న గురోరధికం - అచ్చంగా తెలుగు

న గురోరధికం

Share This

| న గురోరధికం |

- భావరాజు పద్మిని 
\
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమ:!
ఆశ్రయించిన శిష్యులకావహించిన అజ్ఞాన మనెడి గ్రుడ్డితనమును బాపుట కొఱకు తమకు గల సుజ్ఞానమనెడి కాటుకనలమిన పుల్లను అంతః చక్షువులకు పులిమి, తద్వారా విజ్ఞానమనే దృష్టిని కలిగించే మహిమాన్వితులు గురువులు. అట్టి గురువులకు నమస్కరిస్తున్నాను.
‘గు’ అంటే చీకటి, అజ్ఞానం. ‘రు’ అంటే వెలుగు, జ్ఞానం. తన వద్దకు చేరిన శిష్యుని మనస్సులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును చూపించే వారే గురువు. అందుకే గురువు సృష్టి. స్థితి, లయ కారులైన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణూ, మహేశ్వరులు ఏకరూపం దాల్చిన పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొనబడినారు.
భక్తుల కోరిక వలన  మానుషస్వరూపంలో(స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం) మానవులను తరింపజేయుటకోసం ఆ సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు ప్రియభక్తునిపై కృప కలిగి, భక్తుని పరిపక్వస్థితిని బట్టి, వాని పురోభివృద్ధి కొఱకు తన దివ్యత్వాన్ని గురురూపంలో వ్యక్తపరుస్తాడు. సరైన భగవదారాధన సద్గురువు సాంగత్యాన్ని కలిగిస్తుందనీ , సద్గురువు కృప వలన భగవద్దర్శనం లభిస్తుందనీ ఋషి వాక్యం.
నిజమైన గురువు ఎలా ఉంటారో అవతారపురుషుల మాటల్లో తెలుసుకుందాము.
నిరంతర నిశ్చల ఆత్మనిష్టాగరిష్టులై, అందరి యెడల, అన్నింటి యెడల, సర్వకాల సర్వావస్థల్లో, సర్వులయందు, స్థిరచిత్తులై సమదృష్టి కలిగియుండినవారే సద్గురువులని శ్రీరమణులు అంటారు.
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి -  "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" అనే పుస్తకంలో గురువు అంటే ఎవరో ఇలా చెబుతున్నారు.
“గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు దేనిలో పెద్ద?  మీరందరూ నన్ను పెరియావా, పెరియావర్ అని పిలుస్తారు. నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడు అని పేరు ఉండడం వలన మీరందరూ ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్ను పెరియావా అనీ, మహాన్ అనీ పిలుస్తున్నారు.
గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. అతను బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఞానమో విద్వత్తో ఉండనక్కర్లేదు. ఆచార్యుని వలె అతను సాంప్రదాయ, ఆచార అనుష్టానాలకు మార్గదర్శిగా ఉండనవసరమూ లేదు. అతను నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఉపదేశాలు ఇవ్వనక్కర్లేదు. ఎంతో మంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు ఉంటారన్న విషయం మనకి తెలిసనదే. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.
 తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ ఎవరైనా ఉంటే, అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.”
గురువు సాక్షాత్తు కరచరణాదులతో నడయాడే ఈశ్వరుడు. గురువు కోసం అన్వేషణ చేసేవాళ్ళు, గురు చరిత్ర చదవాలి, రోజూ పారాయణ చేయాలి, అప్పుడు గురువులు తప్పక దర్శన మిస్తారు. మనలోని పట్టుదల శ్రద్ధ, భక్తిని బట్టి గురువులు లభిస్తారు. మనసులో గురువు కొరకు తపన, పరితాపము వుండాలి. ఎంత తీవ్రముగా మన కోరిక వుంటే అంత తొందరగా మనకు దొరుకుతారు. గురువులు పర దేవతా స్వరూపము. వారి అనుగ్రహము మీ పైన కలగాలి, అంటే అంత వరకు వేచి వుండాలి.

గురుభక్తుల కధలు :

