నాకు నచ్చిన కథ - శ్రీ గురుభ్యోనమః - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ - శ్రీ గురుభ్యోనమః

Share This
శ్రీ గురుభ్యోనమః (కధ)
కొత్తపల్లి ఉదయబాబు 


మనసంతా ఒకటే అలజడిగా ఉంది హరిప్రసాద్ కి.  టెన్షన్తో అరచేతులు చెమటలు పట్టేస్తున్నాయి.  ఇన్నాళ్లకు వచ్చింది చాన్సు . పూర్ణ రేపు సాయంత్రానికి గానీ రాదు.  ఎలాగైనా ఆ ‘ఒక్కటి’  రుచి చూసేయాలి.
‘హరిత’  ఒప్పుకుంటుందా?  ఎదురు తిరుగుతుందా?’’

తనకు  ఇలాంటి ఉద్దేశం ఉందని ఆ అమాయకురాలికి తెలియదు.  చాలా జాగ్రత్తగా హాండిల్  చేయాలి. రసాభాస  అయితే ఉద్యోగానికి ముప్పు.  కాదు సమాజంలో తల ఎత్తుకోలేడు కూడా.  ఆపైన ఆత్మహత్యే శరణ్యం. అయితే హరితకు  తను  అంటే చాలా అభిమానం.  తన మాట అంటే . తన అందం అంటే ఆరాధన.  తాను యే పని చేస్తున్నా  ముగ్ధ  మనోహరంగా పరిశీలిస్తూ వుంటుంది .

గతంలో ఎన్నో సందేహాలు చెప్పించుకోవడానికి ఇంటికి స్నేహితులతో వచ్చింది కూడా! అప్పుడు   పూర్ణ తో కూడా చాలా చనువుగా మాట్లాడింది.
‘’ ఆంటీ! సార్ స్కూల్లో పాఠం చెబుతుంటే నాదస్వరం వినే పాముల్లా అయిపోతాము మేము.  ప్రతి అక్షరం ఆయన చెబుతూనే  మా చెవుల్లో అమృత ధారలు గా మారి నరనరాన పాకి  మెదడులో నిక్షిప్తమై పోతాయి. అంత బాగా చెపుతారు మేడం.  సార్ లాంటి అందమైన భర్తను  పొందినందుకు  మీరు ఎంతో అదృష్టవంతులు ఆంటీ.’’ అందట ఒకసారి.
 నిజమే తమ భార్యాభర్తలిద్దరిలో  పూర్ణ కన్నా తాను చాలా అందగాడు అని చెప్పాలి, పూర్ణ  చామన చాయగా ఉన్న లక్ష్మీకళ ఉట్టిపడుతూనే  ఉన్న సంపద అంతా బ్యాంకు లాకర్లలో పెట్టేసిన లక్ష్మీదేవి ఉంటుంది.

పూర్ణ పరిపూర్ణ మహిళ.  పూవుకీ తావిలా... తనకు అన్ని విధాలా జీవిత పరమార్థాన్ని చవి చూపిన ప్రేమమయి.  భార్యగా,  ఇద్దరు పిల్లలకు తల్లిగా,  ఒక అయినింటి కోడలిగా,  తన పుట్టింటికి  ఆడపడుచు తన బాధ్యతను సర్వవిధాలా నెరవేరుస్తూనే,  సర్వవేళలా తమ హక్కులను సామరస్యంగా సాధించుకునే చమత్కారం., చాతుర్యం కలబోసిన  స్త్రీ  మూర్తి.

 తాను  సుఖ పడుతూ తనను సర్వవిధాలా సుఖ పెడుతున్న  భార్య.  తన  తప్పు లేనప్పుడు మాట పడదు.  ఎదుటి వ్యక్తి తప్పు ఉన్నప్పుడు నిలదీయడానికి వెనుకాడదు.  అలాంటి పూర్ణ కి అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు.

 ఒకవేళ తాను అనుకున్నది జరిగి ఆ విషయం పూర్ణకు  తెలిసి తనను నిలదీస్తే?  మరేమీ ఆలోచించదు. నిద్ర పోతూ ఉండగా పెట్రోల్ పోసి తగలబెట్టి,  తను కూడా ఆ మంటల్లో కాలిపోయె అంత  ఆత్మాభిమానం ఆమెకు.  ఒకవేళ  హరిత.  పూర్ణ కు చెప్పేస్తుందా?  అలా జరగకుండా మేనేజ్ చేయడం లోనే తన నేర్పరితనం అంత చూపించాలి.

