మాతృత్వంలోని అనేక కోణాలను ఆవిష్కరించిన అమ్మ కథలు
-బెహరా వెంకట లక్ష్మీ నారాయణ
సముద్రాల్లోని నీటినంతా సిరాగా మార్చి వ్రాయగల్గినా.....అమ్మ గురించి విపులంగా వర్ణించడం సాధ్యం కాదేమో. మాతృత్వంలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తూ ..17 కథలుగా కొంతమంది అమ్మల గురించి , అమ్మతనం వ్యధలను బాధలను మధురిమలు అక్షరబద్ధం చేసిన రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారి కథా సంకలనం- అమ్మ కథలు. ఓపికగా వినగల్గితే, శ్రద్ధగా కదిలిస్తే, ప్రతి అమ్మ తలపుల్లోనూ కోటి కథలుంటాయి. కన్నీటి వెతలు కొన్నయితే తర్వాత తరాలకు ఊతంగా నిలిచే అనుభవాల పుటలు మరికొన్ని కావచ్చు. అమ్మకు నీరాజనాలర్పిస్తూ అక్షర సుమమాలగా ఉమాదేవి అందించిన ఈ సంకలనంలో, అమ్మ అంటే తెలుసుకోవల్సింది ఎంతుందో అనే భావనతో పాఠకులను కంట తడిపెట్టించే కొన్ని కథలతో పాటు జోహార్లతో కైమోడ్పులర్పించ తప్పదనిపించే మణిపూసల్లాంటి కథలు కూడా ఆసాంతం ఆర్ద్రతతో చదివిస్తాయంటే అతిశయోక్తి కాదు. తన స్వంత బిడ్డలను సాకడమే భారమైన వలస కూలీ తల్లి ఒడిలోకి అనుకోకుండా చేరిన దిక్కులేని పసికందును తానే పెంచాల్సి వచ్చిన ఓ లచ్చిమి పాత్రతో నడిచిన కథ –బతుకమ్మ. ఆ బిడ్డ తనదికాకున్నా పెంచుకున్న మమతానుబంధంతో బిడ్డను వదల్లేక పడే ఆరాటం, వదిలేసిన తల్లి విపత్కర పరిస్థితిని తల్లి మనస్సుతో అర్ధం చేసుకని చల్లగా బతుకమ్మా అంటూ దీవించిన లచ్చిమి మానసిక సంఘర్షణా అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే, నీడనిచ్చే చల్లటి చెట్టులా తనను తాను కుటుంబం కోసం కరిగించుకున్న ఓ వెంకటమ్మ కథ. కొడుకు ఆవు కోసం తనకు సర్వస్వమైన కడియాలమ్మేసి కొడుకు కళ్ళల్లో వెలుగు నింపిన ఘంటాలమ్మల్లో అమ్మ కు నిర్వచనాలను చూపగా, ఈ సంకలనంలో కమ్లి కథ నాగరిక సమాజానికి తెలియని మరో వన్య సమాజంలోని పేదల దుర్భర జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. సరిగా నడిచేందుకు తోవల్లేని మారుమూల ప్రాంతాల్లో నివశించే అమాయకపు గూడెం వాసుల జీవితాలను మూఢనమ్మకాలు ఎలా ప్రభావితం చేస్తాయో..అక్కడ అమ్మలెదుర్కొనే అగచాట్లు ఎలాంటివో కమ్లి కథలో ప్రస్ఫుటం కావడంతో పాటు కన్నపేగు బంధం తల్లి ప్రాణం నిలిపిన తీరు కంటచెమ్మగిల్లచేస్తుంది. తన విద్యా విజ్ఞానం పేదలకు ఉపయోగపడాలని, డబ్బు సంపాదించే యాంత్రిక జీవనం తాను సహించలేనంటూ ఓ లేడీ డాక్టర్ చివరకు తనకు నచ్చిన బాటలోకి ఎలా మళ్ళగల్గిందో, అమ్మల కోసం ఎలాంటి త్యాగాలకు సిద్ధపడిందో వివరించిన –కొత్త చిగుళ్ళు కథ ఆకట్టుకుంటుంది.