వేణుగోపాల శతకము - పరిచయం (దేవరకొండ సుబ్రహ్మణ్యం) - అచ్చంగా తెలుగు

వేణుగోపాల శతకము - పరిచయం (దేవరకొండ సుబ్రహ్మణ్యం)

Share This
 వేణుగోపాల శతకము - పరిచయం
దేవరకొండ సుబ్రహ్మణ్యం


ఉపోద్ఘాతం

పోలిపెద్ది వెంకటరాయ కవి (క్రీ.శ 1800 - 1875) విరచిత వేణుగోపాలశతకము అధిక్షేపశతకముల కోవకి చెందినది. ఇందు అనేక భక్తి శృంగార, నీతి పద్యాలతోపాటు అధిక్షేప పద్యాలు మెండుగానే ఉన్నాయి. ఐతే ఈశతకం ఆకాలంలో చాలా ప్రాచూర్యంపొందిన శతకాలలో ఒకటిగా నిలిచింది. ఈ శతకంలోని ఆనాటి భాష, వేషభూషలు, రాజుల, మంత్రుల, ప్రవర్తనాదులు ఎంత నిర్మొహమాటంగా, నిర్భయంగా, నిక్కచ్చిగా కుండబద్దలకొట్టినట్లు ఈ కవి తెలియచేసాడో పాఠకులకు చెప్పటమే ఈశతకపరిచయం చెయ్యటంలో ఉద్దేశ్యం.

కవి పరిచయం:

ఫొలిపెద్ద వేంకటరాయకవి (క్రీ.శ 1800-1875) వైదీక బ్రాహ్మణుడు. కార్వేటి రాజైన శ్రీవేంకట పెరుమాళ్ళు ఆస్థానంలో ఆస్థాన విద్వాంసుడు. ఈయన వేణుగోపాల శతకమే కాక లావణ్య శతకము ("శ్రీరామరామ! లావణ్యసీమ!" అనే మకుటంతో), తిట్ల దండకముకూడా చెప్పినాడు. ఈ తిట్లదండకము తెలుగు ప్రజలందరికి సుపరిచితమే. ఇందులో తననుగూర్చి తను చెప్పుకొన్న భాగము ఈకవి వైభవాన్ని చెప్పకనే చెప్తుంది.
" వేదవేదాంత తత్వజ్ఞుఁడన్, వైదీక శ్రేష్ఠుఁడన్, సజ్జనస్తవ్యుఁడన్, సాధుసాంగత్య మున్గ్ల్గువాఁన్, సదాచార శీలుండ, శ్రీవేణుగోపాల సద్భక్తుఁడన్, పోలిపెద్దాన్వయాబ్ధీందుతుల్యుండ, శ్రీ వేంకనార్యుండ, నాస్థానవిద్వాంసుఁడన్, సత్కవింద్రుండ, శ్రీకారువేటి పురాధీశు, శ్రీమన్మహామండలేత్యాది వాక్యాళి సంశోభితున్, రాజరాజేశ్వరున్, మాకరాడ్వంశసంజాతు, శ్రీవేంకట్పెరుమాళ్ళ రాజాశ్రితుండన్, సదారాజ సన్మానితుండన్"...
కార్వేటినగరములో వెలసిన శ్రీవేణుగోపాలస్వామి ఈకవి కులదైవం అవటంవలన "మదరిపువిఫాల మునిజన హృదయలోల వేణుగోపాల భక్త సంత్రాణశీల" అని ఆదైవం పేరునే శతకరచన చేసాడు. పైన చెప్పిన రచనలు కాక ఈ కవి ఇతర రచనల గురించి వివరాలు దొరకలేదు. 

శతక పరిచయం

వేణుగోపాలశతకం సీసపద్య శతకం. ఐతే ప్రస్తుతం ఇందులో దాదాపు 90 నుండి 100 పద్యములు మాత్రమే దొరుకుతున్నవి. "మదరిపువిఫాల మునిజన హృదయలోల వేణుగోపాలభక్త సంత్రాణశీల" అనే మకుటంతో ఉన్న ఈశతకంలోని పద్యాలు అనేకవిషయాలకు సంబంధిచినవి. ముఖ్యంగా ఆ కాలంలోని రాజులను, మంత్రులను, అధికారులను వారిచర్యలను తీవ్రంగా నిరసిస్తు చెప్పిన పద్యములు, స్మాన్య నీతులు చెప్పు పద్యములు ఎక్కవగా కనిపిస్తాయి. ఈసతకంలోని సీసపద్య భావములు సూటిగా చదువరి మనసులో నాటుకుపోయేట్లు ఉంటాయి. చదవటానికి సులువుగా ఉండే సామాన్య తెలుగులో, చెప్పదల్చుకొన్నది సూటిగా చెప్పటంలో కవి అఖండుడని చదివేవారికి తేటతెల్లమవుతుంది. వీరి సీసపద్య ప్రవాహంలో మునిగి ఆనందాబ్ధిలో తేలని సాహిత్య రసికులుండరేమో. అటువంటి పద్యాలను కొన్నిటిని మచ్చుకు మీ ముందుంచుతున్నాను.
వేణుగోపాల ప్రార్థన చేస్తూ చెప్పిన ఈ పద్యంలో అష్టభార్యలను ఎలా పొందుపరచారో చూడండి:

