అనితర సాధ్యం ఆయన మార్గం - అచ్చంగా తెలుగు
అనితర సాధ్యం ఆయన మార్గం
-        వైఎస్.కృష్ణేశ్వరరావు, రచయిత, నటులు

నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం అనితర సాధ్యం, నామార్గం.

అన్న మహాకవి శ్రీశ్రీ   గారి కవితకి, సుప్రసిద్ధ సినీదర్శకులు వంశీ గారికీ సంబంధం ఉంది.  అవును.. వంశీ గారొక దుర్గం, .. సినీ దుర్గం. వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబరు 20 న పుట్టి , అక్కడే పెరిగారు. ప్రాధమిక విద్యను అక్కడే పూర్తి చేశాడు.  16 వ ఏటనే తొలి  కథ 'నల్ల సుశీల' వ్రాసి సాహిత్యకారుల దృష్టిని ఆకర్షించారు. వంశీ వ్రాసే కథా విధానంలో ప్రత్యేకతను గుర్తించిన ఒకరు    " నీ వుండాల్సింది మద్రాసోయ్" అంటూ వంశీ భవితను దూరదృష్టితో చూసి సలహా ఇచ్చారు.. అలా సినీ వినీలాకాశంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ మద్రాసు (నేటి చెన్నై) చేరుకున్నారు వంశీ. తొలి సినీ గురువు ,ప్రముఖ దర్శకులు శ్రీ వి. మధుసూదనరావు. తదుపరి కె. విశ్వనాథ్ గారికి సహాయదర్శకునిగా, తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు సహాయ దర్శకుడిగా వ్యవహరించారు వంశీ. .ఆ తరువాత ప్రముఖ తమిళ దర్శకులు భారతీ రాజా గారి వద్ద చాలా కాలం  అసిస్టెంట్ డైరక్టర్ గా  వ్యవహరించి తనలో ఉన్న అపారజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్నారు. దర్శకునిగా ఆయన మొదటి సినిమా 1982లో చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన 'మంచు పల్లకి '. ఈ తమిళ మాతృకకి యండమూరి వీరేంద్రనాథ్ గారు మాటల  రచయిత. ఆ సినిమాకి టైటిల్ మాత్రం వంశీ  వ్రాసిన నవల 'మంచుపల్లకీ' కావటం విశేషం.  అలా మొదలైన వంశీ దర్శక ప్రస్థానం ఇప్పటి వరకూ 24 సినిమాలకు దర్శకత్వం వహించేత వరకూ నిరాటంకంగా సాగింది...సాగుతూ ఉంది. .. ' వంశీ, సినిమారా..! ' అంటారు ఇప్పటికీ.!  అంత బలంగా సెల్యులాయిడ్ పై తన ముద్ర వేసుకున్న దర్శకుడు వంశీ గారు.  సెల్యులాయిడ్ మీద తన సంతకం ప్రత్యేకత తనదే..! అందుకే, అనితర సాధ్యం ఆయన మార్గం. వంశీ గారు భావుకుడు. అనుభూతి వాది, ఒక అసాధారణ  విషయాన్ని, సాధారణ ప్రేక్షకుడు కూడా అర్ధం చేసుకుని, ఆనందించి, ఆమోదించేలా చిత్రాన్ని తెరకెక్కించడం ఆయన స్టైల్. 'లేడీస్ టైలర్' , 'ఏప్రిల్ ఒకటి విడుదల', 'ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు', ఈ సినిమాలన్నీ అదే కోవలోకి వస్తాయి.   ఐతే - 'మంచు పల్లకి' , 'సితార' , 'అన్వేషణ' , 'ఆలాపన' ...ఆయన మాత్రమే చేయగల సినిమాలు . ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! అక్షర ధర్మాన్ని , సెల్యు లాయిడ్ మర్మాన్ని వశం చేసుకున్న వంశీ -  సంగీత జ్ఞానాన్ని కూడా స్వంతం చేసుకున్నారు . సంగీతం అంటే చిన్ననాటి నుంచి ఎంతో ఇష్టం ఉన్న వంశీ.. తన చిత్రాలలో సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు... తొలి చిత్రం 'మంచుపల్లకీ'కి రాజన్-నాగేంద్ర గారు సంగీతం అందించినప్పటికీ , తరువాత ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా పరిచయంతో వంశీ మార్క్ సంగీతాన్ని ఆస్వాదించారు ప్రేక్షకులు, అనేక సినిమాలు వంశీ , ఇళయరాజా కాంబినేషన్ తో ప్రేక్షకులను అలరించాయి. ఇళయరాజా - వంశీ కాంబినేషన్ సక్సెస్ ఏ రేంజ్ లోదో అందరికి తెలుసు .  ఇళయరాజా సంగీతం అంటే వంశీ గారికి ఎంత ఇష్టం అంటే ఇళయరాజా గారి వద్ద దొరకని, ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన, అన్ని భాషల పాటలన్నీ  వంశీ గారి లైబ్రరీలో దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు.   