లండన్ అమ్మమ్మ - అచ్చంగా తెలుగు

లండన్ అమ్మమ్మ

-  బి. ఎన్.వి.పార్ధసారధి


సుబ్బారావు మేనత్త మీనాక్షి లండన్ నుంచి ఇండియా వచ్చింది.మీనాక్షి కూతురు కౌసల్య తల్లిని  హైదరాబాద్ లో సుబ్బారావు ఇంట్లో దించి తన భర్త భరత్, కొడుకు కౌశిక్ తో షిర్డీ, నాసిక్, ముంబై, చెన్నై చూసి రావటానికి వెళ్ళింది. సుబ్బారావు కొడుకు మహేష్ కి క్రిస్మస్ శలవులు. జనవరి మొదటి వారం లో స్కూలు తెరుస్తారు.మీనాక్షి పుణ్యమా అని ఆరేళ్ళ మహేష్ ని క్రెచ్ లో విడిచి పెట్టడం తప్పిందని సుబ్బారావు భార్య సుమతి సంతోషించింది. వారం రోజులు మీనాక్షితో ఇంట్లోనే వుండటం వల్ల మహేష్ లండన్ అమ్మమ్మ కి బాగా చనువయ్యాడు. రాత్రిళ్ళు లండన్ అమ్మమ్మ పక్కనే పడుకుని ఆవిడె చెప్పే కధలు, గాధలు వింటూ రోజల్లా లండన్ అమ్మమ్మ వెంటే తిరుగుతూ అవిడికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ , సాయంత్రం మొక్కలకి నీళ్ళు పడుతూ అవిడితో పాటు ఆతర్వాత కాలనీలో శివాలయానికి వెళ్లి సాయంత్రం అమ్మా నాన్నలు వచ్చే సమయానికి అమ్మమ్మ మనవడు తిరిగి ఇంటికి వచ్చేవారు. శలవలు ఇట్టే అయిపోయాయి. స్కూలు తెరిచారు.మొదటి రోజునే సాయంత్రం స్కూలు నుంచి బిక్క మొహంతో ఇంటికి వచ్చాడు మహేష్. క్రిస్మస్ కి ముందు జరిగిన పరీక్షలలో అన్ని పేపర్లలో ఫెయిల్ అయ్యాడు మహేష్. సుమతి కంగారు పడింది.ఇంతకుముందు సారి జరిగిన పరీక్షలలో కూడా మహేష్ మంచి మార్కులు తెచ్చుకోలేదు. స్కూల్లో టీచర్ తిడుతుందని , మిగతా పిల్లల ముందు చులకన అవుతాననే భయంతో స్కూలుకు వెళ్లనని మొండికేశాడు మహేష్.దాదాపు వారం రోజులు నానా ఇబ్బంది పడ్డాక , చివరికి ఎలాగైతేనేం మళ్ళీ స్కూలుకి వెళ్లడం మొదలెట్టాడు మహేష్. ఈ వెనకటి ఉదంతం మళ్ళీ ఎక్కడ పునరావృతం అవుతుందో నని సుమతి చాలా దిగులు పడింది. సుమతి భయపడ్డట్టు గానే మహేష్ మర్నాడు స్కూలు కి వెళ్ళలేదు. లండన్ అమ్మమ్మ మనవడిని వెనకేసుకొచ్చింది. “నాలుగు రోజులు స్కూలు కి వెళ్ళకపోతే కొంపలేం అంటుకు పోవు , ఆనక పిల్లాడే స్కూలు కి వెడతా నంటాడు” అని  లండన్ అమ్మమ్మ సర్ది చెప్పింది. సుమతికి లండన్ అమ్మమ్మ మాటలు నచ్చలేదు. కానీ గట్టిగా మారు మాట్లాడితే భర్త సుబ్బారావు తనని మందలిస్తాడని మౌనం దాల్చింది. సుబ్బారావు మేనత్త మీనాక్షికి పెళ్ళైన చాలకాలంవరకు పిల్లలు కలుగలేదు. మీనాక్షి పెళ్లినాటికి సుబ్బారావు మూడేళ్ళ వాడు . దానితో సుబ్బారావు పెంపకం చాలావరకు మీనాక్షి చేతులమీదుగా గారాబంగా జరిగింది. సుబ్బారావు బాల్యంలో బాగా అల్లరి చేసేవాడు. పైగా మేనత్త దన్ను చూసుకొని తల్లి మందలించినా లెక్క చేసేవాడు కాదు. సుబ్బారావు అల్లరి కారణంగా మీనాక్షికి, సుబ్బారావు తల్లికి తరచూ స్పర్ధలు కూడా వచ్చేవి. దాదాపు పెళ్ళైన పదేళ్ళకి మీనాక్షికి కౌసల్య పుట్టింది. సుమారు పదమూడు ఏళ్ల తేడా వుండటంతో సుబ్బారావు కౌసల్యని చిట్టి చెల్లెలుగా చూసుకునేవాడు. పెద్దయ్యాక కౌసల్యకి వివాహం కావటం ఆతర్వాత ఆమె భర్త భరత్ కి లండన్లో ఉద్యోగం రావటం జరిగింది.