గురుపాదుకలు భక్తులకు కల్పవృక్షములు వంటివి. వాటిని సేవిస్తే సర్వశుభములు కల్గుతాయి. గురుభక్తుల చరితలను గమనిస్తే, వారి గురుభక్తి వల్ల వారు అసాధ్యమైన కార్యాలను సైతం సుసాధ్యం చేసుకున్నారని తెలుస్తుంది. ఇలా గురుఉపాసన, పద్మపాదుడు, సాధనతో దేవతలనే మెప్పించిన  దీపకుడు, ధౌమ్య మహర్షి ఆశ్రమంలో ఉండే అరుణి, ఉపమాన్యుడు వంటివారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
శంకరాచార్యుల దగ్గర ఉన్న పద్మపాదుడు తన గురువును దైవంగా భావించేవాడు. గురువాజ్ఞను వేదవాక్కుగా స్వీకరించేవాడు. పద్మపాదుడిని చూచి ఇతర శిష్యులు అసూయ చెందేవారు. అటువంటి అసూయాగ్రస్తులకు కనువిప్పు గలగాలని ఓసారి పద్మపాదుడు శంకరుడు నదికి ఇరువైపులా ఉండగా ఈ దరినుంచి ఆవైపున ఉన్న సనందుని ఇలా రమ్ము అంటున్న శంకరుని మాట వినిపించగానే పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న నదిపైన అలా నడుచుకుంటూ వచ్చేశాడు. కాని పద్మపాదుడు నదిలోవేసిన ప్రతిఅడుగుకు ఓ పద్మం పుట్టింది. ఆ పద్మాలపైనే నడుచుకుని శంకరుని దగ్గరకు వచ్చేశాడు. అందుకే సనంద అన్న నామధేయం పోయ పద్మపాదుడు అన్న నామమే స్థిరమైంది. ఇదంతా గురువు పై ఉన్న భక్తి, ఏకాగ్రచిత్తంతోనే సాధ్యమైంది.
దీపకుడి గురుభక్తి గాధను బ్రహ్మ స్వయంగా కలిపురుషుడికి వివరించారు. కలియుగారంభంలో తనవద్దకు వచ్చిన కలిపురుషుడికి, బ్రహ్మ భూలోకంలోని మానవులందరిని పతితుల్ని చేసి భ్రష్టులను చేయడమే అతని లక్ష్యమని చెప్తాడు.
కాని, వెంటనే బ్రహ్మ ఇలా అంటాడు. ''నిరం తరం ధర్మమార్గాన్ని అనుసరించెడి వారిని, తల్లి తండ్రులను సేవించెడివారిని, శివకేశవులకు బేధం ఎంచనివారిని, గోవును, తులసిని పూజించెడివారిని, గురుదేవులను భక్తితో సేవించేవారిని బాధించవద్దని" హెచ్చరిస్తాడు.
అప్పుడు కలి పురుషుడు బ్రహ్మదేవునితో "గురువంటే ఎవరు? అతని గొప్పతనమేమిటో తెలుపమని" కోరతాడు.
అప్పుడు గురుదేవుని గురించి బ్రహ్మ ఇలా వివరిస్తాడు. "గురువు అనగా అజ్ఞానమనే చీకటిని తొలగించి సుజ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః అని గురువ్ఞను స్తుతిస్తారు అని చెప్తూ గురువు సంతుష్టుడైతే త్రిమూర్తులేగాక సకలదేవతలు సంతృప్తి చెందుతారు. గురువుకు ఆగ్రహం కలిగితే త్రిమూర్తులు సైతం ఏమీ చేయ్యలేని అశక్తులవుతారు. కాని త్రిమూర్తులకు ఆగ్రహం కలిగితే దానిని శమిం పజేసే శక్తి గురుదేవునకు గలదు. సమస్త పాపరాశిని తృటిలో భస్మం చేయగలిగెడి శక్తి గురుదేవునకు గలదు" అని బ్రహ్మ గురుదేవుని గురించి పై విధంగా వివరణ నిస్తాడు.
గురుదేవుని గురించి ఎంతో ఆసక్తితో విన్న కలిపు రుషుడు గురుసేవాభాగ్యం గురించి వివరించమని బ్రహ్మను అర్థిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు. "ఎవరు శాస్త్రవిధిలో సద్గురువును కొలుస్తారో వారు ఉత్తమ శిష్యులుగా కొనియాడబడి బ్రహ్మసమానులయి భాసిస్తారు. గురుసేవాభాగ్యం చేత వారు సమస్త పుణ్యతీర్థాలను దర్శించే పుణ్య ఫలాన్ని పొందగలుగుతారు. సద్గురుదేవునికి చేసిన ఊడిగంతో పరమోన్నతమైన జ్ఞానజ్యోతిని పొందుతారు" అని చెప్తూ, గురుసేవా ఫలితాన్ని వివరించే దీపకుని వృత్తాంతాన్ని ఇలా చెప్తాడు.
