సమస్య మనది - సలహా గీతది - అచ్చంగా తెలుగు

సమస్య మనది - సలహా గీతది

Share This
సమస్య మనది - సలహా గీతది 
 - చెరుకు రామమోహనరావు

ఏపనికైనా ఆరంభము ఒకటుంటుంది. ఒక పని చేయుటకు పాత్రత అత్యవసరము.అట్లని accident అయితే ambulance కొరకు కాచుకొని ఉండము కదా. ఎదో ఒక విధంగా ఎవరో ఒకరు ఆస్పత్రి చేర్చినట్లు నేను గీతా ప్రాశస్త్యము తెలిపే ఈ పనికి పూనుకొన్నాను. మన సందేహాలకు ఎటువంటి సమాధానాలు గీత సమకూర్చుతుందో చూస్తాము. నిజానికి నాకు యోగ్యత లేదు, ఈ ధర్మాన్ని కాపాడవలెనను తపన తప్ప. నా తప్పుకు ఒప్పుకు దేవుని బాధ్యునిగా చేసి తిప్పలు తప్పించుకొని తిన్నగా విషయానికి వస్తున్నాను. సమస్య మనది -- సలహాగీతది అన్నపేరుతో నేను శృంఖలగా ఆనన గ్రంధములో వ్రాయుచున్న నన్ను చి.కుం.సౌ. భావరాజు పద్మిని అచ్చంగా తెలుగు ఈ-పత్రిక లో శృంఖలగా ప్రచురించితే బాగుంటుందనుటతో నేనూ వల్లె యని అన్నాను. సమస్య మనది--సలహా గీతది అన్న పేరు పెద్దదౌతుందని ఆమె చెప్పడముతో శీర్షికను గీత -- అధీత ! గా మార్చడము జరిగినది. ఆ రచనకు ఈపేరు బాగున్నదని పెద్దలైన బ్ర.శ్రీ.వే. చొప్పకట్ల సత్యనారాయణ గారు బ్ర.శ్రీ.వే. గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పుటతో ఈ పేరును నిశ్చయించినాను. వారికి మనసా వచసా శిరసా కృతజ్ఞతలు. గీత-అధీత!అంటే స్థూలముగా గీత చదివినారా ! చదవకుంటే చదివి మీ సందేహాలు తీర్చుకొండి అన్నది సందేశము. ప్రస్థాన త్రయము అన్న పేరు మనము విన్నదే కానీ ఆ మూడు ఏవి అని బహు సూక్ష్మముగా స్పృశించుదాము. మనము ఈ దేశములో పుట్టినందుకు నిజముగా గర్వపడవలె. ఈ భూమి మహనీయులకు ఆలవాలము, మహాత్కార్యములకు ఆలవాలము, మానవత్వమునకు ఆలవాలము, మంజుభాషణమునకు ఆలవాలము, మమతానుబంధములకు ఆలవాలము.సకల వేద, వేదాంగ, వేదాంత సారమును విశ్వ కళ్యాణము కొరకు విస్తృతముగా వివరించిన వివరించిన ఘనత మన ఋషులది. ఆహార నిద్రా భయ మైధునాది పాశవిక తత్పరత కతీతముగా తనకున్న బుద్ధిని సంపాదించిన జ్ఞానమును ఉపయోగించి జీవన ప్రస్తానమునకు అనగా బయలుదేరుటకు , ఎక్కడికి అంటే వచ్చిన చోటికి, వలయు వివరములను విశ్వమానవ కల్యాణమునకై వివరణాత్మకముగా విపులీకరించినారు. " ప్రతిష్ఠంతే అనే నేతి ప్రస్థానంబ్రహ్మసూత్రములు." అంటే మార్గము అనే అర్థము.ఆ వివరణలే ప్రస్తాన త్రయములు.' త్రి ' అంటే మూడు అని అందరకూ తెలిసినదే! అందులో మొదటిది ఉపనిషత్తు. ఇది ఒకటి కాదు. ఇన్ని అని ఇదమిద్ధంగా చెప్పనూలేము. కానీ మన సౌలభ్యము కొరకు ముక్తికోపనిషత్తులో 108 ఉపనిషత్తుల పేర్లను తెలియబరచినారు. ఈ 108 లో చివరిది ముక్తికోపనిషత్తే . 'ఉ' అంటే వద్ద అని 'ప' అంటే పదములు లేక పాదములు నిశతి అంటే కూర్చునుట. అంటే జిజ్ఞ్యాసువు గురువు పాదముల చెంత కూర్చుని పరతత్వము తెలుసుకొనుట అని అర్థము. ఇక రెండవది బ్రహ్మసూత్రములు. సూత్రము అంటే త్రాడు అనే అర్థమే కాకుండా సూచించేది అనే ఒక అర్థము ఉన్నదని విజ్ఞులు చెప్పగా విన్నాను.