బాల గాంధర్వం.. : కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ - అచ్చంగా తెలుగు

బాల గాంధర్వం.. : కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

Share This
బాల గాంధర్వం
 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరునికి గళం అరువిచ్చినదెవ్వరు..?
అభినవ గాంధీ బెన్ కింగ్స్ లే  తెలుగులో ఎలా మాట్లాడారు??
ప్రముఖ హిందీ నటుడు.. అనిల్ కపూర్ తెలుగులో నటించారు కానీ.. స్లం డాగ్ మిలియనీర్ లో తెలుగులో ఎలా సంభాషించారు..
దశావతారి కమల్ నటనతో జీవం పోస్తే..పది వేరువేరు  గళాలతో అలరించినదెవరు??
వీరందరి గొంతులో జీవంపోసి గాంధర్వ మాధుర్యం అందించిన అపర అన్నమయ్య..
పద్మభూషణ్ కలైమామణి మియా తాన్ సేన్ డా. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
ఏదివిలో విరిసిన పారిజాతమో..
ఈ భుమిపై మెరిసిన సినీ గీతమో..
శంకరాభరణ ఓంకారనాదశరీరమో..
తేరా మేరా బీచ్ మె బంధనమో..
సాగరసంగమ తకిటతధిమో..
తానై తరలి వచ్చిన వసంతమో..
దివి నుంచి భువికి దిగి వచ్చి..
మనసుల నెగ్గిన భావగాన వీచిక
బాలసుబ్రహ్మణ్యం...గాత్రం
ఏ పాట విన్నా.. మరొక సారి నోట నానిందంటే..!.. అది ఖచ్చితంగా బాల సుబ్రహ్మణ్యం పాటేమోనని అనుమానించాల్సిందే.. అదే ఆయన ప్రత్యేకత.
"రత్తలు వస్తావా..అడిగింది ఇత్తావా.. " అంటూ మిమిక్రి చేసి పూర్తిగా ఒక పాట పాడిన వ్యక్తి బహుశ అరుదే అని చెప్పాలి .. అల్లురామలింగయ్య లాంటి సీనియర్ కామెడియన్ కి ఆయన  గొంతులోనే పాడి మెప్పించిన బాలు.. పాటలు పాడేటప్పుడు స్వంతగా చేసే గిమ్మిక్కులు ఎందరినో ఆకట్టుకుంటుంటాయ్.. చాలాకాలంగా అనుసరణీయాలయ్యయ్..!
ఒకటా రెండా.. టన్నుల కొద్దీ పాటలు..తవ్వె కొద్దీ మాధుర్యం.. కోట్ల మనసుల్లో స్థానం..ఇవన్నీ కేవలం అతనికే సాధ్యం.. ఖచ్చితంగా నభూతో ..న భవిష్యతి అనేవి ఆయనకి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి.. ఈ పదాలు వారి పరిశ్రమకు కొలమానం కాకపోవచ్చు..కానీ వాస్తవ దూరం మాత్రం కాదు.. ఇంతకీ అతనెవరో కాదు నిత్యం మనందరి మనసుల్లో తీయగా..చల్లగా  పాటలు పాడే బాలు అని. . ఎస్.పి.బి.. అని అందరూ తమవారిలా  పిలుచుకునే..  శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..
బాలసుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే..!.. సినీ వినీలాకాశంలో  పుట్టిన ఓంకార నాదం.. వెండితెర లోకంలో విరిసిన ఒక పారిజాతం .. ఆ స్వరం స్వర్గం అంచులు చూపిస్తుంది.. ఆ..గానం..రసడోలికలలో ముంచి తేలుస్తుంది...