''పూర్వం వేదధర్ముడనే ముని పుంగవుడు ఉండెడి వాడు, ఆయన తనశిష్యుల సేవానిరతిని పరీక్షించదలచాడు. వారిని పిలిచి, నా తపోశక్తి వలన గత జన్మల పాపరాశిని చాలా వరకు దహింపచేసుకో గలి గాను. కాని కొంతభాగాన్ని నేను అనుభవించక తప్పదు. ఆ ప్రకారం నేను కుష్టురోగిగాను, కుంటిగ్రుడ్డివానిగాను ఇరవై ఒక్కవత్సరాలు కర్మ బాధను అను భవించాలి. ఆ కాలంలో నాకు సేవలంనందించేందుకు ఎవరు ముందుకు వస్తారో చెప్పండి అని అడుగుతాడు. శిష్యులందరూ మౌనం దాలుస్తారు. వారిలో దీపకుడను శిష్యుడు అంగీ కరిస్తాడు. తదుపరి వారివ్ఞరును కాశీకి వెళ్తారు. అక్కడ గురువుకు కుష్టురోగం, కుంటితనం, అంధత్వం ఏకకాలంలో వస్తాయి. అసహనంతో ఆయన తన శిష్యుని పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించేవాడు. చీటికీమాటికీ అయినదానికి కాని దానికి ములుకుల వంటి మాటలతో దీపకుణ్ణి నొప్పించేవాడు.
అతను ఎంతో ప్రేమతో అన్నాన్ని తెస్తే దాన్ని విసిరికొట్టేవాడు. చేసే ప్రతీ సేవను ఎంచుతూ నిందించేవాడు. కాని దీపకుడు ఎంతో సహనంతో సంయమనాన్ని పాటిస్తూ శుశ్రూషలు చేసేవాడు. దీపకుని భక్తిని మెచ్చి, ఒకనాడు కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఏదేని వరాన్ని కోరుకొమ్మనమని అవకాశ మిస్తాడు. దీపకుడు తన స్వప్రయోజనార్థం తనకంటూ ఏ వరమూ అక్కర లేదని తన గురువు గారు పడెడి బాధల నుండి ఉపశమనం కావాలని కోరడానికి తన గురువు అనుమతి అడిగివస్తానని అంతవరకు వేచి ఉండమని అర్థిస్తాడు. శివుడు ఇచ్చే వరం గురించి దీపకుడు తన గురువుకు వివరి స్తాడు. అప్పుడు అతను కోపంతో ఊగిపోతూ ఇలా అంటాడు. శివుడిచ్చే వరంతో నాకు ఇప్పుడు విముక్తి లభించినా నాకర్మ శేషం మిగిలే ఉంటుంది. దానిని అనుభవించడానికి నేను మరలా జన్మ నెత్తాలి. నాకు సేవచేయడం ఇష్టంలేక నీవిలాంటి కుయుక్తిని పన్నావ్ఞ అని శిష్యుణ్ణి నిందిస్తాడు. దీపకుడు నిరు త్తరుడవుతాడు.
దీపకుని గురుభక్తి గురించి పరవశించిన మహేశ్వరుడు అతని గురించి మహావిష్ణువుకు చెప్తాడు. విష్ణుమూర్తి ఎంతో ఆనందించి దీపకుని ముంగిట ప్రత్యక్షమయి ఏదేని వరాన్ని కోరుకొమ్మంటాడు. అప్పుడు దీపకుడిలా అంటాడు. నీ దర్శనం కొరకు ఎంతోమంది ఎన్నో వత్సరా లుగా తపించిపోతూ ఉంటే నా ముంగిట కెందుకు వచ్చావు-అప్పుడు విష్ణువు ఇలా అంటాడు. గురుదేవుని సదాభక్తితో సేవించేవారంతా నాకు ప్రియులు. గురువును సేవిస్తే నన్నూ సేవించినట్లేనని వివరణనిస్తాడు. ఏదేని వరాన్ని కోరుకొమ్మనమని కోరతాడు. అప్పుడు దీపకుడు వినమ్రతతతో ఇలా అంటాడు. గురుభక్తి ఎప్పుడూ సడలిపోకుండా, అత్యంత భక్తిశ్రద్ధలతో గురుదేవులను సేవించుకొనాలనే తృష్ణ వృద్ధి చెందేలా వరాన్ని మ్మనమని కోరుకుంటాడు.ఆ వరాన్నిస్తూ విష్ణువు ఇలా అంటాడు.
"నిరంతరం అనితర సాధ్యమైన గురుసేవాభాగ్యం వలన నీవు నన్ను విశ్వనాథుణ్ణే గాక సకల దేవతలను వశం చేసుకోగలిగావు. సదుర్గువును సేవించే శిష్యులు కూడా లోకపూజ్యులేనని" విష్ణువు ప్రశంసిస్తాడు. ఈ విషయాన్ని దీపకుడు తన గురుదేవునకు తెలిపేలోగా అతనే తన నిజరూపాన్ని ధరించి తన శిష్యుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. నీవంటి ఉత్తమ శిష్యుని మూలాన నేను తరించాను. నీ గొప్పతనాన్ని లోకానికి తెలిపేటందులకే ఈ నాటకాన్ని నడిపించాను. నీ పేరును తలచుకున్న వారికి సుఖసంతోషాలు కరతలామలకమవుతాయి అని ఆశీర్వదిస్తాడు.

