ఏం తెలివి!! - అచ్చంగా తెలుగు
ఏం తెలివి!!
పి.యస్.యమ్. లక్ష్మి


మా పెద్ద మనవడు వరుణ్ అమెరికాలో వుంటాడుకదా వాళ్ళ అమ్మా, నాన్నా, తమ్ముడితో.  వాడికి ఐదు ఏళ్ళు.  ఈ కాలం పిల్లలకి భలే తెలివి తేటలు.  ఆ ఆలోచనలు ఎక్కడనుంచి పుట్టుకొస్తాయో తెలియదు.  కిందటిసారి నేను వాళ్ళింటికెళ్ళినప్పుడు వాడికి మూడేళ్ళే.  దొడ్లో పెద్ద ఆవరణ, మొక్కలు వున్నాయి. ఆవరణ వున్నవాళ్ళు సేండ్ పిట్ అని దీర్ఘ చతురస్రాకారం లోతు ఎక్కువ లేని గొయ్యి తవ్వించి, దాన్లో ఇసుక నింపుతారు పిల్లలు ఆడుకోవటానికి వీలుగా.  అక్కడ ఆడుకుందామని తీసుకెళ్ళాడు.  అక్కడ సేండ్ పిట్ కీ గోడకీ మధ్య వున్న ఖాళీలో ఒక చిన్న సాలీడు గూడు కట్టుకుంది.  మా వరుణ్ ఆ కాబ్ వెబ్, అదేనండీ .. ఆ సాలీడు గూడు గురించి నాకు వాడి భాషలో ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో (వాడు అక్కడే పుట్టిపెరగటంతో, ఇంట్లో వచ్చిన తెలుగు కాస్తా, అమెరికన్ ఉఛ్చారణకి వెళ్ళిపోయింది డే కేర్ కి వెళ్ళేసరికి)  వాడి ఇంగ్లీషు నేనర్ధం చేసుకోలేను.  వాడి భాష నాకర్ధం కాక నేనా సాలీడు దగ్గరకు వెళ్తే నన్ను చెయ్యి పుచ్చుకుని పక్కకు లాగి దాన్ని ముట్టుకోకూడదు, దానికి హాని చెయ్యకూడదు అని మళ్ళీ ఒక చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు. వంటింట్లో వున్న మా అమ్మాయి కిటికీలోంచి నా అవస్త చూసి వచ్చి వాడేం చెబుతున్నాడో చెబితేగానీ నాకు అర్ధం కాలేదు.

ఇప్పుడు కరోనా లాక్ డౌన్ .. వీడియోలలో చూడటమేగానీ ఎవరికైనా రాకపోకలకి వీలు లేదుకదా.  ఈ లాక్ డౌన్ మూలంగా పక్క ఇళ్ళవాళ్ళుకూడా ఇదివరకులాగా ఒకళ్ళింటికి ఒకళ్ళెళ్ళటంలేదు.  దానితో మనుషులకి మొహంవాచినట్లుంది అందరి పరిస్ధితీ.  మా మనవడు ఇది వరకు వీడియో కాల్ చేస్తే,  ఆ, ఊ అనేవాడు ఇప్పుడు లెగోస్ తో వాడు చేస్తున్న వాహనాలన్నీ చూపిస్తూ నాకు వివరిస్తూ వుంటాడు ఆ వాహనం ఏం పని చేస్తుందో.  మా అమ్మాయి దుభాషీలాగా వాడు చెప్పింది నాకర్ధమయ్యేటట్లు చెబుతుంది.  లేకపోతే ఆ, ఊ, అలాగా, చాలా బాగా చేశావు .. వగైరా సమయానికి తగు మాటలాడతాను.

