సుగుణ ధామా ! శ్రీ రామా ! - రచన : భావరాజు పద్మిని. - అచ్చంగా తెలుగు

సుగుణ ధామా ! శ్రీ రామా ! - రచన : భావరాజు పద్మిని.

Share This
'సు' గుణం, 'సు' రూప, 'సు'చరిత్ర కలిస్తేనే 'సు' జనుడు అవుతాడు. సుజనత్వమే సౌజన్యం. ఆ సౌజన్యమంతా కలబోస్తే రాముడు. ఉపనిషత్ దృష్టి కలవారికి , శ్రీ రాముడు మోక్ష కారక తారక బ్రహ్మ . భౌతిక దృష్టి గలవారికి సమగ్ర ధర్మ విగ్రహుడు. రాముడు మనిషిగా పుట్టి, మానవుడు ఎలా ప్రవర్తించాలో , ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, ఆయన ప్రతిచర్యతో ఆచరించి చూపి, మనుషులందరి హృదయాల్లో దేవుడయ్యాడు. రాముడికే ఎందుకంత విశిష్టత ? ఆయన పదహారు గుణాలు , పదహారు కళల పూర్ణచంద్రుడు కనక . అందుకే రామనామాన్ని 'రామ చంద్రా ' అంటున్నాం. వాల్మీకి చెప్పిన ఆ పదహారు గుణాలు ఏమిటంటే గుణవంతుడు , పరాక్రమ శాలి , ధర్మజ్ఞుడు , కృతజ్ఞుడు , సత్యవాక్కు కలవాడు , ధృఢ సంకల్పం కలవాడు , మంచి నడవడిక కలిగినవాడు , అందరి హితాన్ని కోరి ఆచరించే వాడు , విద్వాంసుడు , సర్వ సమర్ధుడు , చూసేవారికి ఆనందాన్ని కలిగించే ప్రీతిపాత్రుడు , ధైర్య శాలి ,క్రోధాన్ని జయించిన వాడు ,చక్కని తేజస్సు కలవాడు , అసూయ లేని వాడు , యుద్ధంలో ధర్మ సంరక్షణకై ఆగ్రహాన్ని ప్రదర్శించేవాడు . ఇటువంటి సుగుణ రాముడు , భక్త సులభుడై , మనిషి ఎలా జీవించాలో ఆచరించి చూపించేందుకే రాముడిగా అవతరించాడు . విసుగు అనిపించని సొగసును 'రమణీయం' అంటారు.అటువంటి రమణీయత కలవాడే రాముడు .ఆ రాముని పొందే విధంగా తీసుకు వెళ్ళేది రామాయణం . 'రామస్య ఆయనం రామాయణం ' అన్నారు. రాముడు సాగించే విలువల యాత్రే రామాయణం . ఆయన ప్రతి కదలికకీ ఒక అంతరార్ధం , పరమార్ధం ఉన్నాయి. అందుకే ఎన్ని యుగాలు గడిచినా ,ఎన్ని తరాలు మారినా , ఇంకా ఎన్నో వేల రామాయణాలు పుడుతూనే ఉన్నాయి .రాముడిలోని ఈ విశిష్ట గుణాలు ఏమిటో చూద్దాం. రామోరాజ్య ముపాసిత్వా ....ఎందరోరాజులు ,రాజ్యాలు మట్టిలో కలిసి పోయాయి . అయినా 'రామ రాజ్యమే ' అజరామరమై ,అందరికీ గుర్తుండిపోయింది. ఎందుకని ? ఆయన పాలనను ఒక ఉపాసనగా చేసారు . ఋషులు తపస్సు చేసినంత ఏకాగ్ర చిత్తంతో , రాముడు పరిపాలన సాగించాడు . పాలకులలో చిత్త శుద్ధి వుంటే ,ప్రజలు ధర్మ నిరతితో వుండి, రాజ్యం సుభిక్షమవుతుంది. అందుకే ' యధా రాజా తధా ప్రజా ' అన్నారు. రామో ద్విర్నాభి భాషతే ..... రాముడు ముందొకటి , వెనుకొకటి మాట్లాడడు. ఒక విధంగా చెప్పి , మరొక విధంగా చెయ్యడు. ఆయనది ఒకే మాట , ఒకే బాణం . తన వ్యక్తిత్వ సంపద , ధర్మాచరణ , ప్రేమో గుణంతో అందరినీ ఆకట్టుకున్నాడు . ఆదర్శాల పరిపూర్ణతని తెలిపాడు . స్మిత పూర్వ భాషి ... ఏదైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వు నవ్వేవాడట . చిరునవ్వుకు ఓటమి లేదని , నవ్వుతూవుండేవాళ్ళు ఏపనిలో అయినా సులభంగా విజయం సాధిస్తారని ,ఈ నాటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో వింటూ వుంటాం . ఇది ఆనాడే ఆచరించి చూపాడు రాముడు . పూర్వ భాషి .... ఎవరైనా తెలిసిన వ్యక్తులు కనిపించినప్పుడు ,తానే ముందుగా వెళ్లి చిరునవ్వుతో పలకరించేవాడట రాముడు . చూశారా ! భగవంతుడి ఔదార్యం . నిత్య ప్రశాంతాత్ముడు,మధుర భాషి రాముడు. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ' అవసరమైతే వాళ్ళే వచ్చి పలకరిస్తారులే ' అని మొహం తిప్పుకు పోయేవారిని , ఇప్పుడు చూస్తూవుంటాం . ఈ మిధ్యా భేషజాలు వదలి ,ఆత్మీయంగా పలకరిస్తే , అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని రాముని సందేశం. సమదర్శి .... స్థాయీభేదాలు లేకుండా , అందరినీ ఆదరంగా పలకరించేవాడు రాముడు . రాజులతో , ఋషులతో ఎంత గౌరవంగా మాట్లాడేవాడో ,గుహుడు ,శబరీ మొదలైన సామాన్యులతోనూ అంతే ప్రేమగా మాట్లాడేవాడు . 'అహంకారం' , ధనగర్వం తో స్థాయిని బట్టి గౌరవించే ఈ నాటి ప్రజలు రాముడి వద్ద నేర్చుకు తీరవలసిన ఆదర్శం , సమభావం. నచానృత కథః నిభృతః ...రాముడు ఎప్పుడు అబద్ధమాడి ఎరుగడు. అంతేకాక , అణకువ కలవాడు. నీతి నిజాయితీలు , ఋజువర్తన , కర్తవ్య పరాయణత్వం కలవాడు . రామో విగ్రహవాన్ ధర్మః ... ధర్మం వెంబడి సంపద వస్తుంది. ధర్మ వెంబడే సుఖం వస్తుంది. ధర్మాన్ని ఆచరించేవాడు ప్రతిదీ పొందుతాడు . ప్రపంచానికి ధర్మమే పునాది . అందుకే 'ధర్మో రక్షతి రక్షితః ' అన్నారు . తాను ధర్మాన్ని ఆచరిస్తూ , ప్రజల చేత ఆచరింప చేశాడు కనుకనే రామరాజ్యం సుభిక్ష మయ్యింది . సత్యానికీ , ధర్మానికీ కట్టుబడి ఉన్న వారికి ప్రాణభయం వుండదు. పితృవాక్య పరిపాలకుడు ... శ్రీ రాముడి మాతృభక్తి అసామాన్య మైనది. తన తల్లి అయిన కౌసల్యామాతనే గాక ఇతరమాతలనూ అంతే ఆదరంతో గౌరవించేవాడు . కైకేయికిచ్చిన మాట కోసం అడవికి వెళ్ళడమే కాక , ఆమెపట్ల పరుషంగా ప్రవర్తించరాదని , భరతుడి వద్ద మాట తీసుకొన్నాడు . ఇదే విధంగా రాముడి పితృ భక్తి , అచంచలమైనది . కైకేయీ మాతతో సంభాషించే సందర్భంలో రాముడు ఇలా అంటాడు .. అహం తి వచనాద్ రాజ్ఞః పతేయ మపి పావకే !! భక్షయేయం విషం తీక్షణం పతేయి మపి చార్ణవే!! (వాల్మీకి రా.2/18/28-29 ) అమ్మా ! ప్రభువు ఆదేశిస్తే నేను అగ్నిలోనైనా దూకుతాను . కఠోర విషాన్నైనా పాణం చేస్తాను . సముద్రంలో అయినా పడిపోతాను. పితృ సేవ , పితృవాక్య పరిపాలన , వీటికి మించినధర్మం ప్రపంచంలో మరి లేదు . తల్లిదండ్రులను అనాధాశ్రమాల పాలు చేసి ,బిడ్డలు తమ దారిని తాము చూసుకొంటున్న రోజుల్లో , తల్లిదండ్రులను మించిన దైవం లేరని రాముడు, ఆచరణాత్మకంగా చూపిన ధర్మం మరువ కూడదు . ఏకపత్నీ వ్రతం ... రాముడు జానకిని తప్ప , అన్య స్త్రీని వరించలేదు .