తన పిల్లలకు భవిష్యత్ లో అచ్చట్లు ముచ్చట్లు కొరత రానివ్వకూడదనే తపనతో సమాజం బంధుగణం ఎన్ని నిందలు వేసి అపార్ధం చేసుకున్నా , భర్తకు దూరమై సుమంగళిగా మిగిలిన ఓ అమ్మ అంతరంగ విశ్లేషణతో సాగిన-మనస్విని కథ ఈ సంపుటిలో హైలెట్గా నిలిచింది. తాళికట్టిన వాడు సంసారం పట్ల ఎలాంటి జవాబుదారీ లేకుండా నేరస్తుడై జైలుపాలైతే ఓ కుటుంబం బడ్డ వ్యథతో నడిచిన ఏ దరికో..అనే కథ మన ముందు ఓ సవాల్ ను విసురుతుంది. తాము చేయని నేరానికి సమాజం చేత అపహాస్యం పాలై కష్టాలనెదుర్కొంటూ జీవనసమరంలో ఉక్కిరిబిక్కిరైన ఆ నేరస్తుడి బార్యాపిల్లలు వేసే ప్రశ్నలకు ఇంకా ఎక్కడా జవాబులు పుట్టనట్లే.అలాగే, ఇంకా ఇందులో సహాన, మోతి, అమ్మంటే, చిన్నారి తల్లి కథలు కదిలిస్తాయి. ఆడపిల్లలు పుడ్తే అరిష్టమనుకునే మూర్ఖపు అత్తగారికి బుద్ధిచెప్పి తన సమస్య నుంచి బయటపడ్డమే కాకుండా ఆరళ్ళ నుంచి తోటికోడళ్ళను కూడా గట్టెక్కించిన ఓ పల్లెపడుచు గడుసుదనంతో చెప్పిన కథ- భూదేవి-భేష్ అనిపిస్తుంది. పరిసరాల్లో తటస్థపడే సంఘటలను నిశితంగా పరిశీలించే నేర్పు గల రచయిత్రి సమ్మెట ఉమాదేవిగారు వాటిని కథలుగా మలచి పాఠకులకు అందించడంలో మరింత నేర్పును ప్రదర్శించడం పలువురి అభినందనలందుకుంది.
రచయిత్రి గురించి--- కథను ఎంతమేరకు చెప్పాలో తెలియడంతో పాటు , తెలిసిందంతా కథగా చెప్పాలనే తాపత్రయం లేనందున మంచి కథల రచయిత్రిగా ఉమాదేవి పాఠకుల గుర్తింపు పొందారు- జగన్నాధ శర్మ( నవ్య సంపాదకులు) కథను ఎలా ప్రారంభించి ఎక్కడ ముగిస్తే రంజింపచేస్తుందో అవగాహన గల రచయిత్రి, శిల్పం పట్ల పరిణితి సాధించి తన కథానికల్ని అనభూతి ప్రధానంగా వెలువరించడంలో ఉమాదేవి దిట్ట- విహారి( ప్రముఖ రచయిత)
శ్రీ మతి సమ్మెట ఉమాదేవి సాహితీ ప్రస్థానం -------------------------------------------------- ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయనిగా ఉద్యోగం చేస్తున్నారు. . నాలుగేళ్ళ పాటు ఖమ్మం పాపులర్ చానెల్ లో న్యూస్ రీడర్ గా కొన్ని విద్య సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పని చేసిన వీరు ఖమ్మం జిల్లా సాకేతపురి ఉత్సవాలు నిర్వహించిన సందర్భం లో శ్రీ బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు అందుకున్నారు. ఇప్పటిదాక ఎనభయికిపైగా కథలు వ్రాయగా మనస్విని, నేను సైతం,సకుటుంబం అన్న కథలకు, నడుస్తున్నచరిత్ర మాస పత్రిక నుండి బహుమతులు, అమ్మ తల్లి, బతుకమ్మ గిరి కాన దీపం కథలకు , నవ్య వార పత్రిక నుండి వివిధ బహుమతులు లభించాయి..