సహజంగా వెండితెర లాంటి  మాధ్యమాలలో హీరోలని..హీరోయిన్లని.. ఆటగాళ్ళని..పాటగాళ్లని.. ఆడించే వాళ్ళని..పాడించే వాళ్ళని.. దర్శకులని..దార్శనికులని.. నిర్మాతలని చూస్తుంటాం కానీ,
నిరంతరం సాధన చేసే మునిని..అలసట ఎరుగని యోగిపుంగవుడిని.. చూశారా..  నలభై సహస్రాలు పైగా పాటలు పాడీ అందరి మనసుల్లో నిలచి..అందరి నాలుకలపై నడయాడుతున్న శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం..వయసు పెరుగుతున్నా తన శ్రమకు , వన్నె తరగ నివ్వని కళాకోవిదుడు..నిత్య విద్యార్ధి అని తనకు తాను చెప్పుకునే బాలసుబ్రహ్మణ్యం..   అందరూ ' బాలూ' అని పిలుచుకున్నట్లుగా కొన్నిసమయాల్లో నిజంగా చిన్నపిల్లాడే అనిపించేలా  ఉంటారు బాలు.
బాల్యం..కుటుంబం...
నెల్లురు జిల్లా కోనేటమ్మపేటలో ప్రముఖ హరికథా కళాకారుడు ఎస్పి సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కూతుళ్ళు. వారిలో రెండవ వాడు బాలసుబ్రహ్మణ్యం. 1946 జూన్ 4 వ తేదీన గానగంధ్వర్వుడు బాలసుబ్రహ్మణ్యం జన్మించారు.. ఆ సమయంలో సంగీత సరస్వతి తన వీణ శ్రుతి చేస్తూ ఉండి వుంటుంది.. అందుకేనేమో  సంగీత నేపథ్యంలేకున్నా.. సినిమా పరిశ్రమకు పరిచయం ఐన1966 నాటి నుండి.. నేటీ వరకూ 48 ఏళ్ళలోనలభై వేలకు పైగా పాటలు.. అనేక  భారతీయ భాషలైన తెలుగు, తమిళ, ,కన్నడ,మళియాళం, హిందీ, తుళు, ఒరియ, అస్సామీ, బదగా, సంస్కృతం , ఆంగ్లం, కొంకిణి, బెంగాలీ, మరాటీ,పంజాబీ లాంటి అనేక భాషలలో అనర్గళంగా తన గొంతును అరువిచ్చి..అరవనిచ్చి.. ప్రాంతాల కతీతంగా.. అనేక హృదయాలలో కొలువైయ్యాడు మన ఎస్.పి.బి. బాలు.    బాలు పాట ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వాటిలో సినిమాలే కాదు బుల్లితెర సీరియళ్ళు.. ప్రైవేట్ ఆల్బం లు.. మతాల కతీతంగా ప్రార్ధనాగీతాలు కూడా వున్నాయ్. .పలురకాల గా పాటలు ఆలాపించి దక్షిణభారతదేశ చరిత్రలో అధ్వితీయ..అపురూప.. నేపథ్య గాయకునిగా పుటల్లో పేరు సంపాదించుకున్నారు బాలు.
ఇంతగా కోటానుకోట్ల అభిమానుల మనసుల్లో ఒదిగిన బాలసుబ్రహ్మణ్యం గారికి ఇష్టమైన గాయకుడు రఫీ .. రఫీ గారి గాత్రంలో అనిర్వచనీయమైన మాధుర్యం వుందని..నిద్రపుచ్చుతున్నంత ఆహ్లాదంగా వుంటుందంటుంటారు బాలు. బాలు భార్యకి కూడా రఫీ గారంటే చచ్చేంత ప్రాణం.
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం భార్య పేరు పార్వతి. ఈ అనురాగ దంపతులకు ఒక కూతురు..పావని,పల్లవి..కుమారుడు చరణ్  (పల్లవి చరణాలను తన పిల్లలకు పేర్లు పెట్టుకుని పాట పై తన మమకారాన్ని చాటుకున్నాడు బాలు)
బాలు సోదరి ఎస్.పి. శైలజ   కూడా నేపథ్య గాయకురాలిగా తన ప్రస్థానాన్ని అన్న బాలు అదుగుజాడల్లో కొనసాగిస్తున్నారు. బాలు కుమారుడు ఎస్.పి చరణ్ కూడా నేపథ్యగాయకుడిగా చాలా పాటలు పాడాడు. 