శ్రీ రుక్మిణీ ముఖసారస మార్తాండ, సత్యభామా మనశ్శశి చకోర
జాంబవతీ కుచశైల కంధర మిత్ర, విందాను సుధాధరబింబకీర
భద్రావయోవన భద్రేభరాజ క, ళిందాత్మజా చిదానందనిలయ
లక్షణాశృంగార వీక్షణకాసార, హంస సుదంతా గుణాపహార

సుందర కపోలవిబుధ సంస్తుత కృపాల
వాల ధృతశైల కాంచనవర్ణ చేల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

ఆకాలంలో రాజుల ప్రవర్తనలు వారి వద్దనుండిన వారి నడవదికలు వివరిస్తూ, రాజులేవిధంగా ఉండవలెనో బోదించిన పద్యాలలో కొన్ని :

అల్పునిఁ జేర్చిన నధిక ప్రసంగియౌ, ముద్దు చేసినఁ గుక్క మూతినాకు
గోళ్ళ సాఁకినఁ బొంత కుండలో విష్ఠించుఁ, గొద్దితొత్తుల పొందు రద్ది కీడ్చు
గూబలు వ్రాలినఁ గొంప నాశముఁ జేయుఁ, జన వీయఁగ నాలు చంక కెక్కుఁ
బలువతో సరసంబు ప్రాణహాని యొనర్చు, దుష్టుడు మంత్రియై దొరను జెఱచుఁ

కనుక నీవెర్గి జాగరూకతను ప్రజలఁ
బాలనముఁ జేయు టది రాజ పద్ధతి యగు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

అవనీశ్వరుఁడు మందుఁడైన నర్ధుల కియ్య, వద్దని యెద్ది దివాను చెప్పు
మునిషీ యొకడు చెప్పు మొనసి బక్షీచెప్పుఁ దరువాత నా మజుందారు చెప్పుఁ
దల ద్రిప్పుచును శిరస్తా చెప్పు వెంటనే, కేలు మొగిడ్చి వకీలు చెప్పు
దేశ పాండ్యా తాను దిన వలెనని చెప్పు, మొసరొద్ది చెవిలోన మొఱిగి చెప్పు

యశము గోరిన దొర కొడుకైన వాఁడు
ఇన్ని చెప్పులు కడఁ ద్రోసి యియ్య వలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

ఒక మహామంత్రికి ఉండవలసిన లక్షణాలు ఎంతబాగా వర్ణించారో ఈ కవి: 

కనుముక్కుతీరు చక్కనికాంతి పొందిన, శుభలక్షణంబులు సూక్ష్మబుద్ధి
ఘనత వివేక విక్రమము బాంధవ్య వి, మర్శ విలాసంబు మానుషంబు
సరస వాచాలత సాహసందొకవేళ, విద్యా విచక్షత విప్రపూజ
వితరణగుణము భూపతియందు భయభక్తి, నీతియు సర్వంబు నేర్చునోర్పు
స్నాన సంధ్యాద్యనుష్ఠాన సంపన్నత, గాంభీర్యము పరోపకారచింత

గలుగు మంత్రిని జేర్చుకోఁ గలుగు దొరకుఁ
గీర్తిసౌఖ్యము సకల దిగ్విజయము సిరి
గలుగుచుండును దోషము ల్దొలగుచుండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

అప్పటి క్షత్రీయ వస్త్రధారణ గురించి ఈ క్రింది పద్యాలలో చక్కగా తెలుసుకొన వచ్చును

కొండసిగల్ తలగుడ్డలు పాకోళ్ళు, చలువవస్త్రములు బొజ్జలకఠార్లు
కాసెకోకలు గంపెడేసి జందెములును, దలవార్లు జలతారు డాలువార్లు
సన్నపు తిరుచూర్ణ చారలు కట్నాలు, జొల్లువీడెమ్ములు వల్లెవాట్లు
దాడీలు వెదురాకు తరహా సొగసుకోర్లు, సంతకు దొరగార్లటంచుఁ బేర్లు

