ధనుర్మాసం - అచ్చంగా తెలుగు
ధనుర్మాసం
- ఎకో గణేష్

అంతరిక్షం మొత్తాన్ని 360°గా, 12 రాశులుగా విభజించింది జ్యోతిష్య శాస్త్రం. అందులో సూర్యుడు ప్రతి రాశిలోకి ప్రవేశించే సమయాన్నే సంక్రమణం అంటారు. సూర్యుడు ఒక్కో రాశిలో నెలరోజులు ఉంటాడు. అలా మనకు ఒక ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. అలా సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో మొదలవుతుంది ధనుర్మాసం. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం ఇది. అన్ని పండుగులు చంద్రమానం ప్రకారం చేసుకున్నా, ధనుర్మాసాన్ని సౌరమానం ప్రకారం పాటిస్తాం. ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేది తిరుప్పావై, ఆండాళ్ అమ్మవారు, రంగవల్లులు, గొబ్బెమ్మలు. ఆండాళ్ అమ్మవారు ఈ మాసంలో శ్రీ కృష్ణుడి గురించి వ్రతం చేసి ఆయన్ను చేరుకున్నారు. కలియుగంలో 93వ సంవత్సరంలో శ్రీ ఆండాళ్ తమిళనాట శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనంలో విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) లభించారు ఆండాళ్ అమ్మవారు. తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం, తండ్రి ఆమెను కోదా అని పిలిచేవాడు, క్రమేపి ఆపేరే గోదాగా మారింది. తండ్రిపెంపకంలో ఆమెకు కృష్ణ పరమాత్మ పట్ల గొప్ప భక్తి అలవడింది. కాలక్రమంలో ఆమె కృష్ణుడినే తన పతిగా భావించింది. తన తండ్రి కృష్ణుడికి తులసి మాలలు సమర్పించేవారు, గోదాదేవి విష్ణుచిత్తులవారికి తెలియకుండా ఆ మాలలు తాను ధరించి, తను భగవంతుని వివహామాడటానికి సరిపోదునా అని చూసుకుని, మురిసిపోయి, తన తండ్రికి తెలియకుండా ఆ మాలలను యధావిధిగా బుట్టలో ఉంచేది. ఒకనాడు తండ్రికి మాలలో వెంట్రుక కనిపిచగా, అది గోదా ధరించిందని గ్రహించి, ఒకరు ధరించిన మాలను స్వామికి సమర్పించడం తప్పని సమర్పించలేదు. ఆ రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి, తనకు గోదా ధరించిన మాల అంటే ఇష్టం అని, అది ఎందుకు సమర్పించలేదని ప్రశ్నిస్తాడు. ఆ సంఘటనతో గోదాదేవి కారణజన్మురాలని అర్ధం చేసుకుని, మమ్మల్ని కాపాడుటకు వచ్చావని, ఆమెను ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టారు విష్ణు చిత్తుడు. అప్పటినుంచే రోజు ఆండాళ్ సమర్పించిన మాలనే స్వామికి సమర్పించేవారు. గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరుని వెదకటానికి సిద్ధమవ్వగా, ఆమె కృష్ణుడిని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్తుంది. కాని తండ్రి కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని, అది చాలదూరము, కాలము కూడా వేరని, ఇప్పుడు కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్తారు. విష్ణుచిత్తులవారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల వైభవాన్ని కీర్తించగా, గోదాదేవి శ్రీరంగంలో ఉన్న రంగనాయకులని తనకు వరునిగా తలచింది. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను "తిరుప్పావై" మరియు "నాచియార్ తిరుమొఱ్ఱి" అనే దివ్యప్రభంధాలను పాడారు. ఆ తర్వాతా ఆమె శ్రీ రంగనాధుని వివాహమాడి, ఆయనలో ఐక్యమైంది. ఆండాళ్ అమ్మవారు చేసిన ఆ గానాన్ని ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవదేవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు. శైవాలయాల్లో ఇదె సమయంలో తిరువెంబావైని గానం చేస్తారు. హిందూ ధర్మం అంటే విశ్వధర్మం, మనిషి విశ్వానికి అనుగుణంగా బ్రతకడం జీవించడమే, ఆఖరున విశ్వాత్మలో ఐక్యమవడమే ఈ ధర్మం యొక్క లక్ష్యం.