బాలు కి తండ్రి హరికథా కౌశలం కాస్త ఒంటబట్టిదని చెప్పుకోవచ్చు.. చిన్ననాటి నుండే చక్కగాపాడటం అలవడింది..అనేక పోటీలలో పాటలుపాడి పలువురు ప్రముఖులచే శెభాష్ అనిపించుకున్నబాలు గారి గురించి చాలామందికీ  తెలియని ఒక విషయమేమిటంటే.. బాలు చాలా చక్కగా ఫ్లూట్ వాయిస్తారట. మురళి గాన లోలుడన్నమాట.  బాలు ని సాంబమూర్తిగారు ఇంజనీరింగ్ చేయించేందుకు తొలుత అనంతపురం  పంపారు . అక్కడ కుదురులేకుండా తిరిగొచ్చిన బాలూని ఎ.ఎం.ఐ.యి చేసేందుకు  మద్రాసు (ఇప్పటి చెన్నై) కి పంపారు...
అక్కడే భారతదేశం గర్వించదగ్గ నేపథ్యగాయకుడు బాలు  ప్రపంచానికి తెలిపే సంఘటన ఒక వేదిక పై జరిగింది. 1964లో మద్రాసులో ఒక పాటల పోటీలో అలవాటుగా పాల్గొన్న బాలు గళ మాధుర్యాన్ని గమనించారు ఆ కార్యక్రమానికి  విచ్చేసిన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు కోదండపాణి..
విశ్వామిత్రుని వెనుక వడివడి అడుగులేసిన శ్రీరాముడల్లే.. బాలుని బుడిబుడి అడుగులు కోదండపాణిని అనుసరించాయి.. ఆ నీడలో ఆసేతు హిమాచలం అంతగా ఎదిగారు బాలు.  డిసెంబర్ 15 1966 లో  హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన, కోదండపాణి గారు స్వరపరచిన  శ్రీశ్రీశ్రీమర్యాదరామన్నలో తొలిగా తన స్వరం సరిచేసుకున్నారు బాలు.
అది 1966 వ సంవత్సరం.. డిసెంబర్ 15 తేదీ..
స్థలం : మద్రాసు , రికార్డింగ్ ధియేటర్
శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న పాటల రికార్డింగ్ జరగబోతోంది.. రికార్డింగ్ ధియేటర్ కి నూనూగుమీసాల నూత్నయవ్వనమున వున్న ఒక చిన్నకుర్రాడు వచ్చాడు.
రికార్డింగ్ ధియేటర్ లో ఒక వ్యక్తి... తన తోటి ఉద్యోగితో...
"ఎన్నప్ప ఇవల చిన్నపయ్యన్ ఎన్న పాడ పొరాన్."
"యార్ ఇవనై కూపిట్టదు"
("ఏవయ్య ఇంత చిన్న కుర్రాడు ఏమి పాడతాడయ్యా?? ... ఎవరయ్య వీణ్ణి పిలిచింది. "
అని అన్నాడు..)
తమిళం అప్పటికి ఏమీ రాని ఆ కుర్రాడు చిరునవ్వుతో లోపలికెళ్ళాడు.. రికార్డింగ్ పూర్తిచేసుకుని తిరిగి వెళ్తుండగా..
అదే వ్యక్తి మరలా బిత్తరపోయి చూస్తూ..
"ప్రమాదం[అద్భుతం] ఇవన్నల్లా పాడినాన్,ఇవనుక్కు నల్ల ఎదిర్కాలం ఇరుక్కు"
"రొంబ పెరియవనా వరువాన్ "
("అద్భుతం..చాలా బాగా పాడాడు.. వీడికి మంచి భవిష్యత్తుంది.."