ఇవి బ్రహ్మ స్వరూపమును సూచించుతాయి కాబట్టి వీనికి బ్రహ్మ సూత్రములు అన్న పేరు సార్థకమైనది. బ్రహ్మ తత్వాన్ని ఉపనిషత్తులు శ్రవణ రూపములో బోధించితే బ్రహ్మ సూత్రములు 'మనన' రూపములో బోధించుతాయి."శ్రోతవ్యో మన్తవ్య " అని ఉపనిషత్తులే చెబుతున్నాయి.ఇక మనన తరువాత మిగిలినది 'ఆచరణ'.దానిని తెలిపేదే మూడవదియైన 'భగవద్గీత.' ఈ భగవద్గీత భవ తారకము . ఆలకించినా,ఆలపించినా ఆచరించితే అవ్యయ పదము అందుకోవడమే! లౌకికముగా మన ధర్మ సందేహాలకు భగవద్గీత చెప్పే పరిష్కారమార్గాలు గమనించూదాము అనుసరించుదాము. ఆనందమును పొందుతాము. రేపు సమస్య - సలహా తో కలుస్తాము. సమష్య మనది -- సలహా గీతది -- 1 భగవద్గీత, బైబిలు ఖురాన్ ల వంటిది కాదు. అది జీవితపు చీకటిలో కరదీపిక. ఇహపరాల విజ్ఞాన వేదిక. సమస్య: నేనేమో సర్వ సన్నద్ధమైనాను. చివరి నిముసములో అది నిరుత్సాహామో భయమో నన్నావరించింది. పని జరుగుతుందన్న నమ్మకము సన్నగిల్లింది. నాకు ఏమీ తోచుట లేదు. సలహా : నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. ఆత్మస్థైర్యము అన్నది ఆచరణకు ఆభూషణము. పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టు. నీ కార్య సాఫల్యమునకు అదే ఉడుము పట్టు. ఇక్కడ ఉడుము ను గూర్చి రెండు మాటలు చెబుతాను. పూర్వము పెద్ద పెద్ద బురుజులుగల కోట పైకి శత్రు సైనికులు .చేరాలంటే బలమైన మోకుకు (అంటే పురి గల చేంతాడు లాటిది.) ఉడుము ( బహుశ ఒక విధమైన తాబేలు లాగా ఉంటుందేమో !) ను కట్టి పైకి విసరితే అది కోట గోడ రెండవ వైపునకు ఎంత గట్టిగా అతుక్కుపోయేదంటే , ఆ తాడు కోయవలసిందే గానీ అది పట్టు విడిచేది కాదు. అందువల్ల పట్టుదలను ఉడుమునకు పోలుస్తారు. ఇక భయమును గూర్చి. బాల్యములో వీధి కుక్కలు వెంటబడితే కరుస్తాయేమోనన్న భయం తో పరుగెత్తే వాళ్లము. అప్పుడు , ఇల్లు చేరిన పిదప మా అమ్మమ్మ చెప్పేది " నీవు పరిగెత్తటం వల్ల అవి నిన్ను వెంబడిస్తున్నాయి నీవు స్థిమితపడి నెమ్మదిగా నడువు ,అవి నీ జోలికి రావు. ఆమాటే నా జీవితపు రాచబాట అయ్యింది. ఈ వాస్థవము పరీక్షకై నిరీక్షించే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఇంతటి విషయాని రెండు పంక్తులలో భగవద్గీత ఎంత హత్తుకోనేవిధంగా చెప్పిందో చూడండి . సమరమునకు సర్వ విధములా సమాయత్తమైన తరువాత పాప భీతి యను భ్రాంతి లో మునిగిన బీబత్సునితో కృష్ణు డిట్లంటున్నాడు. క్లైబ్యం మాసమ గమః పార్థ నైతత్వయ్యు పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్విష్ఠ పరంతపా తగని సమయమున తలపులు మారెను నపుంస తత్వము నరముల నిండెను దుర్బలత్వమును దూరముచేయుము పరంతపా అదె పరమోత్కృ ష్టము (స్వేచ్ఛానువాదము) ఇక్కడ పార్థ అని పరంతప అని రెండు సంబోధనలు కృష్ణుడు అర్జనునకు వాడుచున్నాడు. మొదటిదానికేమో, పృథ కుమారుడు (అంటే కుంతీదేవి మరోపేరు పృథ ) అన్నది ఒక అర్థమైతే , వేరొక అన్వర్థములో పార్థివ మైన శరీరము, అంటే మట్టిలో కలిసిపోయేది, కలిగిన అర్జునా ! అని. అంటే మానవులమైన మనమందరమూ ఎదో ఒకరోజు మన్నులో కలిసి మిన్ను జేరవలసిందే అని అన్వయాత్మకముగా చెబుతున్నాడు. అంటే లేనిపోని వ్యథలు వ్యామోహాలు పెట్టుకోకు. చేయవలసిన పనిని సాకులుచేప్పి తప్పించుకోజూడకు, అని హెచ్చరించుచున్నాడు. ఇక పరంతపా అన్నది రెండవ సంబోధన. యుద్ధభూమిలో వున్నారు కాబట్టి, అర్జనుడు వీరాధి వీరుడు కాబట్టి, శత్రువులను తపపింపజేసే వాడా అంటున్నాడు. అంటే అతని సామర్థ్యము అతనికి గుర్తు చేస్తున్నాడు. దీనినే కదా పాశ్చాత్యులు counselling అనేది. మన దేశములో ఎన్ని వేల సంవత్సరములనుండి ఉన్నదో గమనించండి. అందుకే తన పంచ రత్న కీర్తనలలో త్యాగయ్య 'సమయానికి తగు మాటలాడి' అన్నాడు. విద్యర్థుల విషయములో , ధైర్యము నింపటము తల్లిదండ్రుల బాధ్యత. ఏదయినా interview కు వేల్లెసమయములో ఈ శ్లోకము గుర్తుంచుకొంటే ఎంత ధైర్యమిస్తుందో ఎంత ధైర్యమోస్తుందో చూడండి. ఏ పని ప్రారంభాములోనైనా ఈ శ్లోకము ఒక శిలా శాసనము. సమస్య మనది -- సలహా గీతది -- 2 సందేహం :నేను ఎంతో బాగా చదివినాను. ఏల వ్రాస్తానో అని భయం. మా ఉపాధ్యాయులు చెప్పిన ప్రశ్నలు వస్తాయో రావో నారాత ఎట్లుందో?సమాధానం : మొదట పాఠశాలలో పాఠములు చెప్పే teacher కు ఒక 'గురువు'కు గల తేడా గమనించు . teacher పాఠ ము చెప్పి ముఖ్యమైన ప్రశ్నలు వాని సమాధానాలు చెప్పడముతో తీరి పోతుంది. గురువు బాధ్యత అది కాదు. గురు అనే మాటకు ఆంగ్లములో ఎన్ని అర్థములున్నాయో చూడండి. spiritual teacher, teacher, tutor, sage, counsellor, mentor, guiding light,spiritual leader, leader, master acharya, pandit; swami, Maharishi. అంటే ఒకే వ్యక్తిలో ఈ గుణాలన్నీ వుంటే అతను గురువౌతాడు .గురువుకు వయోభేదము ఉండదు. శంకరాచార్యులవారు తన శిష్యుడైన సురేశ్వరాచార్యులకన్న (పూర్వాశ్రమములో శంకరులతో వాగ్వాదమున ఓడిపోయిన మండన మిశ్రులవారు ) చాలా చిన్న వారు. కృష్ణ పరమాత్మ అర్జనునికి బావ అంతకుమించి గొప్ప మిత్రుడు. సాందీపని బలరామ కృష్ణుల కన్నా వయసులో చాలా పెద్దవాడు .వీరు మువ్వురు గురువులే . శిష్యులకన్న చిన్న,సమాన, పెద్ద వయసు కలిగిన వారు. గురుత్వము అంటే నేను సాంద్రతకు అన్వయించు కొంటాను. అహంకారము మాని ఆలోచన పెంచితే గురువు దొరకడము దుర్లభము కాదు. గురువుకు కేవలము విద్య చెప్పుటేగాక నడవడిక, సంభాషణా చతురత, పరిశీలన, ఒకటేల అన్నీ కలిగి తన శిష్యునికి నేర్పుచూ అతనికి ఆపద కలుగకుండా గూడా కాపాడుకొంటాడు. మనలో లేని