సీతను 'ప్రాణేభ్యోపి గరీయసీ ' ..అంటే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. స్త్రీకి పాతివ్రత్య ధర్మమున్నట్లే ,పురుషుడికి ఏకపత్నీ వ్రత పాలన ఉండాలన్న విషయాన్ని చరితార్ధం చేసి చూపాడు . స్త్రీ ,పురుష సంభధం భోగాలకోసం కాదనీ ,ధర్మాచరణ కోసమనీ , చాటి చెప్పాడు. శరణాగత వాత్సల్యం ... క్షత్రియ లక్షణం , 'తమను ఆశ్రయించిన శత్రువు నైనా ,క్షమించి ఆదరించడం '. నిండు సభలో తనకు హితవాక్కులు చెప్పిన విభీషణుడిని , ఘోరంగా అవమానిస్తాడు రావణుడు . నిరాశ తో దుఃఖితుడై , రాముని శరణు కోరతాడు విభీషణుడు . మిత్ర భావంతో వచ్చిన శత్రువుకైనా ఆశ్రయమివ్వడం సుజన లక్షణమని ఆచరించి చూపాడు రాముడు . ఇలాగే శ్రీ రాముడి భ్రాతృ ప్రేమ (సోదరప్రేమ) , సఖ్యప్రేమ , కృతజ్ఞత్వం , క్షమ , పరాక్రమం , వంటి ఆదర్శ లక్షణాలు మనందరికీ , ఆచరణీయం. ఇక ఆధ్యాత్మిక పరంగా , రాముడి విశిష్టత ఏమిటి ? శ్రీరామ చంద్రుడు పూర్ణ బ్రహ్మ , స్వయంగా విష్ణుమూర్తి అవతారం. ఆయన మాయకు ఈ సమస్త సృష్టి వశమయ్యింది . సముద్రము నుండి ఆవిరైన నీరు , మేఘమై, వాన చినుకులై , అటువంటి చినుకులు కలిసి ఒక ప్రవాహమై , ప్రవాహాల సమూహం నదియై , ఆ నది అనేక మలుపులకు , మార్పులకు లోనై ,ఎటువంటి కష్టాలనైనా అధిగమించి , మరలా సముద్రుని చేరడం ఎంత ప్రయాసో .., ఆధ్యాత్మిక పధం అంత దుర్లభం . ఆ పరమాత్ముడి నుంచీ ఉద్భవించిన జీవులు , వాన చినుకుల వంటి వారు. మరలా ,మరలా పుడుతూ , ఆవిరైతూ , ఇగురుతూ, ఇంకుతూ , చివరకు ఎన్నో జన్మల పుణ్యరాశి వలన ,సజ్జన సాంగత్యం అనే ప్రవాహంతో కలిసి , గురుకృప వలన నదీ ప్రవాహంతో ఏకమై , ఎన్నో కష్ట నష్టాలు భరిస్తేనే , తిరిగి 'పరమాత్మ' అనే దయా సింధువును చేరడం సాధ్యమౌతుంది . మాయ , మోహం , ఆధ్యాత్మిక పథంలో , అడుగుగునా ప్రతి బంధకాలు . వీటిని అధిగమించేందుకే పెద్దలు , దానం ,యజ్ఞాలు , యాగాలు, తపస్సు , ధ్యానం వంటి నియమాలను ఏర్పరచింది . కలియుగంలో మనుషులు శారీరకంగా , మానసికంగా బలహీనులు కనుక , కేవలం నామ జపమే , భవ తారక మంత్రమని చెప్పబడినది . మనస్సు నామమును స్మరించగానే , భగవంతుడి రూపం అంతర్నేత్రంలో గోచరిస్తుంది .నామ జపం ద్వారానే ఆత్మ ,పరమాత్మల తత్వం తెలుస్తుంది. ఆర్తులైన భక్తులు నామజపం చేస్తూ ,అనేక కష్టాల నుండి విముక్తులై ,సుఖ శాంతులు పొందుతారు. ప్రేమైక హృదయంతో భగవన్నామ జపం చేస్తే బ్రహ్మ జ్ఞానం కలిగి జీవంముక్తులవుతారు . అయితే , నామాలలో ఏనామం శ్రేష్ఠ మైనది ? 'శ్రీరామ ' నామం భవసాగర తారక మంత్రమని , శివుడే పార్వతికి చెప్పాడు. ఈ రామనామ విశిష్టత ఏమిటో చూద్దాము . శ్రీరామ నామ మహిమ గణపత్యేషు శైలేషు శాక్తా సౌరేష్యభీష్టశః వైష్ణవేష్పపి సర్వేషు రామ మంత్రర్ఫలాధికః !! భావం : గణేశ , వైష్ణవ , శక్తి ,సూర్య , వైష్ణవ మంత్రములు అన్నింటి కంటేనూ అధిక ఫలం ఈ రామ నామ జపం వల్ల కలుగుతుంది . 