దానితో మీనాక్షి వారితోపాటు లండన్ వెళ్లటం జరిగింది. అప్పుడు సుబ్బారావు కొడుకు మహేష్ మీనాక్షికి లండన్ అమ్మమ్మ అని నామకరణం చేసాడు. రెండోరోజు కూడా మహేష్ స్కూలుకి వెళ్ళలేదు.దానితో సుమతికి గుబులు పెరిగింది. “సుబ్బిగాడు కూడా చిన్నప్పుడు ఇట్టాగే అలిగి తరచూ స్కూలుకి వెళ్ళేవాడు కాదు. పెద్దయ్యాక బుద్దిమంతుడుగా మారాడు. అట్టాగే మహేష్ కూడా పెద్దయ్యాక బుద్దిమంతుడు అవుతాడు లే అల్లరి చిన్నప్పుడు చెయ్యక పెద్దయ్యాక చేస్తారా ?” అని తర్కం మొదలెట్టింది లండన్ అమ్మమ్మ.  పెద్దావిడ ఇంకో నాలుగు రోజుల్లో లండన్ వెళ్ళిపోతుంది. ఈ నాలుగురోజుల్లో ఈవిడ ఇలా ముద్దు చేస్తే వీడు ఏకు మేకై  స్కూలుకి  వెళ్ళనంటాడని సుమతి బెంగ పెట్టుకుంది. ఆమాటే భర్త సుబ్బారావుతో అంది సుమతి. సుబ్బారావు ఎప్పటిలాగే  వినీ వినివనట్టు ఊరుకున్నాడు.రెండురోజులుగా రాత్రిళ్ళు పడుకునేముందు మీనాక్షి మహేష్ కి రాణాప్రతాప్ సింగ్ వీరగాధ, కురుపాండవ యుద్ధం కధలుగా చెప్పటం సుమతి గమనించింది. మహేష్ ఎప్పటిలాగే లండన్ అమ్మమ్మ చెప్పే కధలు ఆసక్తిగా వినటంకూడా సుమతి గ్రహించింది.మరో రెండురోజుల్లో మీనాక్షి లండన్ ప్రయాణం అనగా మహేష్ స్కూలు కి వెళ్ళాడు. సాయంత్రం స్కూలునుంచి రాగానే మొదట్లో కాస్త దిగులుగా కనిపించాడు.ఆరా తీస్తే మంచి మార్కులు రానందుకు టీచరు చీవాట్లు పెట్టిందని తెలిసింది. లండన్ అమ్మమ్మ మహేష్ ని ఆటల్లోదింపి , మాటల్లో కధలు చెబుతూ మనోధైర్యం  నూరిపోసింది. రాత్రికల్లా మహేష్ కాస్త మామూలుగా అయ్యాడు. మర్నాడు ఉదయం ఎక్కువ పేచీ పెట్టకుండానే స్కూలుకి వెళ్ళాడు.హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సుమతి.   ఆమర్నాడు కౌసల్య, భరత్, వాళ్ళ కొడుకు కౌశిక్ ఇండియాలో వారి యాత్రలు  ముగించుకుని చివరగా హైదరాబాదు వచ్చారు. వారు మీనాక్షిని వెంటతీసుకుని రాత్రి లండన్ ప్రయాణానికి  సిద్దంకాసాగారు.మహేష్ లండన్ అమ్మమ్మకి వీడ్కోలు చెప్పాడు. “ లండన్ అమ్మమ్మా నేను పెద్ద అయ్యాక బాగా చదువుకుని ఉద్యోగం చెయ్యటానికి లండన్ వస్తాను. అప్పుడు నీదగ్గరే వుంటాను సరేనా ? “ అన్నాడు. “సుబ్బిగాడు చిన్నప్పుడు అచ్చం మహేష్ లాగే అల్లరి చేసీవాడు.మహేష్ ని చూస్తుంటే వాళ్ల నాన్న బాల్యం గుర్తుకొస్తోంది. పెద్దయ్యాక నువ్వు మీ నాన్నకన్నా  గొప్పవాడివి అవుతావురా “ అని దీవిస్తూ మహేష్ ని ముద్దెట్టుకుంది లండన్ అమ్మమ్మ. *     *         *           *          *          *           *         *        *        *        * మీనాక్షి లండన్ వెళ్లి దాదాపు ఏడాది అయింది. ప్రతీసారీ మహేష్ పరీక్షలప్పుడు లండన్ అమ్మమ్మ ఫోన్ లో మాట్లాడుతుంది.పరీక్షలు పాసు అయినా అవకపోయినా మహేష్ హుషారుగా స్కూలుకి వెడుతున్నాడు.