ఒకటా రెండా పాతికేళ్ళు పూర్ణతో  గడిపిన సాంగత్యం తమది.  హరిత ను  ఆ మాత్రం లొంగ తీసుకోలేడా?

 ఇవాళ కాకపోయినా,  ఇలా రెండు మూడు ప్రయత్నాలు జరిగితే ఏదో ఒక సందర్భంలో తన శ్రమకు ఫలితం దక్కక పోదు.  విసుగ్గా  టైం చూసుకున్నాడు.  హరిత ఇంకా రాలేదు.

ఆలోచిస్తూ బెడ్ రూం లోకి వచ్చాడు హరి ప్రసాద్.  ఇల్లంతా నీట్ గా సర్ది ఉంది.  బెడ్రూం అయితే వెంటనే ఆ కాట్ మీద హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకోవాలన్నంత  ఆహ్లాదంగా ఉంది.  గదంతా గులాబీ  పెర్ఫ్యూమ్ స్ప్రే చేసినట్టుగా మంద్రంగా,  మత్తు కలిగించేలా సువాసన గా ఉంది.  సో ఈ గదిలో అడుగు పెడితే హరిత మంత్రముగ్ధ అయిపోవాల్సిందే.

అబ్బా...హరితా...నరాలు నలిపేస్తున్నావ్ కదా... ఆ రోజుల్లో కోరి వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నాను. ఈరోజు కావాలని తహతహ లాడిపోతున్నా ఆ అనుభవం అంది రావడం లేదు.  నా అంతా బ్యాడ్-లక్  ఫెలో మరొకడు ఉండడు.

 అసలు ఇదంతా తన కొడుకు కూతురు చేసిన వెధవ పని . ఆ పనికి తాను ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాడు.  పిల్లలలో  అమ్మాయి ఎంసీఏ చేసింది.  అబ్బాయి సి ఎ చేశాడు.  ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేసాయి.

ఇద్దరూ చదువులో ఉండగానే బలవంతంగా కంప్యూటర్ కొనిపించారు.  పూర్ణ తన అభిరుచిలో  భాగంగా రకరకాల వంటలు,  శారీ డిజైనింగ్స్,  కంప్యూటర్ ద్వారా నేర్చుకుంది.

 రచయితగా కవిగా పేరున్న తను కూడా మరింతగా తన అభిరుచి లో రాణించాలంటే ‘సాహిత్యపు వెబ్ సైట్స్ అన్ని చదవండి నాన్నా’ అంటూ కంప్యూటర్ ఎలా వాడాలో నేర్పించారు. రకరకాల వెబ్ సైట్స్ లో ఎలా సైనప్  అవ్వాలి,  అందుకోసం ఎలా ఎకౌంటు క్రియేట్ చేసుకోవాలో చూపించారు.  సాహిత్యాభిలాష గల స్నేహితులను  చాటింగ్ ద్వారా ఎలా పలకరించాలో,  ఎలా పరిచయం పెంచుకోవాలో అవగాహన కల్పించారు.  అన్నీ నేర్పించి అలవాటు చేసి వాళ్ళు ఉద్యోగాలు వచ్చి  వెళ్ళిపోయారు.  తాను మాత్రం కంప్యూటర్ కు బానిస అయిపోయాడు.  అందులో భాగంగా ఎన్ని అసభ్యపూ  వెబ్సైట్లు ఉన్నాయో  అన్నింటిని చూశాడు. భార్యకు అన్నీ  చూపించాడు.

అలా విచ్చలవిడితనం గా ప్రవర్తించడం పోయినా హద్దులు దాటని,  ఆరోగ్యం పాడవని విధంగా తన చర్యలతో తనను సంతృప్తి పరిచేది. పడేది కూడా.
 పిల్లలు ఉద్యోగాలు వచ్చి వెళ్లి పోయాక నెలకు వారం రోజులు వారి బాగోగులు చూసి వచ్చే నెపంతో  పిల్లల దగ్గరకు వెళ్లి రావడం తో తనలో  అజ్ఞాతంగా దాగున్న కోరిక మొలకెత్తింది.  అది మొగ్గ తొడిగింది. పిండే కాసి కాయంత  అయింది.  పండే కోసం ఎదురుచూస్తోంది.

ఈలోగా చాటింగ్ లోనూ,  రకరకాల సాహితీ పుస్తకాలను, శృంగార  సందేహాల శీర్షికలు అనేకం తెలియని ప్రశ్నలకు జవాబులు నిస్తూ అతనిలోని ‘కోరిక’ కు సాన పెడుతున్నాయి. కొంతమంది కుర్ర కుంకలు నిస్సిగ్గుగా వివాహిత స్త్రీతో తామెలా అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నది వివరిస్తూ  తమ సందేహాలకు సమాధానాలు పొందుతుంటే ఆనాటి వయసులో అలా ఎందుకు ప్రవర్తించ లేకపోయాను అనే వ్యధ  అతన్ని తీవ్రంగా తొలిచేయ సాగింది.

