క్షమాపణ -సరిఅయిన పద్దతిలో చెప్పటం ఎలా? - అచ్చంగా తెలుగు

క్షమాపణ -సరిఅయిన పద్దతిలో చెప్పటం ఎలా?

Share This
క్షమాపణ -సరిఅయిన పద్దతిలో చెప్పటం ఎలా?
అంబడిపూడి శ్యామసుందర రావు


మన జీవితములో మనము తెలిసికొన్ని  తెలియక కొన్ని అనేక పొరపాట్లు చేస్తుంటాము. వాటి వల్ల ఇతరులకు మానసికముగా లేదా శారీరకంగా కష్టము కలుగజేయవచ్చు. అటువంటి పరిస్థితిలో మనము వారికి క్షమాపణ చెప్పి వారికి కొంత ఉపశమనము కలుగజేయవలసిన భాద్యత తప్పు చేసిన వారికి ఉంటుంది. చాలా మటుకు మనము చేసే తప్పులు అంటే ఇతరులను బాధపెట్టే పనులు లేదా మాటలు చెప్పటం అనుకోకుండా జరుగుతాయి. 

మనకు ఇంగ్లిష్ భాష ఇంగ్లిష్ వాళ్ళు నేర్పిన కల్చర్ లో మనకు బాగా అలవాటు అయిన మాట 'సారీ'. మనము ఆ మాటను చాలా సులువుగా రోజుకు చాలా సార్లు చాలా సందర్భాల లో ఆలోచించకుండా వాడేస్తాము.కానీ నిజమైన హృదయపూర్వక క్షమాపణ చెప్పే విదము చాలా భిన్నముగాఉంటుంది. మనము ఆ విధముగా క్షమాపణ చెప్పినప్పుడు ఆవతలి వ్యక్తికీ అయిన  గాయము శారీరకమైన మానసికమైన త్వరగా తగ్గుతుంది. ఆ వ్యక్తికీ మనమీద కోపము ఉండదు.

ముందు క్షమాపణ అంటే ఏమిటో తెలుసుకుందాము. మన చర్యలు అవతలి వ్యక్తికీ శారీరకంగా లేదా మానసికముగా కష్టము కలిగించిన విషయాన్నీ మనము గుర్తించి మనము పశ్చాత్తాపము చెంది, ఆ విషయాన్నీ బాధిత వ్యక్తికీ మృదువైన భాషలో తెలియజేయటమే క్షమాపణ. ఇది గొప్ప కళ.  మనము అవతలి వ్యక్తి మనస్సుకు హత్తుకొనే విధముగా చెప్పిన క్షమాపణ మన మీద ప్రేమను నమ్మకాన్ని పెంచుతుంది.

 మనము క్షమాపణ చెప్పటానికి కారణాలు మన ప్రవర్తన ఇతరులను బాధించిన లేదా వారికి నష్టము కలుగజేసిన మనము క్షమాపణ చెప్పవలసి ఉంటుంది.సాధారణముగా మనము మాట్లాడేటప్పుడు లేదా ఇతరులకు మన భావాలను తెలియ జేసేటప్పుడు ఇటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి. పొరపాటు ను గుర్తించి ఆ వ్యక్తితో సంబంధాలను కొనసాగించాలి అనుకుంటే మీరు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. లేకపోతె ఆ వ్యక్తి శాశ్వతముగా దూరము అవుతాడు.  క్షమాపణ చెప్పటం వల్ల మనము ఇతరుల పట్ల చేసిన తప్పు లేదా పొరపాటును గుర్తించినట్లు ఇతరులకు తెలియజెప్పినట్లు అవుతుంది.

ఫలితముగా వారు క్షమాపణను స్వీకరించి మనలను క్షమిస్తారు లేని పక్షంలో మనము చేసిన తప్పును మనస్సులో ఉంచుకొని మన మీద కోపము పెంచుకుంటారు.మనస్సుపూర్తిగా క్షమాపణ చెప్పినప్పుడు అవతలి వారు మనము మళ్ళా అటువంటి పొరపాటు చేయమని విశ్వసిస్తారు. మనలను నిందించరు. క్షమాపణ చెప్పేటప్పుడు చేయకూడని పనులు  చాలా మంది వాళ్ళు చేసిన తప్పులకు ఇతరులను భాద్యులు చేయాలనీ ప్రయత్నిస్తారు. ఆ విషయాన్ని క్షమాపణ   చెప్పేటప్పుడు ఇతరులను నమ్మించాలని చూస్తారు .

