేదాలు - అచ్చంగా తెలుగు

మన వేదాలు

- భావరాజు పద్మిని 


సృష్టిలో ఎన్నో గుహ్యమయిన విషయాలు ఉన్నాయి. మానవ మేధకు, తర్కానికీ అందని విషయాలను వివరించడానికి విజ్ఞులు వేదాలను ప్రమాణంగా చెప్తారు. ప్రపంచ సాహిత్యంలో వేదములకంటే అత్యంత పురాతనమైన సాహిత్యం మరోటి లేదు."విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. అసలు వేదాలకు ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు? ఎందుకంటె, ఈ సకల చరాచర సృష్టికి కారణ భూతుడయిన పరమాత్మ , ఈ సృష్టి రహస్యాలను, ఆత్మల స్వరూపాన్ని, ఆధ్యాత్మిక తత్వాలను, మానవ ధర్మాలను, ఎన్నో గుహ్యమయిన మంత్రాలను, వీటిలో పొందుపరచాడు కనుక.   కొంత మంది సంప్రదాయ వాదుల, పరిశోధకుల ప్రకారం వేదాలు ఐదోవ శతాబ్దంలో ఎవరో కవులు రచించారు. మరి కొందరు ఔత్సాహికులు మరొక అడుగు ముందుకు వేసి, ఈ వేదాలు రచింప బడిన కాలాన్ని మరో రెండు వందల సంవత్సరాలు ముందుకో, వెనక్కో నెట్టాలని, శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వేదాల్లో రచించిన వారి పేరు ఎక్కడా కనపడదే..ఎప్పుడో పురాణ కాలంలో రాసారు కనుక మర్చిపోయి ఉంటారు...అంటారా? మరి రామాయణం రాసి ఎన్నో యుగాలు గడిచినా, వాల్మీకి పేరు ఎవరు మరువలేదే! పేరు కోసం పాకులాడడం మనవ సహజం. మరి వేదాల రచయతకు కీర్తి కాంక్ష లేదని అనుకుందామా? వేదాలు మనుషులచే సృజింప బడలేనంత విస్త్రుతమయినవి. ఈ సందర్భంగా భరద్వాజ మహర్షి కధ చెప్పుకోవాలి.   మూడు కొండల నడుమ ఉన్న చిన్న కుటీరంలో, నిరంతరం వేదాధ్యయనంలో ఉండేవారట భరద్వాజ మహర్షి. ఆయన మూడొంతుల జీవితం గడిచిపోయింది. అయినా వేద పఠనం పూర్తవలేదు. ఆయనకు పండు ముదుసలి వయసులో, ఇంద్రుడు సాక్షాత్కరించి, 'మీ యవ్వనాన్ని నేను వెనక్కి ఇస్తే, మీరు ఏమి చేస్తారు మహర్షి?' అని అడిగాడు. 'ఈ వేదాలను పూర్తిగా అధ్యయనం చెయ్యాలన్న కోరిక తప్ప, నాకు మరే ఇతర కోరికలూ లేవు. నా యవ్వనం తిరిగి వస్తే, నేను వేదాలను పూర్తిగా అవగాహన చేసుకుంటాను,' అన్నారు. అప్పుడు ఇంద్రుడు, ఆ మూడు కొండల నుంచి పిడికెడు మట్టి తీసి, మహర్షి ముందు ఉంచి, "ఇంతవరకూ మీరు చదివిన వేదాల ప్రమాణం ఇంత. చదవాల్సినది ఆ మూడు కొండలంత, దీనిని బట్టి, మీ సంకల్పం యెంత అసాధ్యమయినదో తెలుసుకోండి," అన్నాడట. వేద రాశి ఆకాశమంత వ్యాప్తి కలిగి ఉంది. సుమారు, రెండు వేల సంవత్సరాలకు పూర్వం 'పాణిని వ్యాకరణం' వ్రాసిన పతంజలి ఆ కాలానికే, వేదాలలో చాలా భాగాలు కోల్పోయామని చెప్పారు. ఆయన కాలానికి ఉన్న వేదాల శాఖలు  : ఋగ్వేదం --21 , యజుర్వేదం- 101 , సామవేదం- 1000 , అథర్వణ వేదం- 9 . మొత్తం 1131 శాఖల్లో, ఇప్పుడు మనకు తెలిసినవి ,  ఋగ్వేదం- రెండు శాఖలు -- శాకల మరియు భాస్కల, ఇందులో భాస్కల లభ్యం కావటంలేదు. యజుర్వేదంలో రెండు శాఖలు-- కృష్ణ యజుర్ వేదం, శుక్ల యజుర్ వేదం. సామవేదం లో మనకు దొరికినవి, రెండు-- కుతమేయ మరియు రణయనీయ, అథర్వణ వేదంలో ఉన్నవి పైప్పలాది, శౌనక, అంటే ప్రస్తుతం, మొత్తం ఎనిమిది శాఖలు మాత్రమే ఉన్నవి.  