' కళాతపస్వి ' విశ్వనాథ్ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

' కళాతపస్వి ' విశ్వనాథ్ గారితో ముఖాముఖి

Share This

' కళాతపస్వి ' విశ్వనాథ్ గారితో ముఖాముఖి 

- భావరాజు పద్మిని
విశ్వనాథ్ గురించి చెప్పాలంటే సంగీత స్వరం... " శంకరాభరణం"  గురించి చెప్పాలి. మనిషి విలువల మధ్య నుంచి జనించిన " సప్తపది"  గుర్తుకు రావాలి. కళల కలయిక... " సాగరసంగమం"  ఆకళింపు చేసుకోవాలి. కల్మషం లేని ప్రేమ " స్వాతిముత్యం" తో జత కట్టాలి. కళ గొప్పతనాన్ని ఆవిష్కరించే " స్వర్ణకమలం"... స్వరప్రవాహ సిద్ధమైన " స్వరాభిషేకం", శృత్వమైన సరిగమల " శృతిలయలు" ... ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలు సంగీత భాండారాలు, విలువల వేదాలు. సినిమాలకు ప్రబంధ గౌరవాన్ని అందించిన ఆ కళాతపస్వి... కాశీనాథుని విశ్వనాథ్ గారు, ‘అచ్చంగా తెలుగు’ కోరాగానే మనతో ముచ్చటించేందుకు అంగీకరించారు.... వారితో ముఖాముఖి మీరూ చదవండి... 

