శ్రీమద్భగవద్గీత - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
గుణత్రయ విభాగ యోగము
14 వ అధ్యాయము

రెడ్లం చంద్రమౌళి 




నాన్యం గుణేభ్యః కర్తారం యదాద్రష్టానుపశ్యతి
గుణేభ్యశ్చ పరంవేత్తి మద్భావం సోధిగచ్ఛతి
19 వ శ్లోకం

సంసారం బంధ విముక్తికి , పరమాత్మ స్వరూప ప్రాప్తికి రాచబాట ఇచట తెలుపబడినది.   బంధమునకు  మోక్షమునకు  మనస్సే  కారణం. మానవుడు సంసార వృక్షాన్ని బలంగా వాటేసుకొని (సాధారణంగా అందరూ చేసేది అదే కాబట్టి) ఆ వృక్షమే తనను గట్టిగా పట్టుకొని విడిచిపెట్టిటలేదని బలంగా విశ్వసిస్తూ ఉంటాడు. మానవుడు సంసారంలో ఉండాలి కానీ తామరాకు మీద నీటి బొట్టులా ముట్టీ ముట్టనట్టుగా ఉండాలి. మూడు గుణములు , దేహేంద్రియాదులు మనస్సుచే  కర్మలను  చేయించుచున్నవి. చైతన్య స్వరూపమైన ఆత్మ సాక్షీభూతునిగా వర్తించుచున్నది.
కావున జీవుడు వివేకముతో తాను వాస్తవముగా గుణములకంటే వేరుగా నున్నాడనియు , గుణములకు , దేహేంద్రియాదులకు సాక్షియగు ఆత్మయే తాననియు ఆయా కర్మలకు తాను కర్తకాదనియు ఎపుడు తెలుసుకొనునో అపుడాతడు ద్రష్టగా  శేషించి పరమాత్మ స్వరూపమునే పొందుచున్నాడని ఇచట వచించబడినది.
ఓ జీవుడా నీవు దృశ్యరూపములుగా త్రిగుణములతో , మనస్సుతో ఐక్యము కావద్దు , వాటికి సాక్షియగు ఆత్మవుకమ్మని భగవానుడు కరుణతో బోధించుచున్నాడు. ప్రపంచములోని సమస్త దుఃఖములకు కారణము గుణములందు మమేకమగుటయే.
మద్భావం సోధిగచ్ఛతి - అని తెలిపినందువలన , ఏ జీవుడు క్రియలన్నింటికినీ గుణములే కర్తయనియు, తాను వాస్తవముగా ఆ గుణములకంటే వేగుగానున్నాననియు తెలిసికొనునో అతడు ఏ జాతికి చెందినప్పటికీ స్త్రీయైననూ, పురుషుడైననూ ఆ క్షణముననే భగవానుని స్వరూపమును తప్పక పోందగలడనియు స్పష్టమగుచున్నది. మోక్షమునకిది చక్కని రాచబాట.

ఇక జీవుడు తాను అల్పుడని, దుర్భలుడని తలంపక తాను వాస్తవముగ నిరంజనుడని, మనస్సుకు సాక్షియని, గుణాతీతుడని సాక్షాత్తు భగవత్స్వరూపుడని నిశ్చయించి  వివేకవంతుడగుటకు యత్నము గావింపవలయును.   అధిగచ్ఛతి  అను పదముచే  బ్రహ్మైక్యమును అట్టివాడు తప్పక పొందగలడని భగవానుడు విస్పష్టముగా చెప్పెను 

శ్రీ భగవానువాచః
ప్రకాశంచప్రవృత్తించ మోహమేవచపాండవ
నద్వేష్టిసంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షితి
22 వ శ్లోకం 

ఉదాసీనవదాసీనోగుణైర్యోన విచాల్యతే
గుణావర్తన్త ఇత్యేన యోవతిష్టతి నేతే
23వ శ్లోకం

సమదుఃఖ సుఖః స్వస్థస్సమలోష్టాశ్మ కాంచనః
తుల్య ప్రియా ప్రియో ధీరస్తుల్య నిన్దాత్మ సంస్తుతిః
24వ శ్లోకం

మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః
సర్వరమ్భ పరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే
25 వ శ్లోకం