గురుపరంపరను స్మరించుకుందాం

ధ్యానమూలం గురోర్మూర్తి:, పూజమూలం గురో:పదం
మంత్రమూలం గురోర్వాక్యం,  మోక్షమూలం గురో:కృపా ||
భావము : ధ్యానానికి మూలం గురువు కావున గురువును ధ్యానించు. పూజకు మూలం గురు చరణాలు కావున గురుచారణాలను పూజించు. మంత్ర మూలం గురు వచనాలు, వాటిని ఆచరించు. మోక్షానికి మూలం గురువు యొక్క కృప, అనగా మోక్షప్రాప్తి కొరకు గురు కృపకు పాత్రులవ్వాలి. సరైన గురువును ఆశ్రయించి, సేవించే శిష్యుని  వంశమంతా పావనమవుతుందని, అతను నడిచే నేల పవిత్రమవుతుందని, కోటి జన్మలలో చేసిన యజ్ఞాలు, వ్రతాలు, క్రతువుల ఫలం కేవలం గురువు సంతుష్ఠుడు అయితే కలుగుతుందని, సమస్త తీర్దాలు గురుపాదుకల్లోనే ఉన్నాయని, స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ‘గురుగీత’ లో ఉపదేశించారు.
గురుభావః పరంతీర్ధం అన్య తీర్ధం నిరర్ధకం,  సర్వతీర్ధమయం దేవి శ్రీగురోశ్చరణామ్బుజం |
ఈ విధంగా ఈ పవిత్రమైన గురుపౌర్ణమి నాడు, ధ్యానం, పూజ, గురువచనాచరణ ద్వారా గురువును సేవించుకుందాము. పూజ్యులైన గురుపరంపరలోని పరమగురువులను స్మరించుకుందాము. అధర్మము, అశాంతి, క్రూరత్వము, పాప కర్మాచరణ , హింసాయుత ధోరణి కలియుగ లక్షణాలు. జిజ్ఞాసువులైన ప్రజలు  కలియుగంలో వీటిని తట్టుకొని ధర్మాచరణ అవలంభించటానికి అనుగుణంగా వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, కలియుగంలో ఆచరణకు అవసరమైనంతవరకు మాత్రమే బోధించి వేదవ్యాసునిగా ఖ్యాతి గాంచిన  వ్యాస మహర్షి కి కృతజ్ఞతలు చెప్పుకుందాం. కేవలం సద్గురువులు మాత్రమే వివరించగల మంత్రాలను మానవాళి శ్రేయస్సు కోసం శ్రీమద్భాగవతాది అష్టాదశ పురాణాలను భారత జాతికి అందించిన శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీ వ్యాస భగవానుడిని పూజించి, విష్ణు సహస్ర నామాది పారాయణ చేసి, భగవద్కృపను పొందే ప్రయత్నం ఈ గురుపౌర్ణమి రోజున చేద్దాం. తన శిష్య ప్రశిష్యుల ద్వారా నిరక్షరాస్యులైన వారికి కూడా ధర్మమంటే ఏమిటో తెలిసేటట్లు చేసి, ఆధ్యాత్మిక పురోగతికి  ఎన్నో విలువైన స్తోత్రాలను, భగవద్గీతాది శ్లోకాలకు భాష్యం చెప్పి నాలుగు దిక్కులా పీఠాలను స్థాపించి సనాతన భారతీయ సంస్కృతీ ధర్మ సాంప్రదాయాలకు రక్షణగా ఆచార్య వ్యవస్థను ఏర్పరచిన సాక్షాత్ శంకరస్వరూపం ఆదిశంకరాచార్యులను స్మరించుకుందాం. దత్తపరంపరలోని అవధూతలు, పరమగురువులకు ప్రణమిల్లుదాము. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామీ సమర్ధ, శ్రీ సాయి నాధుడు మొదలు ఇటీవల పరమపదించిన  సద్గురు శ్రీ శివానందమూర్తి  గారి వరకు సమర్ధ సద్గురువులందరినీ  మానవాళి శ్రేయస్సుకోసం ప్రార్ధించుదాం.
సమస్త వేదాలు, సమస్త దేవతలు, సమస్త తీర్దాలు, గురువులోనే కొలువై ఉంటాయి. గురువుకంటే గొప్పది ఈ లోకంలో లేదు. అందుకే గురుభక్తుల కధలను మననం చేసుకుని, వారి మార్గాన్ని అనుసరించి, అందరమూ గురుసేవా భాగ్యాన్ని పొంది తరించే ప్రయత్నం చేద్దాం.
న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః   || శ్రీ గురుభ్యోం నమః – శ్రీ గురుచరణం శరణం శరణం ||

No comments:

Post a Comment

Pages