ఉసిరి ఆవకాయ - అచ్చంగా తెలుగు

ఉసిరి ఆవకాయ

Share This

ఉసిరి ఆవకాయ

- ఉషారాణి నూతులపాటి 


జనవరి వచ్చిందంటే పచ్చళ్ళ సీజను మొదలైనట్లే.. చాలా మంది “మేం పచ్చళ్ళు మానేసాం .ఆరోగ్యానికి అస్సలు  మంచిది కాదు” ..అంటూనే మార్కెట్ లో దొరికే రెడీమేడ్ పచ్చళ్ళు కొనుక్కుంటారు. మన ఆంధ్రులకి (ఇప్పుడు ఇలా అనకూడదు కదూ..అరరే..) అదే ..మన తెలుగువారికి పచ్చడి లేనిదే ముద్ద దిగదు అని సామెత ఉండనే ఉంది కదా..అయినా అతి ఏదైనా ప్రమాదమే..మితముగా తిని మన పెద్దలు ఎంత ఆరోగ్యంగా ఉండేవారనీ.. అయినా బోలెడు డబ్బులు పోసి , ఎప్పుడో ,ఎక్కడో పెట్టి బాటిల్స్ లో అమ్మే పచ్చడికన్నా.. అమ్మ పెట్టిన కమ్మని ఊరగాయ ఎప్పటికీ మిన్నే..మనచేత్తో చేసుకోవడం కష్టమేమీ కాదు కూడా..కొద్ది ప్రయత్నం , మరికొద్దిగా సమయం కేటాయిస్తే  అద్భుతమైన ఊరగాయ సిద్ధం .ఇప్పుడు ఎక్కడ చూసినా ఉసిరికాయలె..మంచి సీజన్ . చిలకపచ్చ రంగులో నోరూరిస్తూ ..ఉసిరికాయ లో ‘సి’ విటమిన్ బాగా ఉంటుంది.ఆరోగ్యానికి చాలా మంచిది .ఆకలి పుట్టిస్తుంది .పచ్చడి పెట్టినా అందులోని ‘సి’ విటమిన్ నశించదు. అందుకే చేసి చూడండి.. కావలసిన పదార్ధాలు : ఉసిరికాయలు – పావు కిలో , ఎర్రని పచ్చడి కారం (త్రీమాంగోస్  బ్రాండ్ ) 100 g, ఉప్పు 100 గ్రా. ,మెంతి పొడి (మెంతులు ఎర్రగా వేయించి పొడి కొట్టుకోవాలి )25 గ్రా., ఆవపొడి 20 గ్రా.,ఇంగువ ఒక చెంచా, కరివేపాకు ఒక రెమ్మ . (ఇష్టమైన వారు వెల్లుల్లి వేసుకోవచ్చు . 100 గ్రా, వెల్లుల్లి.), పల్లీ నూనె పావుకిలో . చేయువిధానం : ఉసిరికాయలు బాగా కడిగి ,తడిలేకుండా తుడిచి ,పావుగంట గాలికి ఆరనివ్వాలి. స్టవ్ వెలిగించి కొంచం వెడల్పుగా వున్న ,మందమైన పాన్ / పాత్రను ఉంచి ,పల్లీ నూనె తీసుకున్నదానిలో సగం వేసి ,కొద్దిగా వేడి అయ్యాక ,ఉసిరికాయలు నెమ్మదిగా వేయాలి. ఒకసారి కలిపి ,చిన్నమంట మీద మూత పెట్టి మగ్గ నివ్వాలి.మాడకుండా చూస్తూ మగ్గించాలి .మరీ మెత్తగా కాకుండా కాయమీద స్పూన్ తో వత్తితే కాయ విడిపోతుంది. అప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఉసిరికాయలను ఒక్కొక్కటి చిదిమి ,గిన్జతీసేయాలి. చాలామంది గింజలతో కాయను అలాగే ఆవకాయగా పెడతారు. దానివల్ల కొద్దిరోజులకు ,కాయ ముడుచుకొని గట్టిగా అవుతుంది. గింజలు తీసేస్తే పచ్చడి త్వరగా నల్లబడదు కూడా. గింజలు తీసేసి ,అందులో ఉప్పు,కారం ,చిటికెడు పసుపు, మెంతి పొడి,ఆవపొడి కలపాలి.అన్నీ కలిసేలా బాగా కలిపి పక్కనపెట్టి , తిరగమోత వేయాలి. పాన్ లో మిగలిన నూనె వేసి వేడెక్కిన తరువాత అరచెంచా ఆవాలు,జీలకర్ర , కరివేపాకు ,ఇంగువ ,ఇష్టమైతే కచ్చాపచ్చా గా దంచిన వెల్లుల్లి కూడా వేసి , పచ్చడిలో వేయాలి. నూనె కాస్త ఎక్కువగా పైన తేలుతున్నట్టుగా ఉంటేనే పచ్చడి బావుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని,తింటే ...నేను చెప్పను బాబూ...

No comments:

Post a Comment

Pages