ఓ అర్జునా ! ఎవడు తనకు సంప్రాప్తములైన సత్వగుణ సంబంధమగు ప్రకాశమును గాని, రజోగుణ సంబంధమగు కార్య ప్రవృత్తినిగానీ, తమోగుణసంబంధమగు మోహమునుగాని  ద్వేషింపదో , అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో , తటస్థునివలె ఉన్నవాడై గుణములచేత చలింపజేయడో , గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొని యుండునో  , ఏ పరిస్థితుల యందును చలింపక నిశ్చలముగ నుండునో మరియు ఎవడు సుఖదుఃఖముల యందు  సమభావము కలవాడును, ఆత్మయందే స్థిరత్వము కలిగినవాడును మట్టి, రాయి, బంగారము వీనియందు  సమభావము కలవాడును ధైర్యవంతుడు, సమస్త కార్యములందు  కర్తుృత్వబుద్ధి విడిచిపెట్టువాడును, నిరంతరము  బ్రహ్మ నిష్టయందుండువాడను అయి ఉండునో  అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును.
గుణాతీతుని యొక్క లక్షణములిచట పేర్కొనబడినవి. ఈ లక్షణములను బట్టి మనుజుడు త్రిగుణములను దాటినది, లేనిది తెలిసికొనవచ్చును.   గుణాతీతుని  లక్షణములందు  నిశ్చలత్వము సమత్వము అనునవి ప్రధానముగా కనిపించును.
ఏ చిన్న సంఘటన జరిగినను అజ్ఞాని బెదిరిపోయి తన స్థిరత్వమును గోల్పోవును. గుణాతీతుడు మేరు సమాన గాంభీర్యముగలిగి, పరిస్థితులకు ఏ మాత్రము చలింపకయుండును. చిన్న చిన్న అలలు పర్వతమును కదిలింపజాలనట్లు  త్రిగుణములను దాటి, మనస్సునకు  ఆవలయున్న ఆత్మయందు నిలకడకలిగియున్న యోగి ప్రపంచములోని ఏ సంఘటనచేగాని, ఆపత్తులచేగాని చలింపక సదా ఆత్మయందే సుస్థిరుడైయుండును.
మానావమానముల యందు, నిందాస్తుతుల యందు, సుఖదుఃఖముల యందు, శత్రు మిత్రాదులందు, మృణ్మయకాంచనముల యందు గుణాతీతుడగు మహనీయుడు సమబుద్ధి కలిగియుండును. అట్టి మహనీయులు నిరంతరము ఆత్మస్థితియందే నిలకడ కలిగియుందురు. మిధ్యారూప ప్రపంచమునందలి ఇట్టి ద్వంద్వములు వారినేమియు చేయజాలవు. ఉపాధిని తనకంటే వేరుగా జూచు జ్ఞానికి ప్రాపంచికమగు ద్వంద్వము లేమియు బాధింపజాలవు.
సర్వారంభపరిత్యాగీ ఈ పదమునకు సమస్త కార్యములందును కర్తృత్వమును వదలినవాడని అర్థము. ఇతర కార్యములనన్నింటినీ వదలివైచి నిరంతరము బ్రహ్మ నిష్టయందు నిలుచువాడని తెలియవచ్చును. ఇట్టివాడు  గుణాతీతుడని చెప్పబడును. ఎవరైనను  ప్రయత్న పూర్వకముగా  నిట్టి స్థితిని పొందవచ్చును. సర్వులును ఇట్టి మహోన్నత స్థితికై ప్రయత్నించి కృతార్ధత బడయవచ్చును.
బాహ్యమైన నిందాస్థుతులను , మానావ మానములను , శీతోష్ణములను , మృణ్మయకాంచనములను, శతృమిత్రులను సమదృష్టితో చూచుచున్నాడో, తను ఆచరించే కర్మలన్నింటినీ గుణాతీత భావనతో భగవదర్పణగావించుచున్నాడో అట్టివాడు ఈ జన్మయందే భగవంతుని (మోక్షమును) పొందుచున్నాడు.
అచంచల భక్తితో తన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మ సాక్షాత్కారమును బడయగలడని భగవానుడు వచించుచున్నాడు.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages