కాలం కలిసొచ్చింది! - అచ్చంగా తెలుగు

కాలం కలిసొచ్చింది!

Share This
కాలం కలిసొచ్చింది!
శేష కల్యాణి

 
'హమ్మయ్య! ఇవాళ శనివారం! ఈయన ఆఫీసుకి సెలవు రోజు కాబట్టి కొంచెం ప్రశాంతంగా వంట చెయ్యచ్చు!', అని అనుకుంటూ నిద్ర  లేచింది రాధిక.
అంతలో తన భర్త వేణు ఫోన్లో అలారం మోగింది.
"నేను ఇవాళ ఆఫీసుకు వెళ్ళాలి. ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి!", అంటూ హడావుడిగా మంచం దిగి ఒక్క ఉదుటున తయారవ్వడానికి బాత్రూంలోకి  వెళ్ళాడు వేణు.    
'అమ్మో! ఇంకా నయం! ఆఫీసుకు వెళ్లాలని చెప్పారు! లేకపోతే ఆలస్యం అయిపోయేది!', అనుకుంటూ రాధిక కూడా వంటింట్లోకి వెళ్లి రోజూలాగా గంటలో టిఫిన్, లంచ్-బాక్సు సిద్ధంచేసి ఆయాసపడుతూ వేడి వేడి టీ తీసుకుని డైనింగ్ రూంలోకి వచ్చింది. అప్పటికి వేణు సూటూ-బూటూ వేసుకుని, జారిపోతున్న ఆఫీస్ లాప్-టాప్ ను ఒక చేత్తో లాఘవంగా సమర్ధించుకుంటూ, చెవిలో ఉన్న ఇయర్-ఫోన్స్ లో  తన పనికి సంబంధించిన లేటెస్ట్ అప్-డేట్స్ తన బాస్ కు వివరిస్తూ ఉన్నాడు. వేణు చేతికి రాధిక టీ అందించింది.
"టిఫిన్ తినే టైం లేదు!", అని అంటూ టీ తాగి, రాధిక ఇచ్చిన లంచ్-బాక్స్ తీసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయాడు వేణు.
***
వేణుగోపాల్  సొంత ఊరు ఒక చిన్న పల్లెటూరు. ఎన్నో తరాలుగా వ్యవసాయమే వారి కుటుంబానికి జీవనాధారం. కానీ, ఏళ్ళు గడిచే కొద్దీ భూమిలోని సారం తగ్గడంతో చేతికొచ్చే పంట కూడా బాగా తగ్గిపోయింది.  పొలంలో ఎన్ని రోజులు కష్టపడి పనిచేసినా నెల తిరిగేసరికి చేతినిండా సరిగ్గా డబ్బు రాకపోవడంతో విపరీతమైన నిరాశ చెందేవాడు వేణు తండ్రి సీతయ్య. తన కొడుకు తనలాగా వ్యవసాయం చేస్తూ, కుటుంబపోషణకు అవస్థలు పడుతూ మిగిలిపోకూడదని భావించిన సీతయ్య, తన దగ్గరున్న డబ్బంతా పోగు చేసి వేణుని పెద్ద చదువు చదివించాడు. వేణు పట్నంలో మంచి ఉద్యోగంలో స్థిరపడి బాగా డబ్బు సంపాదించాలన్నది  సీతయ్య ఉద్దేశం. వేణుకి వ్యవసాయాన్ని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా, తన తండ్రి మనసును అర్ధం చేసుకుని శ్రద్ధగా చదివి పట్నంలో పెద్ద ఉద్యోగమే సంపాదించాడు. సీతయ్య అనుకున్నట్టుగానే ఇప్పుడు వేణు సంపాదనకు కొదవే లేదు. వచ్చిన ఇబ్బందల్లా ఆ ఉద్యోగంలో వేణుకి విపరీతమైన పని ఒత్తిడి! ఎప్పుడూ ఆఫీస్ పనిలో మునిగి తేలుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటాడు. ఇంటిని పట్టించుకోవడమన్న సంగతి పక్కన పెడితే తన గురించి తాను కూడా సవ్యంగా పట్టించుకునేందుకు కుదరదు వేణుకి  ! దాంతో ఇంటి పనితోపాటూ తమ ఇద్దరు పిల్లలను పెంచే బాధ్యత మొత్తం రాధిక ఒక్కదానిపైనే పడింది!  వేణుకి  తన ఉద్యోగంలో సెలవలు దొరికే ప్రసక్తే లేదు సరికదా, ఆదివారాలు కూడా ఆఫీస్ పనే సరిపోయేది. ఆ కారణంగా తన సొంత ఊరికి వెళ్ళాలన్న ఆలోచన ఎన్నిసార్లు వచ్చినా ఏదో ఒక సాకుతో దాన్ని విరమించుకుంటూ వచ్చాడు వేణు. రాధిక పుట్టిల్లు కూడా వేణు వాళ్ళ సొంత ఊరిలోనే. 'ఒక్కసారి మా అమ్మ దగ్గరకు వెళ్లి వస్తానండీ!', అని రాధిక వేణును ఎన్నోసార్లు అడిగినా, రాధిక వెళ్ళిపోతే ఇంటి పనికీ, వంట పనికీ ఇబ్బంది అవుతుందని తర్వాత చూద్దాంలే అంటూ, రాధిక ప్రయాణాన్ని కూడా వాయిదా వేస్తూ వచ్చాడు వేణు.