సమరమున జొచ్చి ఱొమ్ముగాయములకోర్చి
శాత్రవుల ద్రుంచనేరని క్షత్రీయులకు
నేలకాల్పన యీ వట్టి యెమ్మెలెల్ల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

రాయసకార్ల వేషాలు కూడా అతి రమ్యంగానే వర్ణించారు. తోడుగా వారి దుశ్చర్యలుకూడా ఎలాఊంటాయో చూడండి

వంకరపాగాలు వంపుముచ్చెల జోళ్ళు, చెవి సందుకలములు చేరుమాళ్ళు
మీఁగాళ్ళపైఁ బింజె బాగైన దోవతుల్, జిగితరంబైన పార్షీమొహర్లు
చేఁపవలెను బుస్తీ మీసము ల్కలం, దాన్పెట్టెలును జేత దస్త్రములును
సొగసుగా దొరయొద్దఁ దగినట్లు కూర్చుండి, రంకులాండ్లకు శిపారసులు చేసి

కవిభతుల కార్యములకు విఘ్నములు చేయు
రాయసా ల్పిందములు తిను వాయసాలు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

కవి చౌడప్ప "పస" పద్యాల మాదిరిగా విరి కొన్ని పద్యాలూన్నాయి. మచ్చుకి

ఆత్మగానని యోగి కద్వైతములు మెండు, నెఱ ఱంకులాఁడికి నిష్ఠ మెండు
పాలు పిండని గొడ్డు బఱ్ఱె కీఁతలు మెండు. కల్ల పసిండికిఁ గాంతి మెండు
గెలువని రాజుకు బలుగచ్చులును మెండు, వంధ్యకు భర్తపై వలపు మెండు
దబ్బరపాటకుఁ దలద్రిప్పుటలు మెండు, రోగపుఁ దొత్తు మెఱుంగు మెండు

వండ లేనమ్మకు వగపులు మెండు
కూటికియ్యని విటకాని కోర్కి మెండు
మాచకమ్మకు మనసున మరులుమెండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

భనుకోటి ప్రభా భాసురంబగు వెల్గు, పరులు చూచినఁ గానఁబడని వెల్గు
గురు కృపచేఁ గాకగుఱ్తెఱుంగని వెల్గు, నమృతంపు వృష్టిచే నమరు వెల్గు
విద్యుల్లతాది పరివేష్టితంబగు వెల్గు, ఘననీల కాంతులఁగ్రక్కు వెల్గు
దశవిధ ప్రణవనాదములు గల్గిన వెల్గు, మౌనులెన్నఁగ రమ్యమైన వెల్గు

ఆది మధ్యాంతరరహిత మైనట్టి వెల్గు
ఇట్టి వెల్గును సేవింపనట్టి చెట్ట
వారికే లభించు కైవల్యపదము
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

వేదాంత మనుచు బ్రహ్మాదు లెంచిన వెల్గు, నాదాంత సీమల నడరు వెల్గు
సాధుజనానంద పరిపూర్ణమౌ వెల్గు, బోధకు నిలయమై పొసగు వెల్గు
ద్విదళాబ్జ మధ్యమం దుదయమౌ వెల్గు, సుషమ్న నాళంబునఁజొచ్చు వెల్గు
చూడఁజూడఁగ మహాశోభితంబగు వెల్గు, నిఖిల జగంబుల నిండు వెల్గు

శతకోటి సారస హితుల మించిన వెల్గు
మేరువు శిఖరంబుమీఁది వెల్గు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

ఇలా చెప్పుకుంటూపోతే ఈ శతకంలో ప్రతి పద్యము అత్యంత మనోహరంగా ఉంటుంది. ఐతే ప్రతిపద్యం ఇక్కడ పొందుపరచటం కష్టం కాబట్టి మచ్చుకి కొన్ని మాత్రమే చూపించాను. చౌడప్పలాగా "నీతులు బూతులు లోక ప్రఖ్యాతులురా" అన్నట్లుగా ఈ కవికూడా అవసరం అనుకున్నచోట స్వేఛ్చగా బూతులు వాడారు. ఐతే పద్యాలలూ ఎబ్బెట్టుగా ఉండక చదివినవారికి భావం సూటిగా హత్తుకుపోతుంది. అన్నిపద్యాలు సుగమంగా ఉండటం వలన తాత్పర్యం వ్రాయటం లేదు. 
ఈవ్యాసం చదివిన తరువాత మీరు తప్పక ఈ అందమైన శతకాన్ని సంపాదించి చదివి ఇతరులచే చదివిస్తారని ఆశిస్తాను.

No comments:

Post a Comment

Pages