దశ విధ గురువులు - అచ్చంగా తెలుగు
దశ విధ గురువులు
శారదాప్రసాద్ 



గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి తొలి గురువు. గురుకుల విద్యా విధానంలో గురువు పాత్ర అత్యంత కీలకమైనది.'

శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.

అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది.గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడ గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజీవులైనారు.ఎనిమిది  రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.   

1. బోధక గురువు -  మహామంత్రాలను ఉపదేశించేవాడు!అనుభవ జ్ఞానము అవంతయును లేక, గ్రంధములలో ఉన్న విషయాన్ని మాత్రమే బోధించేవారు. వీరు బోధక గురువులుగా వ్యవహరింపబడతారు.

2. వైదిక గురువు - వేదాలలోని, వేదాంత భావములను వివరించువారు వైదిక గురువులుగా ప్రఖ్యాతి కెక్కుతారు.

3. ప్రసిద్ధ దేశికులు - ప్రతిఫలాన్ని ఏమీ ఆశించకుండానే, ఆధ్యాత్మిక బోధనను చేసేవారు ప్రసిద్ధ దేశిక గురువులనబడతారు.

4. కామ్యక గురువు - పాపపుణ్య క్రియల వల్ల సంభవించే, పాపపుణ్యముల ఫలితాల గురించి చెప్పేవారు కామ్యక గురువులు.

5. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు!అన్ని అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువారు వాచక గురువు అనబడతారు.

6. సూచక గురువు - చదువు చెప్పేవాడు!ఏకాగ్రతతొ చూపు నిలిపి, కన్నులలో దర్శించే, విశ్వములోని కళలన్నీ ఏవిధంగా సాధ్యమవుతాయో తెలుపు గురువులు సూచక గురువులు అనబడతారు.

7. కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు!ఇహలోక, సంపద సుఃఖాలపై, మోహమును పోగొట్టి, ముక్తి అనే సంపదను కైవసము చేయించగల గురువులు కారణ గురువులు అనబడతారు.

8. విహితోపదేష్ట - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు!అంతు చిక్కని, అతి నిగూఢమైన , సృష్టి తత్వాన్ని బోధించి, విశ్వరూపుని దర్శించు మార్గమును చూపించే గురువులు విహితోపదేష్ట గురువులు అనబడతారు.
9. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
10. పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.
గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు. అవి--(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.

***

No comments:

Post a Comment

Pages