వంశీ - వెన్నెలబొమ్మ - అచ్చంగా తెలుగు

వంశీ - వెన్నెలబొమ్మ

Share This
​                వంశీ - వెన్నెలబొమ్మ   పుస్తక పరిచయం
రమాదేవి

వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబరు 20 న పుట్టి అక్కడే పెరిగాడు. వంశీ ​రచయితగా అందరికి తెలిసినా తెలియకపోయియినా చాలా మందికి సినిమా డైరెక్టరుగా తెలుసు..వంశీ  1974 నుండి కథలు వ్రాస్తున్నా మా పసలపూడి కథలు వల్ల రచయితగా గుర్తిపు వచ్చింది...వంశీని రచయితగా అందలం ఎక్కించినవి మా పసలపూడి కథలు, మా దిగువ గోదావరి కథలు, ఆకుపచ్చని జ్ఞాపకం, వంశీకి నచ్చిన కథలు, ఆనాటి వాన చినుకులు. ఆ తరువాత ఆతను వ్రాసిన నవలలు వెన్నెలబొమ్మ, రవ్వలకొండ,​మంచుపల్లకి, మహల్లో కోకిల, గోకులంలో రాధ, గాలికొండాపురం రైల్వేగేటు, వెండితెరనవలలు తిరిగి ఎమస్కో ప్రచురణలతో అందరికి చేరువైనాయి. వంశీ సినిమాల్లో అతనిలోని రచయితను, అతని రచనల్లో పాత్ర చిత్రీకరణలో  సినిమా డైరెక్టరును చూడడం సహజంగా మొదలైంది. అందుకే అతని సినిమాలకి, అతని నవలలకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వంశీ - వెన్నెలబొమ్మ మొదటి ప్రచురణనప్పటికి వంశీ డైరెక్టరుగా సినిమా రంగంలో స్థిరపడలేదు.(​దర్శకుడిగా ఆయన మొదటి సినిమా1982లో చిరంజీవి, సుహాసిని,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా)​. ఈ నవల మొదట 1978 లో, తిరిగి  2001లో స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది,ఎమస్కో వారు 2007 లో ప్రచురించారు. కథా పరిచయం: శృతి అందరికి తెలిసిన ఒక ప్రఖ్యాత సినీతార. అందరి దృష్టిలో ఆమె తప్పిపోయిన కొడుకు కోసం ఆరాట పడుతున్న ఒక తల్లి, ఆ ఆరాటం కొందరికి అర్ధరహితంగా కనిపిస్తే, మరి కొందరికి ఆ ఆరాటాన్ని తమ వ్యాపారానికి ఆయుధంగా కనిపిస్తుంది. తన పిల్లవాడు ఎవరైనా ఎక్కడైనా కనిపించాడు అని చెప్పగానే అందులో నిజమెంతా అని ఆలోచించడానికి కానీ, అనుమానించడానికి గానీ ఆమె  సిద్దంగా లేదు. అపుడు ఆమె ఒక ప్రముఖ నటి కాదు, కొడుకు కోసం ఆరాటపడే తల్లి మాత్రమే.. కానీ అందలం ఎక్కినా ఈ నటి పుట్టుకతో అద్బుత ప్రపంచాన్ని చూడలేదు... తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసింది.. ​​            శృతి గత చరిత్ర తెలిసింది అతి తక్కువ మందికి అందులో ఒకరు రిపోర్టర్ చైతన్య. శృతిగా మారక ముందు ఆమె పేరు చెంచమ్మ. తండ్రి మరణంతో బిచ్చగత్తె గా ఉన్న ఆమె బ్రతుకు మరింత హీనంగా దుర్భరంగా మారుతుంది.అక్కడ ఉన్న సిమ్మడు, కుష్టు శరబయ్య అందితే ఆబగా అందుకుందామనుకునే వారే! తప్పుడు పని చేయబోయిన శరభయ్యను కొట్టి అక్కడినుండి పారిపోయింది... అగమ్యగోచరమైన ఆమె బ్రతుకులో ఒక రోజు సాయంత్రం ఆదారిన ఒక వ్యక్తి చూసి తన గదికి రమ్మని..జుట్టుని చిందర వందర చేసి శిలలా నిలబడమని... పన్నెండు గంటలు  నిల్చోబెట్టి డబ్బు ఇచ్చి పంపాడు..కొన్ని గంటల్లో ఆమె రూపాన్ని తన కాన్వాస్ పై బంధించి " ముష్టి " అని పేరు పెట్టాడు..  