వీటిని ఒక సారి చదవడానికి సుమారు నూటయాభై నాలుగు గంటలు పడుతుంది. పతంజలి కాలంలో ఉన్న 1131 శాఖల్ని చదవడానికి ఇరవై రెండు వేల గంటలు -- అంతే సుమారు రెండున్నర ఏళ్ళు పడుతుంది. ఇక పతంజలి కాలానికి ముందు ఉన్న వాటిని చదవడానికి పట్టే కాలం మనం ఊహించ గలమా? ఇక చదవడానికే ఇంత సమయం పడుతుంటే, రాసేందుకు ఒక మనిషికి సాధ్యమా? హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది .ఈ యుగ ప్రారంభంలో వ్యాసుడు వేదరాశిని నాలుగు గావిభజించి నలుగురు శిష్యులకు వాటి సంరక్షణకై ఈ నాలుగు భాగాలు ఇచ్చాడు. వ్యాసుడు పైలుడికి ఋగ్వేదము, వైశంపాయనుడికి యజుర్వేదం, జైమినికి సామవేదం, సుమంతునికి అథర్వ వేదం ఇచ్చాడు.రోమహర్షణునికి పురాణాలు ఇచ్చాడు. ఈయన సూతుడనే పేరుతో తరువాత కాలంలో నైమిశారణ్యంలోశౌనకాది మహర్షులకు పురాణ ప్రవచనాలు ఇచ్చారు. వేదంలోని భాగాలు సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఉపనిషత్తులను వేదం చివరచేర్చడం వలన అవి వేదాంతము అనిపిలువబడతాయి. వేదాలు అర్థంచేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని వేదాంగాలు అంటారు. ఇవి వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం,శిక్ష,ఛందస్సు. వేదంలోని విషయాలను కథలలో చెప్పేవి పురాణాలు.ముఖ్యమైనవి 18. ఇవీ వ్యాసుడే సామాన్యులకై చెప్పాడు.ఇక దర్శనాలు,శాస్త్రాలు. ఈదర్శనాలలొ మనకు తెలిసినవి న్యాయ వైశేషికాలు. ఇవి ఆనాటి (నేటికీ పనికి వచ్చే) విజ్ఞాన శాస్త్రాలు. సాంఖ్యం, యోగం. మీమాంస, వేదాంతం - ఈ ఆరూ ఆస్తిక దర్శనాలు. వేదాలు అపౌరుషేయాలు,కాబట్టి అవి శ్రుతులు.వేదాంగాలు మానవ జనితాలు కాబట్టి అవి స్మృతులు. పారం పర్యంగా ఒకరి నుంచి ఒకరికి ఒక తరాన్నుంచి మరొక తరానికి ఈ స్మృతులను అందచేయవచ్చు. వేదాలలో చెప్పబడిన విషయాలనే స్మ్రుతులు, ఇతిహాసాలు, పురాణాలు  మున్నగునవి పలు విధాలుగా విశదీకరిస్తున్నాయి. ఉపనిషత్తులను వేదాంతమంటారు. హిందూ మతములోని మహోన్నత సిద్ధాంతములన్నీ ఉపనిషత్తులలోనే ఉన్నాయి.   ఋషులు భవిష్యత్తులో వేదాలలోని లోపాలు వెతికేవారు ఎక్కువ అవుతారనే, వేదాధ్యయనానికి కొన్ని నియమాలు ఏర్పరిచారు. మొదటి 'కర్మ' అధ్యయన భాగం 'జామిని మీమాంస శాస్త్రం' గాను, రెండవ 'జ్ఞాన అధ్యయన' భాగం 'బాదరాయణుడి వేదాంత శాస్త్రం' గాను చెప్పారు. వేదాధ్యయనం ఈ రెండు శాస్త్రాల సహాయం తోనే చెయ్యాలి.  