హాస్యబ్రహ్మ జంధ్యాల - అచ్చంగా తెలుగు
హాస్యబ్రహ్మ జంధ్యాల
                                                               - పోడూరి శ్రీనివాసరావు

                                                                   9849422239

 


"జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి" అంటే మనలో ఎంతమందికి తెలుసు? కనీసం ఆ పేరు గల వ్యక్తి ఉన్నారని గాని, మనకు పరిచయస్తుడేనని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అత్యంత ప్రజాదరణ గల విజయవంతమైన సినిమాలకు కథలు అందించారని, పసందైన సంభాషణలు సమకూర్చారని, హాస్యబ్రహ్మ గా పేరు పొంది, రసవత్తర గులికల్లాంటి ఆహ్లాదకర, ఆనందమయ చిత్రాలకు దర్శకత్వం వహించారని అనుకోగలమా!! అదే... షార్ట్ కట్ లో..

' జంధ్యాల 'అన్న పేరు వినగానే ఎగిరి గంతేస్తాము. నవ్వుల జల్లులు తడిసి ముద్దవుతాము. అలాంటి హాస్యబ్రహ్మ శ్రీ జంధ్యాల గురించి నాలుగు విశేషాలు తెలుసుకుందాం...

శ్రీ జంధ్యాల తండ్రి గారు నారాయణ మూర్తి గారు. జంధ్యాల 14 జనవరి, 1951న నరసాపురంలో జన్మించారు. విజయవాడలోని SSR & CVR కాలేజీలో B.Com చదివారు. చిన్నతనం నుంచీ, శ్రీ జంధ్యాలకు నాటకాలపట్ల ఆసక్తి. స్వయంగా నాటకాలు రచించడం, నటించడం, దర్శకత్వం వహించడం పట్ల శ్రీ జంధ్యాల విపరీతమైన అనురక్తి.
ఆయన రచించిన తొలి నాటకం - ఆత్మాహుతి. తదుపరి నాటకం "ఏక్ దిన్ కా సుల్తాన్". ఈ నాటకం ఎంత ప్రజాదరణ పొందిందంటే పది వేలకు పైగా ప్రదర్శించబడింది. ఆ నాటకపుస్తక ప్రతులు 15 సార్లకు పైగా పునర్ముద్రణ జరిగింది. అత్యంత ప్రజాదరణ ప్రేక్షకాదరణ పొందిన నాటకం 'ఏక్ దిన్ కా సుల్తాన్'. జంధ్యాల రాసిన ఆఖరు నాటకం "గుండెలు మార్చబడును".
ప్రఖ్యాత నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు ఒక నాటకప్రదర్శనలో శ్రీ జంధ్యాలను చూసి వారిని కథారచయితగా ప్రయత్నించమని సలహా ఇచ్చారు.
శ్రీ గుమ్మడి సలహా ప్రకారం, శ్రీ జంధ్యాల సినీ రంగంలో తన ప్రయత్నాలు కథారచయితగా కొనసాగించారు. ఆయనను కళాతపస్వి శ్రీ కాశీనాధుని విశ్వనాథ్, ప్రఖ్యాత దర్శకుడు, ప్రోత్సహించారు.
1974వ సంవత్సరంలో సినీ రచయితగా సినీరంగ ప్రవేశం చేసారు. మాటల రచయితగా శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు, ఆపద్బాంధవుడు, సిరిసిరిమువ్వ ..మొదలైనవి. శ్రీ జంధ్యాల మాటల రచయితగా వ్రాసిన, అనేక విజయవంతమైన చిత్రాల్లో మచ్చుకు కొన్ని.
1976లో దేవుడు చేసిన బొమ్మలు ఈ చిత్రానికి మాటల రచయితగా పని చేశారు. 5సంవత్సరాలలో సుమారు 85 సినిమాలకు రచయితగా పని చేస్తే అందులో 80 శాతం పైగా అఖండ విజయం సాధించడమే కాక, శ్రీ జంధ్యాల మంచి రచయితగా పేరు తెచ్చాయి.
తదనంతరం దర్శకుడిగా అవతారమెత్తి అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. నవరసాలలో హాస్య రసానికి పెద్ద పీటవేసే, అమితంగా ఇష్టపడే శ్రీ జంధ్యాల ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాలకే దర్శకత్వం వహించారు.