ధనుర్మాసం హేమంత ఋతువులో వస్తుంది. ఈ సమయానికి భారతదేశంలో చలి విపరీతంగా ఉంటుంది, పొగమంచు కారణంగా సూర్యుడి కిరణాలు భూమిని అధికంగా చేరలేవు, ఫలితంగా అరుగుదల, ఇతర జీవక్రియలు నెమ్మదిస్తాయి. అదే ఆకులు రాలి ప్రకృతి మొత్తం కళావీహినమైన కారణం చేత మనసుని జడత్వం, బద్దకం ఆక్రమిస్తాయి.  ఈ ధనుర్మాసంలో వ్రతం ఆచరించేవారు ఉదయం వేకువజామునే లేచి పూజ ముగించి సూర్యోదయానికి పూర్వమే భగవంతునికి నివేదన చేయడం కూడా పూర్తి చేయాలి. ప్రతి రోజు ఒక్కో ప్రత్యేకమైన వంటకం ఉంటుంది, పులగం, కట్టెపొంగలి, చక్రపొంగలి, పరమాన్నం, పులిహోర ఇలా అన్నమాట. వాటిలో ఏఏ పదార్ధాలు వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎంత వేయాలో కూడా ముందే నిర్ణయించారు పెద్దలు. ఇందులో ఆయుర్వేద శాస్త్రం ఇమిడి ఉంది. మిరియాలు, శొంఠి, ధనియాలు, ఇంగువ మొదలైనవి ఉపయోషితారు. ఇవి ఔషధగుణం కలిగినవి. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను అరికట్టే శక్తి వీటికి ఉంది. ఇవే కాక దద్దోజనం కూడా వండుతారు. అసలు సూర్యోదయానికి ముందే నివేదన పూర్తి చేయాలన్న నియమం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఇది చలికాలం, పగలు తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. సూర్యాస్తమాయం తర్వాత 1-2 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనైన రాత్రి భోజనం ముగించాలి, అప్పుడే ఆహారం అరిగి, ఆరోగ్యంగా ఉండగలం. హేమంత ఋతువులు సూర్యాస్తమయం సాయంత్రం 5:30లో అవుతుంది. అంటే 7:30 లోపు రాత్రి భోజనం ముగించాలి. ఆ తర్వాత ఏమి తిన్నా అరగడం కష్టం. రాత్రి సమయం ఎక్కువ కావడం చేత ఉదయం సూర్యోదయం 6:30 కు అటుఇటుగా అవుతుంది. ఉదయం 8:30 కు ఉదయం భోజనం చేస్తామనుకున్నా, మధ్యలో 13-14 గంటల సమయం జీర్ణవ్యవస్థ ఖాళిగా ఉంటుంది. ఇంతసేపు ఖాళీగా ఉంటే, కడుపులో గ్యాస్ ఏర్పడి కొత్త రోగాలు వస్తాయి. కనుక ఇది ఆలోచించిన ఋషులు ఉదయమే అందరూ స్నానాలు ముగించి సూర్యోదయానికల్లా పూజ ముగించమన్నారు. సూర్యోదయం అవ్వగానే ఆహారం స్వీకరించవచ్చు కనుక ఈ ప్రసాదంగా చేసిన ఔషధవంటకాలను భుజిస్తారు. దద్దోజనం వంటివి గ్యాస్ ఏర్పడకుండా హరిస్తాయి. ఉదయం పరగడుపున ఏది స్వీకరిస్తమో, దాన్ని శరీరం పూర్తిగా స్వీకరిస్తుంది. ఔషధ తత్వాల ఆహారం స్వీకరిస్తే, రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇక రంగవల్లుల విషయానికి వస్తే చెట్లు ఆకులు రాలి, లోకమంతా చాలా అందవీహినంగా కనిపిస్తుంది, ఇది మనసుపై దుష్ప్రభావాన్ని చూపి, డిప్రెషన్‌కు దారితీస్తుందని ఆధునిక మానసిక వైద్యులు చెప్తారు. అందుకే విదేశాల్లో హేమంతఋతువులో కలైడోస్కోప్ (అనేక చిత్రదర్శినీ) చూస్తు సమయం గడపని అక్కడి వైధ్యులు గట్టిగా చెప్తారు. కానీ మనకు ఆ బాధలేదు, ఋషులు గొప్పవారు. ఒక వ్యక్తికి కాదు, సమస్త లోకానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తారు కనుక అందరిని ఈ కాలంలో రంగవల్లులు వేయమన్నారు. ఆ చిన్న కలైడోస్కోప్ గోట్టంలో కనిపించే రంగులు, భారతదేశంలో ప్రతి చోట నెలంతా కనిపిస్తాయి. అన్ని రంగులను ఒకేసారి చూడటం చేత మనసులో ఒక విధమైన ఉల్లాసం, ఉత్తేజం కలిగుతుంది, మానసిక ఆరోగ్యం బాగుతుంటుంది. అలాగే సూర్యరశ్మి ఈ రంగవల్లుల మీద పడినప్పుడు, పరివర్తనం చెందిన కాంతి కిరణాలు ఈ కాలంలో వచ్చే కొన్ని రకాల రుగ్మతులను హరిస్తాయి. ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇలా చెప్పుకుంటూ పోతే, ధనుర్మాసం గురించి అనేకానేక విషయాలు, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవచ్చు.   

No comments:

Post a Comment

Pages