'ర' అగ్ని బీజం- దహింప జేయునది. 'ఆ' వాయు బీజం - సర్వగతం ,ఆకర్షకం . 'మ' ఆకాశ బీజం - శత్రు మోహనకరం. ఇట్టి అగ్ని , వాయు , ఆకాశ బీజాల సమ్మిళితమైన 'రామ' నామ మహిమ అంతా , ఇంతా అని చెప్పనలవి కాదు . 'ఓం నమో నారాయణాయ ' అనే అష్టాక్షరీ మంత్రం లోని 'రా' అనే ఐదవ అక్షరం ,'ఓం నమా శివాయః ' అనే పంచాక్షరీ మంత్రం లోని 'మ' అనే రెండవ అక్షరం కలిపి , హరి హర తత్వాలు రెండింటినీ ఇముడ్చుకొని ఏర్పడిందే రామనామం . అందుకే రామనామాన్ని 'తారక మంత్రం' అంటారు . 'రామ, రామ, రామ , ' అని మూడుసార్లు నామజపం చేస్తే శ్రీ విష్ణు సహస్రనామము చదివినంత ఫలితం లభిస్తుందని ఈశ్వరుడే, పార్వతికి తెలియజేశాడు . కిరాతుని , తన పేరు తెలియక తిప్పి చదివినా , వాల్మీకిగా మార్చింది 'రామ'నామం. ఒకామె ,రామచిలుకకు మాటలు నేర్పేందుకు 'రామ, రామ ' అని తెలియక పలికినా ,ఆమెకు ప్రేమగా మోక్షమిచ్చాడు రాముడు . మరణ మాసన్నమైన వారి కుడిచేవిలో ,'రామ' నామం పలుకుటవల్ల ,వారు మోక్షం పొందుతారు .ప్రజ్వలించే అగ్ని కట్టెలను దహించినట్లు , తెలిసికానీ , తెలియక కానీ ,రామనామ౦ జపిస్తే మానవుల పాపాలన్నీ దహించుకు పోతాయి .'రా' అనే అక్షరం పలికేటప్పుడు , పెదవులు తెరుచుకొని , మన పాపాలన్నీ బయటికి పోతాయి .'మ' అనే అక్షరం పలికేటప్పుడు పెదవులు మూసుకొని , అవి తిరిగి లోనికి రాకుండా నిరోధిస్తాయి .రామనామం భవ బంధాలను తరింప జేస్తుంది .కనుక 'తారక మంత్రం ' అయ్యింది . అలా రామనామం నిరంతరం స్మరించేవారికి , మాలిన్యాలు అంటవు . ఏ బాధలు బాధించవు .శత్రువులు సైతం వారిని ఏమీ చెయ్యలేరు . రామనామ శబ్దం ఒక కవచంలా వారిని రక్షిస్తుంది . సాంబ శివుడు సర్వదా జపించే రామనామం పరమ పవిత్రమైనది . శబరీ , గుహుడు , హనుమ , సీతామాత , ఇలా ఎందరో రామనామం జపించి పునీతులయ్యారు . శ్రీ రామచంద్ర ప్రభువు , దుష్టశిక్షణ , శిష్ట రక్షణకు అవతరించిన , ఈ పుణ్య శ్రీ రామ నవమి పర్వదినం నుండి ,అనుదినమూ , రామనామం జపిస్తూ , మనమంతా కూడా తరిద్దాం . జై శ్రీ రాం . శ్రీ రామ నవమి :- చైత్రమాసం , పునర్వసు నక్షత్రం , నవమి రోజున శ్రీ రామ జననం జరిగింది .అంతే కాక , నవమినాడే సీతా దేవితో వివాహం , నవమి నాడే పట్టాభిషేకం జరిగాయని రామాయణం ద్వారా తెలుస్తుంది. శ్రీ రాముడికీ , నవమికీ ఉన్న ఈ సంబంధం వల్ల భారతీయులంతా , చైత్రశుద్ధ నవమి రోజున "శ్రీ రామ నవమి " పండుగ జరుపుకుంటారు .ఈ రోజున రామాలయాల్లో , పందిళ్ళలో సీతారామ కల్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవాన్ని దర్శించినా , జరిపించినా , సకల శుభములు కలుగుతాయి . సర్వేజనాస్సుఖినో భవంతు !! శుభం భూయాత్ !  

No comments:

Post a Comment

Pages