డిటెక్టివ్ నారద చిత్రంలో ఒక పాటకు వంశీ గారే స్వయంగా దర్శకత్వం వహించారు..ఇప్పుడు యువ సంగీత దర్శకులు 'చక్రీ ' వంశీ చిత్రాలకు  ఆహ్లాదమైన సంగీతాన్ని అందిస్తున్నారు.... కేవలం సినిమా దర్శకుని గానే కాక, కథా రచయితగా కూడా తెలుగు సాహితీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్వంతం చేసుకున్న ప్రతిభాశీలి వంశీ గారు . అక్కడా అంతే ... అనితర సాధ్యం ఆయన మార్గం..!  . తెలుగు కథా వీథిలో నిరంతరం నిలిచి పోయే - 'మా పసలపూడి కథలు ''మా దిగువ గోదారి కథలు ' , ' 'ఆకు పచ్చని జ్ఞాపకం', ఆయన మాత్రమే రాయగల కథలు . ఇంకా 'మంచుపల్లకీ','కర్మసాక్షి', ' మన్యంరాణి ' , 'సీతారామ లాంచి సర్వీసు-రాజమండ్రి ' ,... వేటికవే  ప్రత్యేకత కలిగి ఉంటాయి.. తను రాయడమే కాకుండా , 'వంశీకి నచ్చిన కధలు', పేరుతో ఒక అసాధారణమైన సంకలనాన్ని తెలుగు పాఠక లోకానికి అందించిన సాహితీ సేవకుడు కూడా ఆయన. నాకు తెలిసి , టోటల్ ఇండియా చలన చిత్ర చరిత్రలోనే, ఒక సినిమా దర్శకుడు , కథా రచయితగా , ఇంత విస్తృత స్థాయిలో కథా రచన చేయడం , ఆ కథలు కూడా ఏవో సాదా సీదా కథలు కాక , అశేష తెలుగు పాఠక లోకంలో విశేష ప్రాచుర్యం పొందినవి కావడం ఇండియాలో లేదు . ( ప్రపంచంలో ఎవరన్నా వున్నారేమో?! నాకు తెలీదు ) సినిమా దర్శకునిగా కన్నా కథా రచయితగా , కథా రచయితగా కన్నా దర్శకునిగా , రెంటిలోను కీర్తి గడించిన వంశీ గారు తెలుగు వాడవటం తెలుగు ప్రజలకు గౌరవం . దేశం లోపల , దేశం బయట కూడా తన సినిమాలకి , తన కథలకు , అశేష అభిమాన ప్రపంచాన్ని స్వంతం చేసుకున్న ఒక మహా దుర్గం వంశీ గారు . వంశీ సినిమాలో నటించాలని వువ్విళ్ళూరే నటీ నటులు ఎందరో ..!. ఎందుకంటే, నాయికని ఆయన చూపించే తీరు అంత ఆకట్టుకుంటుంది . పాటలు చిత్రీకరించే తీరు అంతకంటే అద్భుతంగా ఉంటుంది. "ఒక్కసారన్నా వంశీ సినిమాలో నటించాలండి"  అనే వాళ్ళు  ఎందరో . ( లేడీ ఆర్టిస్ట్ లే కాదు , మగ ఆర్టిస్ట్ లు కూడా ) అదొక గొప్ప అవకాశంగా , అదృష్టంగా భావిస్తారు నటీ నటులు  ( చిన్నా , పెద్దా తేడా లేకుండా ).  'కొంచెం టచ్ లో వుంటే చెప్తాను ' , ' గోపి గోపిక గోదావరి ' , ' సరదాగా కాసేపు , 'తను మొన్నే వెళ్లి పోయింది ' ( ఈ సినిమా విడుదలవ్వాలి ) సినిమాల్లో నాకు ఆ అవకాశం , అదృష్టం కలిగింది . అందుకు ఆ మహానుభావుడికి హృదయ పూర్వక కృతజ్ఞతలు . (అంతకంటే ఆయన కేం ఇవ్వగలం ? ఇచ్చే వాళ్లున్నా ఆయన పుచ్చుకోరు. ఇక్కడా అంతే... అనితర సాధ్యం ఆయన మార్గం .) కీ. శే బాపు గారు , నిరంతర సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ( ప్రైడ్ ఆఫ్ తెలుగు పీపుల్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ) లాంటి దిగ్గజాలు అభిమానించే గొప్ప దర్శకుడు వంశీ గారు . నవంబర్ 20 ఆయన  పుట్టిన రోజు సందర్భంగా వారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు , శుభాభినందనలు. కాని, వంశీ గారు తన పుట్టినరోజు జరుపుకోరు. ఆ రోజున ఎవరికీ అందుబాటులో ఉండరు. ఈ విషయంలో కూడా ఆయన మార్గం అనితర సాధ్యమే ! ఎందఱో నటీ నటులకు తన సినిమాల్లో పాత్ర లిచ్చి , వాళ్లకి జన్మలు , పునర్జన్మలు ఇచ్చి , వాళ్ళు ఎన్నో పుట్టిన రోజులు చేసుకునేలా చేసిన  దర్శకులు వంశీ గారు .  చిన్నతనంలోనే తను రాసిన ' మహల్ లో కోకిల' నవలను, ' సితార' సినిమాగా తెరకెక్కించి, నాలుగు జాతీయ అవార్డులు పొందిన క్రియేటివ్ డైరెక్టర్ వంశీ..  ఆ బహుముఖీన ప్రజ్ఞా శాలికి వందనం , అభివందనం... (ఈ వ్యాస రచయిత, శ్రీ వై.ఎస్.కృష్ణేశ్వరరావు - ప్రముఖ రంగస్థల,సినీ రచయిత, నటులు... వంశీ గారి  చిత్రాలలో హాస్య నటులుగా ప్రేక్షకాదరణ పొందినవారు. - ఎడిటర్  )

No comments:

Post a Comment

Pages