వెన్నెల్లో లాంచీ ప్రయాణం- 2 - అచ్చంగా తెలుగు
వెన్నెల్లో లాంచీ ప్రయాణం- 2
---- వంశీ

(గోదావరి మధ్యనున్న తిప్ప మీద లాంచి లంగరేసి, లాంచి ఓనర్ మూర్తి, చక్రి, పద్మారావు, వంశీ కోయదొర ఇచ్చిన చిగురు తాగుతూ, వెన్నెల్ల రాత్రి గోదావరి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఓ ముప్పావు గంట తర్వాత వంట పనిగానిచ్చిన నల్ల శ్రీనూ, డ్రైవరు కృష్ణా, సరంగు పట్టాభితో పాటు ఇంకా తాతలూ, బుల్లబ్బాయి లాంటోళ్ళంతా వారి చుట్టూ మూగిపోయి మరి ఊసులాడ్డం మొదలెట్టారు....) ఆత్మ బంధువు అలలమీంచి చల్లని ఇగణంలా లేసు తెరలు గాలికేగురుతున్నట్టు తెరలు, తెరలుగా వీస్తుంది గోదారి గాలి. ఓ పదారేళ్ళ పడుచుపిల్ల లాంచీ పది చెక్క మీద ఓరగా కూర్చొని తన పారాణి పాదాల్ని గోదారి నీళ్ళలో ఆడిస్తూ పాపికొండల అందాలను కళ్ళప్పగించి చూస్తుంది. ఎప్పుడో తెల్లారగట్ల. ఎదరాల్లో కూర్చున్న తల్లి ఒళ్లో సంటోడు బూరా ఊదుతున్నాడు. తాళ్ళ చుట్ట మీద కూర్చున్న ముసలోడు మాగన్నుగా నిదరోతున్నాడు. రాజమండ్రి రేవులో మొదలైన ప్రయాణం మధ్యలో ఆగుతా తర్వాత సాగుతా... అందరినీ పలకరించుకుంటా.. రేవులన్నీ చుడతా దేవీపట్నం దగ్గరకొచ్చింది. ఆ రేవులో లాంచీలోకి అత్తారుబత్తంగా చేరుస్తున్నాడు టిక్కెట్లు కొట్టే మల్లాడి పట్టాభి, పొలాలకి ఎరువులు తీసుకెళ్ళే వొళ్ళు... కొండోళ్ళకి పప్పులు, ఉప్పులు మోసుకెల్లి వ్యాపారాలు జేసుకునేవోళ్ళు... చంటోళ్ళకు సుస్తీ చేస్తే ఆసుపత్రులకు తీసుకెళ్ళే వాళ్ళతో నిండిపోయింది లాంచీ. అటూ ఇటూ పరుచుకుపోయున్న పాపికొండల గూడేల్లో వుండే గిరిజనులు బయటకు రావాలన్నా, ప్రాణావసరాలు తీర్చుకోవాలన్నోళ్ళకి ఈ లాంచీలు తప్ప మరే ఆధారం లేదు. అందుకే ఆలలకి ఆత్మబంధువు లాంచీ. స్వర్ణయుగం దవిళేశ్వరం, పోలవరాల్లో మొత్తం కలిపి అయిదారొందల లాంచీల దాకా వున్నాయి. ఇయ్యన్నీ రాజమండ్రి లేకపోతే పోలవరం నించి బయల్దేరి పాపికొండ అవతల్లున్న కూనవరం, భద్రాచలం, దుమ్ముగూడెం దాకా ఎగువ నుంచి దిగువకి, దిగువ నించి ఎగువకీ కలతిరుగుతున్నాయి. ఒక్కోసారి దుమ్ముగూడెం కూడా దాటిపోయి ఏటూరు నాగారం, కాళేశ్వరాలవతలున్న ఆదిలాబాద్ – మహారాష్ట్ర బోర్డరు దాకా వెళ్ళొచ్చేస్తుంటాయి. ఎక్కువ పాసెంజర్ రద్దీ మాత్రం రాజమండ్రి నుంచి తూర్పు గోదావరికి చివరి గ్రామమైన కచ్చులూరు మధ్యే వుంటది. ప్రతీ లాంచీలోనూ నలభై, యాభై మంది జనాలు అటూ ఇటూ తిరుగుతుంటారు. రాజమండ్రి నుంచి పాపికొండలుకి వెళ్ళొచ్చేందుకు ఒక లాంచీకి రమారమి పది గంటలు పడద్ది. మధ్యాన్నం రెండింటికి కనక రాజమండ్రిలో లాంచీ బయలుదేరితే కచ్చులూరేళ్ళే సరికి పోద్దుగుంకిపోద్ది. ఇక రాత్రికి లాంచీ పనోళ్ళంతా రేవులో