బాపురమణల కోతికొమ్మచ్చి - అచ్చంగా తెలుగు

బాపురమణల కోతికొమ్మచ్చి

Share This

బాపురమణల కోతికొమ్మచ్చి

- పరవస్తు నాగసాయి సూరి

 బొమ్మ ఉంటే, బొరుసుండాలి... బుడుగుంటే, " శీగాన పెసూనాంబ" ఉండాలి... అలాగే " బాపు వెంటే రమణ" .... " రమణ ఉంటే బాపు" ఉండితీరాలి. ఒకరు దేహం... ఇంకొకరు ప్రాణం. పెనవేసుకున్న స్నేహం. అందుకే ఎవరి గురించి మొదలెట్టినా... రెండో వారు అసంకల్పింతంగా దూసుకొస్తారు. ఒకరు గీత. ఇంకొకరు రాత. వెండితెరపై వీళ్లిద్దరిదీ మరచిపోలేని చేత. రమణ మొదటి రాత, బాపు తొలి గీత 1945లో అచ్చయ్యాయి. ఆ తర్వాత " ఆంధ్రపత్రిక" ఇద్దరి కెరీర్ ను ఒక్కటిగా మొదలెట్టింది. ఒకరు గీతగా... ఇంకొకరు రాతగా... ఆ ప్రస్థానం అలానే సాగింది. ఇంతలో బాపు మదిలో ఓ ఆలోచన. సినిమా తీద్దామోయ్ అన్నాడు. మనకు అనుభవం లేదు గదా అన్నది రమణ మాట. అదేనోయ్ అసలు క్వాలిఫికేషన్ అన్నది బాపు మాట. ఇంకేముంది " నవయుగ శ్రీనివాసరావు" ప్రోత్సాహంతో " సాక్షి" ఆవిష్కృతమైంది. తొలి సినిమా ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. " బంగారు పిచ్చుక" రూపంలో రెండో సినిమా మొదలైంది. తొలుత కథలైను విని రమణ వద్దన్నారట. అయినా బాపు తీశారట. ఏమవ్వాలో అదే అయ్యింది. అయ్యిందేదో అయ్యిందని ఏయన్నార్ " బుద్ధిమంతుడు" గా మారాడు. అప్పటికే పామునోట్లో ఉన్న ఇద్దరినీ... ఆ సినిమా నిచ్చెనెక్కించింది. పె.....ద్ద హీరోలతో తీసి ఇసుగొచ్చిందేమో...... " బాలరాజుకథ" తీయాలనిపించింది. తీసేశారు కూడా. చాలా బాగా ఆడిందిలే. " ఇంటి గౌరవం" ... పరువు నిలబెట్టిందంతే. ఇహ ఇలాకాదు... పురాణాల మీద పడదాం అనుకున్నారు. " సంపూర్ణ రామాయణం" మొదలైంది. కాంబినేషన్ కూడా భలే కుదిరిందిలే. బాపు కార్టూనిస్టు... రమణ హ్యూమరిస్టు... ఆరుద్ర కమ్యునిస్టు... దీనికి తోడు శోభన్ బాబు రాముడు. ఆడినట్టే అనుకున్నారు. శతదినోత్సవం నాటికి... ముక్కుమీద ఏలేసుకున్నారనుకోండి. మహదేవన్ సంగీతం, ఆరుద్ర పాటలు " సంపూర్ణ రామాయణానికి" మాబాగా కుదిరాయి. సన్నివేశాల సంగతి చెప్పాలా. ఎన్టీఆర్ ప్రత్యేకంగా షో వేయించుకుని మరీ చూశార్ట. సినిమా ఫుల్లు హిట్టు. ఈ సారి నాగేశ్వరరావుతో సినిమా. మళ్లీ రాముణ్నే నమ్ముకున్నారు. పేరు " అందాల రాముడు" . చాలా సినిమా పడవలోనే. స్టార్టింగు ట్రబులొచ్చినా.. నిదానంగా వేగం అందుకుంది. మొన్న " సంపూర్ణ రామాయణ" మైందిగా... ఇప్పుడు " శ్రీరామాంజనేయ యుద్ధం" అంటూ రంగంలోకి దిగారు. రాముడు ఎన్టీఆర్. మాబాగా కుదిరింది. ఆ తర్వాత వెండితెరపై " ముత్యాల ముగ్గు" వేశారిద్దరూ. మేకప్ లేకుండానే... ఇషాన్ ఆర్య కెమెరా పనితనంతో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రేక్షకులు, అవార్డుల వాళ్లే కాదు... ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను బాగా మెచ్చుకున్నారట. కలాపోసనలో ఆయనకు మించిన వారెవరు. ఈ సారి బాపు గారు... రమణ గారు లేకుండానే... చక్రపాణికి అసిస్టెంటులాగా " శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్" తీశారు. అది బావుందనిపించుకుంది. తర్వాత " భక్తకన్నప్ప" . ఆ సినిమానూ చాలా మంది మెచ్చుకున్నారనుకోండి. ఇప్పడు మళ్లీ రామాయణం వంతు. " సీతాకళ్యాణం" పేరుతో సినిమా తీశారు. గంగావతరణ ఘట్టం మాబాగా పండింది. ఈ సినిమా మార్కులు... చాలా వరకూ బాపుగారి ఖాతాలోనే. ఎందుకంటే మాటల పొదుపు మరీ ఎక్కువ. " సీతాకళ్యాణం" తర్వాత " స్నేహం" గురించి చెబుదామనుకున్నారు... ప్రేక్షకులు ససేమిరా అన్నారు. ఇక రమణగారు రంగంలోకి దిగారు. కన్నడ మాతృక నుంచి " మనవూరి పాండవులు" పుట్టుకొచ్చారు. కృష్ణంరాజుతో పాటు అర్జునుడిగా చిరంజీవి కూడా మాబాగా నటించేశాడు. తర్వాత వాణిశ్రీ కథానాయికగా... ఆ అందాలనటికి మేకప్ లేకుండా... " గోరంత దీపం" తీశారు. ఇద్దరికీ ఈ సినిమా చాలా ఇష్టమట. అలాంటి ప్రేక్షకులకు కూడా బానే నచ్చేసింది తర్వాత " తూర్పు వెళ్లేరైలు" ... " కలియుగ రావణాసురుడు" ... " వంశవృక్షం" ... " పండంటి జీవితం" వరసగా వచ్చి వెళ్లాయి. " రాజధిరాజు" ఫర్వాలేదు అనిపించాడు. " బుల్లెట్" వేగం అందుకోలేకపోగా... " జాకీ" సరిగా పరిగెత్తలేకపోయింది. టైము మనది కాదు మరి. ఈ మధ్యలో " మంత్రిగారి వియ్యంకుడి" మాట సరేననుకోండి. " కళ్యాణతాంబూలం" కూడా సరిగా పండలేదు. అందుకే " పెళ్లిపుస్తకం" తెరిచారు. నంది అవార్డుతో పాటు జనం రివార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. అరుద్ర గారి శ్రీరస్తు... శుభమస్తు... పాట బోలెడన్ని మార్కులు వేయించుకుంది. ఈసారి ఎన్టీఆర్ నుంచి పిలుపు... లవకుశ తీద్దామన్నారు. మీకు మీరే పోటీ ఎందుకండీ. ఇంకోటి తీద్దాం అన్నారట. అలా " శ్రీనాథ కవిసార్వభౌముడు" స్క్రిప్ట్ సిధ్దమైంది. సినిమా ప్రివ్యూ చూసి ఎన్టీఆర్ కౌగిలించుకున్నారట. డబ్బులు పెద్దగా రాలేదు కదండీ అంటే... "కళాపోషణ అందరికీ ఉండాలిగా బ్రదర్్" అన్నారట. సరిగ్గా అప్పుడే చేసిన " మిస్టర్ పెళ్లాం" కి ప్రేక్షకుల రివార్డులతో పాటు నంది అవార్డు కూడా లభించింది. కళాతపస్వి విశ్వనాథ్ మెచ్చుకోళ్లు వీటన్నింటికీ కొసరన్నమాట. ఈ సమయంలోనే " పెళ్లికొడుకు" కాస్తంత నిరాశ పరిచాడు. అనంతరం " రాంబంటు" కు మెచ్చుకోళ్లే తప్ప జీతం రాళ్లు రాలలేదు. మొగుడు పెళ్లాలు సమానం... మొగుడు కాస్త ఎక్కువ సమానం అంటూ " రాథాగోపాళం" తెరకెక్కించారు. సరదా సినిమా అనే మార్కులు దక్కించుకుంది. తర్వాత తల్లిదండ్రుల్ని కలిపే " హనుమంతురాలి" కథతో తెరకెక్కిన " సుందరకాండ" ... పాపం... అందర్నీ నిరాశపరిచింది. ఇహ సినిమాలొద్దులే హాయిగా రెస్టు తీసేసుకుందాం అనుకున్నారు బాపు-రమణలు. అయితే అభిమానులు ఊరుకుంటారా. ఎన్టీఆర్ తో ఎలాగూ తీయలేదు... కనీసం బాలకృష్ణతోనన్నా " లవకుశ" తీయండి అన్నారు. రాముణ్ని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. అందుకే " శ్రీరామరాజ్యం" మొదలెట్టారు. రమణగారు మాటలిచ్చి మధ్యలోనే వెళ్లిపోయారు. అంత దుఖంలోనూ బాపుగారు కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు. అద్భుతంగా తెరకెక్కించి, రమణాంకితం చేసేశారు. సినిమా లవకుశని మరిపించేసిందంటే నమ్మండి. బాపు వెంట రమణ... రమణకు ముందు బాపు... భలేగా సాగిందిలేండి వీరి ప్రస్థానం. శ్రీరామరాజ్యం నాటికి రమణగారెందుకో అలిగి వెళ్లిపోయారు. శరీరం మాత్రమే మిగిలింది. ఆత్మ వెళ్లిపోయింది. ఇప్పుడా శరీరం కూడా మరణించింది. కాదు... కాదు... రమణించింది. అసలు నిజానికి..... కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా... అని ఆరుద్ర గోరు దేముడికి సెప్పెసినట్టున్నారు. దానికి రమణ గోరు తలాడించినట్టున్నారు. రావుగోపాల రావు గోరు... మరే మడిసికే గాదు.. దేవుడిగ్గూడా కలాపోసన ఉండాలోయ్ అనే ఉంటారు. పక్కనున్న నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ ఊరకుంటాడా... మరే అనేసి ఉంటాడు. దేవుడు వెంటనే ఎన్టీవోడుని అడిగేసి ఉంటాడు. ఆయన కూడా హు..హు.. అంటూ గంభీరంగా నవ్వి... అవునన్నట్లు తలూపి ఉంటారు. ఇంకేముంది. దేవుడు గోరు బాపు గారిని కూడా తీసుకుపోయాడు.

No comments:

Post a Comment

Pages