అబల కాదు సబల.. శ్రీకాంత్ కానం - అచ్చంగా తెలుగు

అబల కాదు సబల.. శ్రీకాంత్ కానం

Share This
అబల కాదు సబల
.. శ్రీకాంత్ కానం

ప్రకృతిలో స్త్రీ పురుషులలో ఏ ఒక్కరూ విడిగా ఏమి చేయలేరు. అందుకే పార్వతి పరమేశ్వరుల జంటను విడదీయరానిదిగా పేర్కొంటూ ఎన్నో ఉదాహారణలతో నిరూపించారు మన పెద్దలు. కాని నేటి సమాజంలో స్త్రీకి నిజంగాన్నే అంత గౌరవాన్ని ఇవ్వగలుగుతున్నమా అంటే మౌనమే సమాధానం అవుతుంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా స్త్రీ వివక్షకు గురవుతూనే ఉంది. చదువుల తల్లి కూడా ఒక స్త్రీ మూర్తే.. అయినా చదువులోనూ వివక్షే.. చదువు స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే! విద్య వివేకాన్ని పెంపొందిస్తుంది. మనిషిని తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేస్తుంది. విజ్ఞానాన్ని  పెంపొందిస్తుంది. సంస్కారాన్ని నేర్పుతుంది. ఆర్థిక స్వాతంత్ర్యానికి పునాది వేస్తుంది. అటువంటి విద్యను నేర్పడంలొ కూడా స్త్రీల పట్ల వివక్ష చూపుతున్నారు. అబ్బాయిలు చదువుతే చాలు అమ్మాయిలు చదవకపొయినా పరవాలేదు అనే ధోరణి నేటికీ కనిపిస్తుంది. ఈ నాటికి చదువు చెప్పించడానికి మగ పిల్లల మీద చూపించేటటువంటి శ్రద్దాసక్తులు ఆడ పిల్లల మీద ఉండటం లేదు అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా మేమూ మారుతున్నాం అని గొప్పలు చెప్పుకొవడం కాదు దాన్ని చేతల్లొ చుపిస్తూ ఆడ పిల్లల చదువుల విషయంలొ తల్లి తండ్రుల ఆలొచనా విధానంలో మార్పు రావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవజాతి మనుగడకు మార్గదర్శకురాలే స్త్రీ మూర్తి. కాని అటువంటి గొప్ప స్త్రీకి లభించాల్సిన గౌరవం, స్వేచ్చ నేటి సమాజంలో లభించడంలేదు అన్నది జగమెరిగిన సత్యం. " ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరచరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అని అన్నాడు శ్రీ శ్రీ.. కాని ప్రస్తుత సమాజాన్ని చుస్తుంటే "ఏ యుగాన్న చూసినా ఏమున్నది గర్వకారణం స్త్రీ చరిత్ర సమస్తం మగపీడన పరాయణత్వం" చందంగా ఉన్నది స్త్రీ జీవితం. హింసను సైతం తట్టుకునే ఓర్పు తన సొంతం: కేవలం చదువులొనే కాదు సమాజంలో అనేకానేక విషయాలలో స్త్రీ వివక్షకు గురవుతూనే ఉంది. అనేక రకాల హింసలను సహిస్తుంది. అదనపు కట్నం కోసమో.. అందంగా లేదనో.. పిల్లలు పుట్టలేదనో.. పుట్టినా ఆడపిల్ల పుట్టిందనో.. ఇలా రక రకాల కారణాలతో కిరోసిన్ పోసి తగలపెట్టే వాళ్ళు కొంతమంది.. కొట్టీ చంపి ఉరి పోసి తానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే వాళ్ళు కొంతమంది.. ప్రేమించలేదని దాడులకు పాల్పడే మూర్ఖులు కొంతమంది.. కుటుంబ నిర్వాహణ కోసం ఉద్యోగం చేసే స్త్రీలను ఇంటా బయటా హింసించే వారు మరికొంత మంది.. ఇలా ఒక్కరని కాదు సమాజంలో ఎక్కడ చూసినా క్రూరమైన మగ మృగాళ్ళు స్త్రీని హింసితూనె ఉన్నారు.. ఇన్ని రకాల్ల హింసలను తట్టుకోవడం బహుషా కేవలం స్త్రీ కి మాత్రమే సాద్యమేమో. కావలసింది సంఘటిత స్త్రీ శక్తి : అయితే.. తన మీద జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను స్త్రీ ఎదురిస్తున్న సంఘటనలను అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సంఘటనలు మహిళల్లో కొంతలో కొంత చైతన్యాన్ని కలిగించగలుగుతున్నాయి. తమ స్వేచ్చా హక్కుల కోసం తాము ఆలొచించుకోగల శక్తి సామర్థ్యాలను ఇవ్వగలుగుతున్నాయి. తాము ఆడవాళ్ళం అయినంత మాత్రానా ఎందుకు లొంగిపోవాలి అనే భావన ఇప్పుడిప్పుడే వారిలో కలుగుతుంది. స్త్రీ పురుష సమానాధికారం కోసం ప్రభుత్వం ఎన్ని రకాల చట్టలు చేసినా వాటికి ఆమోదం లభించడంలేదు. బహుషా వాటిని అమలులోకి తెచ్చే రాజకీయ ప్రతినిధులలో ఉన్న పురుషాధిక్యత దానికి కారణం అయ్యుండొచ్చు. దీనిని సరిదిద్దటానికి స్త్రీ ఒంటరి పోరాటం చేస్తే ఆమె శక్తి చాలక పోవచ్చు. అందుకే ఇక్కడ కావలసింది సంఘటిత స్త్రీ శక్తి. ఈ శక్తి సంఘటితంగా శ్రమించి ప్రణాళికా బద్దంగా కార్యనిర్వాహణ నెరపడం అవసరం. ఈ శక్తికి కుటుంబాల ఆసరా ఉండాలి. సానుభూతితో స్త్రీ సమస్యలని అర్థం చేసుకోగల పురుషుల సహాయ హస్తాల తోడు కూడా ఉండాలి. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సంఘాలు ఏర్పడినా పురుషాధిక్యత కలిగిన ఈ సమాజంలో స్త్రీ కి సమాన హక్కు రావాలంటే స్త్రీ ఎవరో ఎదో చేస్తారనుకుంటూ ఉండే కంటే తనే ధైర్యాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం. స్త్రీ ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొవాలి. ఆత్మరక్షణోపాయాలను తెలుసుకోవాలి. ఆర్థికంగా తనకాళ్ళపైన తాను నిలబడగలిగే స్థాయికి ఎదగాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా నేను అబలను అనే భావాన్ని మనసులో కలుగనీయరాదు. పురుషుడు ఏ హోదాలో ఉన్నా నా కంటే ఎక్కువ కాదు అనే బలమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. అప్పుడె స్త్రీ శక్తి, స్త్రీలకు మాత్రమే కాకుండా సర్వమానవాలికి విజయకేతనంగా భాసిల్లుతుంది.

No comments:

Post a Comment

Pages