***
శనివారంనాడు ఆఫీసుకు వెడుతున్న వేణు ఏదో ఆలోచిస్తూ కార్ నడుపుతూ ఉండగా అతని తల్లి విమలమ్మ ఫోన్ చేసింది.
"హలో అమ్మా!", అంటూ ఫోన్ ఎత్తాడు వేణు.  
"ఏరా గోపాలం? సొంత ఊరినీ, మమ్మల్నీ పూర్తిగా మర్చిపోయావా? ఒక్కసారి వచ్చిపోకూడదా? మనవళ్లను చూడాలని, వాళ్ళతో ఆడుకోవాలనీ నాకూ, నాన్నకూ మనసు కొట్టుకుపోతోంది. మేమిద్దరం పెద్దవాళ్లమై పోయాము కదరా! మేము నీ దగ్గరకు రావడానికి దూరప్రయాణాలు చేయలేము. మా బాధను అర్ధం చేసుకోరా! మాకున్న ఒక్కగానొక్కడివి! నిన్ను చూడకుండా మేముండలేమురా!", అంటూ గట్టిగా ఏడ్చేసింది విమలమ్మ.
"అమ్మా! నా పరిస్థితి నీకు తెలుసు కదా? మా బాస్ ను నాకు సెలవ కావాలని అడిగినా ఎలాగో ఇవ్వడు!", అన్నాడు వేణు.
"ఎన్ని రోజులని ఆగమంటావురా? అయినా ముందు నువ్వు మీ బాస్ తో మాట్లాడి మానవ ప్రయత్నం చెయ్యి.  నువ్వు ఇక్కడికొచ్చే వీలును నీకు కల్పించమనీ, కాలం కలిసొచ్చేలా చెయ్యమనీ ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తాను. అంతకన్నా నేను మాత్రం ఏమి చెయ్యగలను? రేపు మన గోశాల ప్రారంభోత్సవం! గోశాలను ఏర్పాటు చేయాలన్నది మీ నాన్నగారి చిన్నప్పటి కల!  ఆయనకది ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా! ఆ సమయానికి నువ్వు రాకపోతే ఆయన చాలా బాధపడతారు!", అంది విమలమ్మ.   
" సరేనమ్మా! మా బాస్ ను ఒప్పించడం అంత సులువైన పని కాదు! కానీ నువ్వు చెప్పినట్టు నా ప్రయత్నం నేను చేస్తా!", అని ఫోన్ పెట్టేశాడు వేణు.
ఆఫీస్ పని పూర్తిచేసుకుని ఇంటికివెడుతూ తన బాస్ కు విషయం చెప్పి ఆదివారం నాడు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చెయ్యడానికి అనుమతినివ్వమని అడిగాడు వేణు. ఉద్యోగులు ఇంటినుండీ పనిచెయ్యటాన్ని పూర్తిగా వ్యతిరేకించే అతడి బాస్ వేణు అడిగినదానికి వెంటనే ఒప్పుకుని వేణును ఆశ్చర్యపరిచాడు!
వేణు అప్పటికప్పుడు తన భార్యాపిల్లలతో బస్సు ఎక్కి ఆదివారం ఉదయానికల్లా తన సొంతూరు చేరుకున్నాడు. విమలమ్మ, సీతయ్యలు వారిని చూసి చాలా సంతోషించారు. స్నానము, భోజనం, గోశాల ప్రారంభోత్సవం, అన్నీ అయ్యాక లాప్-టాప్ పట్టుకుని ఆఫీస్ పని చెయ్యడానికి కూర్చున్నాడు వేణు. అయితే అది కుగ్రామం కావడంతో ఎంత ప్రయత్నించినా అక్కడ ఇంటర్నెట్ పనిచేయలేదు! చేసేదిలేక ఆదివారమంతా తన తండ్రితో కలిసి, తమ పొలంలో భూసారం పెంచేందుకు తనతోపాటూ పట్నం నుండీ పట్టుకొచ్చిన ఎరువులను చల్లుతూ పొలంలో గడిపాడు వేణు. మట్టివాసన తగలగానే వేణుకి తన చిన్నతనం గుర్తుకు వచ్చి మనసులో ఏదోతెలియని నూతనోత్సాహం కలిగింది. చిత్రమైన విషయమేమిటంటే వేణు చిన్నప్పుడు తన తండ్రి ఎన్నడూ వేణుని పొలంలోకి రానివ్వలేదు! 