జరిగిందేదో జరిగిపోయింది.  ఒకే ఒక్క సారి ఎలాగైనా ఒక పరాయి స్త్రీ తో ఆ అనుభవం పొంది తీరాలి  అనే నిర్ణయానికి వచ్చాడు హరిప్రసాద్. పెళ్ళయిన స్త్రీలు ఎంతోమంది ఈ వేళ నగరాలలో పట్టణాలలో  ‘సహజీవనం’  కొనసాగిస్తున్నారట.  వారి శాతం ఎక్కువగా ఉండటం చేతనే  ఎయిడ్స్   భారతదేశంలో  ఇంతగా విజృంభించడానికి  కారణం అని కూడా అతనికి అర్థమైంది.
తన అందానికి ఇంట్రెస్ట్ చూపించిన వారు చాలా మందే ఉన్నారు.  కానీ వారందరూ తనకన్నా పూర్ణకు బాగా తెలిసిన వారు . పెళ్ళయిన స్త్రీలు తనకు అవసరం లేదు.  పెళ్ళికాని కాలేజీ  అమ్మాయిలు తారసపడరు.  సో తనకు లభించే అవకాశం ఇక  హరిత వయసు పిల్లలే.

వయసు కు  మించిన ఎదుగుదల ఉన్న హరిత లాంటి అమ్మాయిలు ఒక్కరు దొరికితే చాలు- తన కోరిక తీరినట్లే.వీళ్ళతో అంతగా ప్రమాదం ఉండదు.  ఎందుకంటే తనకు ఉపాధ్యాయుడిగా మంచి పేరు ఉంది.  పలుకుబడి ఉంది.  కవి రచయితగా రాష్ట్రమంతటా పేరుంది.  ఇంకా ఏం జరిగినా అన్నీ పాపాలు కడిగీవేయగల డబ్బు లోటు లేనంతగా ఉంది.  హరిత కు తండ్రి లేడు.  తల్లి ఒక్కతే ఉంది.  ఆమె టీచర్ గా పని చేస్తుంది - అది ఒక చిన్న కాన్వెంట్లో.

 అంతగా హరిత గొడవ చేస్తే తాను ‘డబ్బు’తో కొడతాడు.  అసలు ఆ పరిస్థితి రాకుండా ఎంతో చాకచక్యంగా మేనేజ్ చేయాలి. చేయగలనని అనుకుంటున్నాడు. హరిత రావడమే తరువాయి.

హరిత పుష్కలంగా నిండు జామ పండు లాగా ఉంటుంది. ఒంటికి నిండుగా బట్ట కడుతుంది. ఏ ఆచ్చాదన వీసమెత్తు కనపడకుండా జాగ్రత్త పడుతుంది.  ఆ అమ్మాయిని చూస్తే మన స్వంత మనిషి  భావన తప్ప వెకిలిగా అనిపించదు. తీరువుగా జడ , కల్మషం లేకుండా  మాట్లాడుతుంది. ఆమె అంతగా నచ్చడానికి కారణం ఆమె నిర్మలత్వమే.

ఆ రోజుల్లో తను ఉపాధ్యాయుడిగా సర్వీసులో చేరిన మొదటి రోజుల్లో అలాంటి చక్కని  పర్సనాలిటీతో చక్రాల వంటి  కళ్ళతో,  విశ్వనాథ గారి కిన్నెరసాని అనిపించేలా ఉండే ‘చంద్రకళ’ గుర్తుకు వచ్చింది హరిప్రసాద్ కి.

స్కూల్లో చేరిన మూడో రోజునే క్లాసులో  అందరి తరఫున వకాల్తా పుచ్చుకుని’’ మీ అంత అందమైన మాస్టారు మా స్కూల్ లోనే కాదు,  మా ఊర్లోనే  లేరు. మీరు మాస్టారు అయిపోయారు గానీ-లేదంటే మా ఇంట్లో పోరు పెట్టి మరి మిమ్మల్ని చేసుకునేదాన్ని’’ అంది నిర్భయంగా.