" ఇతను చాలా ఉన్నత స్థాయికి వెళతాడు")
అని అదే వ్యక్తి దీవించాడు..
ఆ యువకుడికి  కాస్త అర్ధమైందో..లేక అతని చూపులను పసిగట్టాడో అతనికి సంస్కారంగా నమస్కరించి బయటకు సంతోషం..ఉద్విగ్న క్షణాలను తన కన్నవారితో స్నేహితులతో పంచుకునేందుకు పరుగెత్తాడు.. అతడే ఇప్పటికి నలభై వేల పైచిలుకు పాటలు అలవోకగా పాడిన మన బాలసుబ్రహ్మణ్యం. ...  ఘంటశాల వెంకటేశ్వరరావు గారు, పి.బి శ్రీనివాస్ గారు లాంటి మాహామహులు తెలుగు సినీలోకంలో సినీనేపథ్య వేదికను ఏలుతున్న సమయంలో నేపథ్య గాయకునిగా రంగప్రవేశం చేశాడు బాలు. ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు.. వందలాది అవార్డులు.. సన్మానాలు.. ఆయననే వెదుక్కుంటూ వచ్చాయి.. అ సమయంలోనే బాలు ఒక మ్యూజిక్ ట్రూప్ ని మద్రాసులో నిర్వహిస్తుండె వారు.. ఆ ట్రూప్ లోనే ప్రఖ్యాత సంగీత దర్శకులు ఇళయరాజా కీబోర్డ్ ప్లేయర్ గా సహకారం అందించే వారు.    తన కు నేపథ్య గాయకునిగా పునర్జన్మకు కారణమైన సంగీత దర్శకులు కోదండపాణిని, నిర్మాత పద్మనాభం ని బాలూ తలచుకోని వేదికుండదంటే అతిశయోక్తి కాదు. బాలు తాను నిర్మించుకున్న రికార్డింగ్ ధియేటర్ కు కోదండపాణి అని పేరు పెట్టుకొని ఆయనపై ఉన్న గురు భక్తిని చాటుకున్నారు. జానకి, సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి , ఎస్.ప్. శైలజ , చిత్ర వంటి హేమాహేమీలతో ..పలువురు వర్ధమాన గాయనిలతో యుగళగీతాలు ఆలాపించారు బాలు.
జాతీయ అవార్డులు..
దక్షిణభారతదేశం లోని తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో ఆలాపిస్తూ.. ఏక్ధూజేకేలియే వంటి హిందీ చలన చిత్రంలో పాటలుపాడి   భారతదేశంలోని వేలాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న గానకోకిల బాలసుబ్రహ్మణ్యం.
1979 లో శంకరాభరణం (తెలుగు) చిత్రంలో కెవి మహదేవన్ సంగీతంలో  ఓంకారనాదాను సంధానమౌ గానమే  గానానికి జాతీయ అవార్డును అందుకున్నారు బాలు.   (https://www.youtube.com/watch?v=JpGSPvWzHmc)
1981 లో ఏక్ ధూజే కేలియే (హిందీ)లో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరపరచిన తేరా మేరా బీచ్ మె కైసాహెయె బంధన్.. పాటకు జాతీయ అవార్డు బాలుని వరించింది.(https://www.youtube.com/watch?v=oGKDBhdxn6c)
1983లో  సాగరసంగమం (తెలుగు) చిత్రంలో ఇళయరాజ స్వరపరచిన తకిటతథిమి తందాన పాటకు  జాతీయ అవార్డు తనఖాతలో వేసుకున్నారు బాలు.(https://www.youtube.com/watch?v=ckuYaGGkqjw)
1988లో రుద్రవీణ(తెలుగు) చిత్రంలో ఇళయరాజ స్వరపరచిన "చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది.." పాటకు,(https://www.youtube.com/watch?v=gSkwSSJV7Rg)
1995 లో  జ్ఞానయోగి పంచాక్షర గావయి (కన్నడ) చిత్రానికి గాను హంసలేఖ స్వరపరచిన ఉమ్మండు.. గుమ్మండు పాటకు
1996 లో మిసరకన్నవు (తమిళ) చిత్రంలో ఎ.ఆర్.రహమాన్ సంగీత సారధ్యం వహించిన  " తంగా తమరై మాగలే " పాటకు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు ఎస్.పి.బాలు.