కమ్లి అన్న కథకు, బ్రౌన్ సంస్థ వారి సాహితీ ప్రస్తానం పత్రిక నుండి బహుమతి, అమ్మంటే కథకు రంజని సంస్థ వారి, ద్వితీయ బహుమతి పొందారు అయ్యో పాపం అన్న కథకు, సంస్కృతీ అంతర్జాల పత్రిక వారి, ద్వితీయ బహుమతి, వారధి అన్న కథకు ఉపాధ్యాయ మాస పత్రిక వారి, తృతీయ బహుమతి . బిజిలి అన్న కథకు, ఉపాధ్యాయ మాస పత్రిక వారి, ద్వితీయ బహుమతి . కళ్యాణ వైభోగమే అన్నహాస్య కథకు, స్వాతి వార పత్రికలో 10000 రూపాయల బహుమతి, అస్తిత్వం అన్న కథకు, నోముల సత్యనారాయణ గారి కథా బహుమతి లభించింది. జనవరి2014 లో అమ్మ కథలు అన్న కథల సంపుటి వెలువడింది . సహకార పద్దతిన వెలువరిస్తున్న మా కథలు 2012. 13 కథల సంపుటాల్లోనూ, లేఖిని సంస్థ, వేదగిరి రాంబాబుగార్ల సమన్వయంలో నూరుమంది రచయిత్రుల రచనలతో వెలువడ్డ దీపతోరణంలోనూ, రంజని సంస్థ వారు వెలువరించిన స్వర్ణ రంజనిలోను, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ వారు వెలువరించిన కథల సంకలనం ఆశా దీపంలోను వీరి కథలు, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ వారు వెలువరించిన చిగురంత ఆశ కవిత ల సంకలనం లో కవిత చోటు చేసుకున్నది. అల్లరి కావ్య.. కలసి తిందాం.. పిల్లి ముసుగు.. నిజాయితి అనే చిన్న పిల్లల కథల పుస్తకాలు వెలువడ్డాయి . కేంద్ర బాల సాహితి అకాడమికి .. బాల సాహిత్యం తీరు తెన్నులు తెలుగు చలన చిత్రాల్లో పిల్లల పాటలు బాల సాహిత్య కృషిలో ఆకాశ వాణి, దూర దర్శన్ల పాత్ర గురించి పత్ర సమర్పణ చేసారు. పిల్ల ల కోసం రామ కృష్ణ పరమ హంస జీవిత చరిత్ర రాసాను. పిల్లల కోసం సేవల తల్లి దుర్గ భాయి దేశ్ ముఖ్ జీవిత చరిత్ర వ్రాస్తున్నారు. కన్నెగంటి అనసూయ , అరిపిరాల సత్య ప్రసాద్, వడలి రాధాకృష్ణగార్లు నలుగురు కలసి.. నాల్నాలుగుల పదహారు అన్న కథల సంకలనం వెలువరించారు త్వరలో చిలుక పలుకులు అన్న బాల సాహితీ కథల సంపుటిని ప్రచురిస్తుండగా గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న అనుభవాలతో వ్రాసిన కథలు కూర్చి రేల పూలు అన్న కథల సంపుటిని వెలువరించనున్నారు. -------------------------- పుస్తకాలు కావాలంటే ----------------------------- (అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం) లేదా బి.డి. నివేదితదినేశ్- డోర్ నెంబర్-3-2-353, 2వ అంతస్థు, స్వామి వివేకానంద వీథి, ఆర్ పి రోడ్, సికిందరాబాద్-500003 రచయిత్రి సెల్ నెంబర్-8106678746,9849406722
No comments:
Post a Comment