నిన్న వీడియో కాల్ లో మాట్లాడుతూ ఎల్లో జాకెట్స్ వచ్చాయన్నాడు.  జాకెట్స్ అంటే బట్టలకి సంబంధించిన మాట నాకు తెలిసి.  వరుణ్ వాళ్ళమ్మని ఆ ఎల్లో జాకెట్స్ ని అమ్మమ్మకి చూపించు అని ఆర్డర్ వేశాడు. మరి వాటి గురించి నాకు చెప్పింది వాడేగా.  మా అమ్మాయి చూపించింది.  దొడ్డి గోడకి బయటవైపు చిన్న త్రికోణాకారం కంతలాగా వుంది.  దానిలో ఏదో చిన్న జంతువు కప్పలాంటిదేదో వున్నదనిపించింది నాకు.  వరుణ్ వాటి గురించి ఏదో చెప్పినా, మా దుభాషీ ద్వారా తెలిసిన విషయం వాటిని ఎల్లో జాకెట్స్ అంటారుట.  తేనెటీగల్లాంటివి.  అయితే తేనె పోగు చెయ్యవు.  ఈ వివరాలు నాకు అప్పుడు చెప్పలేదు మా అమ్మాయి.  తేనెటీగలనే చెప్పింది.  ముందువైపు కూడా రెండు చోట్ల వున్నాయి అన్నది.  అడక్కపోయినా వెంటనే సలహాలిచ్చే అలవాటున్న నేను పొగ బెడితే పోతాయిట..కింద ఏమన్నా మంట వెయ్యండి అని వెంఠనే సలహా ఇచ్చేశాను.  ఇంకా నయం .. ఇవ్వన్నీ చెక్క ఇళ్ళు.  ఇక్కడ మంటలు, పొగలు వేస్తే ఫైర్ అలారాలు మోగుతాయి. నీ అమ్మమ్మ సలహాలు, పొగలు ఇక్కడ పనికి రావు అని డౌట్ లేకుండా చెప్పింది. మరేం చేస్తారే అంటే, వాటికి మందులుంటాయి.  ఏవి మంచివో ఆన్ లైనులో నాలుగైదు చూసి ఒకరికి ఆర్డర్ ఇస్తే సదరు కంపెనీవారొచ్చి వాటి నిర్మూలనకి తగు మందులు వాడి తగు చర్యలు చేబడతారు.   కిం కర్తవ్యం .. నోరు మూసుకొనుట.

అప్పుడు వచ్చాడండీ మా డింభకుడు.  అమ్మా, ఐడియా .. అంటూ.  మాట ఇంగ్లీషుదైనా, అమ్మా నాన్నలని పిలవటం మాత్రం తెలుగే.  మా దుభాషీ నాకు  చెప్పిన వాడి ఐడియా విని నోరు తెరిచాను.  ఏమిటో తెలుసా  వాడేమో కొన్ని పూలు పట్టుకుని (పూలు అనగానే మళ్ళీ వాళ్ళమ్మ సరిగ్గా చెబుతోందో లేదోనని చెక్ చేసుకున్నాడు .. పూలు అంటే ఏమిటని) ఆ ఎల్లో జాకెట్స్ దగ్గరకి వెళ్తాడుట.  అప్పుడా ఎల్లో జాకెట్స్ అన్నీ పూల మీదకి వస్తాయట.  వాడా పూలని దూరంగా తీసుకు వెళ్తాడుట..వాళ్ళమ్మ ఆ బీ హైవ్ తీసి పారేయాలిట.  మన దేశంలో తేనె పట్లు తీసే వాళ్ళకి ఈ ఐడియా వచ్చిందో లేదో...తొందరగా పేటెంట్ కి అప్లై చేసెయ్యాలి వేరేవాళ్ళెవరూ కాపీ కొట్టకుండా.  అమ్మో నా మనవడి తెలివితేటలు.  అమ్మాయ్,  వాడికి కాస్త దిష్టి తీసెయ్యవే.  ఊ..దానికివేం పట్టవు.  వాణ్ణి వీడియోలో అలాగే వుండమని గబగబా కాస్త ఉప్పు తీసుకొచ్చి తీసేశాను.  నా చేతిలో పనయ్యే ఇది.

ఎలా వుందంటారు మావాడి ఐడియా.  


No comments:

Post a Comment

Pages