తెలుగు వారి సోగ్గాడు–శోభన్ బాబు - అచ్చంగా తెలుగు

తెలుగు వారి సోగ్గాడు–శోభన్ బాబు

Share This
తెలుగు వారి సోగ్గాడుశోభన్బాబు
-         పరవస్తు నాగసాయి సూరి ( చాణక్య )

తెలుగుతెరపై చెరగని ముద్రవేసిన సోగ్గాడు..శోభన్ బాబు. మహిళలు నచ్చిన మెచ్చిన నాటితరం నటుల్లో అగ్రస్థానం ఈయనదే. ఆంధ్రుల అందగాడిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నా.. కథకే ప్రాధాన్యమిచ్చిన అరుదైన నటుడాయన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది నటుల్లో శోభన్ బాబు ఒకరు. అసలు పేరు... ఉప్పు శోభనాచలపతిరావు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా శోభన్ బాబు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన పోషించే పాత్రల్లో ఉదాత్తమైన భావాలు, సహజత్వం తొణికిసలాడేవి. శోభన్ బాబుకు చిన్నప్పట్నుంచే సినిమాలంటే మక్కువ. హైస్కూలు రోజుల్లో శోభన్ బాబుకు నాటకాలపై అభిరుచి ఏర్పడింది. గుంటూరు AC  కాలేజీలో పునర్జన్మ వంటి విశిష్ట నాటకాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. పాతాళభైరవి, మల్లీశ్వరి, దేవదాసు వంటి చిత్రాల స్ఫూర్తితో సినిమా రంగంలో అడుగుపెట్టారు. దైవబలం చిత్రంతో తెరంగేట్రం చేసిన శోభన్ బాబుకు... భక్తశబరి, నర్తననశాల, భీష్మ, బుద్దిమంతుడు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. వీరాభిమన్యు చిత్రంలో ఆయన పోషించిన అభిమన్యుడి పాత్ర జననీరాజనాలందుకుంది. తొలినాళ్లలో పొట్టిప్లీడరు, పుణ్యవతి వంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అయినా ఈ ఆయన వెనకంజవేయలేదు. చెల్లెలికాపురం, దేవాలయం, కళ్యాణమంటపం, మల్లెపువ్వు చిత్రాలు ఆయన సినీరంగంలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపకరించాయి. వరుసగా కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తున్న శోభన్్బాబుకు మానవుడు-దానవుడు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణంలో శ్రీరాముని పాత్రలో ఒదిగిపోయాడు... ప్రేక్షకుల్ని భక్తిరసంలో ఓలలాడించాడు. అనంతరం 80వ దశకంలో మహిళా ప్రేక్షకులు శోభన్్బాబుకు బ్రహ్మరథం పట్టారు. దేవత, పండంటి కాపురం, కార్తీకదీపం చిత్రాలే ఇందుకు ప్రధాన కారణం. భగ్నప్రేమికుడిగా సైతం ఆయన నటన ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. గాలివానలో వాననీటిలో అనే పాటలో ఆయన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అప్పట్లో అందంగా ఉన్న కుర్రాళ్ళని శోభన్ బాబుతో పోల్చడం పరిపాటిగా మారింది. ఈ ఒక్కమాట చాలు మహిళాహృదయాల్లో ఈ అందగాడి స్థానమేమిటో. మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి మొగ్గుచూపే భేషజాలు లేని వ్యక్తిత్వం... శోభన్ బాబు సొంతం. అగ్రహీరోలు, NTR , ANR, కృష్ణతో కలసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. పూలరంగడు, బుద్ధిమంతుడు, మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు వంటి మల్టీస్టారర్ చిత్రాలు నటభూషణుడి ప్రతిభకు తార్కాణాలు. ప్రేమికుడి పాత్రల్లోనే కాకుండా ఊరిపెద్ద పాత్రల్లోనూ ఆయన నటన ప్రేక్షకుల మెప్పును పొందింది. బలరామకృష్ణులు సినిమాలో ఊళ్లో వాళ్లని గడగడలాడించే ఊరిపెద్ద పాత్రలో శోభన్ బాబు నటన ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, ఐదు నంది అవార్డులు, ఎనిమిది సినీగోయర్స్ అవార్డులు   శోభన్ బాబు కీర్తికిరీటంలో కలికితురాళ్లు. 1970లో విడుదలైన బంగారుపంజరం చిత్రానికి ఆయనను జాతీయ ఉత్తమ నటుడిగా స్వర్ణకమలం వరించింది. నటనకు అవార్డులతో పనిలేదు ప్రేక్షకుల నీరాజనాలే గొప్పబహుమతని ఆయన చెబుతుంటారు. 220కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు శోభన్ బాబు. 1996లో విడుదలైన హలో... గురూ ఆయన చివరి చిత్రం. ఎన్నటికీ ప్రేక్షకుల మదిలో అందాల హీరోగానే ఉండిపోవాలని భావించిన ఈ అందగాడు ఆ తర్వాత 30 ఏళ్ల నటజీవితానికి స్వస్తి చెప్పి... చెన్నైలో కుటుంబసభ్యులతో ప్రశాంత జీవనాన్ని గడిపారు. 2008 మార్చి 20న అనంతలోకాలకు పయనమయ్యారు శోభన్ బాబు. భౌతికంగా  దూరమైనా..  అద్భుతమైన చిత్రాలతో ఆయన ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా సజీవంగానే ఉంటారు.  

No comments:

Post a Comment

Pages