ఆమె నిర్భయత్వానికి కారణం తను  ఆ ఊరి సర్పంచ్ గారి అమ్మాయి కావడమే.
 తన పాఠం  అత్యంత శ్రద్ధగా విన్నట్టే ఉండేది. ప్రశ్న అడిగి జవాబు  చెప్పమంటే,  ‘చెప్పలేను.  కావలిస్తే వ్రాసే చూపిస్తాను .’’అనేది.  అలాగే అచ్చు పొల్లు పోకుండా తన ఎలా చెప్పాడో అలాగే వ్రాసేది. వాళ్ల ఇంటికి వెళ్లి  ప్రైవేటు చెప్పేలా తన తండ్రి చేత మాట్లాడించింది. పాఠం  చెబుతున్న అంతసేపు తదేకంగా  చూసేది.  తెల్లని ఆ వెన్నపూస కళ్ళల్లో ఆరాధన శ్రావణ మేఘాల  వర్షంగా కురుస్తూ ఉండేది.

‘’ ఏమిటి అలా చూస్తున్నావు?’’ అని అడిగితే - మీ అంత  అందగాడిని నేను ఎప్పుడూ చూడలేదు మాస్టారు.  మీ మేనిఛాయ,  మీ పెదవులు,  తెల్లని పలువరుస,  అందమైన చిరునవ్వు- ముఖ్యంగా కన్నె పిల్ల గుండెల్లో గుబులు రేపే ఆ మీసకట్టు’’
‘’ తప్పు  చంద్ర.  నేను పాఠం చెప్పి తెలుగు పంతుల్ని.  నువ్వు నేర్చుకునే  విద్యార్థివి. గురువుగా నాకు పరీక్ష పెడుతున్నావా? నిజంగానే అంటున్నావా?’’
‘’ గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింప చేసే సూర్యుదు . నేను ‘ ఏ విషయంలో ‘అజ్ఞానం గా ఉన్నానో గమనించి ,  నా అజ్ఞానాన్ని తొలగించి,  ఆ జ్ఞానం ఎలా ప్రసాదించాలో  మీకు చెప్పేంత దానిని  కాదు మాస్టారు’’

‘’నువ్వు పదవ తరగతి చదివే విద్యార్థి గా మాట్లాడటం లేదు.  తల్లిదండ్రుల తరువాత గురువు తండ్రి వంటి వాడు.  అటువంటి నన్ను ఇలాంటి మాటలతో రెచ్చగొట్టి నేరస్తుడిగా మీ నాన్నగారి ముందు నిలబెడదామనేనా  నీ ఉద్దేశం’’ పదునైన స్వరంతో అడిగాడతను.

 ‘’లేదు మాష్టారు.  దీనిని ఏమంటారో తెలియదు.  మీరు లేకుండా.  మిమ్మల్ని చూడకుండా ఒక్క రోజు కూడా బ్రతకలేను అనిపిస్తోంది. మిమ్మల్ని తాకాలని,  మీ  స్పర్శలో నేను కరిగిపోవాలని...నా ఆరాటం.’’

 తనకు చాలా కోపం వచ్చేసింది.’’ చంద్ర! ఏం మాట్లాడుతున్నావు నువ్వు?  ఒంటి మీద తెలివి  ఉండే మాట్లాడుతున్నావా?’’

‘’అవును మాస్టారు.  వరూధిని ప్రవరాఖ్యుని  పట్ల గల అనురాగాన్ని తన పద్యాలలో  ఎంత హృద్యంగా చెప్పిందో -  మీరు  క్లాసులో పాఠం చెప్పినప్పుడు విన్నాను.  ఆ పద్యంలో ఆమె పడుతున్న వేదన, నేను మీ పట్ల వ్యక్తం . ఆ పాఠం  అంతగా  అర్థమయ్యేలా మీరు నాకు బోధించ బట్టే,  నేను మీ అనురాగాన్ని కోరుతున్నాను.  ఇంకా సిగ్గు విడిచి ఆమెలాగే ఒక్కసారి నా ‘కోరిక’ తీర్చమని అడుగుతున్నాను.  కానీ మీరు మీరు ఎందుకు వెనుకాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ‘’ఆమె కళ్ళల్లో అశ్రువులు  జలజలా రాలిపోతున్నాయి.

 ఆమె ఆవేశంలో ఉంది.  అది వయసును కాల్చేస్తున్న ఆవేశం.  ఆలోచన చంపి,  విచక్షణ కోల్పోయి మనిషి తప్పు చేసే ఆవేశం . ఆమె మీద అరచి  ప్రయోజనం లేదు.  అనునయంగా తన తప్పు తాను తెలుసుకునే  విధంగా చెప్పడమే.. తన తప్పు తాను తెలుసుకునేలా చేయడమే !

‘’చూడమ్మా చంద్ర! ఇవి పూర్వపు రోజులు కాదు.   వయసులో ఉన్న ఆడ పిల్ల వైన నీకు  చదువు చెప్పడానికి నన్ను,  నా  దగ్గర చదువు నేర్చుకునేందుకు నిన్ను.  ఇలా ఏకాంతంగా మీ కుటుంబ సభ్యులు ఎందుకు వదిలేసి వారి వారి పనులు చూసుకుంటున్నారు అనుకుంటున్నావు?  గురుశిష్యుల మధ్య ఉన్న అత్యంత పవిత్రమైన బంధం పట్ల వారికున్న అపరిమితమైన నమ్మకం వల్ల.  ఆ నమ్మకాన్ని పాడు చేసుకునే అవకాశం నువు ఇలాగే పొందాలీ అనుకుంటే,  నువ్వు చదువు నేర్చుకోవడం ఎందుకు?  సభ్యత సంస్కారం నేర్పని ఆ చదువు నేను నేర్పడం ఎందుకు?  నీకు నాకు వయసు అనంతరం 10 ఏళ్ళు ఉండవచ్చు.  అంటే నా ఆఖరి చెల్లెలి వయసు నీది . గురువు అనే పదానికి నాకు అర్హత లేకపోవచ్చు.  కానీ మానవత్వపు విలువలను మంట కలిపే సంస్కారం మాత్రం నాకు లేదు.  
నీకు పాఠం అంతగా అర్థమయ్యేలా చెప్పాను అన్నావు.  అవును!  ఆయా పాత్రలు ఆయా సందర్భాలలో ఏ విధంగా  ప్రవర్తించాయి?  ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి? అని  తెలియజేయడమే ఆ పాఠ్యాంశం లక్ష్యం. అలాంటి పరిస్థితి నీకు ఎదురై నాడు నువ్వు స్థితప్రజ్ఞత తో ప్రవరునిలా  ప్రవర్తించడం పోయి,  వెర్రెక్కిన  వరూధినిలా  ప్రవర్తిస్తాను అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించు?

 నేటి సినిమాల ప్రభావంతో అనవసరమైన వూహాలతో బంగారంలాంటి మీ భవిష్యత్తుకు ఐదు నిమిషాల తుచ్ఛమైన  కోరిక కోసం నాశనం చేసుకుంటాను  అనడం ఎంతవరకు భావ్యము?  అసలు ఇలాంటి మాటలు ఏ ఉపాధ్యాయుడైన తన విద్యార్థులతో అంటాడా?  అనవలసిన పరిస్థితిని నాకు కలిగించి.  నన్ను బాధ పెట్టడం నీకు  న్యాయమా?  నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు.  నిబద్ధతతో పెంచారు.  వారి పెంపకానికి మచ్చ తెచ్చే పని నా చేత చేయించవద్దని,  అందుకు పురికొల్పవద్దని చిన్నదానివయినా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.  నన్ను ఈ మాస్టారుని మన్నించు’’  అన్నాడు తాను బతిమాలుతున్నట్టుగా.

 చంద్రకళ లేచి తనకు దగ్గరగా వచ్చి అంతులేని నిరాశ నిండిన కళ్ళతో లోపలకు వెళ్ళబోతూ అంది.

‘’మీరు చెప్పిన ప్రవరుని స్వగతం పాఠం విని ,  నాన్నగారితో దెబ్బలాడి,  మద్రాసు నుంచి ‘’మనుచరిత్ర’’ టీకా- తాత్పర్య సహిత ప్రబంధాన్ని తెప్పించాను మాస్టారు. ఆద్యంతమూ  ఆకళింపు చేసుకున్నాను.  ఇక దానితో నాకు పని లేదు . నా జ్ఞాపకం గా ఉంచండి.  ఇప్పుడు నా అజ్ఞానం తొలగిపోయింది . నాకు జ్ఞానోదయం అయ్యింది.  మీరు ఇప్పుడు నాకు నిజమైన గురువుగా కనిపిస్తున్నారు.  నేను అచ్చమైన విద్యార్థిగా మారేందుకు ప్రయత్నిస్తాను.  రేపటి నుంచి నాకు ప్రైవెట్  అవసరం లేదు.  మాస్టారు మీరు రావడం ఇష్టం లేక కాదు.  తలెత్తి మీ కళ్ళ లోకి సూటిగా చూసే అర్హత కోల్పోయాను. సెలవు’’ అనేసి  మనుచరిత్ర  నా చేతుల్లో పెట్టి లోపలికి వెళ్ళిపోయింది చంద్రకళ.

