తెలుగు సినిమా కళావాహిని – బి.ఎన్.రెడ్డి - అచ్చంగా తెలుగు

తెలుగు సినిమా కళావాహిని – బి.ఎన్.రెడ్డి

Share This
తెలుగు సినిమా కళావాహిని బి.ఎన్.రెడ్డి
-పరవస్తు నాగసాయి సూరి

అంతర్జాతీయ వేదికలపై తెలుగు చలనచిత్ర సీమ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన దర్శకుడాయన. సామాజిక, మానవతా విలువలే ఆయన సినిమాలోని ప్రధానాంశాలు. అంతే కాదు దాదాసాహెబ్  ఫాల్కే అందుకున్న తొలి దక్షిణభారత సినీ ప్రముఖుడు కూడా ఆయనే. మల్లీశ్వరితో తెలుగు సినిమాను, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆయనే... కళావాహిని బి.ఎన్.రెడ్డి. కడపజిల్లా పులివెందులు తాలూకా కొత్తపల్లి గ్రామంలో 16 నవంబర్ 1908లో బి.ఎన్.రెడ్డి జన్మించారు. ఆయన పూర్తిపేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. చార్టెడ్ అకౌంటెంట్గా, పాత్రికేయునిగా కొన్నాళ్లు పని చేశారు. సీత అనే సినిమా చూసిన తర్వాత ఆయనకు సినీరంగంపై దృష్టి మళ్లింది. 1938లో స్వయంగా వాహినీ సంస్థను స్థాపించి "వందేమాతరం"  చిత్రాన్ని తెరకెక్కించారు. ఎందోర హెమాహేమీలు నటించిన ఈ చిత్రంలో నిరుద్యోగం, వరకట్నం లాంటి సామాజికి రుగ్మతల్ని ఎండగట్టారు. బి.ఎన్.రెడ్డి చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడం వల్ల సమస్యలపై సమగ్రమైన దృక్పథం ఉండేది. సముద్రాల, నార్ల, తాపీధర్మారావు, గోపీచంద్ వంటి వారి సాహచర్యంలో ఆయన విద్యార్థి దశసాగింది. బహుశా ఈ నేపథ్యమే సామాజిక చిత్రాలను అందించే ధైర్యాన్ని ఆయనకిచ్చి ఉంటుంది. 1940లో వితంతు సమస్యలతో సుమంగళి అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించడమంటే.... నిజంగా సాహసమే. 1941లో నాగయ్య, టంగుటూరి సూర్యకుమారి వంటి తారాగణంతో పతిత జనోద్ధరణ అనే అంశంపై దేవత చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. అనంతరం 1942లో పోతన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం... తెలుగు పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా నాగయ్యకు అంతులేని ప్రేక్షకాదరణ సంపాదించి పెట్టింది. ఈ చిత్ర విజయం నిర్మాతగా బి.ఎన్. రెడ్డి పురోగమనానికి ఎంతో దోహదం చేసింది.   రెండో ప్రపంచ యుద్ధం రావడంతో 11 వేల అడుగుల కన్నా ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలు రాకూడందంటూ...చిత్రసీమపై ఆంక్షలు మొదలయ్యాయి. అయితే 10 వేల 300 అడుగులతో స్వర్గసీమను తెరకెక్కించి, ప్రేక్షకులకు అందించారు బి.ఎన్. రెడ్డి. ఈ చిత్రం భానుమతికి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ చిత్రంలో సి.హెచ్. నారాయణరావుతో భానుమతికి డ్యూయెట్ కూడా ఉంది. అప్పట్లో నారాయణరావు పెద్ద గ్లామర్ హీరో. స్వర్గసీమ తర్వాత ఆరేళ్ల విరామం తీసుకుని బిఎన్ రెడ్డి 1951లో మల్లీశ్వరి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా... ఆయన కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. తెలుగు సినిమాకు కావ్య గౌరవాన్ని అద్దిన మల్లీశ్వరి చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు ఎప్పటికీ మణిపూసలే. చాటువులని, జానపదగీతాల్ని, మేఘసందేశం తరహాలో హృద్యమైన గీతంగా ఎవర్ గ్రీన్ గీతంగా తన దర్శకత్వ ప్రతిభతో మల్లీశ్వరికి సొగసులు అద్దారు. ఓ చిత్రం విజయవంతమయ్యేందుకు ఎన్నిరకాలు కృషిచేయాలో అంతకు మించి కృషి చేశారు బి.ఎన్.రెడ్డి. భానుమతి పై తెరకెక్కించిన జావళి గీతాన్ని నిత్యనూతనంగా తెరకెక్కించారు బి.ఎన్.రెడ్డి. ఈ చిత్రం.... వాహిని సంస్థ పేరును శాశ్వతం చేసింది. తూర్పుఆసియా ఫిలిం ఫెస్టివల్లో గొప్పకళాఖండంగా ప్రశంసలు అందుకుంది. బి.ఎన్. రెడ్డి తెరకెక్కించిన బంగారుపాప చిత్రం... ఆయన ఖ్యాతిని మరింత పెంచింది. అనంతరం1957లో భాగ్యరేఖ చిత్రాన్ని అందిచారు. రాజసులోచన, కన్నాంబ, ఎన్టీఆర్ తో ఆయన తెరకెక్కించిన రాజమకుటం... సినిమా చరిత్రలో ఓ మైలురాయనే చెప్పాలి. 1966లో బి.ఎన్.రెడ్డి రూపొందించిన రంగులరాట్నం సినిమా.... చంద్రమోహన్, వాణిశ్రీల నటజీవితానికి రాచబాట వేసింది. ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలు దాదాపుగా విజయవంతమైనవే. బంగారుపాప, రంగులరాట్నం చిత్రాలు.... ఉత్తమ చిత్రాలుగా రాష్ట్రపతి రజత పతకాన్ని అందుకున్నాయి. భాగ్యరేఖ చిత్రం... రాష్ట్రపతి ప్రత్యేక ప్రశంసల్ని అందుకుంది. రాష్ట్రప్రభుత్వం ఏటా ఇచ్చే నంది అవార్డులలో బంగారు నందిని రంగులరాట్నం, రజత నందిని బంగారు పంజరం చిత్రాలు అందుకున్నాయి. బి.ఎన్.రెడ్డి చివరగా అందించిన చిత్రం బంగారు పంజరం. బి.ఎన్.రెడ్డి.... 1973లో కేంద్రప్రభుత్వం నుంచి పద్మభూషణ్, వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్నారు. దక్షిణభారతదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఆయనే. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్రప్రభుత్వం చేత సన్మానాలు అందుకున్నారాయన. పూణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో సలహాదారునిగా, మద్రాసు గవర్నమెంట్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో సలహాదారునిగా వ్యవహరించారు. ఎన్నో హోదాలు, గౌరవడిగ్రీలు అందుకున్న బి.ఎన్.రెడ్డి.... 1977లో అమరులయ్యారు. కళారాధనలో బతుకు పండించుకున్న ధన్యజీవిగా... పుణ్యజీవిగా చిరయశస్సుని సంపాదించుకున్న ఆయన... తెలుగు సినిమా ఉన్నంత కాలం జీవించే ఉంటారు.

No comments:

Post a Comment

Pages