పొలం పనులు పూర్తి చేసిన తరువాత, ఆదివారం సాయంత్రం ఇంటిల్లుపాదీ కూర్చుని రేడియో వింటూ ఫలహారం చేస్తూ ఉండగా కరోనావైరస్ కారణంగా ప్రభుత్వం లాక్-డౌన్ ప్రకటించిందన్న సంగతి వేణుకి తెలిసింది. అయోమయంలో పడ్డ వేణు రవాణా సౌకర్యం లేక తను పట్నం రాలేనని చెప్తే తన బాస్ ఏమంటాడోనని సందేహిస్తూ అతనికి ఫోన్ చేశాడు. అటువంటి విషయాలలో అగ్గి పైగుగ్గిలమయ్యే బాస్ ఆ పూట ఏ కళనున్నాడోగానీ వేణు పని పట్ల నిరంతరం చూపే అంకిత భావాన్ని మెచ్చుకుంటూ, వేణు ఇంటి నుండే పని చెయ్యొచ్చని చెప్పటమేకాక ఇంటర్నెట్ లేకపోతే కంగారు పడొద్దని కూడా చెప్పాడు! 
ఆ తరువాత తీరుబడిగా రేడియో వింటున్న వేణుకి కరోనావైరస్ తీవ్రత ఏపాటిదో తెలిసింది. కొంత ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే వేణు సొంత ఊరిలో సగానికి పైగా మంది నిరక్షరాస్యులే! వారికి వైరస్ వంటి విషయాలు ఒక్కసారి చెప్తే గ్రహించేటంత సామర్ధ్యం లేదు. అది తెలిసిన వేణు, తన ఊరివారిని కాపాడుకోవడానికి తను ఏదైనా చెయ్యాలని ఆ క్షణమే నిర్ణయించుకుని తమ ఊరి గ్రామసర్పంచిని కలిసి, ఊరివారికి ఆ వైరస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడంలో తన వంతు కృషి చేస్తానని చెప్పి, ఆ ఊరిలో వైద్య సేవలకుగానూ కొంత సొమ్మును విరాళంగా ఇచ్చాడు. గ్రామసర్పంచి వేణు మంచి మనసును మెచ్చుకున్నాడు.
వేణు ఇంటికి వెడుతూ ఉండగా దారిలో, రాధిక తన పుట్టింటినుండీ వేణుకు ఫోన్ చేసి, అక్కడి విశేషాలన్నీ చెప్పడం ప్రారంభించింది. ఎన్నో ఏళ్ళ తర్వాత తన వారిని కలిశానన్న ఆనందం వేణుకు రాధిక గొంతులో సుస్పష్టంగా వినపడింది! వేణు ఇల్లు చేరుకునేసరికి సీతయ్య తన మనవళ్లను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏవో ఆటవస్తువులతో ఆడిస్తూ ఉంటే విమలమ్మ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తోంది! సాధారణంగా రాత్రి పదకొండింటికి కానీ భోజనం చెయ్యని వేణు ఆ రోజు తొమ్మిదింటికే భోజనం ముగించేశాడు. ఎప్పుడూ ఏవేవో ఆలోచనలతో గందరగోళంగా ఉండే వేణు మనసు ఆ వేళ ఎంతో ప్రశాంతంగా ఉంది! 
"అమ్మా! నువ్వు చెప్పిన మానవ ప్రయత్నం ఇంతగా ఫలిస్తుందని నేను ఊహించలేదు! కాలం బాగానే కలిసొచ్చింది!", అన్నాడు వేణు విమలమ్మతో.
అందుకు విమలమ్మ, " అసలు కాలం అంటే పరమాత్ముడే కదరా! మనము జీవితంలో మనకు కావలసినవి పొందాలంటే ఆ భగవంతుడి అనుగ్రహం మనకు కావాలి! ఏ కారణంతోనన్నా నీ ప్రయాణం ఒక్క పూట వాయిదా పడి ఉంటే మీ నాన్నగారికి నువ్వు గోశాల ప్రారంభోత్సవానికి రాలేదన్న లోటు జీవితాంతం మిగిలిపోయేది!", అంది తన మనవళ్లను నిద్రపుచ్చుతూ.     
'నిజమే! నేను ఇక్క డికొచ్చి నా తల్లిదండ్రులనూ , భార్యనూ సంతోష పెట్టగలిగాను!  నన్ను పెంచి పెద్ద చేసిన నా ఊరి రుణాన్ని అనుకోకుండా కొంత తీర్చుకోగలిగాను! నేను ఎన్నో రోజులనుండీ ప్రయత్నించినా అవ్వని పనులు ఇప్పుడు ఒక్కసారిగా అయ్యాయంటే దీనికంతటికీ అసలు కారణం ఆ పరమాత్ముడే!’, అని అనుకున్నాడు వేణు.
*****

No comments:

Post a Comment

Pages