భగవంతుడు సర్వాంతర్యామి - అచ్చంగా తెలుగు
  భగవంతుడు సర్వాంతర్యామి
- రవి కుమార్

ఇందు కలడు అందు లేడు అని సందేహంబు వలదు,  చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే కలడు.
అసలు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనే మన సందేహాలన్నిటికీ  పోతన గారు ఆనాడే భాగవత రచన లో పైవిధంగా సమాధానం చెప్పారు.
సూర్యుడు ప్రతీ రోజు ఉదయం  తూర్పున ఉదయిస్తాడు,  సాయంకాలం పడమటన అస్తమిస్తాడు. ఇది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఇంకా లోకం లో  మన ప్రమేయం లేకుండా చాలా జరుగుతాయి.  సమయానికి ఆకలి వేయటం, మనం తిన్న ఆహరం జీర్ణం చెందడం,  అలసిపోతే నిద్ర రావటం, నిద్ర పొయినప్పుడు శ్వాస తీసుకొవటం,  అందులో ఒక భాగమే.  ఇవన్నీ ఎలా జరుగుతాయా అని ఆలోచిస్తే మనకు తెలియని ఏదో ఒక శక్తి ఉండి ఉంటుంది. ఆ శక్తే భగవంతుడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ శక్తి తోనే మన జీవితం ముడి పడి ఉంది. ఏదైతే మనకు శక్తి ని ఇచ్చి ప్రాణాన్ని నిలబెడుతుందో వాటన్నింటిలో భగవంతుడు ఉన్నాడు.
సూర్యుడు (మనకు కవలసినంత శక్తి ఇస్తాడు కాబట్టి ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటాం). సూర్య రశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి   శరీరానికి, ఎముకల కు ఎంతో శక్తినిస్తుంది. ఇది శాస్త్రీయం గా  నిరూపించబడినది. ఆహారం ద్వారా శరీరానికి శక్తి, విటమిన్ల రూపంలో వస్తుంది. మనం జీవించాలి అంటే ఆహారం అవసరం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు. మొక్కలకు కూడా సూర్యుడు ఎంతో ఉపయోగపడతాడు. కిరణజన్య సంయోక్రియ అంటే సూర్యశక్తిని రసాయనిక శక్తిగా మార్చే జీవనచర్య. దీని వలన మొక్కలు పచ్చ గా ఉంటాయి
ఏదో ఒక శక్తి లేకుండా ఏ వస్తువు పని చెయ్యదు. ఆ శక్తి రూపంలోని  ప్రతి వస్తువులో భగవంతుడు ఉన్నాడు.  భగవంతుడు సర్వాంతర్యామి అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి.  సూర్యుడు ఒక చోట ఉన్నా సూర్య శక్తి మాత్రం ప్రపంచం అంతా ఎలా విస్తరించిందో అలాగే  భగవంతుడి శక్తి కూడా వ్యాపిస్తుంది .  భగవంతుడు ఒక చోటే ఉన్నా ఆ శక్తి మాత్రం విశ్వం అంతటా వ్యాపించి ఉంటుంది. ఉదాహరణకు మనకు విద్యుతు ఇంట్లో ఉంది అంటే అది అక్కడ ఉద్భవించలేదు. ఒక విద్యుత్తు కేంద్రం లో ఉద్భవించి అన్ని చోట్లకు వచ్చినట్టే భగవంతుడు ఒక చోట ఉన్నా ఆ శక్తి వ్యాపించింది కావున ఆయన్ను సర్వాంతర్యామి అని అంటాం.
గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్ని పంచ భూతములు.  ఇవి లేకుండా మనం జీవించలేము.  కాబట్టి వీటిలో భగవంతుడు ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు.
నీరు:
నీరు లేకుండా ఒక్కరోజును  కూడా మనం ఊహించుకోలేము. నీరు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. నీరు శరీరానికి తగినంత శక్తి ని ఇస్తుంది. మన శరీరం దాదాపు 60శాతం నీటి తోనే నిండి ఉంటుంది. నీరు మనకు కావాలసినంత శక్తి ని ఇస్తుంది. నీరు మన ఆరోగ్యం కపాడటం లో పెద్ద పాత్ర వహిస్తుంది.
వాయువు:
మొక్కలు, చెట్లు ఆక్సిజన్ బయటకు వదిలి మనకు ప్రాణ వయువుని ఇస్తున్నాయి.  మనం పీల్చే గాలి ఆక్సిజన్ అంటాం, వదిలే గాలిని కార్బన్ డైఆక్సైడ్ అంటాం. ఇవి లేకుండా మనం జీవించలేము.కావున వాయువు కూడా ప్రత్యక్ష దైవం అని చెప్పుకోవచ్చు.
భూమి:
మనకు కావలసిన ఆహరం పండించాలి అంటే భూమి ఎంతో అవసరం. ఆ భూమి లేకపోతే మనకు కావలసిన ఆహరం మనకు దొరకదు. అందుకే భూమాత అంటాం.
తల్లి బిడ్డకు కవలసినవి అన్ని ఎలా చేకూర్చి పెడుతుందో అలాగే భూమాత కూడా మనకు కావాలసినవి అన్ని అందిస్తుంది.
అగ్ని:
దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం జ్యోతి మహేశ్వరా
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే
మన సాంప్రదాయం లో దీపం అన్నదానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ దీపం కూడా అగ్ని రూపమే. మన పూజ లో మొదట మనం దీపారాధనే చేస్తాం.
ఆ అగ్ని వలనే మనం వంట చేసుకుని తినగలుగుతున్నాం.
పూర్వ కాలం లో రాజులు యజ్ఞ  యాగాలు నిర్వహించేవారు. ఆ యజ్ఞ కుండలి నుంచి వచ్చే ధూపం ఆకాశం నుంచి చేరుతుంది.
ఆకాశం అనగా అనంతమైనది అని అర్దం. ఆకాశం చేరిన ధూపం, మబ్బుల్లా  మారి వర్షాలు కురిపిస్తుంది. ఆ వర్షాల వలన పంటలు పండి మన భూమి సస్యశ్యామలం గా ఉంటుంది.
భూమి మీద ఆహారం పండాలంటే వర్షాలు కురవాలి. వర్షాలు రావాలి అంటే ఆకాశంలో మేఘాలు ఉండాలి. మేఘాలు ఉండాలి అంటే భూమి మీద యాగాలు జరగాలి. ఆ యాగ ధూపం ఆకాశం చేరి అది మేఘరూపం దాల్చి వర్ష రూపం లో భూమి ని తాకితే భూమి మీద పంటలు పండుతాయి.
కావున  ఇవన్ని ప్రత్యక్ష దైవాలే...
దీన్ని బట్టి భగవంతుడు అంతా నిండి ఉన్నాడు అని చెప్పుకొవచ్చు. ఆయన్ను నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి కూడా జరగాల్సినవి అన్నీ సక్రమంగానే జరుగుతాయి. ఆయనకు తరతమ భేదాలు ఉండవు. ఈ విశాల సృష్టిని సృజించి, తన బిడ్డలపట్ల కరుణతో, వారిని పోషించేందుకు పలురూపాలు ధరించి, వాటి ద్వారా మన ప్రాణాన్ని నిలబెడుతున్న పరమ కృపాళువు భగవంతుడు.

No comments:

Post a Comment

Pages