జంధ్యాల గారికి, తెలుగు చలనచిత్రసీమకే మకుటాయమానమైన "మాయాబజార్" అంటే విపరీతమైన ఇష్టం. అందుకే 'మాయాబజార్' లోని ప్రముఖమైన మకుటాలతో చిత్రాలను నిర్మించారు- ఉదాహరణకు : అహ నా పెళ్ళంట, వివాహ భోజనంబు, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయకా.
స్క్రీన్ ప్లే రచయితగా, కథారచయితగా, దర్శకునిగా, నటునిగా తెలుగు చలనచిత్ర సీమకు సుపరిచితుడు శ్రీ జంధ్యాల.
శ్రీ జంధ్యాల హాస్య ప్రియత్వానికి మచ్చుతునక ఈ క్రింది సంభాషణ. ఒక ప్రముఖుడు శ్రీ జంధ్యాల నడిగారట -- అయ్యా జంధ్యాల గారు! మీరు ఇంటి పేరు తోనే సుప్రసిద్ధులయ్యారు. మీ అసలు నామధేయం, పూర్తి నామధేయం ఏమిటండి.... అంటే చిరునవ్వుతో శ్రీ జంధ్యాల గారి సమాధానం ఏమిటంటే --రామానాయుడుగారి  సినిమాలకు పని చేసేటప్పుడు నా పేరు జంధ్యాల రామానాయుడు. అలాగే విశ్వనాథ్ గారి సినిమాలకు పని చేసేటప్పుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్.
శ్రీ జంధ్యాల తీసిన హాస్య ప్రధానమైన సినిమాలు ఎలా ఉంటాయంటే అనేక హాస్యభరితమైన చిత్రాలు.... అవి కూడా -- ఆరోగ్యకరమైన హాస్యం, అశ్లీల రహిత హాస్య ప్రధానమైన చిత్రాలు.
శ్రీ జంధ్యాల మాటల్లో "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేక పోవడం ఒక రోగం."
శ్రీ జంధ్యాల తన చలన చిత్రాల ద్వారా పరిచయం చేసిన నటులు బ్రహ్మానందం, ప్రదీప్, నరేష్ (సీనియర్), సుత్తివేలు, సుత్తి వీరభద్ర రావు.
శ్రీ జంధ్యాల ద్వారా వచ్చిన, విజయవంతమైన చిత్రాలు: ముద్దమందారం, మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట, నెలవంక, రెండుజెళ్ళసీత, అమరజీవి, మూడుముళ్ళు, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి (తెలుగు _కన్నడం) రావుగోపాలరావు, పుత్తడి బొమ్మ,,బాబాయి - అబ్బాయి, శ్రీవారి శోభనం, ముద్దుల మనవరాలు, మొగుడు పెళ్ళాలు, రెండు రెళ్ళ ఆరు, సీతారామకళ్యాణం, చంటబ్బాయి, పడమటి సంధ్యారాగం, రాగలీల, సత్యాగ్రహం, అహ నా పెళ్ళంట, చిన్ని కృష్ణుడు వివాహ భోజనంబు నీకు నాకు పెళ్ళంటచూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, జయమ్ము నిశ్చయంబురా, లేడీస్ స్పెషల్, బావా బావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం, విచిత్ర ప్రేమ, బాబాయ్ హోటల్, అ ఆ ఇ ఈ, ప్రేమా జిందాబాద్, ఇష్....గుప్ చుప్, ఓహో నా పెళ్ళంట, విచిత్రం.... మొదలైనవి. ఆనందభైరవి పురస్కారాలు పొందిన చిత్రం.
రచయితగా శ్రీ జంధ్యాల పనిచేసిన విజయవంతమైన చిత్రాలు....డ్రైవర్ రాముడు, అల్లుడు పట్టిన భరతం, నారీ నారీ నడుమ మురారి, అడవి రాముడు, వేటగాడు, రహస్య గూఢచారి, సీతాకోక చిలక మొదలైనవి.
శ్రీ జంధ్యాల గారి శ్రీమతి అన్నపూర్ణ. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు -సాహితీ, సంపద.
· శ్రీ జంధ్యాలకు పురస్కారాలు సాధించి పెట్టిన చిత్రాలు....