మంచి గుణములు కలిగిన వ్యక్తిని మనము విచక్షణతో ఎన్నుకోగాలిగితే చాలు. అటువంటి గురువు అర్జనునకు మిత్రుని రూపములో దొరికినాడు కాబట్టే ఆయన కృష్ణుని గురువుగా చేసుకొన్నాడు . పైన తెలిపిన విధమైన ప్రశ్న, శ్రీకృష్ణునితో వేస్తున్నాడు. కార్పణ్య-దోషోపహత-స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ-సమ్ముఢ-చెతః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రుహి తన్మే శిష్యస్తె ‘హం శధి మాం త్వాం ప్రపన్నం భగవద్గిత 2-7 దాయాల జంపగ దయ అవరోధము చొరబడకున్నవి శౌర్యము ధైర్యము దేహిని, ఎద సందేహము ప్రబలెను 'కిం కర్తవ్యం' కృష్ణా తెలుపుము (స్వేచ్ఛానువాదము) బంధువర్గమును పరిమార్చలేని ఒక నిస్సహాయ స్థితిలో వున్నాను.ఆ దోషముచే నా శౌర్యము డిల్ల పడి పోయినది.చిత్తము మొత్తము ధర్మసందేహమున తగుల్కొన్నది.నీ శరణు తప్ప నాకు గత్యంతరము లేదు.నన్ను శాశింపుము అంటున్నాడు పార్థుడు. అది ఛాత్రుని లక్షణం.గురువు ఛత్ర ఛాయలో ఉండేవాడు ఛాత్రుడు.ఆ నమ్మకమే గురువును ప్రేరేపించి డోలాయమనములో వున్న శిష్యుని నావను కష్టాల కడలినుండి గట్టెక్కిస్తుంది.అదే జరిగింది ఆఖరుకు. అర్జనుడే అమితానందకందళితుడై ఈ విధంగా అంటాడు. నష్టో మొహః స్మృతిర్లబ్ధా త్వత్-ప్రసాదాన్మయాచ్యుత స్థితొ స్మి గత-సందెహః - కరిష్యే వచనం తవ 18 - 73 జ్ఞాతి మోహమును జ్ఞానము దునిమెను కర్తవ్యము నాకవగత మయ్యెను శంక తీర్చితివి, శత్రుల జంపగ ఆనతి నివ్వుము ఆప్త రక్షకా (స్వేచ్ఛానువాదము) హే కృష్ణా నా సందేహాలన్నీ పటాపంచాలయిపోయినాయి.నా బాధ్యత నాకు గుర్తుకొచ్చింది . నీ మాట నాకు వేదము. నేను నీ ఆజ్ఞానువర్తిని. దీనినిబట్టి గురువు మీద ఎంతటి నమ్మకము కావలెనో , గురువుకు తన శిష్యుని మనఃక్లేశమును దీర్చి కార్యోన్ముఖుని జేయ ఎంత దీమంతుడై వుండవలెనో తెలుస్తుంది. ఇక మార్కులు వాటికవే వస్తాయి. ఏపనికైనా ధైర్యము స్థైర్యమే ప్రధానము. అవి గురువునుంdi లభించితే ఆ శిష్యునికిక అడ్డేముంది. అంటే తన శిష్యుని గ్లాని తొలగించి అతనిని కార్యోన్ముఖుని చేయాలంటే గురువు కూడా ఎంతో శ్రమించ వలె. ఇక్కడ తల్లి , లేక తండ్రి కూడా గురువు కావచ్చును. స్నేహితుడు కూడా గురువు కావచ్చును. సమ్యక్ పరిశీలన అవసరము. అదే జరిగితే ఆ అనుబంధము ,ఆప్యాయత, ఆత్మీయత, అంతఃకరణ , అనురాగము పరస్పరము వున్న ఎవరైనా గురు శిష్యులు కావచ్చును. నేటి సమాజమున అటువంటి గురువుల ఆవశ్యకత ఎంతయోనున్నది. శ్రద్ధ సమయము జత చేరితే సాధించుట కష్టము కాదు. సాంగత్యము సక్రమమైతే సత్ఫలమునకు కొదువలేదు. ధ్యాన మూలం గురోర్మూ ర్తిః పూజ మూలం గురోర్పదం మంత్రం మూలం గురోర్వాక్యం మోక్ష మూలం గురోర్కృపాః (భావము సులభగ్రాహ్యము) ************************* (మరికొన్ని వచ్చే సంచికలో...)

No comments:

Post a Comment

Pages