ఒక “అక్కర్లేని ఆడపిల్ల “ కధ ఎగిరే పావురమా ! - అచ్చంగా తెలుగు

ఒక “అక్కర్లేని ఆడపిల్ల “ కధ ఎగిరే పావురమా !

Share This
ఒక “అక్కర్లేని ఆడపిల్ల “ కధ ఎగిరే పావురమా !
-      భావరాజు పద్మిని

అవిటితనం ఒక శాపమే కావచ్చు .... ఒక అవకారమే కావచ్చు ... కాని ఆ శాపాన్ని, లోపాన్ని తమ స్వార్ధానికి, తమ వ్యాపారధోరణికి పెట్టుబడిగా వాడుకోవాలని చూసే మానసిక వికలాంగుల మనస్తత్వం  హీనాతిహీనం ! అటువంటి నీచులు కొందరైతే...  సహృదయంతో జడివానలో పీకకు గుడ్డ కట్టి, చెత్త బుట్టలో పడేసిన ఒక “అక్కర్లేని ఆడపిల్లను” చేరదీసి, ఆమె కోసమే బ్రతుకుతూ, ఆమె ఆనందంకోసం అనుక్షణం తపిస్తూ, ఆమె చుట్టూనే తన ప్రపంచాన్ని అల్లుకున్న గొప్ప మనసున్నవారు మరి కొందరు... వీరందరి మధ్య కదలలేని, మాటరాని ఒక ‘గాయత్రి’ పడే వేదనే ఎగిరే పావురమా నవల. ఆడపిల్ల అక్కర్లేదు, అక్కరకు రాదు... అనుకున్న ,అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఆమె తల్లి, కుటుంబసభ్యులకు జడిసి, జడివానలో ‘గాయత్రి’ ని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది. పెద్దింటికి అక్కర్లేని ఆ బిడ్డను చూస్తాడు గొప్ప మనసున్న ఒక పేదింటి వాడు... తాత . చావుబ్రతుకుల్లో ఉన్న పసిగుడ్డును చూసి, హృదయం ద్రవించి, ఆమెను చేరదీసి, సొంత బిడ్డ కంటే ఎక్కువగా సాకుతుంటాడు తాత... పరోపకార గుణం, మమత  మెండుగా గల తాతంటే అందరికీ అభిమానమే ! గాయత్రీ వైద్యం కోసం, 8 ఏళ్ళ నుంచి ఆమెను కోవెల వద్ద  పూజ సామన్లు, పువ్వులు  అమ్మేందుకు నియమిస్తాడు తాత. గుడి పూజారి గారు, వారి కుమార్తె ఉమ, గాయత్రి ని కన్న బిడ్డలా పెంచే పిన్ని, ఆమెను కనిపెట్టుకు ఉండి, ప్రేమగా చూసే రాములు... ఇంకా... రోజూ గింజల కోసం కోవెల ఆవరణకు వచ్చే పావురాలు... ఇదీ గాయత్రి ప్రపంచం. ఆ పావురాల్లా ఎగరాలని, తోటి పిల్లల్లా పాడి, ఆడాలని గాయత్రి కోరిక. గాయత్రికి చదువు నేర్పుతుంది ఉమమ్మ. అందరి సంరక్షణలో గాయత్రి దినదిన ప్రవర్ధమానమౌతూ ఉంటుంది. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఆమె జీవితంలోకి విషపు పురుగులా ప్రవేశిస్తుంది కమలమ్మ. గాయత్రీ మనసుకు విషం నూరి పోసి, ఎవరికి తెలియకుండా ఆమెను ఆ ఊరి నుంచి తీసుకు వెళ్ళిపోతుంది. తన తమ్ముడితో పెళ్లి చేస్తానని , గాయత్రి బ్రతుకు బాగుచేస్తానని, నమ్మబలుకుతుంది. చివరికి గాయత్రిని ‘జేమ్స్’ అనే తండ్రి వయసున్న పాము పడగలో ఉంచుతుంది... ఆ తర్వాత గాయత్రి ఎదురుకున్న పరిస్థితులు ఏంటి ? వాటి నుంచి ఆమె బయటపడిందా ? చివరికి గాయత్రి కధ ఎలా ముగిసింది ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ... “ఎగిరే పావురమా” నవల చదివి తీరాల్సిందే ! కోసూరి ఉమాభారతి గారు గొప్ప నర్తకి. అయితే, ఆమెలోని మరో పార్శ్వం రచనా వ్యాసంగం పట్ల అభిరుచి.  యెంత గొప్ప రచయతైనా , మాట్లాడే మనిషి భావాలను ఆవిష్కరించడమే కష్టం ! అటువంటిది ఒక మూగపిల్ల వేదన, అంతరంగాన్ని ఉమాభారతి గారు ఆవిష్కరించిన తీరు అద్భుతం ! గ్రామీణ భాషలో గాయత్రి కధను మేళవించి, ఊపిరి బిగబట్టి చదివించే శైలిలో... రాసిన ఈ హృద్యమైన నవల ప్రఖ్యాత ‘వంగురి ఫౌండేషన్’ వారు ప్రచురించారు. ఈ నవల ప్రతులు దొరికే చోటు... ప్రస్తుతం ఎగిరే పావురమా పుస్తకం కాచిగూడా నవోదయలో లభిస్తుంది. 25 తర్వాత కినిగెలో కూడా లభిస్తుంది..  

No comments:

Post a Comment

Pages