ఓరగా గెడేసి నిలిపేసి గోదారి చేప, రొయ్యలతో గుమాయించే కూరలోన్డుకుని తినేసి ఆ ఇసక తిప్పల మీద నడుం వాల్చేసి ఆకాసంలో చుక్కల్లెక్కెట్టుకుంటూ నిద్రల్లోకెళ్ళిపోతారు. తెల్లారేక ప్రయాణం మొదలైతే రాజమండ్రి చేరుకునేతలికి సూర్యుడు నడినెత్తి మీదకి జేరతాడు. ఇలా కల తిరిగే లాంచీ ఒక్కో ట్రిప్పుకి ఓనరుకి అన్ని ఖర్చులు పోనూ పదిహేనొందల నించి రెండు వేల రూపాయల దాకా మిగులుద్ది. లాంచీ స్టాఫ్ కి చేతినిండా పని, ఓనరుకి జేబునిండా సొమ్ము. అందరికీ పనే రాజమండ్రి పేపరు మిల్లుకి పచ్చి వెదుళ్ళతో కట్టిన తెప్పకట్టలు ఎగువనించి దిగువకోస్తున్నాయి. యందు మిరపకాయల లాంచీ లెక్క పెట్టలేనన్ని దిగుతున్నాయి. ఎగువలో బాగా మేసిన మేకల మందొకటి ఒక పడవలోకెక్కేసి ఈ వేపొస్తుంది. గోదారి మీద లాంచీలు జోరుగా కల తిరుగుతున్నాయి. ప్రతీ లాంచీ మీదాసరంగూ, గెడేసేవోడు, ఇంజిను డ్రైవరు, వంటపుట్టు, టిక్కెట్లు కొట్టేవోడు, ఈల్లందరికీ ఒక్కో అసిస్టెంటు. అంటే ఒక లాంచీ కదలాలంటే ఏడెనమండుగురు జనం. ఇలా మొత్తం రెండు మూడు వేళ కుటుంబాలకి లాంచీల మీదే బతుకుదెరువు. ఇంకా లాంచీలకు మరమ్మత్తులు చేసేవోళ్ళు కొత్త లాంచీల్ని తయారు చేసేవోళ్ళు ఇలా చాలా మంది పనోళ్ళున్నారు. ఈళ్ళంతా ధవిళేశ్వరంలో వాడపేట, జాలారి పేటలో కాపురముండే జనాభా. ఈ కుటుంబాల్లో కుర్రోళ్ళకి చదువు అట్టే వంటబట్టకపోయినా లాంచీ మీద ఎలా బతకాలో మాత్రం బాగా అబ్బుతుంది. లాంచీ మీద సరంగుగా పన్జేసే ప్రతివోడు, తన బిడ్డని కూడా సరంగుగానే తీర్చి దిద్దుతాడు. ఇంట్లో ఇద్దరుముగ్గురు మగ పిల్లలుంటే ఆళ్ళకిఇంజిను డ్రైవర్, మేకానిక్కూ పనులే నేర్పెస్తారు. పడీ పద్నాలుగేళ్ళ వయసొచ్చే తలికి ఆ పిల్లలు కూడా లాంచీలేక్కి గోదారమ్మ ఒళ్లో ప్రయాణానికి తయారయిపోతారు. యెంత ప్రేమండీ బాబో లాంచీ తయారవ్వాలంటే లక్షల రూపాయలుగావాలి. ఆటిని పెట్టుబడి పెట్టి, ఓ రూపు తీసుకొచ్చే ఓనర్లు ఇటు పశ్చిమ గోదావరి, అటు తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ఉన్నారు. ఆళ్ళంతా ఆళ్ళ లాంచీల్తో పాటే గోదావరిమీద ప్రయాణాలు చేస్తుంటారు. లాంచీ ఎక్కే ప్రతీ పాసింజర్నీ చాలా ఇష్టంగా ప్రేమగా ఎప్పడ్నుంచోఎరుగున్నట్టుచేయ్యట్టుకు తీసుకెళ్ళి లాంచీలో కూర్చోబెడ్తారు. అమాయకులైన కొండోళ్ళంటే మాయిష్టం ఈల్లకి. ఆ కొండోళ్ళు కూడా గుండెల్లో పెట్టుకునేవోళ్ళే. ఒక్కోసారి టిక్కెట్టుకు సరిపడా డబ్బులు లేకుండా ఎక్కినోళ్ళని అర్ధణాబిళ్ళ కూడా అడక్కుండా ఆ కొందోల్లు ఎక్కడ దిగాలో అక్కడ దిమ్పెస్తారు మళ్ళీ వచ్చినప్పుడాళ్ళు ఆ సొమ్మును తెచ్చి, బాకీ తీర్చేస్తారనీళ్ళకి తెల్సు. (సశేషం...)

No comments:

Post a Comment

Pages