అది తప్పు పద్దతి దాని వల్ల మీరు ఎవరిని భాద్యులు చేయాలనీ ప్రయత్నిస్తారో వారితో వైరము తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు బాధ్యతల నుండి తప్పుకోవాలని ప్రయత్నించేవాళ్లే. కొన్ని సందర్భాలలో కొంతమంది క్షమాపణ చెప్పేటప్పుడు అప్పటి పరిస్థితులు తప్పు చేయటంలో వాటి ప్రభావము చెపుతూ జరిగిన పొరపాట్లకు పరిస్తుతులే కారణము నేను నిమిత్త మాత్రుడిని అని నమ్మించాలని చూస్తారు. దీని వల్ల కూడా ఏమి ప్రయోజనము ఉండదు తప్పు చేసినవాడు తానూ చేసిన తప్పును వెంటనే ఒప్పుకోడు సకాలములో క్షమాపణ చెప్పకపోవటము వలన మనుష్యుల మధ్య దూరము పెరుగుతుంది. అందుచేత సకాలములో సక్రమముగా క్షమాపణ చెప్పకపోవటం వలన పరిస్థితులు విషమముగా తయారు అవుతాయి.

సరయిన పద్దతిలో క్షమాపణ చెప్పాలనుకుంటే ముక్తసరిగా సారి అని చెప్పి చేతులు దులుపుకోకూడదు. మీరు ఎవరినైతే భాధించారో వారిని కలిసి వారిని కొంత సమయము మాట్లాడటానికి అనుమతి కోరి వారితో మాట్లాడుతూ నెమ్మదిగా "జరిగిన దానికి చింతుస్తున్నాను క్షమించండి" అని మర్యాదపూర్వకంగా అడిగితె అవతలి వ్యక్తి మనము చేసిన తప్పును క్షమిస్తాడు. అంటే ఆ రకమైన క్షమాపణ మనసుపూర్తిగా చెప్పేది కాబట్టి ఇతరులు నమ్ముతారు మనము చేసిన తప్పును మనము గుర్తించినట్లు వారికి నచ్చజెప్పాలి వారితో సంబంధబాంధవ్యాలను కొనసాగించటానికి ఆసక్తి చూపుతున్నట్లు  వారికి తెలియజేయాలి నమ్మకము కలుగజేయాలి. మళ్లా  అటువంటి పొరపాటు పునరా వృతము  కాకుండా చూస్తానని వారికి హామీ ఇవ్వాలి.

తప్పులు చేయటము మానవ సహజము. ఆ తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నము చేయటము సంస్కారము ఉన్న వ్యక్తుల మాత్రమే చేయగలరు. అటువంటి వారే సరైన పద్దతిలో క్షమాపణ చెపుతారు. పై అధికారులకు లేదా ప్రముఖ వ్యక్తులకు క్షమాపణ చెప్పేటప్పుడు అది వ్రాత పూర్వకముగా ఉండాలి. మన మిత్రుల లేదా తోటి ఉద్యోగులకైతే నోటి మాట సరి పోతుంది.మీరు తప్పు చేయలేదు అని మనసు పూర్తిగా విశ్వసిస్తున్నప్పుడు ఆత్మాభిమానాన్ని చంపుకొని క్షమాపణ చెప్పనవసరం లేదు.

కానీ అటువంటప్పుడు ఎదురయే పరిస్థితులను తట్టుకోవాలి సారి అనే మాట లేదా క్షమించండి అనే మాట చాలా విలువైనవి వాటిని చాలా పొదుపుగా వాడాలి "అడుసు తొక్క నేల కాలు కడుగా నేల " అంటే తప్పు చేయటము ఎందుకు క్షమాపణ చెప్పటం ఎందుకు ? కొద్దిగా సంయమనం పాటిస్తే అన్ని సక్రమముగాఉంటాయి.

మనుష్యులే  కాదు దేశాలు దేశ నాయకులు కూడ ప్రజలకు క్షమాపణ చెప్పిన సందర్భాలు చరిత్రలో (ఆలస్యముగా నైనా) ఉన్నాయి.


***

No comments:

Post a Comment

Pages