వెలుగులు పంచండి... - అచ్చంగా తెలుగు

వెలుగులు పంచండి...

Share This
వెలుగులు పంచండి...

ప్రియమైన మిత్రులకు, చదువరులకు దీపావళి శుభాకాంక్షలు... మనసు అనే నిండు జాబిలిని కారుమబ్బుల్లా కమ్ముకుంటాయి చీకట్లు ! సమయం చూసి మరీ ముసిరే ఈ చీకట్లు ఎన్ని రకాలో కదా ! అజ్ఞానం ఒక చీకటి మబ్బు... స్వార్ధం ఒక చీకటి మబ్బు... బాధ, దుఃఖం, ఓర్వలేనితనం , అసహాయ స్థితి, ఒంటరితనం, బీదరికం, అనుకోని ఎదురుదెబ్బలు, ప్రకృతి వైపరీత్యాలు, అహం  ... ఇవన్నీ చీకట్లే ! వీటిని తొలగించాలంటే... ముందుగా మన లోపాల్ని మనమే గుర్తించాలి... దైవానుగ్రహమనే బలమైన గాలులు వీచాలి... అప్పుడు మబ్బు చాటునున్న వెలుగు ప్రస్ఫుటమౌతుంది... మన మనసు చలవ మనకే కాదు, అందరికీ వెన్నెల వెలుగుల్ని పంచుతుంది... లోకంలో ఉన్న అన్ని మంచి వస్తువులూ తనకే కావాలని, తాను అందరికంటే ఎక్కువ డబ్బు పోగేసి, దర్జాగా బ్రతకాలని దబాయిస్తుంది... స్వార్ధమనే కారుమబ్బు ! దీన్ని గుర్తిస్తే... ‘దానం’ అనే సుగుణంతో తొలగించవచ్చు. అలాగే ఇతరుల దుఃఖాన్ని, బాధని పంచుకుని, అర్ధం చేసుకుని ‘స్వాంతన వచనాలు ‘ అనే ఓదార్పుతో తొలగించవచ్చు. ఓర్వలేనితనాన్ని గుర్తించి, వారిని “మనసారా అభినందించడం” ద్వారా తొలగించుకోవచ్చు. అసహాయులకు చేసే సహాయం, దరిద్ర నారాయణులకు చేసే సేవ... మన కర్మలను తొలగించడమే కాక, నేరుగా భగవంతుడికే చేరుతుంది. భయాన్ని ధైర్యంతో, ప్రకృతి వైపరీత్యాలను ఇతరుల ఆసరా తో జయించవచ్చు. అహాన్ని నిరాడంబర సేవతో జయించవచ్చు. ఇక చివరిదైన “నేను, నాది” అనే అజ్ఞానం తొలగాలంటే... దైవం, గురువు అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. అందుకే ఈ దీపావళికి ... మనలోని చీకట్లను గుర్తించి, తొలగించుకుని, మనసు అనే ప్రమిదలో, ఆర్ద్రత అనే తైలాన్ని నింపి, సుగుణాలు అనే ఒత్తిని వేసి, మానవత్వం తో వెలిగించుకుందాం... వెలుగుదాం, వెలిగిద్దాం ! ఇక ఎప్పటిలాగే నిత్యనూతనంగా వచ్చిన ఈ అక్టోబర్ సంచికలో... ప్రముఖ సినీ దర్శకులు వంశీ గారి “వెన్నెల్లో లాంచి ప్రయాణం” మిమ్మల్ని గోదావరి అలలపై తేలియాడిస్తుంది. ప్రముఖ రచయిత్రి ‘అంగులూరి అంజనీదేవి గారి ‘ ఇలా ఎందరున్నారు ?’ అనే నవల ఈ నెల నుంచి మొదలౌతుంది. సమకాలీన సమాజ స్థితిగతులకు అద్దం పట్టే ఈ నవల అందరినీ ఆలోచింపచేస్తుంది. ఈ నెల నుంచి ప్రతి నెల ప్రముఖుల మనోభావాలు ‘ముఖాముఖి’ లో అందిస్తున్నాము. గాయకులు గంగాధర శాస్త్రి గారితో ‘సంపూర్ణ భగవద్గీత ‘ పై జరిపిన ముఖాముఖి ఈ శీర్షికలో చదవచ్చు. మాండలిన్ శ్రీనివాస్ గారి సంగీత ప్రస్థానం, మధు కురువ గారి చిత్రకళా నైపుణ్యం, స్వాతి సోమనాథ్ గారి అందెల రవళి మిమ్మల్ని మురిపిస్తాయి. కధల కదంబాలు, కవితా సుమ ఝరులు... మిమ్మల్ని ఆనంద డోలికల్లో తెలియాడించేందుకు సిద్ధం ! మరి ఇంకెందుకు ఆలస్యం... చదవండి... చదివించండి... మీ అభిమాన పత్రిక “అచ్చంగా తెలుగు “ ! మీ అమూల్యమైన అభిప్రాయాలను /సూచనలను “అభిప్రాయాలు” శీర్షికలో అందించడం మర్చిపోకండే !
మీ అందరి ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలతో...
భావరాజు పద్మిని
మరియు
అచ్చంగా తెలుగు సంపాదక వర్గం
   

No comments:

Post a Comment

Pages