 నమస్కారమండి. కళ పట్ల మీ అభిరుచి చిన్నతనం నుంచే అలవాడిందా ? మీ స్వగ్రామం, బాల్యవిశేషాలను గురించి చెబుతారా ? 
చిన్నప్పటి నుంచి అభిరుచి ఉంది అని చెప్పి, మభ్యపెట్టవచ్చు. నిజానికి అటువంటిది ఏమీ లేదు. నాకు చిన్నప్పటి నుంచి హోదా ఉండే, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగం చెయ్యాలని ఉండేది. కాని డిగ్రీ తర్వాత ఇండస్ట్రీ కి సౌండ్ రికార్డిస్ట్ గా వచ్చాకా, నేను చాలామందితో పని చేస్తూ, కొందరిని గమనిస్తూ, కొన్ని గుర్తుపెట్టుకుంటూ, బాగా ఆకళింపు చేసుకున్నాను. ఎప్పటికైనా రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా, వివక్షత ఉన్న సినిమాలు తియ్యాలన్న ధ్యేయాన్ని ఏర్పరచుకున్నాను. చివరికి అది సంగీతసాహిత్యాల మీదకి, నృత్యం మీదకి దారి తీసింది. సిరిసిరిమువ్వ దగ్గరనుంచి, అటువంటి సబ్జెక్టులే ఎన్నుకుని, వెనక్కి తిరిగి చూడకుండా, ఈ తరానికి  మన సంప్రదాయంలోని గొప్పని, మాధుర్యాన్ని తెలియచేయ్యాలన్న ఒక పట్టుదల కలిగింది. ఆ కోవలోవే పైన మీరు చెప్పిన సినిమాలన్నీ. మా స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దపులివర్రు గ్రామం. సరైన రోడ్లు కూడా లేని, ఆ గ్రామ నేపధ్యంలో కళల పట్ల అంతగా అభిరుచి ఉండేది కాదు. మా మేనమావల నుంచి నాకు ఈ అభిరుచి అంతర్లీనంగా సంక్రమించిందేమో, అనిపిస్తుంది. 
మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగిందండి ? 
నేను B.Sc పూర్తి  చేసిన తార్వాత, మద్రాస్ లో వాహిని స్టూడియోస్ ప్రారంభిస్తున్నారు, అందులో ట్రైనీలుగా చాలా మంది యువకుల్ని అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ తీసుకుంటున్నారు, అని మా బంధువులు నాన్నగారికి చెప్పారు. బి.ఎన్.రెడ్డి గారు మా నాన్నగారికి యజమానే , నాన్నగారు అక్కడే పనిచేసేవారు ! అలా నేను వాహినీ స్టూడియో లో చేరాను. తర్వాత మిగతా కాలం రికార్దిస్ట్ గా చేసాను. 
వాహినీ స్టూడియో కె.బి. రెడ్డి గారు, బి.ఎన్.రెడ్డి గారు, ఆదుర్తి సుబ్బారావు గారు వంటి మహనీయుల గురించి చెబుతారా ? 
చెప్పడానికి ఏముందండి ? సూర్యుడి గురించి చెబుతారా, చంద్రుడి గురించి, బ్రహ్మ గురించి చెబుతారా, అన్నట్లు ఉంటుంది. వారంతా సినీదిగ్గజాల వంటివారు. వారంతా సొంత పంధాల్లో నిష్ణాతులు. ఏదో సినిమా తీసెయ్యాలి అనుకోకుండా సినిమాను ఒక తపస్సులా చేసినవారు. ఒక స్క్రిప్ట్ అంటే ఇలా ఉండాలి, ఇన్నాళ్ళు పనిచెయ్యాలి, కష్టపడాలి, మ్యూజిక్ సిట్టింగ్స్ కు, కధకు ఓపిగ్గా కూర్చోవాలి, అన్న దృక్పధంతో ఒక యజ్ఞం  చేస్తున్నట్టే పని చేసేవారు. మంచి క్రమబద్ధమైన వ్యక్తులు. వారి కృషి ఫలితంగా వచ్చిన ఫలాలే ఆ అద్భుతమైన సినిమాలు. 
 వీరి ప్రభావం మీపై ఎంతవరకు ఉంది ? 
అంతర్లీనంగా ఉంటుంది. నిర్దిష్టంగా వారిని అనుకరించాలని కాదు. మక్కీకి మక్కి దించడం కాకుండా   నూతనంగా ఆలోచించి, మన పంధాలో తియ్యాలి. 
సౌండ్ రికార్డింగ్ నుంచి దర్శకత్వం వైపు ఎలా వచ్చారు ? 
నేను సౌండ్ లో స్టూడియో టెక్నీషియన్ గా పనిచేస్తున్నప్పుడు, డైరెక్టర్స్ కి కొన్ని సలహాలు ఇచ్చేవాడిని. ఆ రోజుల్లోనాలోని ఆ సృజనాత్మక ఆసక్తిని గమనించిన దుగ్గిపాటి మధుసూదనరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ సంస్థకు రమ్మని , స్టేజి వర్క్ చేసేవారు కావాలని అభ్యర్ధించారు. అలా యాదృచ్చికంగా ఇందులోకి రావడం జరిగింది. కొన్నాళ్ళు ఆదుర్తి గారికి అసోసియేట్ గా పనిచేసాను. మూగమనసులు కు అసిస్టెంట్ డైరెక్టర్ గా నన్ను ఎన్నుకున్నారు. ఆత్మగౌరవం తీసిన తర్వాత నేను బైటకు వచ్చేసాను. 