1983 ఆనందభైరవి ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడు, జాతీయ అవార్డు
1983 ఆనందభైరవి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు
1987 పడమటి సంధ్యారాగం ఉత్తమ కథా రచయిత అవార్డు
1992 ఆపద్బాంధవుడు ఉత్తమ మాటల రచయిత అవార్డు
1983 ఆనందభైరవి చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 1983లో ప్రదర్శింప బడింది.
4 రాష్ట్ర నంది అవార్డులు, ఒక ఫిలింఫేర్ అవార్డు సాధించారు.

ఉత్తమ రచయితగా పుణ్యభూమి కళ్లు తెరు, ఉత్తమ సంభాషణల రచయితగా దేవుడు చేసిన బొమ్మలు, సిరిసిరిమువ్వ చిత్రాలకు  అవార్డులు పొందారు. 1993 - 95 సంవత్సరాల మధ్య దూరదర్శన్ లో బహుళ ప్రజాదరణ పొందిన "ఆనందోబ్రహ్మ" కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇవేగాక మద్రాసి ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు, విజయవాడ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు, వంశి అవార్డ్, కళాసాగర్ అవార్డ్, ఆంధ్ర ప్రదేశ్ సినీ గోయర్స్ అవార్డ్ - శ్రీ జంధ్యాల సాధించిన అవార్డులు.
అశ్లీల రహిత హాస్యానికే భాష్యం చెప్పి, అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీ జంధ్యాల తీవ్రమైన గుండెపోటుతో 19 జూన్ 2001న హైదరాబాదులో మరణించారు.
శ్రీ జంధ్యాల నిర్మించిన సినిమాల్లో అత్యధిక చిత్రాల్లో శ్రీ నరేష్, శ్రీ రాజేంద్ర ప్రసాద్ కథానాయకులుగా నటించారు. మన భారత ప్రధాని (మాజీ) శ్రీ పి.వి. నరసింహారావు గారు మానసికోల్లాసం కొరకై రాజేంద్ర ప్రసాద్ నటించిన చిత్రాలు చూసి ఆహ్లాదం పొందేవారంటే..... హాస్య రస చిత్రాలు మహామహులను సైతం ఎంత ప్రభావితం చేసేవో రాజేంద్ర ప్రసాద్ చిత్రాలు, శ్రీ జంధ్యాల సినిమాలు మానవ జీవితంపై ఎటువంటి ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించాయో అర్థమవుతోంది.
శ్రీ జంధ్యాల చిత్రాలు ఎన్నిసార్లు ప్రదర్శింపబడినా, ఆరోగ్యకరమైన హాస్యం ఇంకా బ్రతికుందనీ, అటువంటి చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనీ, ఆహ్లాదకర హాస్యం ఆరోగ్యకరమైన హాస్యం అని మరోసారి చెప్పక తప్పదు. ఆనందకర హాస్యం అంటే, ఆరోగ్యకరమైన హాస్యం అంటే, అశ్లీల రహిత హాస్యమంటే, జంధ్యాల సినిమాలేనంటే ఎటువంటి సందేహం లేదు.
***

No comments:

Post a Comment

Pages