పిచ్చి ప్రేమ - అచ్చంగా తెలుగు
పిచ్చి ప్రేమ
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

బట్టలారేస్తూ చూడకూడదనుకుంటూనే ఆ పిచ్చోడి వంక చూశాను.
అదే చూపు. ఏదో అడగాలనుకుంటున్నట్టు, చెప్పాలనుకుంటున్నట్టు.
దుబ్బుగా పెరిగిన జుత్తు, గడ్డంతో, మాసిపోయి..అక్కడక్కడా చిరిగిన దుస్తులతో ఉన్న ఆ పిచ్చాడు దాదాపు పది రోజుల నుంచి నా వంక అదేపనిగా చూస్తున్నాడు. ఎక్కడికన్నా వెళితే దూరంగా వెంటబడి వస్తాడు. చేష్టలతో ఇబ్బంది పెట్టడు. భయపెట్టడు. అదో కాస్త రిలీఫ్. అయినా పిచ్చివాళ్లని ఎలా నమ్మగలం? రేపేదైనా చేస్తే?
మొదట మావారికి చెబుదామనుకున్నాను. అనవసరమైన విషయాలకు అనుమానించే ఆయనకి చెప్పడం అనవసరమనిపించింది. పోలీస్ కంప్లయింట్ ఇద్దామనీ అనిపించింది. వాళ్లు వాణ్ని నాలుగు కేకలేసి, తన్ని, తరిమి ‘పిచ్చోడితో మీకేంటమ్మా’ అనొచ్చు. రెంటివల్ల శాశ్వత పరిష్కారం దొరకదనిపించింది. ఎందుకో వాణ్ని చూస్తే అలా చెయ్యాలనీ అనిపించడం లేదు.
ఏదోరోజు వాడితోటే తాడో పేడో తేల్చుకోవడం సబబనిపించింది. తనవల్ల కాకపోతే, అప్పుడు దారినపోయే నలుగుర్నీ పిలిచి చీవాట్లు పెట్టించడమో, తన్నించడమో చేయొచ్చు.
సరుకులు తీసుకొద్దామని బయల్దేరిన నన్ను ఎప్పట్లానే వాడు వెంబడించాడు, కాకపోతే ఈసారి కాస్త పెద్ద పెద్ద అంగలతో. వాడితో తాడో పేడో తేల్చుకుందామనుకున్న నాకు, అలా కొద్దిదూరంలో వెంబడిస్తున్న వాణ్ని చూస్తే ఎందుకో మొదటిసారి భయంవేసింది.
నేను అరిచి గోల చేస్తాననుకున్నాడో ఏమో "గాయత్రీ.."అన్నాడు.
అది నా పేరు. నా పేరు ఆ పిచ్చోడి నోటంట వచ్చేసరికి మొదట తెల్లబోయాను, తర్వాత ఆశ్చర్యపోయాను.
నేను అలాంటి విచిత్ర స్థితిలో ఉండగానే నా దగ్గరగా వచ్చి "గాయత్రీ నేను నీ క్లాస్ మెట్ రవిని"అన్నాడు.
"రవా?..ను..వ్వు ఏమిటిలా?" అన్నాను, చదువుకునే రోజుల్లోని అతని రూపాన్నిమనసు కేన్వాసుపై పరచి, దాంతో ఇప్పటి ఈ కనిపించిన రూపాన్ని పోల్చి బాధపడుతూ.
"చెబుతా..చెబుతా..ఇలా నన్నూ..నిన్నూ ఎవరైనా చూస్తే బాగుండదు, అలా పాత బస్టాండ్ కి వెళ్లి, బెంచీలపై కూర్చుని మాట్లాడుకుందాం..అక్కడ జనం ఆట్టే ఉండరు"అన్నాడు.
నాకూ నిజమే అనిపించింది.
ఇద్దరం పాత బస్టాండ్ చేరుకుని అక్కడి తుప్పుపట్టి విరగడానికి సిద్ధంగా ఉన్న రెండు బెంచీల మీద కూర్చున్నాం.
"నీకు తెలుసు కదా..నేనూ..తులసీ ఎంతగా ప్రేమించుకున్నామో? వాళ్ల నాన్న కర్కోటకుడు. మాపెళ్లికి ససెమిరా అంగీకరించడు. అందుకని తనని ఏం చేద్దామని అడిగితే..‘లేచిపోదాం’ అంది.
"లేచిపోడం క్షణాల్లోపని. కాని తర్వాత? తనని గాఢంగా ప్రేమించిన నేను, కష్టాల పాలు చేయలేనుకదా? ఇంకొద్ది కాలంలో చదువైపోతుంది. అప్పుడు ఉద్యోగం చూసుకుని నా కాళ్లమీద నేను నిలబడ్డాక ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను. 