అంత అందగత్తె ఆనాడు పిలిచి అవకాశం ఇస్తానంటే కావాలనుకున్నాడు .వండుకున్నవాడికి  ఒకటే కూర  అన్నట్టు అన్నపూర్ణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇంతకాలం.
‘ ఎంతో చిన్నది జీవితం - ఇంకా చిన్నది యవ్వనం...
అనుభవించారా జీవితం -ఆగదు ఆగదు యవ్వనం’  అని సినీ కవి  అన్నట్లుగా ఈ కాస్తంత జీవితంలో చుట్టూ గిరిగీసుకుని బతుకు పేరుతో కోరుకున్న జీవితం అనుభవిస్తున్నారు ఈ నాటు జనాలు.  తాను కూడా కుర్రాడై పోవాలి.  వయసు శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించుకోవాలి.  అలా నిరూపించుకోవాలి అంటే... తనకు హరిత కావాలి. ఎస్.  తనకు హరిత కావాలి.  అతని మనసులో గంట మొగిన్నట్టుగా కాలింగ్బెల్ మోగింది.
 ఒక సారి అద్దంలో తనను తాను చూసుకుని వెళ్ళి తలుపు తీశాడు హరిప్రసాద్.
 ఎదురుగా బంగినపల్లి మామిడి రంగు దుస్తుల్లో,  అదే పండు లాంటి ‘హరిత’ గుండెలకు హత్తుకున్న పుస్తకాల దొంతరతో  నిలబడి ఉంది.
‘’’అబ్బా !ఆ పుస్తకాలలో తను  ఆమె వక్షానికి హత్తుకున్న  పుస్తకం తానే అయితే...?

‘’రా.... హరితా...రా..రా...కూర్చో’’  అన్నాడు హరిప్రసాద్,

‘’ ఆంటీ లేరా సార్? అలా కంగారు పడుతున్నారు!’’
 ‘’కంగారూ ఏమీ  లేదు హరిత.  ఆంటీ ఊరెళ్ళారు.  నీకు గణవిభజన సందేహం అన్నావు కదా.  మంచి నీళ్ళు కావాలా?’’

 “అవును సార్.  మంచి నీళ్లు కావాలి.  నేను కిచెన్ లోకి వెళ్లి తెచ్చుకోనా?’’ అడిగింది హరిత అమాయకం  నిండిన కళ్ళతో.
 ‘’ వద్దులే . నేనే తెస్తాను.’’  అంటూ ఫ్రిజ్ లోని  వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు హరిప్రసాద్.  ఇస్తూ అతని చేతివేళ్ళు  ఆమె చేతి వేళ్ళకు కావాలని తగిలించాడు.  ఆ స్పర్శకే  హరిప్రసాద్ ఒళ్ళు  వేడి అందుకోవడం ప్రారంభమయ్యింది.
 అయితే ఏ భావమూ లేకుండా హరిత మంచి నీళ్ళు తాగి, వంగుని సీసా ఒక మూల పెట్టింది.  సరిగ్గా అతని కళ్ళు ఆమె గుండెలోతుల్లో వెదకబోయి కుదరక ఆగిపోయాయి.

 ‘’సరే నువ్వు ఇలా కుర్చీలో కూర్చో!’’ అంటూ కుర్చీ చూపించాడు హరిప్రసాద్.  హరిత కూర్చోబోయింది.

 ‘’చదువు చెప్పే గురువు పాదాల దగ్గర కూర్చోవాలి కానీ,  వారు అనుమతి ఇచ్చినా -  పొరపాటున కూడా పైన కూర్చోకూడదు హరిత... ఇదేనా నువ్వు నేర్చుకున్నది?’’ ఆ మాటలు విన్న వచ్చిన వైపు చూశాడు హరిప్రసాద్.

 ఆశ్చర్యంతో కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి  అలాగే నిలబడి పోయాడు. ఎదురుగా చంద్రకళ!
ఎస్. చంద్రకళ! చంద్రకళ.... ఇప్పుడు ...ఇక్కడ ...ఈ సమయంలో?  పాతికేళ్ల తర్వాత కలా నిజమా?

 సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాడు హరిప్రసాద్.

‘’ సార్ మాష్టారు. నేను చంద్రకళను . పాతిక సంవత్సరాల క్రితం  మీ దగ్గర చదువుకున్నాను.  గుర్తుకు వచ్చానా సార్?’’  నవ్వుతూ పాదాలకు నమస్కరించింది ఆమె. 