మూగమనసులు సినిమా మీకు ఎలాంటి అనుభవం ఇచ్చిందండీ ? 
చాలా మంచి సినిమా. ఒక సబ్జెక్టు మీద ఆర్టిస్ట్ లకు ఇష్టం ఉండి, వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తే, ఫలితం ఎలా ఉంటుందో నేను మూగమనసులు సినిమా ద్వారా చూడగలిగాను. వాళ్ళు సరిగ్గా టైం కు వచ్చి, తయారయ్యి రామా, పాట తియ్యాలి కదా, మళ్ళీ సూర్యాస్తమయం అయిపోతుందేమో అని వాళ్ళే ఆరాటపడేవారు. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు చాలా అంకితభావంతో పనిచేసేవారు. అందుకే ఆ సినిమా అంత విజయవంతమయ్యింది. 
సుడిగుండాలు స్క్రీన్ప్లే అప్పట్లో సంచలనం అంటారు. దీని గురించి చెబుతారా ? 
ఇలా మీరు అయిపోయిన ప్రోడక్ట్ గురించి అడుగుతుంటే... (నవ్వి) నేనింత కష్టపడ్డాను, గడ్డాలు మీసాలు పెంచుకున్నాను అని చెప్పలేను కదా ! అది సుబ్బారావు గారి సృష్టి , వెనకాల మనం ఉత్సవ విగ్రహాల లాగా పనిచెయ్యడమే ! అది నాక్కూడా ఇంటరెస్టింగ్ సబ్జెక్టు కాబట్టి, నన్ను కూడా డార్జిలింగ్ తీసుకెళ్ళి, స్పేర్ టైం లో నేను దానికి పనిచేసేలా ఆయన చేసుకున్నారు. చాలా గొప్ప సినిమా అండి. 
 మీ తొలి అడుగు ఆత్మగౌరవానికి నంది అవార్డు లభించింది కదా ! అప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు ? 
సినిమా డైరెక్టర్ అయ్యాను గనుక, ఒక అవార్డు వస్తే మురిసిపోవడం, డబ్బా కొట్టుకోవడం అన్నది నాకు ఎప్పుడూ లేదు. పద్మశ్రీ, నంది అవార్డులు, వెంకయ్య అవార్డు ఫిలిం ఫేర్ అవార్డులు వంటి ఎన్నో అవార్డులు నాకు వచ్చాయి. మన శ్రమను గుర్తించి వారు ఇచ్చారు తప్ప, నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన పని మనం చేసుకుంటూ పోవడమే, ఫలితం ఆయనకు వదిలెయ్యడమే ! 
హీరోఇజం నుంచి తెలుగు సినిమాను కధాగమనం వైపు మరల్చారు. ఇది అనుకోకుండా జరిగిందా ? ఎలా సాధ్యమయ్యింది ? 
అనుకోకుండానే జరిగిందండి. అంటే సినిమా కధ ఆలోచించేటప్పుడు ,రెండు విధాలుగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. ఫలానా ఆర్టిస్ట్ అందుబాటులో ఉన్నారు, అతనికి తగ్గ కధ చెప్పడం అనేది ఒక పధ్ధతి. ముందే కధను ఎన్నుకుని, దానికి తగ్గ ఆర్టిస్ట్ లను ఎన్నుకోవడం రెండవ పధ్ధతి. అలా సోమయాజులు గారు, చంద్రమోహన్ వంటి వారిని అందరినీ నిర్మాతల వెసులుబాటు బట్టీ , అవసరాన్ని బట్టీ ఎన్నుకున్నాము. చిరంజీవి వంటి ఆర్టిస్ట్  తీసినప్పుడు అతని ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకు తియ్యాలి, అలా తీసినవి శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు వంటివి. నావరకూ కధలు ఇలాగే ఎన్నుకున్నాను. 
ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కధ, సీతా మహాలక్ష్మి – ఇలా ప్రతి సినిమా ఒక సామాజిక అంశాన్ని, స్త్రీల జీవితాలను ఆవిష్కరించాయి. ఈ పాత్రల ఆవిష్కరణ వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా ? 
నేను మనిషి జీవితంలో ‘స్త్రీ’ కి చాలా ప్రత్యేకమైన పాత్ర ఉందని నమ్ముతాను. ఒక స్త్రీ లేక శక్తి లేకపోతే పురుషుడు ఎందుకూ పనికిరాడనే గట్టి నమ్మకం ఉంది. అందుకని స్త్రీ ని గ్లోరిఫై చేస్తూ, విమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్టు లు నేను ఎక్కువ ఆలోచించుకుని, పేర్లు కూడా అందుకు తగ్గట్టే పెడతాను. జీవనజ్యోతి, శారద, ఓ సీత కధ అన్నీ స్త్రీపై నాకు ఉన్న గౌరవంతో రూపుదిద్దుకున్నవే ! 
సిరిసిరిమువ్వ తర్వాత మీ సినిమాల తీరే మారిపోయింది (కళ వైపు మళ్ళింది), ఇందుకు కారణం ఏమిటి ? 