ఈ వేదాల కూర్పులో నాలుగు స్వరాలు ఉన్నాయి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్రచ్యయ అనేవి , కొన్ని చోట్ల ఏడు స్వరాలు- కృష్ణ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, మంద్ర, అతిస్వర్య, అనే స్వరాలు ఉన్నాయి. ఇవన్ని పాటిస్తూ వేద వ్యాసుల వారు వేదాలను రచించారు. అందుకే వేద పఠనానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. శాస్త్ర ప్రకారం  చిన్న పదాన్ని తప్పుగా  ఉచ్చరించడం అపరాధంగా  భావించబడి, అలా ఉచ్చరించిన వాళ్ళు ప్రాయశ్చితం చేసుకోవలసి ఉంటుంది. అనాదిగా వేదాల స్వరాల అల్లికలో పెద్దగా మార్పులు రాకపోవడానికి ఇదే కారణమేమో! ఉదాహరణకు, త్వాస్త్రుడనే వాడు ఇంద్రుడి ని జయించడానికి ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. మంత్రోచరణ లోని చిన్న లోపం వల్ల  యజ్ఞ కర్త అయిన అతనే నాశనం అయ్యాడు.   ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ప్రయాసపడి కనుగొనడానికి ప్రయత్నిస్తున్న విషయాలన్నీ మన వేదాలలో ఏనాడో చెప్పబడ్డాయి. కుండల్లో కౌరవులు పెరిగిన వృత్తాంతం, నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ లను గుర్తు చేస్తుంది. చందగ్యోపనిషత్తు లో చెప్పబడిన ఉద్భిజాలు(చెట్టు నుంచి జనించేవి), అండజాలు(గుడ్డు నుంచి జనించేవి), జీవజాలు(జంతువుల నుంచి జనించేవి) వంటి జాతుల వివరణ ఇటువంటి  రహస్యాలను తెలుపుతుంది.  అధర్వణ పరిష్ట ప్రకారం సప్త ద్వీపాలు ఉన్నాయి. మనము  'అంటార్కిటిక' ను కనుగొన్నది ఎనభై సంవత్సరాల పూర్వం మాత్రమే ! ఈ విషయాన్ని వేదాల్లో మునుపే వివరించడం జరిగింది. ఛాందోగ్య ఉపనిషత్ లో సూర్యోదయం ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి, పశ్చిమం నుంచి తూర్పుకి ఉండే ప్రాంతాల వివరణ అసలు సూర్యోదయం- అస్తమయం లేనే లేని ప్రాంతాల వివరణ ఉంది. ముందరి రెండు ప్రక్రియలు ధ్రువాల వద్ద జరుగుతాయని తెలిసిందే, సూర్యోదయం, సూర్యాస్తమయం లేనిది సూర్య గ్రహం పైనే... మిగిలిన రహస్యాలను కనుగొన వలసి ఉంది. మన వేదాల్లోనే, విమాన విజ్ఞాన శాస్త్రం, మెదడు లోని కుడి ఎడమ భాగాలలోని పని తీరు లోని వ్యత్యాసం వంటి వాటిని వివరించారు. విజ్ఞాన శాస్త్రం సహాయంతో,     ఎంతో క్లిష్టమయిన ఈ రహస్యాలను చేదించేందుకు కొన్ని సంవత్సరాలు పడుతోంది. మరి ఈ రహస్యాలు వేదాల్లో ఎలా ఉంటాయి---సృష్టి కర్తే, వేద కర్త అయితే తప్ప!   వేదాలలోని ఎన్నో భాగాలు నశించినా, వేదం అనేది మన ధర్మ శాస్త్రాలలో, ఇతిహాసాలలో, పురాణాది గ్రంథాలలో విస్తరించి ఉంది. వాటి ద్వారా మనం వేద సారాన్ని దర్శించే అవకాశం ఉంది. భారత దేశంలో  'వేదాలు' అన్న పేరు సైతం తెలియనివారు, ఎన్నో ధర్మాలను అలవోకగా పాటించడం చూస్తూ ఉంటాం. వేదాలు అందరి జీవితాలతో విడదీయలేని సంబంధం కలిగి ఉన్నాయి. యెంత మంది తర్క వాదులు, వితండ వాదులు వేదాలను హేళన చేసినా, మన సంస్కృతిలో వేదాలు బలంగా నాటుకుపోయాయి. ప్రపంచంలోని మానవులందరూ వేదధర్మాన్ని అవలంభిస్తే శాంతి సేవాభావాలు వాటికవే ఏర్పడతాయి.  

No comments:

Post a Comment

Pages