 ‘’రామ్మా... బాగున్నావా ? ఎంత మారిపోయావు !కూర్చో ‘’కుర్చీ చూపించాడు.  అతని ఒళ్ళంతా,  నీళ్ళు చల్లిన పాల పొంగులా  చల్లబడిపోయింది.  చేతిలోని ప్యాకెట్స్ అన్ని కింద పెట్టి నేల మీద కూర్చుంది చంద్రకళ. 

‘’ మీరేమీ మారలేదు సార్.  కాస్తంత లావయ్యారు.  బుగ్గలు వచ్చాయి . అప్పటికన్నా ఇప్పుడు నిండుగా  ఇంకా బాగున్నారు.  నేను ఎలా ఉన్నాను సార్?’’

‘’ అరే! కుర్చీలో కూర్చోక పోయావా అమ్మ ? నువ్వు  వయసు తెచ్చిన పెద్దరికం,  శరీరం  తెచ్చిన హుందాతనంతో చక్కటి కుటుంబ స్త్రీ ఇలా ఉన్నావు.  ఇంతకీ ఏం చేస్తున్నావు?’’ అడిగాడు హరి ప్రసాద్’

 తాను కుర్చీలో కూర్చుంటూ.

‘’ సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను సార్.  అవును సార్.  నా చదువు పూర్తయ్యాక అమెరికా సంబంధం చేశారు . వాడు నన్ను వాడుకుని నా డబ్బు లాక్కుని,  నిందలు వేసి నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి పంపేశాడు.  పోలీస్ రిపోర్టులు ఇచ్చాను. అన్ని టీవీ ఛానళ్లలో కనిపించాను.  కోర్టులను ఆశ్రయించాను.  ఫలితం పూజ్యం.

 నాలాగా అన్యాయంగా మోసానికి గురవుతున్న ఆడవాళ్ళ తరపున అండగా నిలబడే సంస్థ సభ్యురాలిగా యాక్టివ్ గా పనిచేస్తున్నాను.  వాళ్లకు న్యాయం జరగక పోయినా,  జరిగినా ముందు ఆ మగవాళ్ళు ఎంత ఘోరమైన తప్పులు చేస్తున్నారో బయట ప్రపంచానికి తెలియ చేస్తున్నాను. ఆయా  పరిస్థితులలో ఆడవాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో విశ్లేషిస్తున్నాను?  మగవాడి పురుషాధిక్యం  ఎండగడుతూనే  సాటి ఆడదానికి స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాను సార్.  మేడమ్,  పిల్లలు బాగున్నారా సార్?’’వారి వివరాలు అన్నీచెప్పాడు హరి ప్రసాద్.

‘’ మరి హరిత... నీకు ఎలా?’’

‘’ ఆదా... మీ సందేహం.  హరిత మా పిన్ని గారి మనవరాలు.  అంటే వీళ్ళ అమ్మ నాకు పిన్ని కూతురు.  దాన్నో నిత్య పెళ్ళికొడుకు మొదటి పెళ్లి చేసుకొని,  ఈ హరిత కడుపున పడ్డాక పారిపోయాడు.  ఇప్పుడు మూడవ పెళ్ళికి సిద్ధమై,  ఖమ్మం లో ఉద్యోగం చేస్తున్నాడు.  తను కాన్వెంట్లో టీచర్గా పని చేసుకుంటోంది.  ఏదో మాటల సందర్భంలో మీ టాపిక్ వచ్చింది.  మీరు హరిత కు టీచర్ గా ఉన్నారని తెలిసి సంబరపడిపోయాను . జీవితాన్ని నిలబెట్టిన గురువు ను ఇంతకాలం తర్వాత  చూడటం కన్నా ఆనందం ఏముంది సార్?  అందుకే వచ్చాను’’ ఆమె కళ్ళల్లో ఆనందపు మెరుపులు కనిపిస్తున్నాయి. 

‘’లేదమ్మా నేను ఆ పదానికి అర్హుడిని కాదు. ‘’అతని తన శక్తిని ఎవరో బలవంతగా లాగేసినట్టుగా అయ్యాడు.

‘’అవును సార్.  మీకు ఆ పదవి తక్కువే.  ఎందుకంటే నా దృష్టిలో మీరు పురుషోత్తముడు. నాకు తెలిసిన భగవంతుడు మీరే.  మీ కథలు ఎన్నో పత్రికల్లో చదివాను . వాటిలో మీరు చూపిన పరిష్కార మార్గాలు నా సోదరీమణులకు వాడాను అంటే మీరు నమ్ముతారా మీరు?

