శార్వరీ సందేశం - అచ్చంగా తెలుగు
శార్వరీ'.. సందేశం..!
పి.వి.ఎల్.సుజాత 



చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే పర్వదినమే 'ఉగాది'. దీనిని సంవత్సరాది అని కూడా అంటాము. 'ఆది' అంటే మొదలు అని అర్థం. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి జన్మ, ఆయుష్షు అని పలు అర్థాలున్నాయి. ఇవన్నీ ఆది తో ఆరంభమౌతాయి కాబట్టి ఉగాది అని పేరొచ్చింది. యుగము అనగా రెండు జంట అని నిర్వచనాలున్నాయి. అంటే ఒకే ఏడాది కాలాన్ని రెండు భాగాలుగా విడదీస్తే రెండు ఆయనాలు ఏర్పడ్డాయి. అవే ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ రెండు భాగాలకు ఆది 'ఉగాది. దక్షిణాయనానికి మరో ఆది అనేది లేదు కనుక ఉగాది రెండింటికీ వర్తిస్తుంది.

వర్తమాన కాలంలో ప్రపంచమంతట ఏకీకృతంగానున్న సంవత్సరాది జనవరి ఒకటవ తేదీ, కానీ ప్రపంచంలోని అన్ని దేశాలలో వారి వారి సంప్రదాయమును బట్టి ఉగాది పండుగను వేరు వేరు తేదీలల్లో జరుపుకొంటున్నారు. మన భారతదేశంలోనే ఐదు విధములుగా వత్సరమానములు అమలులో ఉన్నాయి. అవి చాంద్రమాన వత్సరం, సౌరమాన వత్సరం, బార్హ స్పత్యమాన వత్సరం, సావనమాన వత్సవం మరియు నక్షత్రమాన వత్సరం.

చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిధి రోజున ఉగాది పండుగగా పరిగణించడమైనది.

ఈ ఏడాది అడుగిడిన సంవత్సరం పేరు 'శార్వరి'. అరవై తెలుగు సంవత్సరాలలో ఇది ముప్ఫై నాలుగవది. శార్వరము అంటే చీకటి. చీకటి రాత్రి వేళల్లో ఏర్పడుతుంది. రాత్రి అంటే అందరికీ భయం. ఎందుకంటే కాళరాత్రి, నిశిరాత్రి, చీకటిరాత్రి అనే మాటలు రాత్రి అనే పదంతో ముడిపడి ఉండటం చేత గుర్తుకు వచ్చి భయపడటం సహజమే. అంతేకాకుండా చీకటి అంటేనే అగమ్య గోచరం. అందుకే భయమనిపిస్తుంది. నిజానికి చీకటి రమ్యమైనది.అందుకే రమ్య అని పేరుంది. అలసిన దేహాలు శారీరకంగా సేదతీరే సమయం రాత్రిపూటే. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవడం వల్లే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాం. రాత్రీ పగలు రెండూ సమపాళ్ళలో ఉండబట్టే మానవజీవనం ఆనందంగా ఉంటోంది. అలాగే, సుఖ దుఃఖాలను కూడా మిశ్రమంగా అనుభవించగలగాలి. వేపపువ్వు 'చేదు'(తిక్త), మామిడి 'వగరు'(కషాయం) , బెల్లం 'తీపి(మధురం)', చింతపండు 'పులుపు'(ఆమ్లం), మిరయాల 'కారం'(కటు), ఉప్పు' లవణం'(కటువు)'..ఈ షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడిని సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలను, మంచి చెడులను సమంగా సంతోషంగా ఎదుర్కోవాలి. కష్టమొచ్చినప్పుడు బెంబేలు పడిపోయి మానసికంగా కృంగిపోకూడదు, సంతోషానికి పొంగిపోకూడదు. ఈ రెండింటినీ సమదృష్టితో గ్రహించి మనుగడ సాగించాలనేదే 'శార్వరి' ఉగాది సందేశం.

******

No comments:

Post a Comment

Pages