ఒకనాడు రిపోర్టర్ చైతన్య ఆమెను చూసి కాన్వాసుపై బొమ్మ తనదే అనుకున్నాడు, చెంచమ్మ గురించి వివరాలు అడిగాడు తన బ్రతుకుతున్న వైనం, అందులో బాధలు ఆర్టికల్ గా రాశాడు. అది ఒక ఆదివారం అనుబంధం పేజీలో చైతన్య రాసిన ఆర్టికల్ అందులో పది ఫోటోలు రక రకాలుగా చెంచమ్మ ఫోటోలు అచ్చు అయ్యాయి.. అవి చూసి  ఆర్ట్ సినిమాలు మమకారంతో ఒక నిర్మాత తన ​"బిచ్చగాళ్ళ కథ" సినిమాకు ఆమెను  హిరోయిన్చేసాడు . ​            ఆ సినిమా  అనుకోని  కారణాలతో విడుదల కాకపోవడంతో, మళ్ళీ ఆమె పరిస్థితి మొదటికి వచ్చింది. ముష్టి దానిగా మారలేక, సినిమాలలో వేషాలు దొరక్క.. ఒక జూనియర్ ఆర్టిస్ట్ గుంపులో ఒకదానిగా కాలం గడిపేస్తుంది. అలాటి ఒడిదుడుకుల్లో జీవితమే ముగించాలనుకున్న రోజుల్లో మళ్ళీ పేపర్లలో చెంచెమ్మ ఫోటోలు, సంగ్రహంగా వివరాలు... "బిచ్చగాళ్ళ కథ" చిత్ర సమీక్షా ప్రచురించాడు చైతన్య , అపుడే ఆమె పేరు చెంచమ్మ నుండి శృతిగా మారింది. ప్రముఖ నటిగా పేరుపొందిన శృతిలోని ఆవేదన ఆరాటంతో వెన్నెల బొమ్మ నవల మొదలవుతుంది ఇలా....వెన్నెలబొమ్మ మొదటి పేజిలో, (నవల అట్ట వెనుక పేజీలో) ఏమంటున్నారంటే.....    ”గుండెలమీద కాలిన సిగరెట్‌ మచ్చ పెద్దమచ్చలా ఉంటుంది. ఎఱ్ఱటికళ్ళు- తెల్లటి ఒళ్ళు- తొమ్మిదేళ్ళు. ఈ గుర్తులున్న అబ్బాయి మీకెక్కడైనా కన్పించాడా అయ్యా!” చెన్నై సిటీ స్లమ్‌ ఏరియాలో అప్పుడప్పుడూ ఒక ఎయిర్‌కండిషన్డ్‌- మారిస్‌  కారు అగుతుంది. అందులోంచి దిగిన ​​ఒక ప్రఖ్యాత సినీతార, ఆ క్షణాన ఆమెకి తారసపడ్డ ప్రతీ ముష్టివాణ్ణీ- మురికివాణ్ణీ- కుష్టువాణ్ణీ అలా ప్రశ్నిస్తుంది. వాళ్ళు తెలీదన్నాక, నిరాశతో తిరిగి వెళ్లిపోతుంది.
***
”యూ బ్లడీ బాస్టర్డ్‌. నా బాబుని నాకు కాకుండా దూరం చేస్తావా? జాగ్రత్త! ఆరవసారి జైలు కెళ్ళగలవ్‌. ఇంకా నిలబడ్డావేం. పోరా ఫో… ఫో…” అలా అవమానిస్తుందామె. ఆమె ఒక పాపులర్‌ సినీస్టార్‌. పేరు చాలా అందంగా ఉంటుంది. ”శృతి”. ఆమె మాటల్ని మౌనంగా భరిస్తున్నాడతను. ”నీక్కాదూ చెప్పేది? వెళ్ళు… అసలు వాణ్ణి ముట్టుకునే హక్కూ- అర్హతా యెవరిచ్చారు నీకు?” ”అది కాదు శృతీ!” ”ఇంకేం చెప్పకు. వెళ్ళు. తియ్యటి విషానికి కేంద్రానివి నువ్వు. ఆ గరళాన్ని నువ్వు పనిచేసే ఆ పత్రికలో రాసుకో. ఫో. నా బాబుని కాస్సేపు తనివితీరా చూస్తాను ఫో… ఫో…” మౌనంగా బయటికొచ్చేశాడతను. అతని పేరు చైతన్య. జర్నలిస్టు. ఆమెదీ, అతన్దీ చాలా ఏళ్ళ సంబంధం. రాసుకుంటే అదో పెద్ద ఉద్గ్రంథం.
*****
​​​మిలటరీ పనిచేసే తండ్రి, అందమైన తల్లి, అయినా కూతురు ముష్టి పిల్లగా మారి ... ముష్టిపిల్ల జీవితం నుండి కాన్వాసు పై రంగుల చిత్రమై.. ఒక సినిమాలో పాత్రధారిగా మారి.. మళ్ళీ ముష్టి జీవితంలోకి వెళ్ళలేక బ్రతుకు పోరాటంలో విధి వంచిత అయ్యి, బిడ్డను వదిలించుకున్న తల్లిగా మారి. తనకు జీవితమే వద్దు అని తనువూ చాలించాలి అనే తీర్మానించుకున్న ఆమెకు ఒక రిపోర్టర్ వ్రాసిన ఒక పత్రిక సమీక్ష సినిమా రంగానికి రహదారిగా మారి పెద్ద హిరోయిన్ గా మారి... వదిలించుకున్న బిడ్డ కోసం చేసిన బ్రతుకు పోరాటంలో​ .. ​ ఆమె పోగొట్టుకున్నది ఏమిటో...  అన్ని పోగొట్టుకుంటే ..మరి ఆమె అందుకున్న వెన్నెల బొమ్మ ఏమిటో ............... ఒక స్త్రీ జీవితాన్ని, అద్బుతంగా మనసుని తాకేలా అందించిన నవల ....​ వంశీ - వెన్నెలబొమ్మ చదివి తెలుసుకోవాల్సిందే... ​వంశీ - వెన్నెలబొమ్మ ... ఎమెస్కో ప్రచురణలు ఆన్లైన్ లో గాని, విశాలాంద్ర బుక్ హౌస్ లోను మరియు అన్ని ప్రముఖ పుస్తక సంస్థలో  కూడా దొరుకుతుంది.    

No comments:

Post a Comment

Pages