ఏకబిగిన పదిహేడు పాటలు ఉదయం 9 గంటల నుండి- రాత్రి 9 గంటల వరకూ రికార్డింగ్ కోసం కన్నడం లో  సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ కోసం పాడారు.
తెలుగు, తమిళ్ లలో ఒకే రోజు 19 పాటలు రికార్డీంగ్ కోసం సంగీత దర్శకులైన ఆనంద్ మిళింద్ కోసం ఆలాపించిన  సినీ గాంధర్వుడు బాలు. సినిమా రికార్డింగ్ అయిన పాటల్లో అత్యధికంగా పాటలు పాడిన ఒక వ్యక్తి గా ఎస్.పి.బి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థాపించారు. మహిళల్లో ఇది కూడా భారతీయుల పేరిటే వుంది.. ఆవిడే ప్రముఖ బాలివుడ్ గాయని లతా మంగేష్కర్.
అవార్డులు రివార్డులు...
ఇక బాలూ మెడలో అవార్డులు రివార్డులు బాలుని లెక్కలేనన్ని వరించాయ్.
పొట్టీశ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్ (1999)
కె.ఆర్ నారాయణ్ చేతుల మీదుగా పద్మశ్రీ (2001),
సత్యభామ యూనివర్శిటీ (తమిళనాడు)డాక్టరేట్ (2009),
పద్మభూషణ్(2011) వంటి జాతీయ అవార్డులు వచ్చి మెరిశాయి.
అంతే గాక
దిల్ దీవానా అంటూ హిందీలో మైనే ప్యార్ కియా చిత్రంలో పాడిన పాటకు 1989 లో,
శ్రీరామదాసు (తెలుగు) అదిగో భద్రాద్రి గౌతమి పాటకు 2006 లో ,
మోజీ(తమిళ్)చిత్రంలోని కన్నల్ పేసుం పెన్నె పాటకు 2007లో  ఫిల్మ్ పేర్ అవార్డులను అందుకున్నారు బాలుగారు.
దేశంలోని అత్యంత పాత సంస్థ అయిన ఫిల్మ్ ఫాన్స్ అసోసియేషన్ మద్రాసు వారి నుంచి 20 పైగా పర్యాయాలు అవార్డును అందుకున్నారు బాలు.
అవే గాక
తమిళనాడు ప్రభుత్వం అందించే కలైమామణి (1981) అవార్డు
మియ తాన్ సేన్ అవార్డ్, సుర్ సింగర్ సంజాడ్ (బాంబే)
శ్రీమతి లతా మంగేష్కర్ పురస్కార్ (మధ్యప్రదేశ్ ప్రభుత్వం)
డా. బెజవాడ గోపాలరెడ్డి అవార్డ్
లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ (ప్లేబాక్ కింగ్ )
వంటి అవార్డులు వందలు ఆయన ఖాతలో చేరాయ్..
అవేగాక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  పురస్కారాలు 17 సార్లు
కర్నాటక రాష్ట్ర పురస్కారాలు 3సార్లు
తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు 3 సార్లు బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు.
సంగీత దర్శకునిగా....
సంగీత దర్శకునిగా బాలు  45 చిత్రాలకు పైగా తెలుగు,తమిళ, కన్నడ, హిందీ లలో చేశారు. నేపథ్య సంగీతం అందించిన మయూరి చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా బంగారు నంది అందుకున్నారు ఎస్.పి. ఆయన స్వరపరచిన మధురసాల  లో పడమటి సంధ్యారాగం చిత్రంలో అన్ని పాటలూ ఒకదానికి మించి మరొకటి.. అందులో " పిబరే రామరసం " ఒకటి.