కానీ మహేష్ మంచి మార్కులు తెచ్చుకోవడం లేదని సుమతి బెంగ పెట్టుకుంది. “కొంతకాలం పోతే పెద్దవాడయ్యాక వాడే బాగా చదువు కుంటాడు లే “అని మీనాక్షి ఫోనులో మాట్లాడి సుమతిని ఓదార్చింది. ఇప్పుడు మహేష్ తొమ్మిదో క్లాసు కి వచ్చాడు. మునపటి కన్నా బాగా చదవటం ,కాస్త మంచి మార్కులు సంపాదించటం చెయ్య సాగాడు. సుమతి చాలా సంతోషించింది. ఆనందంతో మీనాక్షికి ఫోన్ చేసింది.  “జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. చదువే జీవితం కాదు. పిల్లలు ఆట పాటల్లో చురుకుగా వుంటూ సరదాగా వుంటే చదువులో క్రమంగా శ్రద్ధ చూపెడతారు. నలుగురు పిల్లలతో తిరిగితే వారిలాగా మనం కూడా బాగా చదవాలని అనుకుంటారు. పెద్దవాళ్ళం మనం వారితో నువ్వు ఇంకా బాగా చదవగలవు అదేం పెద్ద కష్టం కాదు. కాస్త శ్రద్ధగా చదువు. రోజూ కాస్సేపు ఆడుకో అలాగే కాస్సేపు శ్రద్ధగా చదువుకో. మంచి మార్కులు ఆవే వస్తాయి  అని మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కాస్త నూరిపోస్తే చాలు పెద్దయ్యాక వాళ్ళే గ్రహిస్తారు. చిన్నప్పుడు అల్లరి నువ్వు చెయ్యలేదా ? నేను చెయ్యలేదా? నామాట విని కొన్నాళ్ళు మీ అమ్మని మీదగ్గర ఉంచుకోండి. పెద్ద దిక్కు లేక పిల్లాడు ఒంటరితనం తో అలా ప్రవర్తిస్తున్నాడు “ అని లండన్ అమ్మమ్మ హితబోధ చేసింది సుమతికి. సుమతికి తన బాల్యం గుర్తుకొచ్చింది.తను కూడా చిన్నప్పుడు బాగా చదివేది కాదు. అమ్మా నాన్నా బాగా మందలించేవారు. బామ్మ తనని ఎంతో గారాబంగా చూసుకొనేది. ఇంటి పనులతో అమ్మా, ఆఫీసు పనులతో నాన్నా ఎప్పుడూ బిజీగా నే ఉండేవారు. తన చిన్నప్పుడు బామ్మతోనే ఎక్కువ కాలం గడిపేది. తన బాల్యం లోని పెంపకానికి మహేష్ బాల్యంలోని పెంపకానికి తేడా ఏమిటో గ్రహించింది సుమతి. మహేష్ కి బామ్మో అమ్మమ్మో లేకపోవటమే ! తమకి పెళ్ళైన రెండేళ్లకే సుబ్బారావు తల్లీ తండ్రీ మరణించారు. తమ పెళ్ళికి ముందే సుమతి వాళ్ల నాన్న మరణించారు. సుమతి తల్లి తన కొడుకు దగ్గర వుంటుంది. చుట్టపు చూపుగా ఏడాది కి నాలుగు రోజులు సుమతి తన అన్నా వాళ్ళ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుంది. సుమతి సుబ్బారావు ఇద్దరూ ఉద్యోగస్తులవటం వల్ల చుట్టా లెవరూ పెద్దగా ఇంటికి రారు. సుమతి తల్లి కూడా ఎప్పుడో కాని కూతురింటికి రాదు. మహేష్ కి ఎమోషనల్ సపోర్ట్ , కౌన్సెలింగ్ తాను తన భర్త ఇవ్వలేకపోతున్నామని గ్రహించింది సుమతి. “కొన్నాళ్ళు మా అమ్మని వచ్చి మనింట్లో వుండమం దా మండీ “ అంది సుమతి భర్త సుబ్బారావు తో ఒక రాత్రి నిద్ర పోయే ముందు. ఎప్పుడూ వినీ విననట్టు ఊరుకొనే సుబ్బారావు ఈ సారి మాత్రం “ కొన్నాళ్ళే ఎందుకు ఆవిడికి నచ్చినంత కాలం మనింట్లో వుండమను. మహేష్ తో ఆవిడికి కాలక్షేపం అవుతుంది” అన్నాడు. సంతోషంతో కళ్ళు చెమరగా నిద్ర పూతున్న కొడుకు మహేష్ ని ప్రేమతో అక్కున చేర్చుకుంది సుమతి మీనాక్షి కి మనస్సు లోనే  కృతజ్ఞతలు తెలుపుతూ.

No comments:

Post a Comment

Pages