 మీ కవిత్వం  లోని చైతన్యమే నన్ను ఈనాడు నిస్వార్థ సంఘ సేవికురాలిని  చేసిందంటే ఒప్పుకుంటారా సార్?  గొప్పవాళ్ళు ఒప్పుకోరు సార్. నాకు తెలుసు’’ 

‘’ అవునమ్మా! నా లోని లోపాలు ఏమిటో నాకు తెలుసు.  పురుషోత్తముడు అంటే శ్రీ రాముడమ్మా.  16 సద్గుణాలను కలిగినవాడు  కనుకనే ఆయన పురుషులలో ఉత్తముడు  అయ్యాడు.  కడివెడు పాలలో ఒక్క ఉప్పురాయి చాలమ్మా. విరిగిపోవడానికి. అలాగే  ఎంతటి గొప్పవాడైనా, ఒక్క తప్పుడు ఆలోచన వచ్చిందంటే  పురుష హీనుడు అవ్వాల్సిందే. 

‘’ నేను నమ్మను.  మీలో దాగి ఉన్న విద్వత్తు మీకు తెలియదు సార్. ఈ 25 సంవత్సరాలలో మాతృభాషా పండితులైన మీరు అందరికీ మార్గదర్శకులయ్యారు.  ఎందరి హృదయాలలో పూజింపబడుతున్నారో  మీకు తెలియదు సార్.  నేను  మీ శిష్యుడిలను ఎందరినో కలిశాను సర్.  వారికి మీ పట్ల ఉన్న భావన ఒక్కటే. తస్మై  శ్రీ గురవేన్నమః  అన్న గురు రూపానికి ప్రతిరూపం మీరు. 

 నేను అసలు వచ్చింది అందుకే.  హరిత కు తెలుగు భాష పట్ల ఎంతో మక్కువ.  మీ అంత పండితురాలు గా మీరు తనని తీర్చిదిద్దాలి . అది దాని కోరికే  కాదు . వాళ్ళ అమ్మ కోరిక కూడా.  అందుకే దానిని మీ చేతుల్లో పెడుతున్నాను. ‘’ అని హరిత  చేతులు  హరిప్రసాద్ చేతుల్లోకి ఉంచింది  చంద్రకళ.

‘’అమ్మా....చంద్రా! ‘’ హరి ప్రసాద్  మనసులో తాత్కాలికంగా పేరుకున్న కుతంత్రం  కరిగి కరిగి కళ్ళల్లో కళ్ళల్లో లావాయై  పొంగసాగింది.  హరిత స్పర్స అతన్ని పాపాన్ని అడుగుతున్న గంగలా  చల్లగా ఉంది. 

‘’మీరు ఎందుకు సార్ బాధపడతారు?  మిమ్మల్ని మీ విద్యను ఉపయోగించుకోకుండా శూర్ఫణఖ లా  ప్రవర్తించిన నేను ఈనాడు ఇలా ఉన్నానంటే కారణం మీరే.  అందుకే కాబోలు పెద్దలు ‘’విద్వాన్ సర్వత్ర పూజ్యతే’’ అన్నారు.

 ‘’ అమ్మా... హరితా...మాస్టారికి బట్టలు పెట్టి , ఆయన పాదాలకు నమస్కరించు’’ అంటూ తాను తెచ్చిన ప్యాకెట్లను అందించింది చంద్రకళ.

 మాస్టారికి బట్టలు అందించి ఆయన పాదాలకు పవిత్ర భావంతో నమస్కరిస్తున్నహరితకు,   ఆ నమస్కరించి లేచిన చంద్రకళ కు -మాస్టారి కళ్ళు ఎందుకు వస్తున్నాయో అర్ధం కాలేదు.

‘’ ఆనాడు నువ్వు తప్పు చేయబోయి నన్ను గురువుని చేశావు . ఈనాడు తప్పు చేయబోయిన  నా  పశుత్వాన్నిచంపి  నాలోనే గురువును మేల్కొలిపావు.  మీలాంటి శిష్యులు ఉన్నంతకాలం నాలాంటి వాళ్ళు పురుషోత్తముడి గానే పరిగణింపబడతారు.  హరితను నా వారసురాలిగా తయారు చేస్తానని నా విద్య మీద ప్రమాణం చేస్తున్నాను’’ కళ్ళు మూసుకుని ఆత్మ సంతృప్తిగా అనుకున్నాడు ఆయన.

 ఇప్పుడు ఆయన మనసు మానస సరోవరాన్ని తలపిస్తూ ప్రశాంతంగా ఉంది ఏ అలజడి లేకుండా!!!

***

No comments:

Post a Comment

Pages