నిర్మాతగా దక్షిణాది భాషలన్నింటిలో ఆయన చిత్ర్రాలు నిర్మించారు. విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హసన్ నటించిన శుభసంకల్పం  ఆయన నిర్మించిందే..! ఆశించినంత లాభాలు రాకున్నా.. అజరామరం గా నిలిచిన చిత్ర రాజం అది. తను స్వరాలకు అవార్డు నందుకున్న మయూరి చిత్ర్రా అనువాదాన్ని తమిళ్ లో ఆయనే నిర్మించారు.
నటుడిగా ...
నటుడిగా ఎన్నో చితాలలో నటించి మెప్పించారు బాలు..
తెలుగులో ప్రేమికుడు తమిళ కాదలన్ లో ప్రభు తండ్రిగా నటించి.. తండ్రి అంతే ఇలా వుండాలని అనేక మంది కొడుకుల మనసు దోచారాయన.
విదేశాల సంస్కృతి వంటబట్టిన వెంకటేష్ కు పెళ్ళి చేసేందుకు ఆరాటపడ్డ తండ్రిగా పవిత్రబంధం చిత్రం లో బాలు అసమాన అద్వితీయ నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెచ్చి బంగారు నంది అందించి తనను తాను సత్కరించుకుంది.
తనికెళ్ళ భరణి గారి మిధునం చిత్రంలో సీనియర్ నటీమణి లక్ష్మి గారితో కలిసి చేసిన బాలు నటన అల్టిమేట్ అనే చెప్పాలి.
యాంకర్ గా...
బుల్లితెర యాంకర్ గా ప్రజెంటర్ గా బాలు ఎన్నో విన్యాసాలు చేశారు బాలు.
సంగీతాలాపన చేయగలిగి మట్టిలో మాణిక్యాలు లాగా మిగిలిపోకూడదనే సత్సంకల్పంతో బాలు  ఈ టివీ వేదిక గా 'పాడుతాతీయగా' కార్యక్రమం ఎందరో గీత మాధుర్యాలను ఇటు ప్రేక్షకులకు ..అటు సినీ ప్రపంచానికి అందించే యాగం నిరంతరం సాగిస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం.
ఇప్పటికి వందలాది ఎపిసోడ్లు పూర్తయినా ప్రతి వారం టివీలకు అతుక్కునేంతగా చెరువయ్యరు బాలు.. ఎందరో గాంధర్వులను వెలికి తీసి సాన బెట్టిన పరుసవేది ఆయన.1.పాడుతాతీయగా (ఈటివి- తెలుగు)-200 ఎపిసోడ్లు పైగా
2. ఎందరో మహానుభావులు (జెమిని టివి - తెలుగు) - 73 ఎపిసోడ్లు
3. పాడాలని వుంది (మాటివి - తెలుగు) 300 పైగా
4.ఏధె తుంబి హాదువేణు (ఈటివి - కన్నడ)-403
5.ఎన్నెడుపాటలు పాడుంగళ్ (జయ-టివి- తమిళ్) 150
6.సునాద వినోదిని (ఎస్.వి.బి.సి- తెలుగు)- 49
7.ఘుమ్మంది నాదం (ఈటివి- తెలుగు) - 26
పలు భాషలలో పాటలు పాడే వారికోసం చిన్నరుల నుంచి పెద్దవారి వరకూ మాణీక్యాలను వెదికి ప్రపంచానికి పరిచయం చేశారు బాలు.
సినీ సంగీత వినీలాకాశంలో ధృవతారగా మిలమిల మెరుస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల మదిలో గుడి కట్టుకున్న బాలసుబ్రహ్మణ్యం ఉరఫ్ బాలు గారికి జన్మదిన సందర్బంగా ఇవే అచ్చంగా తెలుగు సమర్పించుకున్న శుభాకాంక్షల మాల.

No comments:

Post a Comment

Pages