ఇది దానంతట అదే జరిగింది. నాకు సంబంధించినంత వరకు సంగీతం, నృత్యం అనేవి సినిమాకు హీరో, హీరొయిన్ ల వంటివి. వీటికి పెద్ద పీట వెయ్యాలన్న సంకల్పం ఎప్పుడైతే కలిగిందో, కధలు అవే పుట్టాయి. అప్పుడప్పుడే పైకొస్తున్న జయప్రదతో సిరిసిరిమువ్వ తీసాను, అలాగే మిగతావి. 
శంకరాభరణం సినిమా ఒక పెద్ద సాహసం అని అంటారు. అది తీసేటప్పటి మీ మనోభావాలు ఎలా ఉన్నాయి ? 
నాకు అలాగేమీ అనిపించలేదు. నిర్మాతలకు కధ నచ్చడం ప్రధానం అని నేను నమ్ముతాను. అంతా దాదాపు కాస్త పేరున్నవారు, లేక కొత్తవారే. అల్లురామలింగయ్య వంటి వారు సైడ్ కారెక్టర్స్ కదా ! అలా చేసిన సినిమా అది. విశ్వనాథ్ గారితో బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్న అనుబంధం గురించి చెబుతారా ? 
మాకు రక్త సంబంధం ఉండండి. అతను మా కజిన్. అలాగని పాడించలేదు. అతను సంగీతం నేర్చుకోకపోయినా, మంచి ప్రతిభ ఉన్నవాడని, నేర్చుకుని పాడగలడని నా నమ్మకం. అందుకే శంకరాభరణం పాటలన్నీ అతనితో పాడించాను. 
 మీ సినిమాల్లో పాటలన్నీ కూడా సూపర్ హిట్లే ! సంగీతం పట్ల మక్కువ ఎలా కలిగింది ? 
నేను సౌండ్ డిపార్టుమెంటు లో పనిచేసాను కదా ! అందుకే, చెవికి ఒక మెలోడీ అలవాటు అయ్యింది. అంతే తప్ప నాకు సంగీత జ్ఞానం లేదు. రికార్దిస్ట్ గా పనిచెయ్యడం వల్ల, అనేకమంది పాటలు విని ఉండడం వల్ల, మెలోడీ మనసులో ఉండిపోయింది. నా టేస్ట్ కూడా అలాంటిదే. మొదటి నుంచి కూడా ఈ గందరగోళాలు, ఈ టప్పాటప్పాలు ఇవన్నీ కూడా నేను భరించలేను. అంచేత, నా వ్యక్తిగత అభిరుచే, నా సినిమాల్లో కూడా కనిపిస్తుంది. 
మీ పాటల సూర్యచంద్రులు వేటూరి, సిరివెన్నెల గార్లు. అసలు వారిలో అంత గొప్ప ప్రతిభ ఉందని, మీరు ఎలా గుర్తించారు ? 
‘శ్రీకాకుళం చిన్నది’ అన్న రేడియో షో చేసిన వేటూరి, సినిమా పాటల అవకాశాలు వెతుకుతూ మద్రాస్ వచ్చారు. ఆ రేడియో ప్లే వినగానే, నాకు ఆయన విద్వత్తు తెలిసింది. వేటూరికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఉన్న పదపొంకం, భావం వంటివి ఉన్నాయని అర్ధమయ్యింది. ఒకసారి ఒక అవసరం దృష్ట్యా సీతారామశాస్త్రి గారిని తీసుకు రావడం జరిగింది. ఇద్దరూ మంచి ప్రతిభ ఉన్నవారు. 
మీరు తీసిన అన్ని సినిమాలు వేటికవే ప్రత్యేకం. మీరు బాగా ఇష్టపడే సినిమా ఏది ? 
ఏదీ అలా లేదండి. ఒక కళాకారుడు నిత్య అసంతృప్తితో ఉండాలి. ఇదే పరాకాష్ట అని అనుకోకూడదు. మంచివి ఎక్కువ , తప్పులు తక్కువ ఉండడం వల్ల, అది అలా వెళ్ళిపోయింది అనుకుంటాను. అంచనాలు ప్రేక్షకులకే వదిలేస్తాను. 
నటుడిగా మీరు బాగా ఇష్టపడి చేసిన పాత్ర ఏమైనా ఉందా ? 
లేదండి, కేవలం అదొక హాబీ క్రింద చేసాను. అవసరానికి ఆపద్ధర్మంగా శుభసంకల్పం సినిమాలో నటించమని బలవంతపెట్టారు. అందరూ అది చూసి, మంచి నటుడు అన్నారు. నేను నిజమే కాబోలు అనుకున్నాను. నేను చాలా సాధించేసాను అని నేను ఎప్పుడూ అనుకోను. 
నాటికీ, నేటికీ సినిమారంగంలో వచ్చిన ప్రధానమైన మార్పు ఏమిటండి ? 
మేమింకా పాతకాలం వాళ్ళమే నండి. మీరే మార్పు ఏమిటో చెప్పాలి. అందరితో మారకపోతే మనకు ఉనికి లేదు అన్న భయం నాకు లేదు. నాపద్దతి నేను పెట్టుకుని, ఆచరిస్తున్నాను. 
 విశ్వనాథ్ స్థాయి దర్శకులు తెలుగు సినిమాకు మళ్ళీ దొరకరు, అని మేము నమ్ముతాము. ఆ సినిమాల కాలం ఒక స్వర్ణయుగమని మేము భావిస్తున్నామండి... 
అలాగే అనుకోండమ్మా . మాకు అదే ఆశీర్వాదం . చాలా సంతోషమండి. మీ అమూల్యమైన కాలాన్ని, మా చదువరుల కోసం అందించినందుకు కృతజ్ఞతాభివందనాలు. విశ్వనాథ్ గారితో నా ముఖాముఖి ని క్రింది లింక్ లో వినండి... 
    

No comments:

Post a Comment

Pages