కృష్ణం వందేహం - విసురజ - అచ్చంగా తెలుగు

కృష్ణం వందేహం - విసురజ

Share This
పుట్టకేమో చీకటి చెరసాలలో
శ్రీహరి చక్రి భక్తరక్షోపనిధి చిన్నికృష్ణ
దేవకి సుతుండై జనియించి
కంసమామ ప్రాణహరుండవైతివి లీలాకృష్ణ
తారాడింది అనురాగ బృందావనంలో
నందసుతడివి రాధసఖుడివై గోపికమానసచోరుడవైతివి
చిలిపిదొంగవి నీవు చిన్నికృష్ణ
ప్రభందకావ్యనాయకుడివి ప్రణయంలో నీవు లీలాక్రిష్ణ
ముసి ముసి నవ్వులతో
సర్వుల మనసు దోచేవు చిన్నికృష్ణ
కాలిఅందియలు చప్పుడవ్వకే
అల్లన మెల్లన వెన్నను దొంగిలించేవు లీలాకృష్ణ
ముద్దు ముద్దు చేష్టలతో
గోపికలను ప్రీతిమేర అలరించేవు చిన్నికృష్ణ
మోహనరూపానివి నీవు మోక్షప్రదాయివి
యోగీశ్వరడవు యాదవోత్తమడవు నీవు లీలాకృష్ణ
బహుదొడ్డ ఘనకార్యాలు చేసేవు
బాలరూపుతో బంగారుబుగ్గల చిన్నికృష్ణ
కిరీటికి గీతాసారాన్ని త్రావించేవు
చూపి నీవు విరాటరూపు లీలాకృష్ణ
గోవర్ధన పర్వతాన్ని చిటికెనవేలితో
చిత్రంగా చిటికెలో చకచకా పైకేత్తేవు చక్రధారి చిన్నికృష్ణ
గోవిందా గోవిందాయని పిలువ
గబగబా తరలోచ్చి కరిని కృపతో బ్రోచేవు లీలాకృష్ణ
ఇంట్లోనే క్షణకాలంలో చెప్పకనే నోటిలో
తల్లి అశోదకు ముల్లోకాలు చూపించేవుగా చిన్నికృష్ణ
ఆర్తిగా డగుత్తితో చెయ్యేత్తి మ్రోక్కంగానే
కౌరవసభలో ద్రౌపది మానసంరక్షణ గావించేవుగా లీలాకృష్ణ
అనురాగ ఆలంబనకు నీవు ఆత్మవి ఆత్మజుడివి
ప్రేమకు పట్టుకొమ్మవి పెద్దదిక్కువి నీవేగా చిన్నికృష్ణ
రాధారమణి వలపును గెలిచిన శ్రీనాధుడివి ప్రేమదేముడివి
స్వార్దరహిత ప్రేమే సత్యం శివం సుందరమని నిరూపించింది నీవేగా లీలాకృష్ణ
......

No comments:

Post a Comment

Pages