చదువయ్యాక హైద్రాబాదులోని మా ఫ్రెండ్ రూం లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. మా భావి జీవితం అందంగా ఉండాలి కదా! ఉద్యోగం వచ్చాకే సర్పైజ్ ఇచ్చినట్టు తనను కలుద్దామనుకున్నాను. అప్పటిదాకా ఆమెతో ఎటువంటి కమ్యూనికేషన్ పెట్టుకోవద్దనుకున్నాను. వారాలు..నెలలు..అంత గిర్రున తిరగడం నేనెప్పుడూ చూడలేదు. సంవత్సరకాలం గడిచిపోయింది. 
ఉద్యోగం వచ్చి స్వీట్ పేకేట్తో ఊరెళ్లిన నాకు తులసికి పెళ్లయిపోయిందన్న అశనిపాతంలాంటి వార్త తెలిసింది. బహుశా ఎవరో మా ప్రేమవార్త వాళ్ల నాన్న చెవిన పడేసి, అంత హఠాత్తుగా ఆమె పెళ్లి జరిగేలా చేసుంటారు.
అది విని చచ్చిపోదామనుకున్నాను. కాని నా మీద తులసి మనసులో ఏర్పడిన ’రవి తప్పించుకు పారిపోయాడు’ అన్న భావనను తుడిచి..చచ్చిపోవాలని అనుకున్నాను. ఎంత ప్రయత్నించినా ఆమె ఎక్కడుందో..తెలియలేదు. ఆమె కోసం ఊర్లన్నీ పిచ్చోడిలా తిరుగుతున్నాను. ఇన్నాళ్లకి ఇలా అదృష్టవశాత్తూ..ఈ బెంగళూరులో నువ్వు కనిపించావు. నువ్వూ తనూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా! నువ్వైనా తనెక్కడుందో చెబుతావని ఆశ. ప్లీజ్! చెప్పవా?" అతని శరీరం భావోద్వేగంతో ప్రకంపిస్తోంది. తులసి జ్ఞాపకాల తేనెతుట్టె కదిలినందువల్ల కన్నీరో, హఠాత్తుగా నన్ను చూసిన ఆనందబాష్పాలో కాని అతను  కళ్లు నీటి కొలనులయ్యాయి.
ప్రేమకున్న శక్తి ఎంత గొప్పది. గొప్ప ఆశయాలతో బతకాల్సిన ఒక వ్యక్తిని పిచ్చోణ్ని చేసి రోడ్లు పట్టించింది..అప్రయత్నంగా నా కళ్లలోనూ నీళ్లు నిండాయి.
"రవీ..తులసి పెళ్లయ్యాక ఆమె ఎక్కడుందో నాకు..కాదు తన స్నేహితులమైన మాకెవ్వరికీ తెలియనివ్వలేదు వాళ్ల నాన్న..నేనూ నీలానే ఆమె అడ్రస్ కోసం తీవ్రంగా ప్రయత్నించి ఊరుకున్నాను. ఎప్పటికైనా నీకు తెలిస్తే నాకూ చెప్పవూ..ప్లీజ్. ఇంకోటి ఆమె ఎక్కడున్నా సంతోషంగానే ఉంటుంది. తనకోసం నువ్విలా పిచ్చోడిలా ఉన్నట్టు తెలిస్తే మాత్రం తట్టుకోలేదు. దయచేసి నువ్వు మునుపటి రవిలా మారు. నీదైన అందమైన చిన్న ప్రపంచం సృష్టించుకో..అదే తులసికి గొప్ప సంతృప్తినిస్తుంది!"అన్నాను. 
అతని ముఖంలో తీవ్ర నిరాశ. నేనన్నది విన్నాడో, లేదో తెలీదు. ముభావంగా లేచి వెళ్లిపోయాడు.
నేను భారంగా నిట్టూర్చాను.
‘తులసి బెంగళూరులోని మరో వీధిలో ఉంటోందని, తండ్రి చూపించిన సంబంధాన్ని ఇష్టపడే చేసుకుందని, తన గయ్యాళి తనంతో భర్తని రాచి రంపాన పెడుతోందని తెలిస్తే తులసిని ప్రేమ దేవతగా భావించిన రవి హృదయం బద్దలైపోతుంది. కనీసం ప్రేమ పిచ్చోడిగా అన్నా మనశ్శాంతిగా ఉంటాడు...భగవంతుడా..దయచేసి తులసిని, ఎప్పటికీ రవి కంటబడకుండా చూడు.." మనసులో అనుకుంటూ మార్కెట్ వైపు అడుగులేశాను.
***

No comments:

Post a Comment

Pages