నాగ చతుర్దశి వెనకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ ఆంత్యర్యం - అచ్చంగా తెలుగు

నాగ చతుర్దశి వెనకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ ఆంత్యర్యం

Share This
'నాగ చతుర్దశి వెనకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ ఆంత్యర్యం'  
-సుజాత.పి.వి.ఎల్.




శ్రావణ శుద్ధ చతుర్థిని నాగ చతుర్థి గా భావించి కొంతమంది పండుగ జరుపుకుంటారు.
ప్రకృతి మానవ జీవనాధారమైనది. చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కోన, నది, పర్వతాలు..ఇలా సమస్తాన్ని దైవ స్వరూపంగా భావించి పూజిస్తాం. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. ఇందులో భాగంగానే నాగుపాముని కూడా భగవత్స్వరూపంగా ఆరాధించి పూజించడం అనాదిగా వస్తున్నా ఆచారం.
నాగ చతుర్థినాడు నాగేంద్రుని పూజించి పుట్టలో పాలు పోయడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ సత్యమేమిటో తెలుసుకుందాం.
పాములనేవి భూమి  అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త ప్రాణ కోటికి జీవాధారమైన నీటిని ప్రసాదించే దేవతలుగా మన పూర్వీకులు భావించేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా వ్యవసాయదారులకు పంటనష్టం జరగకుండా కాపాడుతూ ఎంతో సహాయకారిగా ఉంటాయి.
మన పురాణాల్లో నాగ చతుర్థి గురించి ఎన్నో గాథలున్నాయి.
దేశమంతటా పలు హిందూ దేవాలయాల్లో మెలికలు తిరిగి ఉన్న నాగేంద్రుని విగ్రాహాలు కనిపిస్తూ ఉండటం మనం గమనిస్తాం. ఇలా ఉండటానికి ఒక సైoటిఫిక్ రీజన్ ఉంది. అదేమిటంటే, మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. వాటిని నవ రంధ్రాలు అంటారు. ఈ మానవ దేహం అనేక నాడులతో నిండి ఉంది. ఆ నాడులన్నింటికీ మూలం వెన్నెముక. వెన్నెముక పాముని పోలి ఉంటుంది కనుక దానిని వెన్ను‘బాము’ అనీ అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధార చక్రంలో 'పాము ' ఆకారంలానే ఉంటుందని 'యోగశాస్త్రం' చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలనే విషయాన్ని గక్కుతూ మనలోని సత్వగుణ సంపత్తిని అణచివేస్తూ ఉంటుంది. అందుకని నాగ చతుర్థి నాడు ప్రత్యక్ష విష సర్పాలకు నిలయమైన పాము పుట్టలో పాలు పోసి పూజలు చేస్తాము. మనలో ఉన్న విష సర్పాల్లాంటి గుణాలు కూడా పాలవలే శ్వేత తత్వం పొంది సత్వగుణాన్ని ప్రసాదిస్తాయని. అంతే కాకుండా, అందరి హృదయాల్లో కొలువైన శ్రీ మహావిష్ణువునకు పాలకడలిపై ఆదిశేషుడిగా మనo కూడా మారి ఆస్వామికి శేషపాన్పులమై సేవలందించాలన్న కోరికతో పాలు పోయడం జరుగుతుంది.
ఏదేమైనా మనం తెలిసో తెలీకో చేసిన తప్పుల్ని క్షమించమని..పొరపాటున తోక తొక్కుంటే  తోబుట్టువనుకో.. నడుము తొక్కి ఉంటే 'నా'వారనుకో ..తల తొక్కి ఉంటే తన వారిమని భావించి మమ్ము మన్నించు నాగేంద్రా! అనుకుంటూ పాలు పోస్తే శుభమని పెద్దల మాట.
భక్తజనావళికి నాగుల ఆశీర్వాదఫలం లభించుగాక..!

*****

No comments:

Post a Comment

Pages